276

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 276*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 191*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *(గజ్వయె బనీయిల్ ముస్తలిక్ : - 1)*
                 *(హిజీ శకం 5 లేక 6)*

ఈ గజ్వా, యుద్ధం దృష్టికోణంతో చూస్తే, ముఖ్యమైన గజ్వా మాత్రం కాకపోయినప్పటికి దాని ప్రాధాన్యత మాత్రం గొప్పదే. కారణం, ఆ గజ్వాలో చోటు చేసుకున్న సంఘటనలు ఇస్లామీయ సమాజంలో పెద్ద సంచలనాన్ని రేకెత్తించాయి. దాని ఫలితంగా ఓ వైపు మునాఫిక్ ల కాపట్యం కాస్త బయటపడిపోతే, మరో వంక ఇస్లామీయ సమాజానికి గౌరవం మరియు ఔన్నత్యాన్ని చేకూర్చిపెట్టిన క్రిమినల్ చట్టాలు అవతరించాయి. దీనివల్ల దానికి ఓ ప్రత్యేక రూపం వచ్చినట్లయింది. మొదట మేము ఆ గజ్వాకు సంబంధించిన వివరాలను చెప్పి ఆ తరువాత ఆ సంఘటనలేవో చెబుతాము.

ఈ గజ్వా - సీరత్ చరిత్రకారుల కథనం ప్రకారం, హిజ్రీ శకం - 5, షాబాన్ నెల లేదా హిజ్రీ శకం - 6లో సంభవించింది - ఈ గజ్వా కోసం వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటే, దైవప్రవక్త (సల్లం)కు, బనూ ముస్తలిక్ సర్దారు 'హారిస్ బిన్ అబీ జరార్' యుద్ధానికి సిద్ధమై తన తెగలతో ఇంకా ఇతర అరబ్బులతో కలసి వస్తున్నాడని వార్త అందడమే. మహాప్రవక్త (సల్లం), బరీదా బిన్ హసీబ్ అస్లమీ (రజి) గారిని అది ఎంత వరకు నిజమో తెలుసుకురమ్మని పంపించారు. ఆయన బనూ హారిస్ నాయకుడు హారీస్ బిన్ అబీ జరార్ ను కలసి మాట్లాడారు. తిరిగి వచ్చి విషయమంతా మహాప్రవక్త (సల్లం)కు విన్నవించుకున్నారు. ఈ వార్త నిజమే అన్న విషయం తెలియగానే, మహాప్రవక్త (సల్లం) సహాబా (రజి)ను బయలుదేరడానికి సిద్ధం కమ్మని ఆదేశం ఇచ్చారు.

ఆ తరువాత ఆయన త్వరలోనే అటు వైపునకు బయలుదేరి వెళ్ళారు. ముస్లిముల సైన్యం షాబాన్ నెల 2వ తారీఖున బయలుదేరింది. ఈ గజ్వాలో దైవప్రవక్త (సల్లం) వెంట మునాఫిక్ ల ఓ వర్గం కూడా ఉంది. ఇంతకు పూర్వం వారు ఏ యుద్ధంలోనూ పాల్గొన్నవారు కారు.

మహాప్రవక్త (సల్లం) మదీనా బాధ్యతల్ని హజ్రత్ జైద్ బిన్ హారీసాకు (మరో ఉల్లేఖనంలో అబూ జర్ (రజి)కు, ఇంకో ఉల్లేఖనంలో నమీలా బిన్ అబ్దుల్లాహ్ (రజి)కు) అప్పగించారు. హారిస్ బిన్ జరార్, ఇస్లామీయ సేన ఆచూకి తెలుసుకోడానికి ఓ వేగులవాణ్ణి పంపగా ముస్లిములు అతణ్ణి పట్టుకొని హతమార్చారు.

హారిస్ బిన్ అబీ జరార్ కు మరియు అతని అనుచరులకు, దైవప్రవక్త (సల్లం) బయలుదేరడం మరియు తమ వేగులవాడు హతమార్చబడటం తెలిసి భయభీతులయ్యారు. ఏ అరబ్బులయితే వారి వెంట బయలుదేరారో వారంతా చెల్లాచెదరై పారిపోయారు.

మహాప్రవక్త (సల్లం) 'మురైసీ' అనే ఊట బావి వద్దకు చేరుకోగా బనూ ముస్తలిక్ యుద్ధానికి సిద్ధమై ముందుకు వచ్చేశారు. మహాప్రవక్త (సల్లం) తన సేనను వరుసలుగా నిలబెట్టి సేనా పతాకాన్ని హజ్రత్ అబూ బక్ర్ (రజి) చేతికి ఇచ్చారు. అలాగే అన్సారుల ప్రత్యేక పతాకం ఒకటి హజ్రత్ సఅద్ బిన్ ఉబాదా (రజి) చేతిలో ఉంది. కొంతసేపటి వరకు ఇరు పక్షాల నడుమ ధనుర్యుద్ధం జరిగింది.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) ఒక్కసారే వారిపై దాడి చేసి విజయం సాధించారు. బహుదైవారాధకులకు ఓటమి ఎదురైంది. కొందరు చంపబడ్డారు. స్త్రీలను, పిల్లలను ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది. అలాగే వారి మేకలు, పశువులు ముస్లిముల చేత చిక్కాయి. ముస్లిములకు చెందిన ఒకే ఒక వ్యక్తి హతుడయ్యారు. అది కూడా ఓ అన్సారీ ఆయన్ని శత్రువుకు చెందిన మనిషిగా భావించి చంపడం జరిగింది.

సీరత్ చరిత్ర కారులు ఈ గజ్వా వివరాలను ఇంతవరకే చెప్పారు. కాని 'అల్లామా ఇబ్నె ఖైమ్' మాత్రం యుద్ధం జరగలేదని రాశారు. కేవలం దైవప్రవక్త (సల్లం) ఆ ఊట బావిపై దాడి చేసి స్త్రీలను, పిల్లల్ని, పశువుల్ని పట్టుకోవడం మాత్రమే జరిగింది అని అంటారు. 'సహీహ్' హదీసులలోని ఓ ఉల్లేఖనంలో దైవప్రవక్త (సల్లం) బనూ ముస్తలిక్ పై దాడి చేసినప్పుడు వారు ఏమరుపాటులో ఉన్నారని ఉంది.

ఖైదీల్లో 'హజ్రత్ జువైరియా (రజి)' కూడా ఉన్నారు. ఈమె బనూ ముస్తలిక్ నాయకుడు 'హారీస్ బిన్ అబీ జరార్' కుమార్తె. ఈమె 'సాబిత్ బిన్ ఖైస్' వాటాకు వచ్చిన మహిళ. ఆయన ఆమెను 'మకాతిబ్'★ చేసి తన వద్ద ఉంచుకున్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఆయనకు, నిర్ణీత ధనమిచ్చి స్వతంత్రురాలిగా చేసి వివాహం చేసుకున్నారు☆. ఈ వివాహం కారణంగా, ఓ వంద మంది బనూ ముస్తలిక్ కుటుంబం వారు ముస్లిములైపోయారు. వారిని విడుదల చేయడం జరిగింది. ముస్లిములు వారిని విడుదల చేస్తూ, *"వీరు మహాప్రవక్త (సల్లం) గారి అత్తగారి కుటుంబానికి సంబంధించిన వారు"* అని చెప్పుకున్నారు కూడా.

_(★→ 'మకాతిబ్' అంటే తన జమానత్ తో ఓ నిర్ణీత ధనం ఇచ్చి విడుదల అయ్యే ఒప్పందం కుదుర్చుకునే బానిస లేక బానిసరాలు అని అర్థం._
_☆→ ఈ వివాహంలోని మరింత వివరణను రాబోయే పుటల్లో తెలుసుకుందాం)_

ఇవీ ఆ గజ్వాకు సంబంధించిన వివరాలు. ఇక ఆ గజ్వా సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల విషయానికి వస్తే, వాటికి మూలకారణం, మునాఫిక్ ల నాయకుడైన 'అబ్దుల్లా బిన్ ఉబై' మరియు అతని అనుచరులే. ఇస్లామీయ సమాజంలో వారి నడవడి, వారు అవలంబించిన వైఖరి ఎలాంటిదో చెప్పుకోవడం ఎంతైనా అవసరం. ఈ వివరాలు మనం తరువాత తెలుసుకుందాం.

*గజ్వయె బనీ ముస్తలిక్ కు పూర్వం కపట విశ్వాసి అబ్దుల్లా బిన్ ఉబై అవలంభించిన వైఖరి : -*

అబ్దుల్లా బిన్ ఉబైకు ఇస్లాం మరియు ముస్లిముల ఎడల సాధారణం గాను, దైవప్రవక్త (సల్లం) ఎడల ప్రత్యేకంగాను కక్ష ఉన్న విషయం మనం ఇది వరకు చెప్పుకున్నదే. ఎందుకంటే, అవస్, ఖజ్రజ్ తెగలు దైవప్రవక్త (సల్లం) మదీనాకు రాకపూర్వం అతణ్ణి తమ నాయకునిగా చేసుకోడానికి ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఉన్నారు. అతని తలపై కిరీటం పెట్టి తమ రాజుగా చేసుకోవడానికి ఓ పగడాల కిరీటం కూడా తయారు చేసుకొని ఉన్నారు. అంతలోనే మదీనాలో ఇస్లాం వెలుగు విస్తరించనారంభించింది. వారి దృష్టి కాస్తా అతని వైపు నుండి మళ్ళిపోయింది. అందుకని అతను, దైవప్రవక్త (సల్లం) అతని రాచరికాన్ని లాక్కున్నారని బాధపడిపోతున్నాడు.

ఇతని ఈ కక్ష, హిజ్రత్ ప్రారంభం అయినప్పటి నుండే కొనసాగుతూ ఉంది. అప్పుడు అతను ఇస్లాం స్వీకరించి ఉండలేదు. ఆ తరువాత తాను ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించిన తదుపరి కూడా అతని వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.

అతను ఇస్లాం ధర్మం స్వీకరించక ముందు ఓసారి దైవప్రవక్త (సల్లం) గారు కంచర గాడిదపై ఎక్కి హజ్రత్ సఅద్ బిన్ ఉబాదా (రజి) గారిని పరామర్శించడానికి వెళుతూ ఉండగా ఓ చోట అబ్దుల్లా బిన్ ఉబై తన సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. అబ్దుల్లా బిన్ ఉబై, దైవప్రవక్త (సల్లం)ను చూడగానే తన ముక్కుకు అడ్డంగా గుడ్డను పెట్టుకుంటూ, అనవసరంగా దుమ్ము రేపవద్దు అని హెచ్చరించాడు కూడా. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) అక్కడ ఆగి ఆ సమూహం వినేటట్లు దివ్య ఖుర్ఆన్ పారాయణం చేశారు. దానికి అతను, *"మీరు మీ ఇంట్లోనే ఉండండి. అనవసరంగా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చీకాకుపరచకండి"* అని అన్నాడు.

ఇది ఇస్లాం ధర్మం స్వీకరించడానికి పూర్వపు మాట. కాని బద్ర్ యుద్ధం తరువాత గాలివాటం చూసి అతను ముస్లిం అయినట్లు ప్రకటించుకున్నాడు. అప్పటికి అతను అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లం), విశ్వాసుల ఎడల శత్రుత్వం వహిస్తూనే ఉన్నాడు. ఇస్లామీయ సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించడానికి, ఇస్లాం పిలుపును బలహీనపరిచేందుకు సతతం కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఇస్లాం విరోధులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటూనే ఉన్నాడు. బనూ ఖైనుఖా వ్యవహారంలో అబ్దుల్లా బిన్ ఉబై అనవసరంగా జోక్యం చేసుకోవడం జరిగింది (ఆ వివరాలు వెనుకటి పుటల్లో మనం చదువుకున్నవే. మరింత అర్థవంతం కోసం చదవండి ఇస్లాం చరిత్ర -224). అలాగే ఉహద్ పోరాట సమయంలోనూ కుట్రపన్ని ముస్లిముల్లో చీలిక తేవడానికి ప్రయత్నం చేశాడు (ఇందులోని వివరణ కోసం చదవండి ఇస్లాం చరిత్ర -232).

ఈ మునాఫిక్ కుతంత్రాలు ఎలా సాగాయంటే, అతని ఇస్లాం స్వీకారం తరువాత ప్రతి జుమా రోజున, దైవప్రవక్త (సల్లం) జుమా ప్రసంగం కోసం లేచి నిలబడక ముందే తాను నిలబడి, *"ప్రజలారా! ఈయన గారు మీ నడుమ నిలుచున్న వ్యక్తి దైవప్రవక్త (సల్లం). అల్లాహ్ ఆయన ద్వారా మీకు గౌరవాన్ని, ఔన్నత్యాన్ని చేకూర్చాడు. కాబట్టి మీరు ఆయనకు సహాయంగా ఉండండి. ఆయన మాటలను విని వాటి ప్రకారం నడుచుకోండి."* అని చెప్పి కూర్చునే వాడు. ఆ తరువాత లేచి దైవప్రవక్త (సల్లం) ప్రసంగించేవారు. ఇలా చేయడం అతనికి అలవాటుగా మారింది (కారణం అందరూ అతణ్ణి నిజమైన ముస్లిం అనుకోవాలని). అయితే ఉహద్ యుద్ధం ముగిసిన తరువాత మొదటి జుమా (శుక్రవారం) రాగానే - ఆ యుద్ధంలో అతను ఓ పెద్ద ద్రోహానికి పాల్పడినప్పటికీ - లేచి ఇదివరకటిలా తన మాటలను వల్లించసాగాడు. కాని ఈ సారి ముస్లిములు అన్ని వైపులా నుంచి అతణ్ణి చుట్టుముట్టి చొక్కా బట్టి క్రింద కూర్చోబెడుతూ, *"ఓ దైవవిరోధీ! కూర్చో. నీవు చేసిన ద్రోహానికి తిరిగి ఆ మాటలు పలికే అర్హత నీకు లేదు."* అనగా, అతను మనుషుల తలలపై నుండి దాటుకుంటూ, *"నేను వారి ప్రవక్త (సల్లం)ను బలపరచడానికి లేచి నిలబడితే వారు నన్ను ఏదో నేరం చేసినవాడిలా కూర్చోబెడుతున్నారు"* అని గొణుక్కుంటూ మస్జిద్ బయటకు వెళ్ళిపోయాడు.

మస్జిద్ ద్వారం వద్ద అనుకోకుండా ఓ అన్సారి అతనికి తారసపడి, *"నీవు నాశనం అయిపోను! పద, వెనక్కు వెళదాం. బహుశా దైవప్రవక్త (సల్లం) నీ మన్నింపు కోసం దుఆ చేస్తారేమో"* అని అన్నారు. అతను దానికి, *"దైవసాక్షి! ఏమీ వద్దు ఆయన (సల్లం) నా మన్నింపు కోసం ఎలాంటి వేడుకోలు చేయవద్దు"* అంటూ వెళ్ళిపోయాడు.

అదే కాదు ఇతను బనూ నజీర్ యూదులతో సంబంధాన్ని స్థాపించుకొని వారితో కలసి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలూ పన్నాడు (ఈ కుట్రల గురించి తెలుసుకునేందుకు చదవండి ఇస్లాం చరిత్ర - 253, 254).

అలాగే అహ్జాబ్ యుద్ధం సందర్భంలో కూడా అబ్దుల్లా బిన్ ఉబై అతని సహచరులు ముస్లిముల నడుమ భయోత్పాతాన్ని సృష్టించేందుకు, వారి ధైర్య సాహసాలను దెబ్బ కొట్టేందుకు రకరకాలుగా ప్రయత్నించి ఉన్నారు.

*కపట విశ్వాసి అబ్దుల్లా బిన్ ఉబై పన్నిన మరిన్ని కుట్రలు గురించి In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment