267

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 267*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 182*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 7* ⚔🛡

అయినప్పటికీ ముస్లింల పరిస్థితి రోజులు గడుస్తున్న కొద్దీ విషమిస్తూ పోతోంది. ఆహారపదార్థాలు నిండుకోవడంతో అనేకమంది ఆకలిబాధతో అలమటిస్తున్నారు. కందకం ఆవల శత్రువులు సందు దొరికితే దూకివచ్చి దాడిచేయడానికి కాచుకొని ఉన్నారు. అంచేత యోధులు కళ్ళలో ఒత్తులు వేసుకొని అహర్నిశలు కాపలా కాయవలసి వస్తోంది.

వీటన్నిటికీ తోడు ముస్లిం సైన్యంలో కపట విశ్వాసుల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ దుర్మార్గులు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ముస్లింలతో ఎలా సహకరిస్తారు? యుద్ధం నుంచి తప్పుకోవడానికి వాతావరణం ఇప్పుడు వారికి అనుకూలంగా ఉంది. వారు పరస్పరం కూడబలుక్కొని దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చారు. 

*"అయ్యా! మా ఇళ్ళు భద్రంగా లేవు. మా భార్యాపిల్లలు అపాయకర స్థితిలో ఉన్నారు. నగరం పోవడానికి మాకు అనుమతివ్వండి."* అంటూ రకరకాల సాకులు చెప్పసాగారు.

దైవప్రవక్త (సల్లం) వారి సాకులను గురించి ఆరాతీయకుండా ఇళ్ళకు వెళ్ళిపోవడానికి వారికి అనుమతి ఇచ్చారు. 

కాని ఆ దుర్మార్గులు అంతటితో తృప్తిచెందకుండా, తాము యుద్ధం నుంచి తప్పుకోవడమేగాక ముస్లింలను కూడా పురిగొల్పసాగారు. కల్లిబొల్లి మాటలతో వారిని భయపెట్టేవారు. దైవప్రవక్త (సల్లం)ను గురించి సందేహాస్పదమైన మాటలు పలికేవారు....; ↓

*"ముహమ్మద్ మనకు బాగా నూరిపోశాడు. అదిగో సిరిసంపదలు వచ్చి పడుతున్నాయి; ఇదిగో రోమ్, ఈరాన్‌ దేశాల నుంచి మణిమాణిక్యాలు ఊడిపడుతున్నాయి అన్నాడు. కాని ఇక్కడ పరిస్థితి చూస్తే ఏదైనా అవసరమొచ్చి నగరంలోకి పోవాలన్నా ప్రాణాంతకంగా ఉంది."* అన్నారు కపట విశ్వాసులు.

(ఈ సందర్భం గురించి దివ్య ఖుర్ఆన్ ఇలా వర్ణిస్తోంది. చదవండి దివ్య ఖుర్ఆన్ 33:13-19.)

కపట విశ్వాసుల పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఉంటే, మరోవైపు బహుదైవాధాధకులు తమల్ని ఆదుకోవడానికి యూదులు ఎప్పుడొస్తారా అని తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. వారు తమకోటల గుండా దారి ఎప్పుడిస్తారు, ఆ దారి గుండా వెళ్ళి మదీనాపై దాడిచేసి తమ దుష్టకోర్కెలను ఎప్పుడు నెరవేర్చుకుందామా అని అదను కోసం కాచుకొని ఉన్నారు.

*కందాకాన్ని దాటిన శత్రు సైనికులు : -*

మదీనా చుట్టూ త్రవ్విన కందకం ఒకచోట వెడల్పు కొంచెం తక్కువగా ఉంది. భద్రతాఏర్పాట్లు కూడా ఏమంత కట్టుదిట్టంగా లేవు. ఈ సంగతి గమనించిన అవిశ్వాసులకు రొట్టెవిరిగి నేతిలో పడినట్లయింది. అటు నుండి దాడిచేయడమే అన్నివిధాలా బాగుంటుందని భావించారు. ఇంకేముంది, శత్రుసైనికుల్లో అమితోత్సాహం పెల్లుబికింది. 

ముందుగా ఆరితేరిన కొందరు వీరాధివీరులు కత్తులు సిద్ధం చేసుకొని, హుషారైన గుర్రాలు ఎక్కి కందకాన్ని అవలీలగా దాటగలిగారు. దాంతో వారి ఆనందం అవధులు దాటింది. ఇక విజయం తమదేనన్న భావనతో రొమ్ములు విరుచుకుంటూ ముస్లిం సైనికుల్ని సమీపించారు.

వారిలో 'అబూ జహల్' కొడుకు 'ఇక్రమా'తో పాటు, యావత్తు అరేబియాలోనే పేరు మోసిన యోధానయోధుడు 'అమ్రూ బిన్ అబ్దె ఉద్' కూడా ఉన్నాడు. అతను వేయి అశ్వశక్తి గల బలాఢ్యుడని ప్రతీతి. ముస్లింలను ఎదుర్కోవడానికి మొదట అతనే ముందుకు వచ్చాడు. దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా శత్రువుల్ని గమనిన్తున్నారు.

అమ్రూ మదపుటేనుగులా ఘింకరిస్తూ, *"ముస్లిం సైనికులారా! నన్ను ఎదుర్కోగల ధీరులు మీలో ఎవరైనా ఉన్నారా?"* అని సవాలు విసిరాడు.

తక్షణమే హజ్రత్ అలీ (రజి) ముందుకొచ్చి, *"నేనున్నాను"* అన్నారు. 

దైవప్రవక్త (సల్లం), అలీ (రజి) వైపు తిరిగి, *"వద్దు కూర్చో"* అన్నారు. 

అమ్రూ తో పోటీకి దిగడానికి ఇంకెవరికీ ధైర్యం చాల్లేదు. అతను మళ్ళీ ముస్లిం యోధులకు సవాలు విసిరాడు. సమాధానంగా హజ్రత్ అలీ (రజి) ఈసారి కూడా ముందుకు వచ్చి, *"నేనున్నాను"* అన్నారు.

కాని దైవప్రవక్త (సల్లం) ఆయన్ని వారించారు. 

అమ్రూ, తనను ఎదుర్కొనేవారెవరూ ఇక్కడ లేరనే తలంపుతో, *"నన్ను ఎదుర్కొనే ధీరుడు ఒక్కడూ లేడా మీలో"* అన్నాడు రెట్టింపు స్వరంతో. 

అలీ (రజి) మూడవ సారి కూడా ముందుకొచ్చి, *"లేకేమి? నేనున్నాను"* అన్నారు. 

*"అలీ! ఇతను అమ్రూ అన్న సంగతి నీకు తెలుసా?"* దైవప్రవక్త (సల్లం) అలీ (రజి) వైపు సూటిగా చూస్తూ అడిగారు.

*"తెలుసు. ఇతను సుప్రసిద్ధ యోధుడయిన అమ్రూ అని నాకు బాగా తెలుసు."* అన్నారు అలీ (రజి).

*"అయితే నీనిప్పుడు అమ్రూ తో పోటీకి దిగవచ్చు."* దైవప్రవక్త (సల్లం) అనుమతిచ్చారు.

దైవప్రవక్త (సల్లం) తన పవిత్ర హస్తాలతో అలీ (రజి) చేతికి ఖడ్గం అందించారు. తలపై పాగా పెట్టారు. అప్పుడు హజ్రత్ అలీ (రజి) పోటీకి సిద్ధమయి అమ్రూ ముందుకు వచ్చారు. అమ్రూ, హజ్రత్ అలీ (రజి)ని చూసి విరగబడి నవ్వారు.

*"కుమారా! నువ్వా నాతో తలపడేది! నిన్ను వధించడానికి నా మనస్సు అంగీకరించడం లేదు."* అన్నాడు అమ్రూ నవ్వు ఆపుకుంటూ.

*"కాని నిన్ను వధించడానికి నా మనస్సు అంగీకరిస్తోంది."* అన్నారు అలీ (రజి).

ఈ మాటలు అమ్రూ హృదయానికి శూలాల్లా గుచ్చుకున్నాయి. అతను దెబ్బతిన్న బెబ్బులిలా చివాలున ముందుకు లంఘించి కత్తితో బలంగా ఒక్క వ్రేటు వేశాడు.

అకస్మాత్తుగా మీద పడిన ఈ దెబ్బను హజ్రత్ అలీ (రజి) చాకచక్యంగా ఢాలుతో నిరోధించి తృటిలో తప్పించుకున్నారు. అలా తప్పించుకుంటూనే రెండో చేతిలో ఉన్న ఖడ్గంతో లాగి ఒక్కవ్రేటు వేశారు. అంతే, ఆ దెబ్బకు అంతలావు పహిల్వాన్ మ్రానులా కూలిపడ్డాడు. రెండు క్షణాలకు ముందు వికటాట్టహాసం చేస్తూ ప్రగల్భాలు పలికిన ఖురైష్‌ వీరుడు ఒకే ఒక దెబ్బతో ఊపిరివిడిచి రక్తపు మడుగులో పడిపోయాడు.

*"అల్లాహుఅక్బర్"* నినాదాలు మిన్నుముట్టాయి. విజయ ప్రకటన గావిస్తూ ముస్లిం యోధులు హర్షధ్వానాలు చేశారు. ఆ తరువాత అమ్రూ తో పాటు వచ్చిన ఖురైష్‌ సైనికులు కూడా కాస్సేపు పెనుగులాడి ఆ తరువాత వెన్నుజూపి పారిపోయారు.

ఈ దాడిలో శత్రువులు ఓటమి చవిచూసినా అంత పెద్ద కందకం దాటగలిగారంటే పెద్ద విశేషమనే చెప్పాలి. అదే వారి మనోస్థయిర్యాన్ని ద్విగుణీకృతం చేసింది. ఆ ధైర్యమే ఇతర యోధుల్ని ప్రాణాలతో చెలగాటమాడటానికి ప్రేరేపించింది. ఎలాగైనాసరే ఈ రోజు కందకం దాటితీరాలని నిశ్చయించుకున్నారు వారంతా.

సూర్యాస్తమయమయింది. చూస్తుండగానే చీకట్లు ఆవరించాయి. బహుదైవారాధకుల సేనల నుంచి ఒక సైనికదళం బయలుదేరింది.

సైనిక దళాధిపతి 'నౌఫల్' ముందున్నాడు. అశ్వరూఢులైన ఈ సైనికదళం కందకం దగ్గరకు చేరుకుంది. మొదట దళాధిపతి కందకం దాటి అనుచరులకు ఆదర్శప్రాయుడు కావాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల నౌఫల్, గట్టు మీదికెళ్ళి అగడ్త ఎంత వెడల్పు ఉందో ఓసారి చూసుకున్నాడు. తరువాత కొంత వెనక్కి వచ్చి గుర్రాన్ని అదిలించి ఒక్క దూకు దూకించాడు.

అత్యంత ప్రతిభాశాలి అయిన ఈ ధీరుడు ఒక్క కుదుపుకు అశ్వంతో పాటు ఆకాశానికి ఎగిరాడు. కాని అక్కడ్నుంచి అమాంతం అగడ్తలోకి పల్టీకొట్టి బోర్లాపడ్డాడు. దాంతో అతని తల పుచ్చకాయలా బ్రద్దలయి పోయింది. 

అనుచరులంతా నిశ్చేష్టులయ్యారు. క్షణంపాటు ఆలోచనలో పడ్డారు. నాయకుడి పర్యవసానం కళ్ళారా చూశారు. దుస్సాహసానికి పాల్పడితే తమకు కూడా అదే గతి పడ్తుందని భావించారు. వెంటనే తోకలు ముడిచి కాళ్ళకు బుద్ధిచెప్పారు.

సైన్యాధ్యక్షుడు అబూ సుఫ్'యాన్ కు ఈ విషయం తెలిసి ఎంతో విచారించాడు. నౌఫల్ మృతదేహం ఇచ్చివేస్తే దానికి బదులు వంద ఒంటెలు ఇస్తామని ముస్లింలకు కబురు చేశాడు. ఈ కబురు అందుకున్న దైవప్రవక్త (సల్లం) ఇలా సమాధానమిచ్చారు....;

*"తీసుకెళ్ళండి, మీ సైనికుడి మృతదేహాన్ని. రక్తపరిహారంగా ఇవ్వజూపుతున్న మీ ఒంటెలు మాకవసరం లేదు. మీ సైనికుడి మృతదేహం కూడా అపవిత్రమైనదే, దాని రక్తపరిహారం కూడా అపవిత్రమైనదే."*

అవిశ్వాసులు కందకంలో నుంచి నౌఫల్ మృతదేహం బయటికి తీసి తమ శిబిరానికి మోసుకెళ్ళారు. ఇంత జరిగినా వారు తమ ప్రయత్నాలు మానుకోలేదు. రేయింబవళ్ళూ కందకం దాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాని కోసం కొన్ని ప్రత్యేక సైనిక దళాలను కూడా తయారు చేసుకున్నారు. ఈ దళాలు కందకం దాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment