266

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 266*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 181*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 6* ⚔🛡

*దైవప్రవక్త (సల్లం)తో స్నేహ ఒప్పందాన్ని ఉల్లంఘించిన బనూ ఖురైజా యూదులు; ఆ తర్వాత జరిగిన సంఘటనలు : -*

*"కందకం అయితే బాగానే తయారు చేసుకున్నాం. కాని ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం ఏమిటి? యూదుల కోట వైపు నుంచి శత్రువులు దాడి చేయడానికి మార్గం ఏర్పడింది. ఇప్పుడేం చెయ్యాలి? మార్గాంతరం ఏమిటి?"* ఎవరి నోట విన్నా ఇవే మాటలు.

శత్రువులు కందకం చుట్టూ చేరి కొత్తగా ఏర్పడిన దారి గుండా నగరంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లింలు వారిని ప్రతిఘటిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అదే స్థితిలో ముస్లింలు అనేక రోజులు పోరాడవలసి వచ్చింది.

అవి ముస్లింలకు కఠినాతి కఠినమైన రోజులు. ఆహారపదార్థాల కొరత తీవ్రంగా ఉంది. దానివల్ల ముస్లిం యోధులు కొందరు రెండేసి మూడేసి రోజులు పస్తులుండవలసి వస్తోంది. ఒక్కొక్క సారి ఆకలి బాధ భరించలేక వ్రేలాడపడిపోయేవారు.

వారి పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లం) ఆలోచనలో పడ్డారు. ఈ పరిస్థితి సైనికుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయవచ్చు. దీన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలి? చివరికి ఒక ఉపాయం తట్టింది.

తక్షణమే ఆయన (సల్లం) గత్ఫాన్ తెగవారి దగ్గరకు ఒక దూతను పంపిస్తూ, *"మీరు మాకు వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే మదీనాలో పండే పంటలో మీకు మూడో వంతు పంటనిస్తాం."* అని చెప్పారు. దానికి గత్ఫాన్ తెగవాళ్ళు ఎంతో సంతోషించారు. సరే, ఎందుకైనా మంచిదని ఆ విషయాన్నిధృవపరచుకునేందుకు వారు దైవప్రవక్త (సల్లం) దగ్గరకు ఒక ప్రతినిధిని పంపించారు.

అయితే కథ అడ్డం తిరిగింది. వచ్చిన ప్రతినిధి మూడో వంతు పంటకు ఒప్పుకోలేదు. అర్థ పంట కావాలని పట్టుబట్టాడు. దైవప్రవక్త (సల్లం) ఓ క్షణం ఆలోచించి ఇదంతా చూస్తున్న అన్సార్‌ నాయకులు 'సఅద్ బిన్ ముఆజ్ (రజి)', 'సఅద్ బిన్ ఉబాదా (రజి)'లను దగ్గరకు పిలిచి మీ అభిప్రాయం ఏమిటని అడిగారు.

*"దైవప్రవక్తా! ఈ వ్యవహారం దైవాజ్ఞే గనక అయితే దీన్ని నిరాకరించడానికి మాకు ఎలాంటి అధికారం లేదు. మీరు ఎలా నిర్ణయించినా దాన్ని ఆమోదించడానికి, అమలు పరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. ఒకవేళ దైవాజ్ఞ కాకుండా నిర్ణయం తీసుకునే అధికారం మనకు ఉన్నట్లయితే మటుకు కొన్ని విషయాలు మీ ముందు నివేదించుకోవాలని ఉంది."* అన్నారు హజ్రత్‌ సఅద్ బిన్ ముఆజ్‌ (రజి).

*"ఇదంతా మీ శ్రేయస్సు కోసమే చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే శత్రువుల బలం కొంతయినా తగ్గుతుందని నా అభిప్రాయం."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా! మేము అవిశ్వాసులుగా ఉన్నప్పుడే మా దగ్గర్నుంచి ఏ ఒక్కడూ సుంకం రూపేణ వీసమెత్తు వస్తువయినా తీసుకోలేకపోయాడు. ఇప్పుడు మేము మీ సహచర భాగ్యంతో ముస్లింలమై ఎంతో ఔన్నత్యం సంపాదించాము. అందువల్ల వారి కోసం ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఖడ్గం ఒక్కటే."* అన్నారు అనుచరులు ఆవేశంతో. 

ధీర సహచరుల నోట వెలువడిన ఈ పరుష వచనాలు వినగానే దైవప్రవక్త (సల్లం) గత్ఫాన్ తెగ బహుదైవారాధకులతో ఒప్పందం చేసుకోవడం మానుకున్నారు. తరువాత గత్ఫాన్ తెగ ప్రతినిధిని వెనక్కి పంపి తృప్తిగా నిట్టూర్చారు.

*ధీరవనిత హజ్రత్‌ సఫియా (రజి) : -*

అయితే యుద్ధం మలుపు తిరిగింది. బహుదైవారాధకుల సైన్యం నూతన ఉత్తేజంతో ముస్లింల మీదకు విజృంభించింది. నిన్నటిదాకా భయంతో బిక్కముఖాలు వేసుకున్న ఖురైష్‌ సైనికులకు ఈరోజు బనూ ఖురైజా యూదుల మద్దతు లభించడంతో ఎక్కడలేని ధైర్యం పుట్టుకొచ్చింది. కందకం వల్ల ఏర్పడిన భయం కాస్తా పోయింది. రక్తాన్ని గడ్డ కట్టించే చలి ఉన్నా ఖాతరు చేయకుండా పోరాడుతున్నారు. ముస్లింలు ఎటువైపు నుంచి కూడా బయటపడలేనంత పకడ్బందీగా ఖురైష్‌ సైనికులు వారిపై ఉధృతంగా బాణాలు కురిపిన్తున్నారు.

ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నలువైపుల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. భయాందోళనలతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. మరో వైపు యూదులు వచ్చిపడతారనే భయం కూడా వారిని రేయింబవళ్ళు పట్టి పీడిస్తోంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు నగరంలోని 'పారే' అనే పేరుగల కోటలో తలదాచుకున్నారు. అయినా నమ్మకద్రోహులయిన యూదులు ఎప్పుడు ఏ హాని తలపెడ్తారోనన్న భయాందోళనలతో ముస్లింలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

బనూ ఖురైజా యూదులు దొంగచాటుగా ముస్లింలపై దాడిచేయడానికి అవకాశం కోసం పొంచి చూస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే ఒక సైనికదళం రహస్యంగా బయలుదేరింది. వారి విద్రోహచర్యల్ని కనిపెట్టిన ముస్లిం యోధులు వెంటాడి వారిని తరిమేశారు. 

అయినప్పటికీ యూదులు తమ కుటిలయత్నాలు మానలేదు. మదీనాలో ముస్లిం స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తలదాచుకున్న కోట పక్కనే యూదుల కోటలు కూడా ఉన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న యూదులు సంతోషంతో ఎగిరి గంతేశారు. 

*"ముస్లిం సైనికులు ఖురైషీయులతో పోరాడుతున్నారు. అందువల్ల కోటలో వారి స్త్రీలు, పిల్లలు, తప్ప యుద్ధం చేయగలిగే పురుషులెవరూ ఉండకపోవచ్చు. కోటను ఆక్రమించుకోవడానికి ఇదే మంచి అవకాశం"* ఈ ఆలోచన రాగానే యూదులు ఒక సైనికుడ్ని ముస్లింల కోట వైపు పంపారు.

ఆ యూద సైనికుడు మెల్లగా కోట దగ్గరకు వెళ్ళాడు. కోట చుట్టూ తిరుగుతూ కోట లోపల పురుషయోధులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించసాగాడు. 

కోట పకడ్బందీగా ఉంది. లోపల ఉన్న స్త్రీలకు, పిల్లలకు కాపలా కాయడానికి 'హజ్రత్ హస్సాన్ (రజి)' నియమించబడ్డారు. కోటలో దైవప్రవక్త (సల్లం) మేనత్త 'హజ్రత్ సఫియా (రజి)' కూడా ఉన్నారు.

బనూ ఖురైజా తెగ, దైవప్రవక్త (సల్లం)తో చేసుకున్న ఒప్పందాన్ని భంగపరిచి యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయమది. బనూ ఖురైజా నుండి రక్షించడానికి వారి వద్ద ఏ పురుషుడూ లేడు. దైవప్రవక్త (సల్లం), ముస్లిములందరితో సహా శత్రువును ఎదుర్కోడానికి కందకం ఈవల పొంచివున్న సమయమది. ఎవరైనా వారిపై దాడి చేస్తే, ఆయన (సల్లం) కందకం వద్ద నుండి వారిని రక్షించడానికి రాలేని పరిస్థితి.

అటువంటి సమయంలో కోట వెలుపల ఆ యూద సైనికుడి నీడ కనిపించగానే సఫియా (రజి) భయపడ్డారు. హజ్రత్ హస్సాన్ (రజి)కు అటువైపు చూపిస్తూ ఇలా అన్నారు....;

*"చూశారు కదా శత్రువు మన కోట చుట్టూ ఎలా తిరుగుతున్నాడో? తక్షణమే వెళ్ళి అతని శిరస్సు ఖండించి రండి. ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోయి మనల్ని గుర్తించిన సమాచారం శత్రువులకు చేరవేస్తాడు. అటు మన సైనికులు ఖురైషీయులతో యుధ్ధంలో నిమగ్నులై ఉన్నారు. ఒకవేళ ఇతను తప్పించుకొనిపోతే మాత్రం మనం ప్రమాదంలో పడిపోతాం. త్వరగా బయలుదేరండి. (★ చూడండి! ఈ యూదుడు వచ్చి మనం ఉన్న కోట చుట్టూ తిరుగుతున్నాడు. దైవసాక్షిగా చెబుతున్నాను, ఇతను యూదులకు మన బలహీనతల గురించి చెప్పి మనపై దాడి చేయడానికి పురికొల్పవచ్చు. అటు దైవప్రవక్త (సల్లం) సహాబా (రజి)తో సహా యుద్ధంలో చిక్కుకొని ఉన్నారు. ఆయన (సల్లం) మన సహాయానికి రాలేరు. కాబట్టి వెళ్ళి అతణ్ణి సంహరించండి.)"*

హజ్రత్ హస్సాన్ (రజి) సందిగ్ధంలో పడ్డారు. ఆయన ప్రఖ్యాత కవి. తన అసాధారణ కవితా పటిమతో దైవప్రవక్త (సల్లం) తరఫున సత్యతిరస్కార కవుల నోళ్ళను కట్టిపడవేసేవారు. కాని ఖడ్గం చేపట్టాలంటే కొంచెం భయపడ్డారు. అందువల్ల క్షణంపాటు తటపటాయించి తన పిరికితనాన్ని బయట పెట్టుకోక తప్పలేదు.

*"అబ్దుల్‌ ముత్తలిబ్ కూతురా! నన్ను పరీక్షించకు. నేను ఈ పనికి తగనని నీకు తెలుసు కదా! (★ దైవసాక్షిగా! నేను అలాంటి పనికి ఉపయోగపడే వ్యక్తిని కానని మీకు తెలియదా?)"* అన్నారు ఆయన.

హజ్రత్ సఫియా (రజి)కు మరోమార్గం కనిపించలేదు. ప్రమాద ఘడియ దగ్గర పడుతోంది. గత్యంతరంలేక తానే ఓ శిబిరం గుంజ పీకి బయటకు వెళ్ళారు. చప్పుడు చేయకుండా శత్రువు వెనకాలగా పోయి గుంజతో అతని తల మీద బలంగా ఒక దెబ్బ వేశారు. ఆ దెబ్బకు తల పుచ్చకాయలా పగిలిపోయి శత్రువు నేలకొరిగాడు. 

తరువాత హజ్రత్ సఫియా (రజి) కోటలోకి తిరిగొచ్చి, *"శత్రువు చచ్చిపోయాడు. ఇప్పుడైనా వెళ్ళిరండి. అతను పురుషుడైనందున నేను తాకడం సమంజసం కాదు. మీరు వెళ్ళి అతని ఆయుధాలు, దుస్తులు తీసి పట్రండి. (★ వెళ్ళి అతని ఆయుధాలు, అతని బట్టలు ఒలుచుకు రండి, అతను పురుషుడు కాబట్టి నేను అతణ్ణి తాకలేను.)"* అని చెప్పారు.

*"పోనీవమ్మా! నాకు వాటి అవసరం లేదు. (★ నేను అక్కడికి వెళ్ళలేను. అతని ఆయుధాలతో నాకు పని కూడా లేదు.)"* అన్నారు హజ్రత్ హస్సాన్ (రజి) పోవడానికి సాహసించలేక.

*"సరే, కనీసం అతని శిరస్సునైనా కోసిపారేయండి. దాన్ని చూసి యూదులు హడలిపోతారు."* అని హజ్రత్ సఫియా (రజి) మళ్ళీ పురమాయించారు.

కాని హజ్రత్ హస్సాన్ (రజి) దానికీ సిద్ధం కాలేకపోయాడు. చేసేదిలేక హజ్రత్ సఫియా (రజి)యే మళ్ళీ బయటికి పోవలసి వచ్చింది.

ఆమె వెళ్ళి శత్రువు తల ఖండించి దూరంగా విసిరివచ్చారు. బనూ ఖురైజా యూదులు తమ సైనికుడి శిరస్సు చూసి కోటలో కూడా సైనికులున్నారని భావించారు. అందువల్ల వారు ముస్లింల కోటపై దాడిచేయడానికి సాహసించలేక పోయారు.

(★ యదార్థం ఏమిటంటే, ముస్లిం మహిళలు మరియు పిల్లల సంరక్షణ కోసం, మహాప్రవక్త (సల్లం) గారి మేనత్త హజ్రత్ సఫియా (రజి) నిర్వహించిన ఈ ఘనకార్యం యూదులపై పెద్ద ప్రభావాన్నే చూపించింది. బహుశా యూదులు, ఆ కోటలో మరింత మంది ముస్లిం యోధుల పటాలం ఉందని అనుకోవడమే - అయితే అక్కడ ముస్లిం యోధుల పటాలం ఏదీ లేదు - అందుకని యూదులు తిరిగి కోటలోనికి వెళ్ళే ధైర్యం ఏ మాత్రం చేయలేదు. కాని వారు శత్రు సైన్యానికి సహాయపడుతున్నామని చూపడానికి వారికి నిరంతరం ఆహారాన్ని సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ ఆహారాన్ని మోసుకొని వెళ్ళే ఇరవై ఒంటెలను సైతం ముస్లింలు పట్టుకోవడం జరిగింది.)

_(★→ మరింత వివరణ కోసం వేరొక సీరత్ కితాబ్ నుంచి సేకరణ)_

అయినప్పటికీ ముస్లింల పరిస్థితి రోజులు గడుస్తున్న కొద్దీ విషమిస్తూ పోతోంది. ఆహారపదార్థాలు నిండుకోవడంతో అనేకమంది ఆకలిబాధతో అలమటిస్తున్నారు. కందకం ఆవల శత్రువులు సందు దొరికితే దూకివచ్చి దాడిచేయడానికి కాచుకొని ఉన్నారు. అంచేత యోధులు కళ్ళలో ఒత్తులు వేసుకొని అహర్నిశలు కాపలా కాయవలసి వస్తోంది.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment