265

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 265*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 180*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 5* ⚔🛡

(శత్రు సైనికులు)ఒక వైపు కందకం దాటడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మరోవైపు ప్రాణాలు తోడేసే చలి ఆపాదమస్తకం గజ గజ వణికిస్తోంది. దైవప్రవక్త (సల్లం)ను అంతమొందించి, సత్యధర్మాన్ని సమాధి చేయడానికి వచ్చిన బహుదైవారాధకులు చివరికి ఇలా ఇరకాటంలో పడ్డారు.

పాపం వారి సైనికులు ఢీలాపడిపోయారు. క్రమశిక్షణ సన్నగిల్లిపోయింది. సర్వత్రా నిరాశానిస్పృహలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా *"ఇక ముహమ్మద్ (సల్లం)ని జయించడం మన వల్ల సాధ్యం కాదు"* అన్న మాటలే వినిపిస్తున్నాయి.

*ప్రవక్త (సల్లం)తో చేసుకున్న స్నేహ ఒప్పందాన్ని త్రుంచివేసిన బనూ ఖురైజా యూదులు : -*

బనూ నజీర్ యూద తెగ నాయకుడు 'హుయ్ బిన్ అఖ్తబ్' సైనికుల పరిస్థితి చూసి భయపడ్డాడు. సైనికుల్ని ఒక చోట చేర్చడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ఆలోచించాడు. *"సైనికుల పరిస్థితి ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే వారి మనోస్థయిర్యం సన్నగిల్లిపోతుంది. అందువల్ల తక్షణమే ఏదో ఒకటి చేయాలి."* అనుకున్నాడు మనసులో.

వెంటనే అతను సర్వసేనాని అబూ సుఫ్'యాన్ దగ్గరికి పరిగెత్తాడు.

*"నా జాతి వాళ్ళయిన బనీ ఖురైజా యూదులు కూడా మీ పక్షాన ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో మీకు తెలుసు. రంగంలో దిగితే విజయమో వీరస్వర్గమో అన్నదే వారి ధ్యేయం."* అన్నాడతను. 

*"అయితే ఇక ఆలస్యం ఎందుకూ? త్వరగా పోయి ముహమ్మద్ (సల్లం)తో చేసుకున్న స్నేహ ఒప్పందం త్రెంచెయ్యమని చెప్పిరా."* అన్నాడు అబూ సుఫ్'యాన్. 

హుయ్ ఆ తర్వాత బనీ ఖురైజా తెగవాళ్ళ దగ్గరికి పరుగుపెట్టాడు. *"ఎలాగైనా వాళ్ళకు నచ్చజెప్పాలి. మభ్య పెట్టి అయినాసరే ముస్లింలతో చేసుకున్న ఒప్పందం త్రెంచివేయించి వారిని ఖురైషీయుల పక్షం వైపు తిప్పాలి"* అనుకున్నాడు మనసులో. 

కొంచెం దూరం ఉండగానే అతని వాలకం చూసి బనీ ఖురైజా నాయకుడు 'కఅబ్ బిన్ అసద్' అనుమానించాడు. *"ఇతనేదో కల్లిబొల్లి మాటలు చెప్పి ఒప్పందాన్ని త్రెంచివేయించడానికి వస్తున్నాడు"* అని పసిగట్టాడు. వెంటనే కోట సింహద్వారాలు మూయించాడు. అతడ్ని కలుసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. 

హుయ్ కోట ద్వారం దగ్గరికి వచ్చాడు. ఎన్నో ప్రమాణాలు చేసి మీ శ్రేయస్సు కోసమే వచ్చాను, తలుపు తీయమని అడిగాడు. కఅబ్ తలుపు తెరవలేదు. హుయ్ తలుపు తెరిపించడానికి చాలా ప్రయత్నించాడు. చివరికి 'కఅబ్‌'ని రెచ్చగొడ్తూ, *"మీరు తలుపులు ఎందుకు మూయించారో నాకు తెలుసు. నేను కూడా మీకున్న దాంట్లో భాగస్వామిని అవుతానేమోనని భయపడ్తున్నారు మీరు."* అన్నాడు. 

ఈ మాట వినగానే 'కఅబ్ బిన్ అసద్‌'కు అభిమానం ముంచుకు వచ్చింది. అందువల్ల వెంటనే అతను తలుపులు తెరిపించాడు.

*"చూశారా! మీ కోసం నేను ఎలాంటి పేరుప్రతిష్ఠల మూట పట్టుకొచ్చానో. బ్రహ్మాండమైన సైనికవాహిని! నురుగులు కక్కే సైనికవాహిని!! యావత్తు అరేబియా కదలివచ్చింది. ఖురైష్‌, గత్ఫాన్.... ఒకరేమిటీ? సమస్త తెగలు వచ్చిపడ్డాయి. అంతా ముహమ్మద్ (సల్లం) రక్తాన్ని కళ్ళ చూడటానికి తహతహలాడి పోతున్నారు. అనుకున్న పని నెరవేరనిదే ఇక్కడ్నుంచి కదలమని గట్టిగా శపథం కూడా చేశారు."* అన్నాడు హుయ్ కోటలోకి ప్రవేశిస్తూ. 

హుయ్ అతిశయోక్తులకు కఅబ్ కొంచెం తికమక పడ్డాడు.

*"హుయ్! నువ్వు నా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నావు. నేను ముహమ్మద్ (సల్లం)తో ఒడంబడిక చేసుకున్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు ఈ ఒడంబడికను ఉల్లంఘించడం నావల్ల కాదు. ముహమ్మద్‌ (సల్లం) ఎల్లప్పుడూ మా పట్ల నమ్మకంగానే ప్రవర్తించాడు. అలాంటి నిజాయితీపరుడికి వ్యతిరేకంగా నేను ఈ విశ్వాసఘాతుకానికి పాల్పడలేను."* అన్నాడు కఅబ్.

కఅబ్ మాటలకు హుయ్ ఏ మాత్రం నిరాశపడలేదు. అతని అభిమానాన్ని మరింత రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు.

*"కఅబ్! ఈ రోజు మొత్తం జాతి గౌరవాన్ని కాపాడేపని నీ చేతిలో ఉంది. దాని పరాభవం కూడా నీ చేతిలోనే ఉంది. దాన్నిబట్టి నీవే ఆలోచించుకో. ఇలాంటి అవకాశం చేజారిపోతే మళ్ళీ రాదు. నా మాట విని సంకోచించకుండా ఒప్పందాన్ని త్రెంచి ఖురైష్ సైనికులకు దారివ్వు. వారు ప్రవాహంలా ముందుకు పురోగమిస్తారు. నిమిషాల్లో ముహమ్మద్ (సల్లం)ని, అతని అనుచరుల్ని తుడిచిపెడ్తారు. ఆ తరువాత యావత్ అరేబియాపై మన ప్రభావం పడుతుంది. అంతేకాదు, మన మతవ్యాపి కోసం కూడా దారి సుగమం అవుతుంది. మదీనా సిరిసంపదలు కూడా మనకే దక్కుతాయి."*

హుయ్ ఈసారి ప్రయోగించిన రాజనీతి అస్త్రం వృధా పోలేదు. అతని ఇంద్రజాలానికి కఅబ్ మంత్రముగ్ధుడయ్యాడు. కాని దాన్ని ఆచరణలో పెట్టడానికి కఅబ్ వెనకాడుతూనే ఉన్నాడు. ఒప్పందం ధిక్కరణ వల్ల కలిగే దుష్పరిణామాలు అతని హృదయాన్ని మాటి మాటికి పట్టి కలచివేస్తున్నాయి. 

*"ఒకవేళ ఖురైష్, గత్ఫాన్ తెగలు ఓడిపోతేనో....? వాళ్ళు కాలికి బుద్ధిచెప్పి ఎలాగో బయటపడతారు. కాని నేను ఏకాకినవుతాను. ఆ తర్వాత సర్వనాశనమవుతాను. బనీ నజీర్, బనీ ఖైనుఖా తెగల మాదిరిగా నేను, నా తెగ వాళ్ళు కూడా ఘోరంగా అప్రతిష్ఠ పాలవుతాము."* ఈ ఆలోచన రాగానే ఒంటిమీద జెర్రులు ప్రాకినట్లనిపించింది కఅబ్ కు.

కాని కఅబ్ ముఖకవళికలు కనిపెట్టిన హుయ్ చాకచక్యంతో మాయమాటల వలపన్ని అతని ఒంటిమీద జెర్రుల్ని వదలగొట్టాడు, అనుమానభూతాన్ని పారదోలాడు. బలవంతంగా ఓ చిరునవ్వు ఒలకబొస్తూ, *"కఅబ్! నీ అనుమానం ఏమిటో నాకు తెలుసు. దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే, ఖురైషీయులు కూడా పారిపోతే.... అప్పుడు నేను ఖైబర్ వదలి ఇక్కడికే వచ్చి మీ దగ్గర ఉంటాను. ఏ కష్టమొచ్చినా మీతో పాటు నేనూ పాలుపంచుకుంటాను, సరేనా?"* అన్నాడు.

ఈ మాటలతో కఅబ్ మనస్సు కుదుటపడింది. ఇప్పుడు పూర్తిగా దిగివచ్చి హుయ్ తో రాజీపడ్డాడు.

ఇక ఆ తర్వాత హుయ్ విజయగర్వంతో అబూ సుఫ్'యాన్ దగ్గరకు వెళ్ళి ఈ వార్త వినిపించాడు. ఈ వార్త విని అబూ సుఫ్'యాన్ ముఖం చాటంత అయింది. 

*"నిజమా! అయితే రేపు ఈ సమయానికి ముస్లిములంతా మాకు లొంగిపోతారు. ముహమ్మద్ (సల్లం) మాకు బందీగా దొరికిపోవడం ఖాయం"* అని భావించి తెగ సంబరపడిపోయాడు అబూ సుఫ్'యాన్.

ఇటు మరో ప్రక్క, కందకం వద్ద ముస్లిం యోధులు ఎడతెరిపి లేకుండా ధనుర్బాణాలతో పోరాడుతూనే ఉన్నారు. ఆహారపదార్థాలు కొరవడినా ఖాతరు చేయకుండా అత్యంత ఉత్సాహాంతో యుద్ధరంగంలో స్థిరంగానే ఉన్నారు. 

సరిగ్గా అదే సమయంలో బనీ ఖురైజా తెగ యూదులు దైవప్రవక్త (సల్లం)తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన వార్త ముస్లిం సైనికుల్లో దావానలంలా వ్యాపించింది. అందరూ నిర్ఘాంతపోయారు. ఇప్పుడు వీరు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఒక వైపు కందకం ఆవల శత్రుసైనికులు కాచుకొని ఉన్నారు. మరోవైపు ఒప్పందాన్ని భంగం చేసిన యూదులు ఉన్నారు. అంతర్గత శత్రువులయిన ఈ యూదులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. స్త్రీలు, పిల్లల భద్రతకు కూడా ముప్పు ఏర్పడింది. యూదుల నమ్మకద్రోహం వల్ల ఖురైషీయుల దారి సుగమం అయింది. ఈ దారి గుండా వారు మదీనాలోకి ఏ క్షణాన్నయినా ప్రవేశించే ప్రమాదం ఉంది. 

బనూ ఖురైజా యూదులు ఒప్పందం ధిక్కరించిన వార్త విషయంలో నిజానిజాలు తెలుసుకొని రావడానికి దైవప్రవక్త (సల్లం) వెంటనే ఒక మనిషిని పంపించారు. అతను అక్కడికి పోయి చూస్తే యూదులంతా యుద్ధ సన్నహాలు చేస్తూ ఉద్రేకంతో ఉరకలు వేస్తున్నారు. ఏ ఒక్కరూ అతని మాట ఆలకించేటట్లు కన్పించలేదు. అందరూ ఆయుధాలు, వాహనాలను సమకూర్చుకోవడంలో నిమగ్నులైపోయారు. 

దైవప్రవక్త (సల్లం) మరో ఇద్దరు 'సఅద్ బిన్ ఉబాదా (రజి)', 'సఅద్ బిద్ ముఆజ్‌ (రజి)'లను కూడా పంపారు. సఅద్ బిన్ ఉబాదా (రజి) ఖజ్రజ్ తెగ నాయకులు. సఅద్ బిన్ ముఆజ్ (రజి) అవస్ తెగ నాయకులు. ఈయనకు బనూ ఖురైజా యూదులతో కూడా సంబంధం ఉంది. అందువల్ల దైవప్రవక్త (సల్లం) వీరిద్దరిని పంపిస్తూ, *చూడండి! బనీ ఖురైజా గురించి ఏ వార్త అయితే అందిందో అది ఎంత మట్టుకు సరియైనది? అదే గనక నిజమైతే తిరిగి వచ్చి, ముస్లింల ధైర్యానికి దెబ్బ తగలకుండా అది నాకొక్కడికే తెలియజేయండి. అది కూడా సంజ్ఞల రూపంలోనే సుమా! అలా కాకుండా, బనూ ఖురైజా తమ ప్రతిజ్ఞపై నిలకడగా ఉంటే మాత్రం ఆ వివరాలను అందరికీ తెలిసేటట్లు ప్రకటించండి."* అని తాకీదు చేశారు.

వారిద్దరు బనూ ఖురైజా వాడలోకి పోతే వారికీ అదే పరిస్థితి ఎదురైంది. యూదులు ఒప్పందం అతిక్రమించి నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. వారి నాయకుని వైఖరి మరీ సిగ్గుచేటుగా ఉంది. దైవప్రవక్త (సల్లం)ను బహిరంగంగా తూలనాడుతూ, *"ఎవరా దైవప్రవక్త? మాకూ ముహమ్మద్ (సల్లం)కు మధ్య ఎలాంటి ఒప్పందం లేదు."* అని తెగేసి చెప్పాడు. 

ప్రవక్త (సల్లం) అనుచరులు అతని మాటలు విని రెచ్చిపోయారు. కాని ఏం చేయగలరు? పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అప్పటికే ఇద్దరు అనుచరులు బాగా రెచ్చిపోయి యూదులతో కలబడే స్థితికి వచ్చారు. కాని సఅద్ బిన్ ముఆజ్ (రజి) మిత్రులిద్దరికీ నచ్చజెప్పి అదుపులో ఉంచారు. *"అంతేకాదు, అంతకంటే ఎక్కువగానే మీతో మా సంబంధాలు తెగిపోయాయి."* అంటూ ఈ ముగ్గురూ అక్కడ్నుంచి చరచరా వెళ్ళిపోయారు.

వారు ముగ్గురూ సైనిక స్థావరానికి చేరుకొని దైవప్రవక్త (సల్లం)కు పరిస్థితినంతా రహస్యంగా సైగలతో విన్నవిస్తూ, "అజ్ల్ మరియు ఖారా" అనే పదాలను మాత్రమే పలికారు. అంటే 'అజ్ల్ మరియు ఖారా'లు ఎలాగైతే 'రజీ' సహాబీలను మోసగించారో, ఈ యూదులు కూడా అలాగే తమ వాగ్దానాన్ని భంగపరిచారని చెప్పడం అన్నమాట. కాని ఈ రహస్యం ఎంతో సేపు రహస్యంగా ఉండలేదు. కొన్ని క్షణాల్లోనే సైనికులందరికీ తెలిసిపోయింది. నగరమంతా అట్టుడికిపోయింది. ప్రజల హృదయాల్లో నిరాశా చీకట్లు ఆవరించాయి.

*"కందకం అయితే బాగానే తయారు చేసుకున్నాం. కాని ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం ఏమిటి? యూదుల కోట వైపు నుంచి శత్రువులు దాడి చేయడానికి మార్గం ఏర్పడింది. ఇప్పుడేం చెయ్యాలి? మార్గాంతరం ఏమిటి?"* ఎవరి నోట విన్నా ఇవే మాటలు.

శత్రువులు కందకం చుట్టూ చేరి కొత్తగా ఏర్పడిన దారి గుండా నగరంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లింలు వారిని ప్రతిఘటిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అదే స్థితిలో ముస్లింలు అనేక రోజులు పోరాడవలసి వచ్చింది.

అవి ముస్లింలకు కఠినాతి కఠినమైన రోజులు. ఆహారపదార్థాల కొరత తీవ్రంగా ఉంది. దానివల్ల ముస్లిం యోధులు కొందరు రెండేసి మూడేసి రోజులు పస్తులుండవలసి వస్తోంది. ఒక్కొక్క సారి ఆకలి బాధ భరించలేక వ్రేలాడపడిపోయేవారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment