264

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 264*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 179*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

    🛡⚔ *గజ్వయె అహ్జాబ్ (అగడ్త యుద్ధం - కందక యుద్ధం) : - 4* ⚔🛡

*మదీనా పొలిమేర్లలో శత్రు సైనికులు : -*

అటు శత్రుసైనికులు అప్పుడే మదీనా పొలిమేరల సమీపానికొచ్చి మోహరించ సాగాయి. సేనాపతి అబూ సుఫ్'యాన్ ముస్లింల కోసం తెగ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాడు. కాని ముస్లింలు అక్కడ కనిపించక పోవడంతో అతను మదీనా దారిపట్టాడు. మదీనా సమీపానికి వచ్చి విడిదిచేశాడు. సైన్యంలోని కొన్నితెగలు మాత్రం ఉహద్ దగ్గరే ఆగిపోయాయి. 

ముస్లింలు మదీనా నుంచి కదలినట్లు సూచనలేమీ కానరావడం లేదు. అసలు వారి పరిస్థితి ఏమిటో, సైనిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయో సమాచారం అందితేగాని తదుపరి చర్య తీసుకోవడానికి వీలుపడదు. అంచేత అబూ సుఫ్'యాన్ కొన్ని గూఢచార బృందాలను తయారుచేసి మదీనా వైపు పంపించాడు. 

ఈ గూఢచార బృందాలు ఒకదాని వెంట మరొకటి చొప్పున రహస్యంగా బయలుదేరాయి. కాని తీరా మదీనా సమీపానికి చేరుకునేటప్పటికి అక్కడ కొత్తగా వెలసిన దృశ్యం చూసి కొయ్యబారి పోయారు. మక్కా బహుదైవారాధకులు ఇదివరకెప్పుడూ ఇలాంటి విశేషం చూడలేదు. అసలు ఇలాంటి అద్భుతం గురించి వారు కనీసం ఊహించనైనా ఊహించలేదు. నమ్మశక్యంకాని ఆ దృశ్యాన్ని చూసి వారు నోరెల్ల బెట్టారు. 

*"ఏమిటిదీ! కందకంలా ఉందే!! ఔను కందకమే. ఎంతో లోతుగా, పొడవుగా త్రవ్వుకున్నారు. ఇది మదీనా రక్షణ కోసం చేసిన ఏర్పాటు కాబోలు!! అయితే మన సైన్యం ఈ కందకాన్ని దాటగలదా? ఏ పని కోసం మనం ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి ఇంత పెద్ద సైన్యం సమీకరించుకొని వచ్చామో ఆ పని నెరవేరుతుందా, లేదా? కొంపదీసి మనం వేసుకున్న పథకం తల్లక్రిందులు అవదుకదా!"* పరిపరి విధాల ఆలోచించి దిక్కుతోచని స్థితిలో ఉసూరుమంటూ తమ స్థావరాలకు తిరిగొచ్చారు ఖురైష్ గూఢచారులు. 

ఈ చావుకబురు వినగానే ఖురైషీయులందరికీ నడుములు విరిగినంత పనయింది. దేహమంతా చలిచీమలు ప్రాకినట్లనిపించింది.

*"ఇదేదో కొత్త వ్యూహంలా ఉంది. అరేబియాలో ఇదివరకెప్పుడూ ఇలాంటి విడ్డూరం మనం చూడలేదే! ఏమిటీ యుద్ధ తంత్రం!!"* ఎంతో ఆశ్చర్యపోయి, నిస్సత్తువతో అంతా హతాశులయ్యారు.

అటు మదీనా వెలుపల ముస్లిం సేనలు అవిశ్వాసులతో పోరాడటానికి తహతహ లాడుతున్నాయి. 'నల్అ' కొండ దిగువ భాగంలోని ఎత్తయిన కీలక ప్రదేశంలో ఓ ప్రత్యేక సైనిక శిబిరం వెలసింది. ఇది మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) కోసం నిర్మించబడిన తాత్కాలిక సైనిక స్థావరం. ఇక్కడ కూర్చొని ఆయన (సల్లం) జరగబోయే యుద్ధాన్ని గురించి ఓ సమగ్రమైన పథకం రూపొందించారు. 

పథకం ప్రకారం ఆయన (సల్లం) సైన్యాన్ని అనేక విభాగాలుగా విభజించారు. కొన్ని సైనిక విభాగాలను ముందుగానే కందకం పొడుగూతా పహరా ఉంచారు. శత్రువులు దాటివస్తారని అనుమానం ఉన్న అగడ్త భాగాల దగ్గర మాత్రం మరింత పకడ్బందీగా గస్తీ దళాలను కూడా ఏర్పాటు చేశారు. మిగిలిన సేనలు శత్రువులను ఎదుర్కోవడానికి పంక్తులుతీరి నిలబడ్డాయి. కందకం ఆవల శత్రుసైన్యాలు వచ్చి బుసలు కొడుతున్నాయి.

మధ్యలో పెద్ద కందకం ఉండటం వల్ల ఇరుపక్షాల సైన్యాలు నేరుగా ఢీకొనడానికి వీలులేకుండా పోయింది. శత్రుసైనికులు ఏమీ పాలుపోక కోపంతో చిందులు తొక్కుతున్నారు. అశ్వరూఢులైన కొందరు సైనికులు కందకం దాటడానికి విఫలయత్నం చేశారు. 

ఇటు ముస్లిం యోధులు ఎడతెరిపి లేకుండా బాణాలు కురిపించసాగారు. వీరి బాణాలధాటికి నిలువలేక శత్రు సైనికులు వెనక్కి తగ్గారు. అయినా వారు అధైర్యం చెందలేదు. అగడ్తకు ఆవల వైపు నుంచి వారు కూడా బాణాలు వదలడం మొదలెట్టారు. 

అలా సాయంత్రందాకా యుద్ధం చేశారు. చీకటిపడిన తరువాత వారు తమ స్థావరాలకు వెళ్ళిపోయారు. మరునాడు సూర్యోదయం కాగానే మళ్ళీ కందకం దాటి రావడానికి ఎంతో ప్రయత్నించారు. కాని ఆ రోజు కూడా వారికది సాధ్యపడలేదు. పట్టరాని కోపంతో పళ్ళు పటపట కొరుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. 

వారు అనుకున్నది ఒకటయితే ఇక్కడ జరిగింది మరొకటి. తమ పథకం తారు మారైందని భావించి దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఖురైషీయులు. 

దానికి తోడు రాత్రి వేళల్లో విపరీతమైన ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. ఆపై ఎముకలు కొరికే చలి! నరాల్లోని రక్త౦ గడ్డ కట్టుకుపోతోంది. సైనిక పంక్తులు చెల్లాచెదరయి పోతున్నాయి.

ఒక వైపు కందకం దాటడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మరోవైపు ప్రాణాలు తోడేసే చలి ఆపాదమస్తకం గజ గజ వణికిస్తోంది. దైవప్రవక్త (సల్లం)ను అంతమొందించి, సత్యధర్మాన్ని సమాధి చేయడానికి వచ్చిన బహుదైవారాధకులు చివరికి ఇలా ఇరకాటంలో పడ్డారు.

పాపం వారి సైనికులు ఢీలాపడిపోయారు. క్రమశిక్షణ సన్నగిల్లిపోయింది. సర్వత్రా నిరాశానిస్పృహలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా *"ఇక ముహమ్మద్ (సల్లం)ని జయించడం మన వల్ల సాధ్యం కాదు"* అన్న మాటలే వినిపిస్తున్నాయి.

*ప్రవక్త (సల్లం)తో చేసుకున్న స్నేహ ఒప్పందాన్ని త్రుంచివేసిన బనూ ఖురైజా యూదులు : -*

బనూ నజీర్ యూద తెగ నాయకుడు 'హుయ్ బిన్ అఖ్తబ్' సైనికుల పరిస్థితి చూసి భయపడ్డాడు. సైనికుల్ని ఒక చోట చేర్చడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ఆలోచించాడు. *"సైనికుల పరిస్థితి ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే వారి మనోస్థయిర్యం సన్నగిల్లిపోతుంది. అందువల్ల తక్షణమే ఏదో ఒకటి చేయాలి."* అనుకున్నాడు మనసులో.

వెంటనే అతను సర్వసేనాని అబూ సుఫ్'యాన్ దగ్గరికి పరిగెత్తాడు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

No comments:

Post a Comment