254

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 254*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 169*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*5. గజ్వయె బనూ నజీర్ : - 2*

కపట ముస్లిం నాయకుడు 'అబ్దుల్లా బిన్ ఉబై' అందించిన ఈ సందేశం వల్ల యూదులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. దేశబహిష్కరణకు గురికావడానికి బదులు ముస్లింలను ఎదుర్కునేందుకు వారు సిద్ధపడ్డారు.

ఈ హామీ మాటలు విని ఆ తెగ నాయకుడు 'హుయ్ బిన్ అఖ్తబ్' సంతోషంతో ఎగిరి గంతేశాడు. తన తెగకు కొండంత అండ దొరికిందని భావించి విర్రవీగాడు. ఆ గర్వంతో దైవప్రవక్త (సల్లం) పంపించిన హెచ్చరికను ఖాతరు చెయ్యలేదు. అతను దైవప్రవక్త (సల్లం) వద్దకు సమాధానంగా, *"మేము ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి."* అని తెగేసి చెప్పాడు ఆ విశ్వాసఘాతకుడు.

ముస్లింలకు ఈ పరిస్థితి అతి గడ్డయిన పరిస్థితి అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే, వారు తమ చరిత్రలోనే ఈ కీలకమైన మరియు గడ్డు పరిస్థితిలో శత్రువులతో ఢీకొనడం అంటే మాటలు కాదు. పరిణామం బహు ప్రమాదకరంగా ఉంటుంది. అరేబియా దేశం మొత్తమే ముస్లిములకు ఎదురు తిరుగుతున్న రోజులవి. ముస్లింలకు చెందిన రెండు ప్రచారం బృందాలు ఎంతో నిర్దయగా చంపివేయబడ్డాయి. అదే కాదు, బనీ నజీర్ తెగకు చెందిన యూదులు కూడా ఎంతో శక్తిని పుంజుకొని ఉన్నారు. వారు ఆయుధాలను పడవేసి వెళ్ళిపోవడం కూడా జరగని పని అగుపిస్తోంది. వారితో యుద్ధానికి తలపడితే అనేక ప్రమాదాలు ఎదురుకావచ్చు కూడా. కాని, 'బిఇరె మఊనా' దుర్ఘటనకు పూర్వం నెలకొన్న పరిస్థితులు చాలా మటుకు మారిపోవడం వలన ముస్లింలు హత్యలు మరియు వాగ్దాన భంగం లాంటి విషయాల్లో ఎంతో జాగరూకతతో మెలుగుతున్నారు. ఆ నేరాలు చేసేవారి ఎడల వారి ప్రతీకార భావం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అందుకని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. బనూ నజీర్ యూదుల తెగ దైవప్రవక్త (సల్లం) గారిని హత్య చేయడానికి పన్నాగం పన్నారు కాబట్టి వారితో తప్పకుండా తలపడవలసిందే. పరిణామాలు ఏమైనప్పటికీ వారిని అణచివేయవలసిందే అన్నది ఆ నిర్ణయం.

దైవప్రవక్త (సల్లం)కు హుయ్ బిన్ అఖ్తబ్ సందేశం అందగానే, ఆయన (సల్లం) తమ సహాబాలనందరినీ ఓ చోట సమావేశపరచి యుద్ధం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు. *అల్లాహ్ అక్బర్* అనే నినాదం చేస్తూ అందరూ లేచి నిలబడ్డారు.

'హజ్రత్ ఉమ్మె మక్తూమ్ (రజి)'కు మదీనా సంరక్షణ భాధ్యతను అప్పగించి బనూ నజీర్ నివసిస్తున్న ప్రాంతానికి బయలుదేరారు. 'హజ్రత్ అలీ (రజి)'గారి చేతిలో యుద్ధ పతాకం రెపరెపలాడుతోంది. వీరు బనూ నజీర్ ప్రాంతానికి చేరి వారిని చుట్టుముట్టేశారు.

ఇటు బనూ నజీర్ యూదులు తమ కోటల్లో దాక్కొని తలుపులు మూసుకున్నారు. దృఢంగా ఉన్న తమ కోటల్ని, కపటవిశ్వాసుల అండదండల్ని చూసుకొని విర్రవీగారు.

ముస్లింలు తమ కోటలను ముట్టడించినందువల్ల, వారు తమ కోట గోడలపైకెక్కి ముస్లింలపై బాణాలు వదలసాగారు. మరికొందరు రాళ్ళ వర్షం కురిపించడం ప్రారంభించారు. ముస్లింలు వారి దాడిని కోట వెలుపల నుండి ఎదుర్కొంటున్నారు. వారి కోట చుట్టూ ఉన్న ఖర్జూరపు తోటలు వారిని రక్షిస్తున్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి.

తరువాత దైవప్రవక్త (సల్లం) కోట వెలుపల దారిలో యుద్ధానికి అవరోధంగా ఉన్న ఖర్జూరపు చెట్లను నరికి కాల్చిపారేయమని అనుచరుల్ని ఆదేశించారు. ఈ చెట్ల వల్ల కోటలను ముట్టడించడం ముస్లింలకు చాలా కష్టమైపోయింది. అదే సమయంలో ప్రవక్త (సల్లం), హజ్రత్ హస్సాన్ (రజి)ను సంబోధిస్తూ ఇలా అన్నారు....; ↓

*"బనీలవీ సర్దారులకోసం, బవైరా (బనూ నజీర్ కు చెందిన ఓ ఖర్జూరపు తోట పేరు)లో అగ్ని కీలలు పైకిలేవడం ఓ మామూలు విషయంలా ఉంది."*

దీని గురించే అల్లాహ్ ఆదేశం కూడా అవతరించింది.

*"మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికివేసినా లేదా వాటిని వాటి వ్రేళ్ళపై నిలిచి ఉండేలా వదిలివేసినా - ఇదంతా అల్లాహ్ అనుజ్ఞతోనే జరిగింది. అవిధేయులను అవమానపరచటానికి (ఆ పాటి చర్య అవసరమయింది)". (ఖుర్ఆన్ 59:5).*

దైవప్రవక్త (సల్లం) ఆదేశం ప్రకారం అనుచరులు చెట్లను నరకడం ప్రారంభించారు. దాంతో ప్రమాదం ముంచుకొస్తోందని తలచి యూదులు బెంబేలెత్తిపోయారు.

*"సోదరా ముహమ్మద్ (సల్లం)! ఏమిటిదీ? మీరు విధ్వంసాన్ని అరికట్టేవారు, విధ్వంస శక్తుల్ని అసహ్యించుకునేవారు కదా! మరి ఈ చెట్లను ఎందుకు నరికిస్తున్నారు? మా ఖర్జూరపు చెట్లను ఎందుకిలా తగలబెట్టిస్తున్నారు?"* అంటూ వారు గగ్గోలు పెట్టారు.

ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? సమయం మించిపోయింది? పరిస్థితి ప్రమాద సూచిక దాటింది. వారు, కపట విశ్వాసి 'అబ్దుల్లా బిన్ ఉబై' మీద ఆశలు పెట్టుకున్నారు. అతను రెండువేల సైన్యంతో వచ్చి తమను ఆదుకుంటాడని భావించి అతని రాక కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూడసాగారు.

ఎలాగైతేనేమీ, ముస్లింలు యూదుల కోటలను చుట్టుముట్టిన తరువాత 'బనూ ఖురైజా' తెగ ఇందులో తలదూర్చకుండా మిన్నకుండిపోయింది. *"మేము అండగా ఉంటాం"* అని హామీ ఇచ్చిన కపట విశ్వాసి 'అబ్దుల్లా బిన్ ఉబై' జాడే లేదు. అతని రెండు వేల సైన్యమూ జాడ లేదు. అతను యూదులను మోసగించాడు. వారి మిత్రపక్షం అయిన 'గత్ఫాన్' తెగ కూడా వారి సహాయం కోసం రాలేదు. మొత్తానికి ఏ ఒక్కడూ వారిని ఆదుకోడానికిగానీ వారి కష్టాలను కడతేర్చటానికిగానీ ముందుకు రాలేదు.

అల్లాహ్ ఈ పరిస్థితిని ఈ ఉపమానం ద్వారా ఇలా సెలవిచ్చాడు....; ↓

*"వీళ్ళ సంగతి షైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో, "తిరస్కార వైఖరిని అవలంబించు" అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు "నీతో నాకెలాంటి సంబంధం లేదు, పో. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను." అని అంటాడు." (ఖుర్ఆన్ 59:16).*

ఆ దిగ్బంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. కేవలం ఆరు రాత్రులు, మరో ఉల్లేఖనం ప్రకారం పదిహేను రాత్రులు మాత్రమే కొనసాగింది. అల్లాహ్ వారి హృదయాల్లో భయాన్ని ముస్లిముల ఎడల ఆఘోరాన్ని పుట్టించాడు. వారి ధైర్యం పటాపంచలైపోయింది.

'అబ్దుల్లా బిన్ ఉబై' పట్ల వారి నమ్మకం సన్నగిల్లిపోయింది. అతని రాక కోసం ఎదురుచూసి హతాశులయ్యారు. నలువైపులా నిరాశా కారుమేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అయితే దైవప్రవక్త (సల్లం) కారుణ్యకడలిపై వారికి పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే వారు కాళ్ళబేరానికి వచ్చారు.

*"సోదరా ముహమ్మద్ (సల్లం)! మమ్మల్ని కాపాడండి. మేము మదీనాను విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. తమరు ప్రతిపాదించిన దేశ బహిష్కరణను మేము శిరసావహిస్తున్నాము."* అని అన్నారు దైవప్రవక్త (సల్లం)ను విన్నవించుకుంటూ.

మహాప్రవక్త (సల్లం), వారి ఈ ప్రతిపాదనను మంజూరు చేస్తూ, *"సరే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ ఆయుధాలు తప్ప మీ సొత్తునంతా ఒంటెలపై వేసుకొని మీ భార్యాపిల్లలతో సహా మదీనాను విడిచి వెళ్ళండి. ఒక ఒంటెపై ముగ్గురు మనుషులతో పాటు, ఎంత ఆహారధాన్యం తీసుకెళ్ళగలిగితే అంత మేరకు తీసుకెళ్ళవచ్చు."* అని ఆదేశించారు.

యూదులు ఈ షరతును ఒప్పుకున్నారు. ఒప్పుకోక ఏం చేస్తారు? ప్రమాదం పీకల మీదికొచ్చి కూర్చుంది! స్నేహ ఒప్పందం ఉల్లంఘించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు!! ఈ విధంగా తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. కపట విశ్వాసుల్ని నమ్ముకొని ఉన్నదంతా ఊడగొట్టుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఇచ్చిన ఈ ఆదేశం మేరకు వారు తమ ఆయుధాలను పడవేసి, తమ చేతులతోనే తమ ఇళ్ళను పడగొట్టి కిటికీలు ద్వారబంధాలతో, చివరికి గోడలోని మేకులతో సహా ఒంటెలపై వేసుకొని కట్టుకున్నారు.

ఆ తరువాత తమ భార్యాబిడ్డలను ఎక్కించుకొని ఆరు వందల ఒంటెలపై మదీనా నుండి బయలుదేరారు. జరిగిన అవమానభారం తగ్గించుకోవడానికన్నట్లు వారి స్త్రీలు మదీనా వీధుల్లో పాటలు పాడుతూ, తప్పెట్లు మోగిస్తూ నడిచారు.

బనూ నజీర్ తెగ సర్దారులు 'హుయ్ బిన్ అఖ్తబ్' మరియు 'సలాం బిన్ అబిల్ హుఖైఖ్'తో సహా, వారిలో చాలా మంది యూదులు 'ఖైబర్' ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయారు.

వారిలోని మరొక బృందం సిరియా దిశగా వెళ్ళి దాని పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకున్నారు. కేవలం ఇద్దరు వ్యక్తులు, 'యామీన్ బిన్ అమ్రూ' మరియు 'అబూ సయీద్ బిన్ వహబ్'లు మాత్రమే ఇస్లాం స్వీకరించి మదీనాలో ఉండిపోయారు. వారి ఆస్తులను ఏమాత్రం ముట్టుకోవడం జరగలేదు.

*బనూ నజీర్ తెగ యూదులు మదీనాలో వదిలేసిన ఆస్తిపాస్తుల పంపకాలను In Sha Allah రేపటి భాగంలో....; →*

✍🏻✍🏻 *®@£€€q  +97433572282* ✍🏻✍🏻 
             *(rafeeq)*

✍🏻✍🏻  *Salman    +919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment