252

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 252*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 167*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*4. 'బిఇరె మఊనా' ఉదంతం : -*

రజీ సంఘటన జరిగిన మాసంలోనే 'బిఇరె మఊనా' ఉదంతం కూడా చోటు చేసుకుంది. ఇది రజీ సంఘటన కంటే ఘోరమైనది.

*ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి....; ↓*

'బనీ ఆమిర్' తెగ నాయకుడు 'మసాయిబుల్ అస్ నా' (శూలాలతో ఆటలాడుకునేవాడు) బిరుదు గల 'అబూ బరా ఆమిర్ బిన్ మాలిక్' అనేవాడు మదీనాపురంలో మహాప్రవక్త (సల్లం) సన్నిధికి హాజరయ్యాడు. అతన్ని దైవప్రవక్త (సల్లం) ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. అతను ఇస్లాం ధర్మాన్నయితే స్వీకరించలేదుగాని, ముస్లింలకు విరోధిగా కూడా ఉండలేదు. అతను దైవప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! మా తెగలో ఇస్లాం ప్రచారం చెయ్యడానికి మీ అనుచరుల్ని కొంతమందిని పంపండి. వారి ప్రచారం వల్ల ఇస్లాం మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది."* అన్నాడు.

కానీ, దైవప్రవక్త (సల్లం) ఇందుకు వెంటనే ఒప్పుకోక కొంత అనుమానం వ్యక్తపరిచారు.

*"అనుమానించకండి. మీ అనుచరులు నా రక్షణలో ఉంటారు. మీరు నిస్సంకోచంగా పంపండి."* అని అన్నాడు అబూ బరా.

అబూ బరా పట్ల అతని తెగవాళ్ళకు ఎంతో గౌరవం ఉంది. నిజంగా అతని రక్షణలో ఉన్న వారెవరికీ ప్రమాదం ఉండదు. ఆ నమ్మకంతోనే మహాప్రవక్త (సల్లం) సహాబా (రజి)లను అతని వెంట పంపేందుకు సుముఖత చూపారు.

ప్రవక్త (సల్లం), ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం నలభై మందిని, సహీ బుఖారి ఉల్లేఖనం ప్రకారం డెబ్భై మందిని అతని వెంట పంపించారు - *డెబ్భై మందిని* పంపించారనే ఉల్లేఖనం సరైనది.

సాయిదా తెగకు చెందిన 'మున్జిర్ బిన్ అమ్రూ (రజి)'ను ఆ బృందానికి అమీరుగా చేసి పంపించారు. *ఈ బృందంలో ఉన్న సహాబాలంతా మేధావులు, ఖుర్ఆన్ పారాయణంలో దిట్టలు, సహాబాల్లోకెల్లా ఉత్తమమైన వారు.* వీరు పగలు కట్టెలు కొట్టి వాటిని అమ్మి 'సుఫ్ఫా' వారి కోసం భోజనం సమకూర్చి పెట్టేవారు. వారికి ఖుర్ఆన్ చదివించేవారు. రాత్రిపూట మహాప్రవక్త (సల్లం) గారితో పాటు నమాజులోనూ, వేడుకోళ్ళలోనూ నిమగ్నమై ఉండేవారు.

ఈ బృందం ప్రయాణిస్తూ 'మఊనా' బావి వద్దకు చేరుకున్నారు. ఈ బావి 'బనూ ఆమిర్' మరియు 'హుర్రా బనీ సులైమ్' తెగలు నివసించే ప్రదేశానికి నడుమన గల ఓ ప్రదేశంలో ఉంది.

అక్కడ విడిది చేసిన తరువాత సహాబా (రజి), ఉమ్మె సులైమ్ సోదరుడు 'హిరామ్ బిన్ మల్హాన్'కు దైవప్రవక్త (సల్లం) గారి లేఖనిచ్చి, దైవవిరోధి అయిన 'ఆమిర్ బిన్ తుఫైల్' వద్దకు పంపించారు. కాని అతను ఆ ఉత్తరాన్ని చూడనైనా చూడలేదు. ఓ మనిషికి సైగ చేశాడు; ఆ మనిషి 'హజ్రత్ హిరామ్ (రజి)' వీపులో శూలాన్ని దిగగొట్టాడు. అది ఆయన (రజి) శరీరంలోనుంచి బయటకు వచ్చేసింది. రక్తాన్ని చూడగానే హజ్రత్ హిరామ్ (రజి) గారి నోట, *"అల్లాహు అక్బర్! కాబా ప్రభువు సాక్షి! నేను విజేతనయ్యాను."* అనే పలుకులు వెలువడ్డాయి.

వెంటనే దైవవిరోధి అయిన ఆమిర్, మిగిలిన సహాబా (రజి)లపై విరుచుకుపడమని తన తెగ 'బనీ ఆమిర్'ను ఉసికొల్పాడు. కాని వారు 'అబూ బరా' సంరక్షణలో ఉండడం వలన అతని మాటలను లెక్కచేయ్యలేదు. *"మేము 'అబూ బరా'తో చేసుకున్న ఒడంబడికను అతిక్రమించలేము."* అని ఖండితంగా చెప్పారు. చేసేదిలేక అతను 'బనూ సులైమ్'ను కేక వేశాడు. 'బనూ సులైమ్'కు చెందిన మూడు తెగలు 'అసియా', 'రఅల్', 'జకాన్'లు అతని పిలుపునకు పరుగెత్తుకొచ్చారు.

రాగానే వారు ఆ సహబా (రజి)లను చుట్టుముట్టేశారు. ఈ హఠాత్పరిణామానికి ముస్లింలు నిర్ఘాంతపోయారు. వెంటనే, సమాధానంగా సహాబాలు కూడా తమ ఆత్మరక్షణ కోసం కత్తులు ఝళిపించారు. ధైర్యంతో శత్రువుల్ని ఎదుర్కొన్నారు. కాని అంత పెద్ద శత్రుమూకను ఈ కొద్దిమంది ముస్లింలు ఎలా ఎదిరించి బయటపడగలుగుతారు? చివరికి కొందరు తప్ప అందరూ అమరగతి పొందారు.

ఈ సహాబా (రజి)లలో 'హజ్రత్ కఅబ్ బిన్ జైద్ బిన్ నజ్జార్ (రజి)' మాత్రం బ్రతికిపోయారు. గాయాలతో పడివున్న ఆయన్ను షహీదుల నడుమ నుండి ఎత్తుకు రావడం జరిగింది. అగడ్త యుద్ధం వరకు ఆయన జీవించే ఉన్నారు.

ఆయనే కాకుండా మరిద్దరు సహాబా (రజి)లు 'హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమరీ (రజి)' మరియు 'హజ్రత్ మున్జిర్ బిన్ ఉఖాబా బిన్ ఆమిర్ (రజి)'లు ఒంటెలను మేపడానికి వెళ్ళడం వలన మిగిలిపోయారు. వారు ఆ పోరాటం జరిగిన చోట గ్రద్దలు ఎగరడం చూసి నేరుగా అక్కడికి వెళ్ళి చూడగా వారి సహచరులు ముష్రిక్కులతో యుద్ధం చేస్తూ చనిపోయారన్న విషయం తెలిసింది.

హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమరీ (రజి)ని 'ఆమిర్ బిన్ తుఫైల్' బంధీగా పట్టుకోవడం జరిగింది. ఆయన (రజి) తాను 'ముజిర్' తెగకు చెందినవాడని పరిచయం చేసుకోగా, ఆమిర్, ఆయన నొసటి వెంట్రుకలను కత్తిరించి తన తల్లి తరఫున స్వతంత్రునిగా చేసి వదిలేశాడు. అతని తల్లి ఇదివరకే ఓ బానిసను విడిచిపెడతానని మ్రొక్కుకొని ఉంది.

ఈ దుర్ఘటనలో డెబ్భై మంది ముస్లిముల అమరగతి, ఉహద్ యుద్ధ గాయాన్ని తిరిగి తోడేసింది. ఉహద్ యుద్ధంలో చనిపోయినవారు బాహాబాహి యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నవారు. కాని పాపం వీరు మాత్రం ఓ హేయమైన మోసం, దగా మరియు కుట్ర కారణంగా చనిపోయారు.

హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమరీ (రజి) ఈ దుర్ఘటనను మదీనాకు చేరవేయడానికి కాలినడకన బయలుదేరారు. మదీనా నుండి తనతోపాటు వచ్చిన మిత్రులంతా శత్రువుల దౌర్జన్యకాండకు బలైపోయిన సంఘటన తలచుకొని ఆయన భోరున విలపించారు. గుట్టలు మిట్టలు దాటుకుంటూ రేయింబవళ్ళు ప్రయాణం సాగించారు.

హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమరీ (రజి) తిరుగు ప్రయాణంలో రాత్రివేళ 'ఖనాత్' లోయ చివర్లో ఉన్న 'ఖర్ ఖరా' అనే ప్రదేశానికి చేరి ఓ చెట్టు నీడన సేద తీర్చుకుంటున్నారు. కొద్ది దూరంలో 'బనూ కిలాబ్' తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు దైవప్రవక్త (సల్లం)కు, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నడుస్తూ అక్కడికి వచ్చి చేరారు. ఆ మాటలు జాగ్రత్తగా వింటున్న అమ్రూ (రజి) వారి శత్రుపక్షానికి చెందినవారై ఉంటారని భావించారు. వారిద్దరు ఆదమరిచి నిద్రించే సమయంలో హజ్రత్ అమ్రూ (రజి) వారిద్దరిని చంపేశారు. అలా చేయడం ఆయన దృష్టిలో, తమ స్నేహితుల హత్యకు పగ తీర్చుకుంటున్నానని అనుకోవడమే.

అయితే, ఆ ఇద్దరికి మహాప్రవక్త (సల్లం) గారు సంరక్షణ హామీ ఇచ్చి ఉన్నారన్న విషయం ఆయనకు తెలియదు.

ఆ తరువాత ఆయన మరికొన్నాళ్ళు ప్రయాణం చేసి మదీనా చేరుకున్నారు. నేరుగా మస్జిద్ కు వెళ్ళి దైవప్రవక్త (సల్లం)ను కలుసుకొని జరిగిన వృత్తాంతం వివరంగా తెలియజేశారు. ఈ దుర్ఘటన విని దైవప్రవక్త (సల్లం) తల్లడిల్లిపోయారు.

'మఊనా' మరియు 'రజీ' దుర్ఘటనలు ఒకదాని తరువాత మరొకటి ఉనికిలోనికి రావడం మూలంగా★ దైవప్రవక్త (సల్లం) ఎనలేని దుఃఖానికి లోనయ్యారు☆. ఏ జాతులు, మరే తెగలైతే ఏ సహాబా (రజి)ల పట్ల ఈ విధంగా ప్రవర్తించాయో, మహాప్రవక్త (సల్లం) ఒక నెల వరకు వారిని శపిస్తూనే ఉన్నారు.

సహీ బుఖారిలో హజ్రత్ అనస్ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం, ఆయన (సల్లం) ముప్పై రోజుల వరకు ఆ షహీదులను చంపిన వారిని శపించారని, ఆయన (సల్లం) ఫజ్ర్ నమాజులో, 'రఅల్', 'జక్వాన్', 'లహియ్యాన్' మరియు 'ఉసయ్యా'ను శపించేవారు. అల్లాహ్ ఈ విషయంలో దైవప్రవక్త (సల్లం)పై దైవవాణిని అవతరింపజేశాడు. అది ఆ తరువాత రద్దు అయింది. ఆ దైవవాణిలో ఇలా ఉంది....; ↓

*"మా జాతికి చెప్పండి, మేము మా ప్రభువును కలుసుకున్నామని, ఆయన మా ఎడల సంతుష్టుడయ్యాడని, మేము ఆయన పట్ల సంతుష్టులయ్యాము."* ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) తన ఈ శాపాన్ని వదిలేశారు.

హజ్రత్ అమ్రూ (రజి) తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటనను కూడా వివరిస్తూ, *"దైవప్రవక్తా! నేను బనూ కిలాబ్ కు చెందిన ఇద్దరు మనుషుల్ని హతమార్చాను."* అని తెలియజేశారు.

ఈ సంగతి వినగానే దైవప్రవక్త (సల్లం) విచారం వెలిబుచ్చుతూ, *"అయ్యో అమ్రూ! నువ్వు పెద్ద పొరపాటు చేశావు!"* అన్నారు.

*"పొరపాటు చేశానా! ఏమిటా పొరపాటు?"* అన్నారు అమ్రూ (రజి) ఆశ్చర్యపోతూ.

*"నీవు నా రక్షణ పొందిన ఇద్దరిని చంపేశావు. వారి దీత్ (రక్త పరిహారం) నేను తప్పకుండా చెల్లించాల్సి ఉంది."* అని అన్నారు ప్రవక్త (సల్లం).

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) వారి మిత్రపక్షాలైన యూదుల నుండి ఆ దీత్ ను కూడగట్టడంలో నిమగ్నమైపోయారు. ఆ తరువాతే ఈ సంఘటన 'గజ్వయె బనూ నజీర్'కు కారణభూతమైంది.

దైవప్రవక్త (సల్లం), అమ్రూ (రజి)తో పాటు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని, రక్త పరిహారం చెల్లించేందుకు 'బనూ నజీర్' తెగ వాడకు వెళ్ళారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....; →*

_(★→ వాఖిదీ, రజీ మరియు మఊనా దురంతాల వార్త దైవప్రవక్త (సల్లం)కు ఒకే రాత్రి చేరినట్లు చెప్పారు._

_☆→ ఇబ్నె అసద్ (రజి), హజ్రత్ అనస్ (రజి)గారి ఉల్లేఖనాన్ని ఉల్లేఖిస్తూ, బిఇరె మఊనా సంఘటనపై దుఃఖించినంతగా మరే సంఘటనపై ఆయన దుఃఖించలేదు అని అంటారు. చూడండి, ముక్తసరుస్సీరత్ - అబ్దుల్లాహ్ - పుట - 269.)_

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment