251

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 251*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 166*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*3. రజీ సంఘటన : -*

ఆ సంవత్సరమే (హిజ్రీ శకం - 4) సఫర్ నెలలో దైవప్రవక్త (సల్లం) వద్దకు 'అజ్ల్' మరియు 'ఖారా' తెగలకు చెందిన కొంతమంది వచ్చి, *"దైవప్రవక్తా! మా తెగలో ఇస్లాం ధర్మం గురించి బాగా ప్రచారం జరుగుతోంది. తమరు ధర్మబోధ కోసం, ఖుర్ఆన్ చదివించడానికి కొంతమందిని పంపండి."* అని కోరారు.

మహాప్రవక్త (సల్లం), ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం ఆరుగురిని మరియు సహీ బుఖారి ఉల్లేఖనం ప్రకారం *పది మందిని* వారి వెంట పంపించారు.

ఇబ్నె ఇస్'హాక్ చెప్పినట్లు, 'ముర్సిద్ బిన్ అబీ ముర్సిద్ గనవీ'కు, సహీ బుఖారి ఉల్లేఖనం ప్రకారం, 'ఆసిమ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్' తాతగారైన 'హజ్రత్ ఆసిమ్ బిన్ సాబిత్ (రజి)'ను ఆ బృందానికి అమీరుగా (నాయకునిగా) చేసి పంపించినట్లు చెప్పబడుతోంది.

వీరంతా రాబెగ్ మరియు జిద్దా నడుమన గల హుజైల్ తెగకు చెందిన 'రజీ' అనే చెలమకు చేరగానే, 'అజ్ల్' మరియు 'ఖారా' తెగలకు చెందిన వారు హుజైల్ తెగ వారిని వారిపై (సహాబాలపై) పురికొల్పి వెన్నంటి చంపమని పంపించారు.

'బనూ లహియ్యాన్'కు చెందిన ఓ వందమంది విలుకాండ్రు ఆ బృందం వెంటబడ్డారు. వారి అడుగుజాడల్ని చూస్తూ ఆ బృందాన్ని చేరుకోవడం జరిగింది. ఇది గమనించిన సహాబా (రజి) ఓ ఎత్తైన కొండపైకెక్కి రక్షణ పొందారు.

బనూ లహియ్యాన్ విలుకాండ్రు వారిని చుట్టుముట్టి, *"మీరు దిగివస్తే మిమ్మల్ని చంపమని మాటిస్తున్నాం."* అని అన్నారు. హజ్రత్ ఆసిమ్ (రజి) దిగడానికి సిద్ధపడక తమ మిత్రులతో యుద్ధానికి దిగారు. చివరికి బాణాల వర్షం కురిపించి ఏడుగురిని చంపడం జరిగింది.

ఇక 'హజ్రత్ ఖుబైబ్ (రజి)', 'జైద్ బిన్ దస్నా (రజి)' మరియు మరొక సహాబీ (రజి) ముగ్గురూ మిగిలిపోయారు. ఇప్పుడు కూడా బనూ లహియ్యాన్ తన వాగ్దానాన్ని వారి ముందుంచడం వలన ఆ ముగ్గురు క్రిందికి దిగి వచ్చారు. అయితే వారు క్రిందికి రాగానే తమ మాటపై నిలబడక వారిని తమ వింటి నారులతో కట్టివేస్తుండగా, అందు మూడో సహాబీ (రజి), *"ఇది మీరు చేసిన వాగ్దానానికి విరుద్ధమైన విషయం"* అంటూ వారి వెంట వెళ్ళడానికి నిరాకరించారు. వారు ఆయన (రజి)ను ఈడ్చుకొని తమ వెంట తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించడం వల్ల అక్కడనే చంపేశారు.

ఇక మిగిలిన ఇద్దరు సహాబా (రజి)లు, హజ్రత్ ఖుబైబ్ (రజి) మరియు జైద్ (రజి)లను మక్కాకు తీసుకొనివెళ్ళి అమ్మేశారు. ఈ ఇద్దరు సహాబా (రజి)లు బద్ర్ యుద్ధంలో మక్కా సర్దారులను మట్టుపెట్టినవారు.

హజ్రత్ ఖుబైబ్ (రజి) కొంతకాలం మక్కా వారి ఖైదులోనే ఉన్నారు. ఆ తరువాత ఆయన్ను హత్య చేద్దామనే ఉద్దేశ్యంతో హరం (బైతుల్లాహ్) బయట ఉన్న 'తన్ఈమ్' అనే ప్రదేశానికి తీసుకొని రావడం జరిగింది. ఖుబైబ్ (రజి)ని ఉరికంబం ఎక్కించడానికి సిద్ధమైనప్పుడు ఆయన (రజి) వారితో, *"నన్ను వదలండి, నేను రెండు రకాతుల నమాజు చేసుకుంటాను"* అని అన్నారు. బహుదైవారాధకులు ఆయన ఈ చివరి కోరికను మన్నించి కట్లు విప్పారు.

ఆయన (రజి) రెండు రకాతుల నమాజు చేశారు. నమాజు ముగించుకొని సలాము పూర్తిచేసిన తరువాత ఆయన (రజి) వారిని ఉద్దేశించి, *"నేను భయం వల్ల ఇలా చేస్తున్నానని అనుకుంటారని నమాజును త్వరగా ముగించాను. అలా కాని పక్షంలో నా నమాజును ఇంకొంత పొడిగించేవాణ్ణి"* అంటూ, *"ఓ అల్లాహ్! వీరిని ఒక్కొక్కరిగా లెక్కించు, పిదప వారిని విడదీసి చంపు, వీరిలో మరెవ్వరినీ వదిలిపెట్టకు."* ప్రార్థించారు.

ఆ తరువాత ఈ క్రింది అర్థం వచ్చే పద్యపాదాలను పఠించారు.

*"ప్రజలు నా చుట్టూ గుంపులు గుంపులుగా ప్రోగయ్యారు. తమ తెగల్ని నాపైకి ఉసిగొల్పారు. ఇలా ఓ పెద్ద సమూహాన్ని కూడదీశారు. తమ కుమారుల్ని, తమ స్త్రీలను కూడా పిలుచుకున్నారు. నన్ను ఓ దృఢమైన ఎత్తైన బోదె దగ్గరకు చేర్చారు. నేను నా దీనస్థితి, స్వస్థలం నుండి నా ఎడబాటు, నా వధ్యస్థలం దగ్గర ప్రోగైన బృందాలు పెట్టే బాధలను గురించి అల్లాహ్ కే ఫిర్యాదు చేస్తున్నాను. ఓ ఆకాశాల స్వామీ! నా యెడల నా శత్రువులు అవలంబిస్తున్న ఈ వైఖరిపై నాకు సహనం వహించే భాగ్యం కలుగజెయ్యి. వారు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. వారు నన్ను, నిన్ను ధిక్కరించమని ఒత్తిడి చేస్తున్నారు. అయినా మరణమే అంతకంటే సులభతరమైనది. నా కళ్ళు కన్నీళ్ళు లేకుండా బయటకు రావాలి. నేను చంపబడితే, ఏ ప్రక్కన పడిపోయి చస్తానో అనే బెంగ నాకు లేదు. నా ఈ మరణం దైవమార్గంలో వచ్చే మరణం. ఖండఖండాలుగా నరికిన నా అవయవాల్లో ఆయన శుభాన్ని కలుగజేస్తాడు."*

ఆ తరువాత అబూ సుఫ్'యాన్, హజ్రత్ ఖుబైబ్ (రజి)తో, *"ముహమ్మదే గనుక (నీకు బదులు) మా దగ్గర ఉండి ఉంటే, మేము ఆయన (సల్లం) మెడను నరికేస్తే, నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉంటే ఇది నీకు ఇష్టమేనా?"* అని అడిగాడు.

ఇది విన్న హజ్రత్ ఖుబైబ్ (రజి), *"దైవసాక్షి! దాన్ని నేను ఎన్నటికీ సహించజాలను. ఆయనే తన భార్యాబిడ్డలతో సుఖంగా ఉంటూ ఆయన కాలిలో ఓ ముల్లు గ్రుచ్చుకొని అది ఆయనకు బాధ కలిగించినా నేను సహించే విషయం కాదు."* అని బదులు పలికారు.

పిదప ఆయన (రజి)ను ముష్రిక్కులు ఉరివేసి శవాన్ని వ్రేలాడదీశారు. దాని రక్షణ కోసం మనుషుల్ని నియమించారు. కాని 'హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా (రజి)' అక్కడికి వచ్చి వారిని మోసగించి శవాన్ని రాత్రికి రాత్రే మాయం చేశారు. దాన్ని ఖననం చేశారు. హజ్రత్ ఖుబైబ్ (రజి)ను చంపినవాడు 'ఉక్బా బిన్ హారిస్'. హజ్రత్ ఖుబైబ్ (రజి), అతని తండ్రి హారిస్ ను బద్ర్ యుద్ధంలో సంహరించారు.

సహీ బుఖారీలో ఉల్లేఖించిన దాని ప్రకారం, హత్య సమయంలో రెండు రకాతుల నమాజు చేసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినవారు హజ్రత్ ఖుబైబ్ (రజి) మాత్రమే అని ఉంది. ఆయన్ను చంపేముందు ఖైదు చేయగా ఆయన (రజి) దగ్గర ద్రాక్ష గుత్తులు కొన్ని కనుగొనడం జరిగింది. ఆయన అప్పుడు వాటిని తింటున్నారు. మక్కాలో ఖర్జూరం కూడా లభించని రోజులవి.

ఈ సంఘటనలో బంధీ అయిన మరో సహాబీ (రజి), అంటే హజ్రత్ జైద్ బిన్ దస్నా (రజి)ను సఫ్'వాన్ బిన్ ఉమయ్యా కొని తన తండ్రి హత్యకు బదులు చంపేశాడు.

ఆ సహాబాల బృందానికి నాయకునిగా ఉన్న ఆసిమ్ బిన్ సాబిత్ (రజి) అల్లాహ్ ను వేడుకొని ఉన్నారు, తన శరీరంలోని ఏ భాగాన్నీ ముష్రిక్కులు తాకకూడదని, తానూ ఏ ముష్రిక్కునూ అంటుకోనని. ఆయన బద్ర్ యుద్ధంలో ఖురైషులకు చెందిన ఓ ముష్రిక్కును సంహరించి ఉన్నారు. అందుకని ఖురైషులు ఆయన శవానికి చెందిన ఓ ఖండాన్నేదైనా తీసుకురమ్మని మనుషుల్ని పంపించారు. కాని అల్లాహ్ ఆయన వేడుకోలును మన్నించి ఆయన శవాన్ని కాపాడడానికి కందిరీగల ఓ పెద్ద తుట్టెను పంపించాడు. ముష్రిక్కులు ఆయన శవం వద్దకు పోలేక వెనక్కు మరలి వచ్చేశారు.

హజ్రత్ ఉమర్ (రజి) గారికి ఈ సంఘటన గురించి తెలిసినప్పుడు ఆయన (రజి) తరచూ ఇలా అంటూ ఉండేవారు.

*"అల్లాహ్ విశ్వాసిని అతను జీవించి ఉన్నప్పటివలెనే మరణించిన తరువాత కూడా రక్షిస్తూ ఉంటాడు."*

*4. 'బిఇరె మఊనా' ఉదంతం : -*

రజీ సంఘటన జరిగిన మాసంలోనే 'బిఇరె మఊనా' ఉదంతం కూడా చోటు చేసుకుంది. ఇది రజీ సంఘటన కంటే ఘోరమైనది.

ఇందులో డెబ్భై మంది సహాబా (రజి)లు అమరగతి పొందవలసి వచ్చింది.

*In Sha Allah రేపటి భాగంలో మరింత వివరణ....; →*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment