247

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 247*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 162*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          *గజ్వయె హుమరా ఉల్ అసద్*

ఇటు దైవప్రవక్త (సల్లం) రాత్రి అంతా, యుద్ధం వల్ల ఉత్పన్నమైన గడ్డు పరిస్థితిని సమీక్షిస్తూ గడిపివేశారు. యుద్ధంలో ముష్రిక్కులు తమదే గెలుపైనా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేరు అని గ్రహిస్తే అది వారికి తలవంపులుగా ఉండవచ్చు. అందువలన తిరిగి మదీనాపై దండెత్తనూ వచ్చు అని ఆలోచించారు మహాప్రవక్త (సల్లం). అందుకని ఆయన (సల్లం) మక్కా సైన్యాన్ని వెంటాడటానికే నిశ్చయించుకున్నారు.

సీరత్ చరిత్రకారుల కథనం ప్రకారం, ప్రవక్త శ్రీ (సల్లం) ఉహద్ యుద్ధం జరిగిన రెండో రోజే, అంటే ఆదివారం, షవ్వాల్ నెల - 8వ తారీఖున ఉదయమే శత్రువును తరమడానికి బయలుదేరాలని ప్రకటించారు. దానికితోడు ఆ ప్రకటనలో, ఉహద్ యుద్ధంలో పాల్గొన్న యోధులే శత్రువును తరమడానికి వెళ్ళాలని నిక్కచ్చిగా చెప్పారు. అయినా 'అబ్దుల్లా బిన్ ఉబై' కపట ముస్లిం మాత్రం ప్రవక్త (సల్లం) వెంట వస్తానని అనుమతి కోరగా, ఆయన (సల్లం) అతనికి అనుమతి ఇవ్వలేదు.

ఇటు, ఉన్న ముస్లిములంతా ఏదో ఒక రూపంలో గాయపడి, దుఃఖసముద్రంలో మునిగి భయాందోళనలతో ఉన్నవారు. కాని వారంతా, మహాప్రవక్త (సల్లం) గారి ఈ ప్రకటనకు సంతోషభరితులై సన్నద్ధులయ్యారు.

ఉహద్ యుద్ధంలో పాల్గొనే అవకాశం లభించని 'హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజి)' ప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి ఆయన (సల్లం)తో, *"ఓ మహాప్రవక్తా (సల్లం)! తమరు ఏ యుద్ధానికి వెళతారో, ఆ యుద్ధంలో నేను కూడా మీ వెంటే ఉండాలని అనుకుంటున్నాను. తమరు ఉహద్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు (ఆ యుద్ధంలో పాల్గొనకుండా) నా తండ్రి మరియు నా కుమార్తెల బాగోగులు చూడమని మీరే నన్ను మదీనాలోనే విడిచిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు నాకు తమ వెంట ఉండే అనుమతి ఇవ్వండి."* అని విన్నవించుకోగా, ప్రవక్త శ్రీ (సల్లం) ఆయన ఒక్కరికే ఆ అనుమతి ఇచ్చారు.

*మక్కా సైన్యాన్ని వెంటాడటానికి బయలుదేరిన ఇస్లామీయ సైన్యం....; ↓*

అనుకున్నట్లుగానే మహాప్రవక్త (సల్లం) ముస్లిములను వెంటబెట్టుకొని మదీనాకు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న 'హుమరా ఉల్ అసద్' అనే ప్రదేశానికి చేరి అక్కడ గుడారాలు వేసుకొని ఆగిపోయారు.

ఈ సందర్భంలోనే 'మఅబద్ బిన్ అబీ మఅబద్ ఖజాయి' అనే అతను దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించడం జరిగింది _(అతను తన పాత ధర్మం మీదనే ఉన్నాడుగాని, దైవప్రవక్త (సల్లం)కు సానుభూతిపరుడు అని చెప్పుకోవడం కూడా జరుగుతోంది)_ ఎందుకంటే 'బనూ ఖుజాఅ' మరియు 'బనూ హాషిం' తెగ (దైవప్రవక్త (సల్లం) గారి వంశం)ల నడుమ స్నేహసంబంధం ఉంటూ వచ్చింది. అందుకని అతడు దైవప్రవక్త (సల్లం)తో, *"ఓ ముహమ్మద్ (సల్లం)! మీకూ, మీ అనుచరులకు తగిలిన దెబ్బ మాకు బాధ కలిగించింది. మిమ్ములను క్షేమంగా తీసుకురావాలని అల్లాహ్ ను వేడుకునేవారం."* అని అన్నాడు. అతని ఈ సానుభూతి వచనాలను విన్న మహాప్రవక్త (సల్లం) అతనితో, *"నీవు అబూ సుఫ్'యాన్ వద్దకు వెళ్ళి అతణ్ణి నిరుత్సాహపరిస్తే బాగుండు."* అన్నారు.

బహుదైవారాధకులకు తిరిగి మదీనాపైకి దాడి చేసే ఆలోచన రావచ్చు అనే అనుమానం మహాప్రవక్త (సల్లం)కు కలిగింది; అది కాస్త నిజమై కూర్చుంది.

*ముస్లిములపై తిరిగి దాడిచేయాలని పూనుకున్న ముష్రిక్కులు : -*

ముష్రిక్కులు, మదీనా నుండి 32 మైళ్ళ దూరానికి వెళ్ళి 'రౌహా' అనే ప్రదేశంలో విడిది చేశారు. అప్పుడు ముష్రిక్కులకు తట్టింది, మదీనాపై తిరిగి దాడి చేయాలన్న విషయం. వారు పరస్పరం ఒకరినొకరు తిట్టుకుంటూ, *"మీరేం చేశారు గనుక? వారి శక్తిని, ప్రాభవాన్ని విరిచేసి అలానే వదలి వచ్చేశారు. ఇంకా వారిలో అనేక తలలు మిగిలే ఉన్నాయి. అవి మనకు తలనొప్పిగా మారవచ్చు. కనుక పదండి తిరిగి వెనక్కు. వారిని పూర్తిగా తుదముట్టించి వద్దాం."* అని అనుకోసాగారు.

అయితే ఈ సలహా అంత విలువైనది కాదు. వారికి ప్రత్యర్థి శక్తిసామర్థ్యాలు, అతని ధైర్యసాహసాలను గురించి సరైన అవగాహన లేదు. వారిలోని ఓ సైనిక కమాండరు, సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా లేచి ఈ సలహాను కొట్టిపారేశాడు. వారిని ఉద్దేశించి, *"ప్రజలారా! అలా చేయకండి. ఏ ముస్లిములైతే ఉహద్ యుద్ధంలో పాల్గొనలేదో వారు మీకు వ్యతిరేకంగా ఓ చోట చేరి ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితిలోనే మనం మక్కాకు వెళ్ళిపోదాం. ఎటొచ్చీ విజయం మనదే కదా! మీరే గనక తిరిగి మదీనాపై దాడి చేస్తే చిక్కుల్లో పడి పోతారు."* అన్నాడు.

కాని వారిలో చాలా మంది సుఫ్'వాన్ బిన్ ఉమయ్యా మాటలను త్రోసిపుచ్చారు. తిరిగి మదీనాపై దాడి చేద్దాం అనే నిర్ణయించుకున్నారు. అబూ సుఫ్'యాన్ మరియు అతని సైన్యం బయలుదేరడానికి ఇంకా సన్నద్ధమైందో లేదో, (పైన పేర్కొన్న, దైవప్రవక్త (సల్లం) సన్నిధిలో ఇస్లాం స్వీకరించిన) 'మఅబద్ బిన్ అబీ మఅబద్ ఖజాయి' అక్కడికి చేరనే చేరాడు. ఈయన ముస్లిం అయిన విషయం అబూ సుఫ్'యాన్ కు బొత్తిగా తెలియదు.

_(అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది....; ↓)_

*అబూ సుఫ్'యాన్ : -* మఅబద్! అక్కడి విషయాలేమిటి?

*మఅబద్ : -* ఇంకేముందీ! ముహమ్మద్ (సల్లం) తన అనుచరుల్ని వెంటబెట్టుకొని మిమ్మల్ని తరుముకు వస్తున్నాడు. అబ్బో అది ఎంత పెద్ద సైన్యమో! మీకు వ్యతిరేకంగా క్రోధాగ్నిలో కాలిపోతున్నారు. నేనిప్పటి వరకు అలాంటి సైన్యపటాలాన్నే చూసి ఎరుగను అనుకోండి. ఉహద్ యుద్ధంలో పాల్గొనని వారు కూడా ఆ సైన్యంలో వచ్చి చేరారు. వారు పోగొట్టుకున్న దాన్ని గురించి వారికి బాధగా ఉంది. మీకు వ్యతిరేకంగా వారు నూరుతున్న కారాలు మిర్యాలు నేనింత వరకు చూడలేదు సుమా! (అంటూ వారిని మానసికంగా కృంగదీశాడు మఅబద్)

*అబూ సుఫ్'యాన్ : -* అదేమిటయ్యా నువ్వు అనేది? (ఆశ్చర్యంగా)

*మఅబద్ : -* దైవసాక్షి! మీరు ఇక్కడి నుండి వెళ్ళే ముందు మీ గుర్రాలను సిద్ధం చేసుకునే లోపలే వారి మొదటి దళం అదిగో ఆ ఇసుక తిన్నె వెనుక నుండి ప్రత్యక్షం అవగలదు.

*అబూ సుఫ్'యాన్ : -* ఓహో! మేమైతే వారిపై తిరిగి విరుచుకుపడదామనీ, వారిని మొదలంటా నరికేద్దామనీ అనుకున్నామే.

*మఅబద్ : -* అబ్బో! అలా మాత్రం చేయకండి. నేను చెప్పేదంతా మీ మేలు కోరే సుమా!

ఈ వార్త వినీవినగానే వారి గుండెలు గుభేలుమన్నాయి. భయం వారిని ఆవహించసాగింది. ఇక మక్కాకు తిరిగి వెళ్ళడంలోనే క్షేమం ఉందని అనుకున్నారు. అబూ సుఫ్'యాన్, ఇస్లామీయ సైన్యాన్ని తమ వెన్నంటి రాకుండా, తిరిగి సాయుధ పోరాటం ఎదురవకుండా ఉంచడానికిగాను మానసికమైన ఓ ఎత్తు వేశాడు.

జరిగిందేమిటంటే, 'అబ్దుల్ ఖైస్' తెగకు చెందిన ఓ బిడారం మదీనా వైపునకు పోవడం చూసిన అబూ సుఫ్'యాన్, ఆ వర్తకులతో, *"ఎక్కడిదాకా మీ ప్రయాణం?"* అని అడిగాడు.

దానికి ఆ బృందం నాయకుడు, *"మేము మదీనా వెళ్తున్నాం. అక్కడ వ్యాపారం చేసి ధాన్యం తెచ్చుకోవాలని వెళ్తున్నాం."* అని అన్నాడు.

ఇది విన్న అబూ సుఫ్'యాన్, ఆ నాయకునితో, *"మీరు ముహమ్మద్ (సల్లం)కు నా సందేశం ఒకటి వినిపించాలి. నేను, మీరు తిరిగి వచ్చిన తరువాత మక్కాలో ఉన్న ఉక్కాజ్ సంతలో మీ ఈ పెంటి ఒంటె మోసినంత బరువు ఎండు ద్రాక్ష ఇస్తాను సరేనా?"* అని అడిగాడు.

వారు దానికి, *"అలాగే అందజేస్తాం. చెప్పండి ఆ మాటేమిటో."* అని అనగా; అబూ సుఫ్'యాన్, *"మీరు వెళ్ళి ముహమ్మద్ (సల్లం)కు ఈ కబురు అందించండి. మేము ఆయన్నూ, ఆయన అనుచరుల్ని తుదముట్టించటానికి తిరిగి మదీనాపై దాడి చేస్తున్నామని నమ్మించాలి."* అని చెప్పాడు.

*"మంచిది, అలాగే చెప్తాం."* అని చెప్పి వాణిజ్యబృందం అక్కడ్నుంచి బయలుదేరింది.

ఆ బిడారం 'హుమా ఉల్ అసద్'కు చేరగానే, మహాప్రవక్త (సల్లం) మరియు ఆయన అనుచరులు దానికి తారసపడ్డారు. ఆ వాణిజ్య బృందంవారు, ఆయన (సల్లం)కు అబూ సుఫ్'యాన్ సందేశాన్ని అందించారు.

ఆ మాటలు విన్న ముస్లిముల్లో భయానికి బదులు విశ్వాసం మరింత పెరిగిపోయింది. వారు, *"హస్బునల్లాహు వనేమల్ వకీల్" (మాకు అల్లాహ్ సహాయం చాలు, ఆయన గొప్ప సహాయకుడు)* అని నినదించారు. (ఈ విశ్వాసపటిమ) కారణంగా వారు అల్లాహ్ వరాలతో, ఆయన దయతో వెనక్కు మరిలారు. వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. వారు అల్లాహ్ ప్రసన్నతను బడిశారు. ఆయనకు విధేయత చూపారు. అల్లాహ్ ఎంతో దయామయుడు.

మహాప్రవక్త (సల్లం), ఆదివారం రోజున 'హుమ్రాఉల్ అసద్'కు చేరి, సోమ, మంగళ మరియు బుధవారం (అంటే 9,10,11 షవ్వాల్, హిజ్రీ శకం 3) వరకు అక్కడనే బస చేశారు. ఆ తరువాతగాని ఆయన (సల్లం) మదీనాకు తిరిగి రాలేదు.

_(↑ ఇదే విషయం వేరొక ఉల్లేఖనం ప్రకారం ↓)_

దైవప్రవక్త (సల్లం), ఆ ప్రదేశంలో అబూ సుఫ్'యాన్ కోసం మూడురోజుల దాకా ఎదురుచూశారు. కాని అబూ సుఫ్'యాన్ రాలేదు. అబూ సుఫ్'యాన్, మదీనాపై దండెత్తడానికి వస్తున్నానని మాటవరసకు అన్నాడేకాని, ముస్లిం యోధులంటే అతనికి లోపల భయంగానే ఉంది. అతని సైనికులకు కూడా ఈ విషయం బాగా తెలుసు. అందువల్ల వారు, ఎంతో కొంత దక్కిన గౌరవాన్నే ఘనవిజయంగా భావిస్తూ మక్కా దారిపట్టారు.

ఖురైష్ సైన్యం మక్కా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత దైవప్రవక్త (సల్లం) కూడా తన అనుయాయుల్ని తీసుకొని మదీనా తిరిగొచ్చారు.

*ప్రవక్త (సల్లం), మదీనాకు తిరిగి వచ్చే ముందు జరిగిన కొన్ని సంఘటనలను In Sha Allah రేపటి భాగములో తెలుసుకుందాము.*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment