238

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 238*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 153*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

          🛡⚔ *ఉహద్ పోరాటం : - 10*⚔🛡

*చెల్లాచెదరవుతున్న ముస్లిములు : -*

ముస్లిములు దిగ్బంధంలోనికి వచ్చాక వారి ఓ వర్గం వారి మెదళ్ళే మొద్దుబారిపోయాయి. కేవలం ప్రాణాలు ఎలా దక్కించుకోవాలా అన్నదే వారి ఆలోచన. కాబట్టి వారు యుద్ధ మైదానాన్ని వదిలిపెట్టి పారిపోయారు కూడా. వెనుక ఏం జరుగుతోందో వారికి తెలియదు. వారిలో ఒక వర్గం వారు పారిపోయి మదీనాలో ఆశ్రయం కూడా పొందారు. కొందరు కొండలపైకి ఎక్కేశారు. మరో వర్గం వెనక్కు తిరిగి ముష్రిక్కు సేనలోకి పోయి కలగాపులగమైపోయింది. ఒకరికి మరొకరి ధ్యాసే లేకుండా పోయింది. దీని ఫలితంగా స్వయంగా ముస్లిములే ముస్లిముల చేతిలో హతులవుతున్నారు.

*సహీ బుఖారీలో 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓*

ఉహద్ యుద్ధం రోజున (మొదట) ముష్రిక్కులకు ఘోర పరాజయం ఎదురైంది. ఆ తరువాత 'ఇబ్లీస్' ఓ కేక వేశాడు. *"దైవదాసుల్లారా వెనక్కు మళ్ళండి"* అని. మొదటి వరుసలోని వారు వెనక్కు మళ్ళి వారి వెనకన ఉన్న వరసతో తలపడనారంభించారు. 'హజీఫా (రజి)', తన తండ్రి 'యమాన్'పై దాడి జరగడం చూసి, *"అల్లాహ్ దాసులారా! ఆయన నా తండ్రి"* అని హెచ్చరించారు కూడా. కానీ చంపేశారు ఆయన్ను వదల్లేదు. చివరికి ఆయన చనిపోయారు. 'హజీఫా (రజి)', *"అల్లాహ్ మిమ్మల్ని మన్నించుగాక"* అని పలికి ఊరకుండిపోయారు. 'హజ్రత్ ఉర్వా' ఉల్లేఖనం ప్రకారం, 'హజ్రత్ హుజైఫా (రజి)' మరణించినంత వరకు ముస్లిముల మేలునే కాంక్షించేవారు.★

_(★→ సహీ బుఖారి 1/539,2/581; ఫత్'హుల్ బారి 7/351,362,363. బుఖారే కాకుండా మరికొన్ని ఉల్లేఖనాల్లో, దైవప్రవక్త (సల్లం) 'హజ్రత్ హుజైఫా (రజి)' తండ్రి 'యమాన్' దీత్ (రక్తపరిహారం) చెల్లించడానికి సిద్ధపడితే 'హజ్రత్ హుజైఫా (రజి)', *"నేను ఆయన దీత్ (రక్తపరిహారం)ను ముస్లిములకు దానం చేసేశాను."* అని అన్నారు. దీని ఫలితంగా ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం) గారికి మరింత ప్రేమపాత్రుడయ్యాడు. చూడండి, ముక్తసురుస్సీరత్ లిష్షేక్ అబ్దుల్ వహ్హాబ్ నజదీ పుట - 246)_

ఎలాగైతేనేమి ముస్లిముల సేన తీవ్రమైన అస్తవ్యస్తకు, ఛిన్నాభిన్నానికి గురైపోయింది. చాలా మంది ఎటు పోవాలో తోచక స్తబ్ధంగా నిలుచుండిపోయారు. ఈలోపునే ఓ వ్యక్తి, *"దైవప్రవక్త (సల్లం) చంపబడ్డారు."* అని అరవనారంభించాడు. ఈ అరుపులు వినగానే ముస్లిములకున్న ఆ కాస్త స్పృహ కూడా ఉడిగిపోయింది. చాలా మందికి ధైర్యం అడుగంటిపోయింది. కొందరు యుద్ధాన్ని కూడా ఆపేశారు. తమ చేతుల్లో ఉన్న ఆయుధాలను విసిరికొట్టారు. ఇంకొందరికి, మునాఫిక్ ల సర్దారు అయిన 'అబ్దుల్లా బిన్ ఉబై' దగ్గరకు వెళ్ళి వారి కోసం ''అబూ సుఫ్'యాన్"తో తమను రక్షించమని అడుగుదాం అనే ఆలోచన కూడా వచ్చింది.

కొంతసేపు గడిచిన తరువాత 'హజ్రత్ అనస్ బిన్ నజ్ర్ (రజి)' వారి దగ్గరకు రావడం జరిగింది. వారంతా మిన్నకుండా కూర్చుని ఉండటాన్ని చూశారాయన. *"ఏమిటి దేనికోసం ఎదురు చూస్తున్నారు?"* అని అడగగా; వారు, *"దైవప్రవక్త (సల్లం) చంపబడ్డారట"* అని బదులు పలికారు.

*"అయితే ఆయన (సల్లం) పోయిన తర్వాత మీరు బ్రతికుండి ఏం చేస్తారు? లేవండి! దేనికోసమైతే మహాప్రవక్త (సల్లం) ప్రాణాలనర్పించారో మీరు కూడా మీ ప్రాణాలను అర్పించండి."* అన్నారాయన. తన సంభాషణను కొనసాగిస్తూ, *"ఓ అల్లాహ్! వీరు (అంటే ముస్లింలు) ఏ వైఖరినైతే అవలంబిస్తున్నారో దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. వారు (అంటే ముష్రిక్కులు) ఏదైతే చేశారో దానికి మేము బాధ్యులం కాము."* అంటూ ముందుకు వెళ్ళిపోయారు.

కొంతదూరం వెళ్ళారో లేదు ఆయనకు 'హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)' తారసపడ్డారు. ఆయన ఈయనను ఉద్దేశించి, *"ఓ అబూ ఉమర్! ఎక్కడికి వెళుతున్నావు?"* అని అడుగగా; *"ఆహా! స్వర్గసుగంధం గురించి ఏం చెప్పనూ! ఓ సఅద్! నేను ఆ సుగంధాన్ని ఉహద్ కొండకు అవతలి ప్రక్క నుంచి ఆఘ్రాణిస్తున్నాను."* అని చెబుతూ 'హజ్రత్ అనస్ (రజి)' ముందుకు దూసుకువెళ్ళి, ముష్రిక్కులతో పోరాడుతూ అమరగతులయ్యారు. యుద్ధం ముగిసిన తరువాత 'హజ్రత్ అనస్ (రజి)'కు గుర్తుపట్టలేనంతగా గాయాలు అయ్యాయి. చివరికి ఆయన చెల్లెలు ఆయనను ఆయన చేతివ్రేళ్ళను చూసి గుర్తుపట్టగలిగారు. ఆయన శరీరంపై బరిశెలతో, బాణాలతో ఎనభైకి పైగా గాయాలున్నాయి.

ఇలాగే, 'సాబిత్ బిన్ వహ్హాబ్ (రజి)' తన జాతిని పిలుస్తూ, *"ఒకవేళ ముహమ్మద్ (సల్లం) గారే చంపబడితే చంపబడ్డారు. కాని అల్లాహ్ మాత్రం బ్రతికే ఉన్నాడు కదా! ఆయనకు మరణం లేదు. మీరు మీ ధర్మం కోసం పోరాడండి. అల్లాహ్ మీకు తప్పకుండా సహాయపడి విజయాన్ని చేకూరుస్తాడు."* అని అన్నారు. ఈ పిలుపు విన్న అన్సారుల ఓ వర్గం సిద్ధమై లేచి నిలబడింది. 'హజ్రత్ సాబిత్ (రజి)', వారి సహాయంతో 'ఖాలిద్' పటాలంపై దాడి చేశారు. ఆయన అలా యుద్ధం చేస్తూ 'ఖాలిద్' విసిరిన బరిశె దెబ్బకు షహీద్ అయిపోయారు. ఆయనలాగే ఆయన అనుచరులు కూడా యుద్ధం చేస్తూ షహీదులై పోయారు.

ఓ ముహాజిర్ సహాబీ (రజి), ఇంకో అన్సారీ సహాబీ (రజి) ప్రక్క నుండి వెళ్ళడం తటస్థించింది. ఆయన అప్పుడు రక్తంతో ముద్దగా తడిసి ఉన్నారు. ఆయన్ను చూసి ఆ ముహాజిర్ సహాబీ (రజి), *"ఓ సోదరా! ముహమ్మద్ (సల్లం) చనిపోయిన విషయం నీకు తెలిసిందా?"* అని అడుగగా; ఆయన, *"ఒకవేళ ముహమ్మద్ (సల్లం) గారే చనిపోతే, ఆయన మటుకు అల్లాహ్ ధర్మాన్ని అందించినట్లే. ఇప్పుడు ఆ ధర్మాన్ని పరిరక్షించడం నీ వంతు"* అని సమాధానమిచ్చారు.

(చదవండి దివ్య ఖుర్ఆన్ 3:142-145)

ఇలా ఉత్సాహపూరితమైన హృదయాలను చురగొనే మాటల వల్ల ఇస్లామీయ సైన్యానికి కోల్పోయిన తిరిగి వచ్చినట్లయింది. వారికి స్పృహ వచ్చినట్లయింది. వారు ఆయుధాలను పడవేయడం లేదా 'అబ్దుల్లా ఉబై'తో కలిసి రక్షణ కోసం "అబూ సుఫ్'యాన్"ను యాచించే ఆలోచనను వదిలి తిరిగి తమ ఆయుధాలను చేపట్టారు. ముష్రిక్కుల పటిష్టమైన వలయాన్ని ఛేదించి ఇస్లామీయ కేంద్రం వైపునకు పోయే మార్గాన్ని సుగమం చేయడానికి ప్రయత్నించనారంభించారు.

*ఈలోపే, దైవప్రవక్త (సల్లం) గారి హత్యా వార్త కేవలం కల్పితమైందని, అసత్యమైందనే విషయం వారికి తెలిసినప్పుడు వారి శక్తి ద్విగుణీకృతమైపోయింది. వారి పరాక్రమంలోకి క్రొత్త ఊపిరి వచ్చినట్లయింది. కాబట్టి వారు ఓ భయంకరమైన దాడి చేసి ఆ వలయాన్ని ఛేదించి ఓ పటిష్టమైన కేంద్రం చుట్టూ చేరడంలో కృతకృత్యులయ్యారు.*

ఇస్లామీయ సైనిక పటాలానికి చెందిన మూడవ వర్గం కేవలం దైవప్రవక్త (సల్లం) రక్షణ గురించే ఆలోచిస్తోంది. ఈ వర్గం, ముష్రిక్కుల వలయం ఛేదించబడిందన్న విషయం తెలుసుకోగానే దైవప్రవక్త (సల్లం) వైపునకు నడిచింది. ఆ వర్గంలో 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)', 'హజ్రత్ ఉమర్ (రజి)' మరియు 'హజ్రత్ అలీ (రజి)'లు ప్రముఖులు. వీరు, శత్రుసేనను తుదముట్టించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కాని దైవప్రవక్త (సల్లం) గారికి ప్రమాదం ఏర్పడిందన్న విషయం తెలుసుకోగానే ఆయన (సల్లం) సంరక్షణార్థం ముందుకు ఉరికారు.

*దైవప్రవక్త (సల్లం) హత్య చేయబడ్డారన్న కల్పితమైన వార్తలోని మరింత వివరణ వేరొక సీరత్ కితాబ్ ప్రకారం : -*

దైవప్రవక్త (సల్లం) వధించబడ్డారన్న గాలివార్త విన్న అనేక ముస్లిములు శత్రువుల్ని ప్రతిఘటిస్తున్నప్పటికీ వారిలో ఏర్పడిన నిరాశానిస్పృహలు పూర్తిగా తొలగిపోలేదు. శత్రువులు మాత్రం తమ చిరకాల వాంఛ నెరవేరిందని సంబరపడిపోతూ గంతులేస్తున్నారు. కాని అసలు విషయం ఎవరికీ బోధపడలేదు.

'ఇబ్నెఖమియా' అనే ఓ అవిశ్వాసి 'హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)'ను వధించాడు. ముస్అబ్ (రజి) రూపురేఖల్లో అచ్చం దైవప్రవక్త (సల్లం)ను పోలి ఉంటారు. అంచేత 'ఇబ్నె ఖమియా' ఆయన్నే దైవప్రవక్త (సల్లం) అనుకున్నాడు. ఈ పొరపాటే ముస్లిముల పాలిత గ్రహపాటయి వారి సైన్యాలను అస్తవ్యస్తం చేసింది. నిరాధారమైన ఈ వార్త దైవప్రవక్త (సల్లం) దగ్గరున్న అనుచరులకు తెలిసింది. అయితే వారు దీన్ని ఖండిద్దామనంటే దైవప్రవక్త (సల్లం) వారించారు.

అవిశ్వాసులు నిజంగానే ముహమ్మద్ (సల్లం) హతమయ్యారని తలపోస్తున్నారు. అంచేత ఆయన మృతదేహం కోసం ఖురైష్ సైనికులు నలువైపులా పరుగెత్తారు. మైదానంలో పడివున్న శవాలను వెతకసాగారు. వారిలో ప్రతి ఒక్కడూ ఆ మృతదేహాన్ని ముందుగా తానే స్వాధీనం చేసుకోవాలని, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి గుండెల్లో మండుతున్న మంటను చల్లార్చుకోవాలని వెంపర్లాడసాగాడు.

అలా వెతుకుతున్నవారిలో సర్వసేనాని అబూ సుఫ్'యాన్ కూడా ఉన్నాడు. అతను ఎంతో ఆత్రంతో శవాల దగ్గరికి పరుగెత్తాడు. కాని ఆ శవాలను చూసి, *"అరె! ముహమ్మద్ మృతదేహం ఎక్కడా కన్పించడం లేదే!! ఏమయి ఉంటుంది?"* అని ఆశ్చర్య పోయాడు. అయితే ఒకచోట అతని దృష్టి ఓ మృతదేహం పై పడింది. అది ''హజ్రత్ హమ్'జా (రజి)" మృతదేహం. దాన్ని చూడగానే అతను ఉగ్రుడైపోయాడు. చేతిలోని ఈటెతో ఇష్టమొచ్చిన చోటల్లా పొడుస్తూ, *"విశ్వాస ఘాతకుడా! బద్ర్ యుద్ధంలో నీవు చేసినదానికి ప్రతిఫలం అనుభవించు."* అని అన్నాడు.

అక్కడ 'హులైస్' అనే మరో విశ్వాసి ఉన్నాడు. అతను అబూ సుఫ్'యాన్ చేస్తున్న ఈ కసాయి పని చూడలేక, *"సైనికుల్లారా! రండి, ఇటు చూడండి. ఇతను ఖురైష్ నాయకుడట! సోదరుని మృతదేహం పట్ల ఇతని దుశ్చర్య చూడండి."* అని అరిచాడు బిగ్గరగా.

ఈ మాటలకు అబూ సుఫ్'యాన్ బిత్తరపోయాడు. *"ఓహ్! ఎంత పొరపాటు జరిగింది నా వల్ల!! సరే వదిలేస్తున్నాగాని అల్లరి చేయకు."* అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో.

ఆ తరువాత అతను 'ఖాలిద్ బిన్ వలీద్'ను కలుసుకొని, *"ముహమ్మద్ నిజంగానే వధించబడ్డాడా? మరయితే అతని మృతదేహం ఎక్కడా కనిపించడం లేదేమిటీ?"* అన్నాడు.

దానికి ఖాలిద్, *"వధించబడలేదు. నేనిప్పుడే చూసి వస్తున్నా. ఆయన కొందరు అనుచరులతో కలిసి కొండ పైకి పోతున్నాడు."* అని చెప్పాడు.

అయితే ఇటు ముస్లిం యోధులకు దైవప్రవక్త (సల్లం) సజీవంగా ఉన్న సంగతి ఇంకా తెలియదు. వారు కళ్ళలో ఒత్తులు వేసుకొని వెతుకుతూనే ఉన్నారు. అకస్మాత్తుగా 'కఅబ్ బిన్ మాలిక్ (రజి)' దృష్టి కొండపైకి వెళ్తున్న దైవప్రవక్త (సల్లం) పై పడింది. దాంతో ఆయన సంతోషంతో ఎగిరి గంతేశారు. *"ముస్లిం వీరులారా! అదిగో మన ప్రియప్రవక్త!!"* అని బిగ్గరగా అరుస్తూ తోటి సైనికుల దగ్గరికి పరుగెత్తారు ఆయన.

ఈ వార్త వినగానే ముస్లిం యోధుల ఆనందం అవధులు దాటింది. ఒక్కసారిగా అందరి ముఖాలలో నూతనోత్సాహ కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. సడలిపోయిన ధైర్యం మళ్ళీ ఎగసిపడింది. అనాసక్తతతో చచ్చుపడిన దేహాలు తాజాశక్తి పుంజుకున్నాయి. అనుచరులంతా దీపపు పురుగుల్లా దైవజ్యోతి (సల్లం) వైపు పరుగెత్తారు. నలువైపుల నుంచి పరుగులు పెడ్తూ వచ్చి క్షణాల్లో దైవప్రవక్త (సల్లం) దగ్గరికి చేరుకున్నారు. తృటిలో వారు ఆయన (సల్లం) చుట్టూ వలయంగా ఏర్పడి అవిశ్వాసులతో పోరాడుతూనే ఉహద్ పర్వతం అధిరోహించసాగారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment