🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర - 235* 🛐🕋☪🕌
🌸🌸 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 150* 🌸🌸
◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉
🛡⚔ *ఉహద్ పోరాటం : - 7*⚔🛡
*ప్రధాన యుద్ధ కేంద్రం మరియు యుద్ధ పతాకధారుల వధ : -*
ఆ తరువాత అన్నివైపుల నుండి యుద్ధ జ్వాలలు మిన్నుముట్టాయి. యుద్ధరంగం అంతటా వధ ప్రారంభం అయింది. ముష్రిక్కుల యుద్ధ పతాకం యుద్ధకేంద్రంగా మారింది.
బనూ అబ్దుద్దార్, తమ కమాండరు 'తల్హా బిన్ అబీ తల్హా' వధ తరువాత ఒక్కొక్కరుగా యుద్ధ పతాకాన్ని కాపాడనారంభించారు. కాని వారంతా వధించబడ్డారు.
మొట్టమొదట యుద్ధ పతాకాన్ని 'తల్హా' సోదరుడు 'ఉస్మాన్ బిన్ అబీ తల్హా' ఎత్తుకున్నాడు. అతను ఆ జెండాను ఎత్తుకొని...., *"బరిశె రక్తంతో తడిసినా లేదా విరిగిపోయినా, అంతవరకు యుద్ధం చేయడం పతాకాన్ని ఎత్తుకున్నవాడి విధి."* అని ముందుకు ఉరికాడు.
అతనిపై "హజ్రత్ హమ్'జా (రజి)" దాడి చేశారు. ఆయన (రజి), ఉస్మాన్ భుజంపై వేసిన ఖడ్గం దెబ్బకు హమ్'జా (రజి) కరవాలం, ఉస్మాన్ చేతితో సహా భుజాన్ని తెగగొట్టుకుంటూ అతని ఊపిరితిత్తులు అగుపడేటట్లు శరీరాన్ని చీల్చుతూ నాభి వరకు వచ్చి ఆగింది.
ఆ తరువాత 'అబూ సఅద్ బిన్ అబూ తల్హా' జెండా ఎత్తి పట్టుకున్నాడు. అతనిపై 'హజ్రత్ సఅద్ బిన్ అబీ విఖాస్ (రజి)' బాణాన్ని గురిచూసి వదిలారు. అది నేరుగా అతని కంఠంలో దిగబడింది. ఆ బాణం దెబ్బకు అతని నాలుక బయటకు వచ్చి వెంటనే చనిపోయాడు. _అయితే కొందరు సీరత్ రచయితలు, అబూ సఅద్ బయటకు వచ్చి వ్యక్తిగత పోరాటం కోసం సవాలు విసరగా 'హజ్రత్ అలీ (రజి)' వచ్చి అతణ్ణి ఎదుర్కొన్నారనీ, కత్తియుద్ధంలో 'హజ్రత్ అలీ (రజి)' అతణ్ణి చంపేశారనీ ఉంది._
ఆ తరువాత యుద్ధ పతాకాన్ని 'ముసాఫె బిన్ తల్హా బిన్ అబీ తల్హా' ఎత్తుకున్నాడు. కాని అతణ్ణి 'ఆసిమ్ బిన్ సాబిత్ బిన్ అబీ అఫ్లహా (రజి)' బాణం వేసి చంపేశారు.
పిదప జెండాను అతని సోదరుడు 'కిలాబ్ బిన్ తల్హా బిన్ అబీ తల్హా' అందుకున్నాడు. అయితే అతనిపై 'హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)' విరుచుకుపడ్డారు. అతనితో యుద్ధం చేసి అతణ్ణి అంతమొందించడం జరిగింది.
ఆ ఇద్దరు మరణించిన తరువాత వారి సోదరుడు 'జలాస్ బిన్ తల్హా బిన్ అబీ తల్హా' ఆ పతాకం క్రింద పడకుండా ఎత్తుకున్నాడు. అతణ్ణి 'తల్హా బిన్ ఉబైదుల్లాహ్ (రజి)' బరిశెతో పొడిచి చంపేశారు. మరో ఉల్లేఖనంలో, అతణ్ణి 'ఆసిమ్ బిన్ సాబిత్ బిన్ అబీ అఫ్లహా (రజి)' బాణం వేసి చంపినట్లుంది.
వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు యోధులు. అంటే అందరూ 'అబూ తల్హా అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ అబ్దుద్దార్' కుమారులు, మనుమలూను. వీరంతా ముష్రిక్కు సైనిక పతాకాన్ని పరిరక్షిస్తూ ప్రాణాలు వదిలినవారు.
ఆ తరువాత 'బనీ అబ్దుద్దార్' వంశానికే చెందిన మరో వ్యక్తి "అర్'లూత్ బిన్ షుర్జీల్" పతాకాన్ని ఎత్తుకున్నాడు. అతణ్ణి 'హజ్రత్ అలీ (రజి)', మరో ఉల్లేఖనం ప్రకారం, 'హజ్రత్ హమ్'జా (రజి)' సంహరించినట్లు ఉంది.
అతను అంతమైపోగానే 'షురీహ్ బిన్ ఖారిజ్' ఆ జెండాను ఎత్తుకున్నాడు. కాని అతను 'ఖజ్మాన్' చేతిలో హతమైపోయాడు. _(ఖజ్మాన్ ఓ కపట ముస్లిం (మునాఫిక్). ఇస్లాం కోసం కాకుండా అరేబియా తెగల ఆత్మాభిమానం పెల్లుబికి యుద్ధంలోకి వచ్చి చేరినవాడు.)_
'షురీహ్' తరువాత 'అబూ జైద్ అమ్రూ బిన్ అబ్దె మునాఫ్ అబ్దరీ' జెండాను అందుకున్నాడు. అతణ్ణి కూడా ఈ ఖజ్మానే సంహరించేశాడు. ఆ పిదప అతని కుమారుడు 'షుర్జీల్ బిన్ హాషిమ్ అబ్దరీ' ఆ జెండాను ఎత్తుకొనగా ఖజ్మానే అతణ్ణి చంపేశాడు.
ఇలా 'బనూ అబ్దుద్దార్'కు చెందిన పది మందీ ముష్రిక్కుల జెండా కోసం ప్రాణాలను పోగొట్టుకున్నట్లయింది. ఆ తరువాత ఆ వంశంలో మరెవ్వరూ జెండాను ఎత్తుకోడానికి మిగిలిపోలేదు. అయితే, అంతలోనే ఓ నీగ్రో బానిస 'సువాబ్' పరుగున వచ్చి ఆ జెండాను ఎత్తుకున్నాడు. అతను ఆ జెండాను ఎత్తుకొని పోరాడిన విధం, క్రితం తన యజమానులు చేసిన యుద్ధాన్ని మించిపోయినట్లుగా ఉంది. అంటే అతను నిర్విరామంగా, తన రెండు చేతులు నరకబడినా సరే పోరాడుతూనే ఉన్నాడు. అయినా అతను జెండాను మాత్రం క్రిందపడనీయలేదు. ఆ జెండాను తాను మోకాలిపై కూర్చుని దాన్ని వక్షస్థలానికి ఆనించి భుజంపై వేసుకుని నిలబెట్టే ఉంచాడు. చివరికి ఆ పరిస్థితిలోనే అతను ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది. ప్రాణాలు పోయేటప్పుడు అతను చెప్పిన మాటలు ఇవి....; ↓
*"ఓ ప్రభూ! నేను నాకు సాధ్యమైనంత వరకు పోరాడాను. అంతకంటే నేను ఇంకేమీ చేయలేను."*
ఈ బానిస (సువాబ్) మరణం తరువాత జెండా భూమిపై పడిపోయింది. ఇక దానిని మరెవ్వరూ ఎత్తుకోలేదు. అది అలానే క్రిందపడి ఉండిపోయింది.
*తక్కిన భాగాల్లో జరిగిన యుద్ధ వైనం : -*
ఓ వైపు ముష్రిక్కుల జెండా ఆ యుద్ధంలో ఆకర్షణ కేంద్రంగా ఉండింది. మరో ప్రక్క తక్కిన యుద్ధరంగంలోనూ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముస్లిముల వరుసల్లో విశ్వాస పటిమ ఎల్లెడలా వ్యాపిస్తూనే ఉంది. ముష్రిక్కుల మరియు దైవతిరస్కారుల సేనపై వెల్లువలా దానికి ఏ ఆనకట్టా నిలువదన్నట్లుగా ముస్లిములు విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితిలో వారి నోట "అమిత్' అమిత్ (చంపండి, చంపండి)" అనే పదం ఒక్కటే వెలువడుతోంది.
*కరవాలం కర్తవ్యాన్ని నిర్వర్తించిన అబూ దుజానా (రజి) : -*
ఇటు 'అబూ దుజానా (రజి)' తన ఎర్ర ఒంటెపై తలపై ఎర్ర రుమాలు కట్టుకొని చేత కరవాలం దూసి పోరాడుతున్నారు. ఆ కరవాలం హక్కును పూర్తిగా నిర్వర్తించేందుకు దృఢనిశ్చయంతో ముష్రిక్కుల శిరస్సులను నరుకుతూ ముందుకు సాగుతూనే ఉన్నారు. అలా పోరాడుతూ ఆయన (రజి), శత్రుసేనలో చాలా దూరం వరకు వెళ్ళిపోయారు. ఏ ముష్రిక్కులు ఆయనకు అడ్డం వచ్చినా అతణ్ణి తుదముట్టిస్తున్నారు. అలా ఆయన ముష్రిక్ సేన వరుసలను చిందరవందర చేస్తూ, వారిని నేల కూలుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు.
ఆయన (రజి) యుద్ధం చేసిన తీరు గురించి 'హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)' ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓
→"నేను మహాప్రవక్త (సల్లం)ను ఆ కరవాలాన్ని నాకు ఇవ్వమని అడగ్గా, ఆయన (సల్లం) దానిని నా చేతికి ఇవ్వలేదు. నాకు కొంత బాధ కూడా కలిగింది. నేను నా మనస్సులో, నేను దైవప్రవక్త (సల్లం)కు మేనత్త అయిన సఫియా (రజి)గారి కుమారుణ్ణి కదా! అదే కాకుండా ఒక ఖురైషీని కూడా. అబూ దుజానా కంటే ముందే వెళ్ళి కరవాలాన్ని అడిగానాయె. అంతలోనే దానిని నా చేతికి ఇవ్వకుండా 'అబూ దుజానా'కు ఇచ్చారు. *"సరే! దైవసాక్షి! నేనూ చూస్తాను, ఆయన ఈ కరవాలాన్ని ఎలా ఉపయోగిస్తారో!"* అని తలచాను. అందుకని నేను 'అబూ దుజానా' వెనకాలే బయలుదేరాను. ఆయన ముందు తన ఎర్ర రుమాలును తీసి తలపై కట్టుకున్నారు. అది చూసిన అన్సారులు, *"ఓహో! అబూ దుజానా తన నెత్తిపై చావుగుడ్డను కట్టుకున్నాడే."* అని అనుకోసాగారు.
అలా ఆ పట్టీని తలపై కట్టుకొని ఆయన (రజి)...., *"నేను ఈ ఒయాసిస్సు ప్రాంగణంలో నా మిత్రునికి, ఎన్నడూ యుద్ధంలో సైనిక వరుసలకు వెనుకన ఉండనని, వారి మధ్యలో చొరబడి పోరాడుతానని మాట ఇచ్చి ఉన్నాను."* అంటూ అందినవాడినల్లా ఆ కరవాలంతో హతమార్చనారంభించారు.
అటు ముష్రిక్కులు చెందిన ఓ వ్యక్తి మాలోని క్షతగాత్రులను ఏరి వధించనారంభించాడు. అతనూ, అబూ దుజానా పరస్పరం దగ్గరవుతున్నారు. నేను, వారిద్దరూ ఎదురెదురుగా వచ్చి తలపడాలని అల్లాహ్ ను ప్రార్థిస్తూనే ఉన్నాను. సరిగ్గా అలానే జరిగింది. అతను, అబూ దుజానాకు ఎదురుగా వచ్చి ఆయనపై ఖడ్గప్రహారాన్ని చేశాడు. అబూ దుజానా, ఆ దాడిని తన ఢాలుపై ఆపారు. అతని ఖడ్గం అబూ దుజానా ఢాలులో ఇరుక్కుపోయింది. ఆ తరువాత ఆయన (రజి) తన కరవాలంతో అతని తలను నరికివేశారు."←
అనంతరం అబూ దుజానా (రజి) శత్రు వరుసల్ని చిన్నాభిన్నం చేస్తూ ముందుకు కదిలిపోతున్నారు. చివరికి ఆయన ఖురైష్ స్త్రీల కమాండరు దగ్గరికు చేరుకోగలిగారు. ఆమె స్త్రీ అన్న విషయం ఆయనకు బొత్తిగా తెలియదు. ఆయన ఖుద్దుగా చెప్పిన దాని ప్రకారం...., *"నేను ఓ వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి శత్రు సైనికులను ఎంతో ఉత్సాహంతో యుద్ధానికి పురికొల్పుతున్నాడు. అందుకని ముందు అతని పని పడదామని నా కరవాలంతో దాడి చేయబోగా, ఆ వ్యక్తి హాహాకారాలు చేస్తూ వెనక్కు తగ్గుతున్నాడు. అప్పుడుగాని నాకు తెలిసి రాలేదు, ఆ వ్యక్తి ఓ స్త్రీ అన్న విషయం. నేను, ఓ స్త్రీని చంపి దైవప్రవక్త (సల్లం)గారు ఇచ్చిన కరవాలానికి మచ్చ ఎలా తేగలను? అందుకని ఆమెను వదిలేశాను."*
ఈమె 'ఉత్బా' కుమార్తె 'హింద్'. 'హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)' గారి కథనం ప్రకారం...., *"అప్పుడు నేను చూసిన దృశ్యం ఏమిటంటే, అబూ దుజానా 'హింద్' నడినెత్తిపై తన కరవాలాన్ని ఎత్తి వ్రేటు వేయబోయి వెంటనే దానిని ప్రక్కకు జరిపేశారు. ఇలా ఎందుకు జరిగిందో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం)కే బాగా తెలుసు."*
మరో ప్రక్క "హజ్రత్ హమ్'జా (రజి)" పులిలా గాండ్రిస్తూ శత్రు మూకలపై దాడి చేస్తున్నారు. ఆయన అసాధారణమైన ఖడ్గ ప్రహారాలు చేస్తూ శత్రుసైన్యం మధ్య భాగంలోనికి చొరబడుతున్నారు. ఆయన ముందు గొప్ప గొప్ప యోధులు కూడా నిలువకుండా, సుడిగాలిలో ఎగిరిపోయే ఆకుల్లా చెల్లాచెదురై పోతున్నారు. హమ్'జా (రజి), ముష్రిక్కుల ధ్వజవాహకుల వధలో ప్రముఖపాత్రను పోషించినవారు. దానికితోడు యోధానయోధుల పరిస్థితిని కూడా అధ్వాన్నపరిచినవారాయన. కాని, విచారకమైన విషయం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితిలోనే హమ్'జా (రజి) అమరగతిని పొందారు. అయితే ఆయన (రజి)ను షహీద్ చేసింది ఎదురెదురుగా జరిగిన యుద్ధంలో మాత్రం కాదు. మాటువేసి పిరికి పందలుగా హమ్'జా (రజి)ను నేలకూల్చడం జరిగింది.
*హజ్రత్ హమ్'జా (రజి) గారి షహాదత్ (అమరగతి పొందడం) : -*
హజ్రత్ హమ్'జా (రజి) గారి హంతకుని పేరు 'వహ్షీ బిన్ హరబ్'. హమ్'జా (రజి) ఎలా వధించబడ్డారో అతని నోటనే విందాం....; ↓
"నేను, 'జుబైర్ బిన్ ముత్యిమ్'కు బానిసగా ఉండేవాణ్ణి. జుబైర్ పినతండ్రి 'తుఅయిమా బిన్ అద్దీ' బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు. ఖురైషీయులు, ఉహద్ యుద్ధం కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు 'జుబైర్ బిన్ ముత్యిమ్', నాతో...., *"వహ్'షీ! నా పినతండ్రి చావుకు బదులుగా నీవు ముహమ్మద్ (సల్లం) పినతండ్రి హమ్'జా (రజి)ను చంపితే, నిన్ను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి స్వతంత్రుణ్ణి చేస్తాను."* అని అన్నాడు.
జుబైర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడానికి, నేను కూడా ఖురైష్ సైన్యం వెంట బయలుదేరాను.
*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment