224

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◉••••◉•••◯•••◉•••◯•••◉✧◉•••◯•••◉•••◯•••◉••••◉

🕌☪🕋🛐      *ఇస్లాం చరిత్ర - 224*       🛐🕋☪🕌

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 139*      🇸🇦🇸🇦

◉••••◉•••◯•••◉•••◯•••◉✦◉•••◯•••◉•••◯•••◉••••◉

*❖ బనీ ఖైనుఖా తెగ ఉల్లంఘించిన ఒప్పందం షరతులు : - ↓*

అల్లాహ్, బద్ర్ యుద్ధ మైదానంలో ముస్లిములకు గొప్ప సహాయం అందించి వారికి గౌరవం కలగజేసినందుకు వారి ఈర్ష్య, విరోధం మరింత పెరిగిపోయింది. వారు బాహాటంగా దుశ్చర్యకు దిగి శత్రుత్వాన్ని ప్రకటించుకున్నారు. బాహాటంగా విద్రోహ చర్యలను చేబడుతూ ముస్లిములను బాధింపజొచ్చారు.

ముస్లిములను బాధలకు గురిచేయడంలోను, వారి ఎడల శత్రుత్వం వహించడంలోనూ అందరికి మిన్న అయినవాడు "కఅబ్ బిన్ అష్రఫ్". అతని గురించి రాబోయే పుటల్లో చర్చిద్దాం.

అలాగే యూదులకు సంబంధించిన మూడు తెగల్లోనూ అన్నిటికంటే దుష్టమైన తెగ 'బనూ ఖైనుఖా' తెగే. వీరు ఉండేది మదీనాలోనే. వారి వాడ పేరు కూడా ఆ తెగ పేరు మీదనే ఉండింది.

వీరు వృత్తి రీత్యా స్వర్ణకారులు, కంచర్లు, పాత్రలను తయారు చేసేవారు. ఈ వృత్తుల కారణంగా వారి వద్ద కావలసినంత యుద్ధసామాగ్రి, ఆయుధాలు ఉండేవి. వారి సైన్యం మొత్తం ఏడు వందలు. వీరందరూ మదీనాకు చెందిన పరాక్రమశీలురైన యోధులు. వారే అందరికంటే ముందు ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దాని వివరణ ఇలా ఉంది....; ↓

అల్లాహ్, బద్ర్ యుద్ధ మైదానంలో ముస్లిములకు ఘన విజయాన్ని చేకూర్చిపెట్టిన తరువాత వారి ఈర్ష్యా వైషమ్యాలు మరింత పెరిగిపోయాయి. వారు తమ దుష్ట ప్రవర్తనను మరింత పెంచి అశాంత వాతావరణాన్ని సృష్టించారు. ఏ ముస్లిమైనా బజారులోనికి వస్తే అతణ్ణి ఎగతాళి చేసి పంపేవారు, బాధించేవారు. అంతేకాదు, ముస్లిం మహిళల ఎడల కూడా ఆకతాయిగా వ్యవహరించనారంభించారు.

పరిస్థితి మరీ విషమించి, వారి తలబిరుసుతనం మరింతగా పెరిగినప్పుడు మహాప్రవక్త (సల్లం) వారందరినీ సమావేశపరచి వారిని పరిపరివిధాల నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి ఆగడాలను మానుకొమ్మని, వాటి దుష్పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొమ్మని బోధించారు. అయితే వారి ఆగడాలు మరింత పెరిగాయే కాని తగ్గలేదు.

*ఇమామె అబూ దావూద్ వగైరాలు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) గారి ఉల్లేఖనాన్ని ఇలా ఉటంకిస్తున్నారు....; ↓*

మహాప్రవక్త (సల్లం), ఖురైష్ ను బద్ర్ యుద్ధంలో ఓడించి మదీనాకు అరుదెంచిన తరువాత 'బనీ ఖైనుఖా' వాడలో వారిని సమావేశపరిచారు. వారిని సంబోధిస్తూ...., *"ఓ యూద వర్గమా! ఖురైషులకు పట్టిన గతి మీకు పట్టక మునుపే మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి."* అని చెప్పగా; వారు...., *"ఓ ముహమ్మద్ (సల్లం)! మీరు ఆత్మవంచనకు పాల్పడకండి. మీరు ఎదుర్కొన్నది ఖురైషుల అమాయక సైన్యంతో. వారికి యుద్ధం ఎలా చేయాలో తెలియదు. కాబట్టి వారిని మీరు ఓడించగలిగారు. ఒకవేళ ఆ యుద్ధం మాతోనే జరిగి ఉంటే అప్పుడు తెలిసేది మా తడాకా ఏమిటో! మేము పురుషులం. మాలాంటి వారితో మీకు ఇప్పటి వరకు పనిపడలేదు."* అని బీరాలు పలికారు.

ఇక ఆ తరువాత బనీ ఖైనుఖా యూదుల దుస్సాహసం ఇనుమడించింది. కొన్ని రోజులు గడచీ గడువక మునుపే వారు మదీనాలో కల్లోలాన్ని, మారణకాండను సృష్టించారు. దీని ఫలితంగా వారు తాము త్రావ్వుకున్న గోతిలో తామే పడిపోయారు.

*ఇబ్నె హష్షామ్ అబూ ఔన్ ఉల్లేఖనాన్ని ఇలా గ్రంథస్థం చేశారు....; ↓*

ఓ ముస్లిం మహిళ, బనూ ఖైనుఖా సంతలో పాలు తెచ్చి అమ్మింది. ఆమె ఏదో పని ఉండి ఓ యూద స్వర్ణకారుని దుకాణానికి వెళ్ళి కూర్చుంది. అక్కడ మరికొందరు యూదులు కూడా ఉన్నారు. ఈ దుర్మార్గులకు ఏం దుర్బుద్ధి పుట్టిందోగాని, యూదులు ఆ ముస్లిం మహిళను ముఖం చూపించమని అడిగారు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో అక్కడున్న యూదులు ఆమె ముఖంపై ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు. కాని, ఆమె దాన్ని అడ్డుకుంది. ఆ స్వర్ణకారుడు ఆమెకు తెలియకుండా ఆమె కట్టుకున్న వస్త్రాన్ని ఆమె వీపుపై వేసి కట్టివేశాడు. ఆమె లేచి నిలబడగానే (ఆ వస్త్రం వీపుపై కట్టబడి ఉన్నందున) ఆమె రహస్యభాగాలు బయట పడిపోయాయి. యూదులందరూ గొల్లున నవ్వారు. పాపం ఆ అమాయకురాలు ఈ అవమానం భరించలేక పెద్దకేక పెట్టి భోరున ఏడ్వసాగింది. ఆ మహిళ గగ్గోలు పెడుతూ ఉండగా ఓ ముస్లిం యువకుడు అది చూశాడు. అతను కోపాన్ని ఆపుకోలేక ఆ స్వర్ణకారుడిపై దాడి చేసి చంపేశాడు. దీనికి జవాబుగా, యూదులందరూ కలసి ఆ ముస్లిం యువకునిపై విరుచుకుపడి అతణ్ణి చంపేశారు.

ఆ తరువాత హతుని కుటుంబీకులు గగ్గోలు పెడుతూ యూదులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తూ ముస్లిములకు న్యాయం చేయమని అర్థించారు. ఫలితంగా ముస్లిములకు, బనీ ఖైనుఖా యూదులకు నడుమ కొట్లాట ఆరంభమైంది.

అక్కడ దరిదాపుల్లో ఉన్న పాతికమంది ముస్లిములు పరిగెత్తుకొని వచ్చారు. మరోవైపు నుంచి ఏడు వందల మంది యూదులు ఆయుధాలు ధరించి వచ్చారు. అంతమంది యూదుల్ని చూసి ముస్లిములు భయపడలేదు. వెంటనే వారు ఒరల్లో నుంచి ఖడ్గాలు లాగి పోరాటానికి ఉపక్రమించారు.

ఈ విధంగా పాతిక మంది ముస్లిములు ఏడు వందల మంది యూదులతో తలపడుతూ వీరోచితంగా పోరాడసాగారు. వారి ధైర్యసాహసాలు చూసి యూదులు ఆశ్చర్యపోయారు.

*దైవప్రవక్త (సల్లం)కు అందిన సమాచారం : -*

ఈ విషయం తెలిసిన వెంటనే మహాప్రవక్త (సల్లం) చేసేదిలేక, మదీనా పాలనా బాధ్యతను 'అబూ లుబాబా బిన్ అబ్దుల్ మున్జిర్ (రజి)'కు అప్పగించి, ''హజ్రత్ హమ్'జా (రజి)" గారి చేతికి ముస్లిముల పతాకాన్ని అందించి స్వయంగా అల్లాహ్ సైన్యంతో సహా 'బనూ ఖైనుఖా' వైపు బయలుదేరారు.

ఇటు, ఏడొందల మంది యూదులతో తలపడుతున్న పాతిక మంది ముస్లిములు, పోరాటంలో తమ పరాక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ముస్లిములు చాలా సేపు పోరాడారు. చివరికి వారి సత్తువ క్రమంగా తగ్గిపోసాగింది. అప్పుడు యూదుల వైనుక వైపు నుంచి *"అల్లాహ్ అక్బర్"* అనే నినాదాలు వినవచ్చాయి.

దైవప్రవక్త (సల్లం) నేతృత్వంలో మూడు వందల మంది ముస్లిం యోధులు వచ్చిపడ్డారు.

దైవప్రవక్త (సల్లం) ఆదేశం లభించగానే ముస్లిం యోధులు, యూదుల సైన్యంలోకి దూసుకుపోయి తుఫానులా విరుచుకుపడ్డారు. కాస్సేపటికే యుద్ధం పరాకాష్ఠకు చేరింది. యూదులు, ముస్లిముల ధాటికి నిలువలేక వెనుకకు జరుగుతూ పోయారు. చివరికి పారిపోయి తమ కోటలోకి దూరి తలుపులు మూసుకున్నారు.

దైవప్రవక్త (సల్లం), వారి కోటను ముట్టడించమని అనుచరుల్ని ఆదేశించారు. తక్షణమే అనుచరులు ఆ కోటను ముట్టడించారు. అంతేకాకుండా, యూదులకు బయటి నుంచి ఆహారపదార్థాలు సరఫరా కాకుండా అన్ని వైపుల నుంచి కోటను దిగ్బంధం చేశారు. కాని, ముస్లిములు ఎంత ప్రయత్నించినా కోటలోకి ప్రవేశించలేకపోయారు.

హిజ్రీ శకం - 2, షవ్వాల్ నెల పదిహేనవ తేది శుక్రవారం నాడు, దైవప్రవక్త (సల్లం) ఆ కోటను చుట్టుముట్టారు. పదిహేను రోజుల వరకు ఆ కోటను చుట్టుముట్టి, వారి కోసం నిరీక్షిస్తూ ఉన్నారు _(అంటే జీఖాదా చంద్ర దర్శనం అయిన రోజు వరకు అన్నమాట)_. అటు, కోటలోకి ఆహారపదార్థాల సరఫరా నిలిచిపోయినందున, యూదులు పస్తులతో విలవిల్లాడిపోయారు.

ఆ తరువాత అల్లాహ్, యూదుల హృదయాల్లో భయాన్ని, ముస్లిముల ఎడల అఘోరాన్ని సృష్టించాడు. అల్లాహ్ ఏ జాతికైనా అపజయాన్ని కల్గించదలుచుకుంటే, ఇలా వారి హృదయాల్లో ఓ విధమైన భయవిహ్వలతను సృష్టించడం ఆయన సంప్రదాయం. కనుక వారు, దైవప్రవక్త (సల్లం) వారి ధన ప్రాణాలు, వారి కుటుంబాలు మరియు వారి భార్యాపిల్లల విషయంలో ఏ తీర్పు ఇస్తే దానికి తాము బద్ధులై ఉంటామని ఒప్పుకొని లొంగిపోయారు. ఆ తర్వాత మహాప్రవక్త (సల్లం)గారి ఆదేశం ప్రకారం వారందరిని బంధించడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) వారందర్నీ ఖైదీలుగా పట్టుకొని మదీనా తీసుకెళ్ళారు. 

ఆనాటి అరబ్ యుద్ధనీతి ప్రకారం, యుద్ధ ఖైదీలందర్నీ వధించాలి. అందువల్ల యూద ఖైదీలు, తమకు ఇక చావు తప్పదని భావించి భయపడ్డారు.

అయితే ఈ సమయంలోనే 'అబ్దుల్లా బిన్ ఉబై'కు తన కపట నాటక మాడడానికి సమయం లభించింది. అతను, మహాప్రవక్త (సల్లం) వద్దకు వెళ్ళి, వారందరినీ క్షమించి వదిలేయాలని ప్రాధేయపడ్డారు.

కావున అతను, దైవప్రవక్త (సల్లం)తో...., *"ఓ ప్రవక్తా! నాతో ఒప్పందం కుదుర్చుకొని ఉన్న వారిని కరుణించండి."* అన్నాడు. _(బనూ ఖైనుఖా, ఖజ్రజ్ తెగకు మిత్ర పక్షంగా ఉండిన విషయం గమనార్హం)_ 

కాని, మహాప్రవక్త (సల్లం) మాత్రం మాట్లాడలేదు. అతను తిరిగి ఆ విన్నపాన్నే విన్నవించుకున్నప్పుడు మహాప్రవక్త (సల్లం) ముఖం మరో వైపుకు త్రిప్పుకున్నారు. కాని అతను దైవప్రవక్త (సల్లం) గారి చొక్కా పట్టుకున్నప్పుడు, ఆయన (సల్లం)...., *"నన్ను వదిలేయి"* అని అంటూ కోపాన్ని ప్రదర్శించారు. *"నన్ను వదిలేయి, నీవు పాడుగాను"* అని కసురుకున్నారు కూడా. అయినా ఆ మునాఫిక్ (కపట ముస్లిం) తన పంతాన్ని వదల్లేదు.

*"లేదు, నాతో ఒప్పందం కుదుర్చుకొని ఉన్నవారిని కరుణించే వరకు తమరిని వదిలిపెట్టేది లేదు. నన్ను బాగోగుల నుండి రక్షించిన ఆ నాలుగు వందల మంది యువకుల్ని, మరి కవచధారులైన మూడు వందల మంది సైనికుల్ని మీరు ఒక రోజు నరికి వేయగలరు. దైవసాక్షి! రాబోవు పరిణామాలను గురించి నేను భయపడుతున్నాను."* అని పదే పదే విన్నవించుకో నారంభించాడు.

చివరికి ఆ మునాఫిక్ విన్నపాన్ని మన్నించి వారిని ప్రాణాలతో వదలడానికి సిద్ధమయ్యారు దైవప్రవక్త (సల్లం) _(అబ్దుల్లా బిన్ ఉబై కపట ఇస్లాం ధర్మం స్వీకారం చేసి ఒక నెల మాత్రమే అయింది అప్పటికి)_.

కాని, వారంతా మదీనా దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోవాలని ఆదేశించారు ప్రవక్త (సల్లం). కనుక, బనూ ఖైనుఖా తెగకు చెందిన యూదులు అందరూ గత్యంతరంలేక మదీనా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలా వారు సిరియా భూభాగంలోనికి వెళ్ళి, అక్కడ స్థిరపడిపోయారు. కొన్ని రోజుల తరువాత అక్కడ చాలా మంది మరణించడం కూడా జరిగింది.

యూదులు వదిలిపెట్టి పోయిన కోటలు, ఇళ్ళు, ఆయుధాలు, వెండి, బంగారు రాసులన్నీ ముస్లిములకు దక్కాయి.

● *మరో ఉల్లేఖనంలో....; →* దైవప్రవక్త (సల్లం), వారి ఆస్తులన్నిటినీ జప్తు చేసుకున్నారు. అందులో నుండి మూడు విల్లులు, రెండు కవచాలు మరియు మూడు కరవాలాలను తన కోసం ఉంచుకున్నారు. వారి 'మాలె గనీమత్ (యుద్ధధనం)' నుండి ఖమ్స్ కూడా తీశారు. ఈ మాలె గనీమత్ ను ప్రోగు చేసే పని 'ముహమ్మద్ బిన్ ముస్లిమా'కు అప్పగించడం జరిగింది.●

ఈ సంఘటనతో అరేబియాలో ఇస్లాం ఔన్నత్యం ఇనుమడించింది. అంతపెద్ద యూద తెగ, అందులో ఎంతో ధైర్యసాహసాలకు ప్రసిద్ధిచెందిన తెగకు మదీనాలో నిలువ నీడలేకుండా పోయింది. దీన్ని బట్టి ముస్లింలు ఎంత బలపడ్డారో తెలుస్తోంది. ఇక వారికి ఎదురే లేదు! ఈ ఆలోచనతో మదీనా దరిదాపుల్లో ఉన్న బనీ నజీర్, బనీ ఖురైజా అనే మరో రెండు యూద తెగలు ముస్లింలకు భయపడి మౌనంగా ఉండిపోయాయి.

*❖ గజ్వయె సవీఖ్ : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment