211

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 211            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 126*     

*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 

*బద్ర్ సంగ్రామం : - 10*

*అబూజహాల్ సంహారం : -*

*ఈ విషయంలో "హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)"గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*

అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి), బద్ర్ యుద్ధం రోజున యుద్ధం చేస్తూ శత్రు సైన్యంలో చొరబడ్డారు. హఠాత్తుగా ఆయన (రజి) వెనక్కు తిరిగి చూస్తే, తన ఇరుప్రక్కల ఇద్దరు యువకులున్నట్లు గమనించారు ★. అంటే, ఆయన (రజి) ఊహించని విషయమది.

_(★ → ఆ ఇద్దరు యువకుల పేర్లు "ముఆజ్ బిన్ అమ్రూ బిన్ జమూహ్" మరియు "ముఆజ్ (ముఅవ్విజ్) బిన్ అఫ్రా".)_

అంతలోనే ఓ యువకుడు అబ్దుర్రహ్మాన్ (రజి) దగ్గరకు వచ్చి రహస్యంగా...., *"బాబాయి! నాకు అబూ జహల్ ఎవరో చూపించరూ?"* అని అడిగాడు.

*"అబ్బాయీ! అబూ జహల్ ను చూపిస్తే అతణ్ణి ఏం చేయదలచుకున్నావు?"* అని అడిగారు అబ్దుర్రహ్మాన్ (రజి).

*"అతను, దైవప్రవక్త (సల్లం)ను తిడుతున్నాడు. ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ సాక్షి! నేనేగనక అతణ్ణి చూస్తే అతణ్ణి వెంటాడుతాను. చివరికి అతనో నేనో చనిపోవలసిందే."* అని అన్నాడు.

దానికి "అబ్దుర్రహ్మాన్ (రజి)" గారికి ఆశ్చర్యం వేసింది. ఇంతలోనే మరో యువకుడు వచ్చి, "అబ్దుర్రహ్మాన్ (రజి)" గారిని సైగలతో "అబూ జహల్" గురించి అడిగాడు.

అంతలోనే, అబ్దుర్రహ్మాన్ (రజి)కి "అబూ జహల్" తన సైన్యంలో తిరుగుతూ కనబడ్డాడు. అతణ్ణి చూసి...., *"అదిగో! వాడే మీ ఇద్దరికి కావలసిన వ్యక్తి."* అని అన్నారు.

ఆయన (రజి) మాటలు విన్నంతనే ఆ ఇద్దరు యువకులు కరవాలాలతో అతని వైపు దూసుకెళ్ళారు.

అప్పటికే ముష్రిక్కు సైనికులు, అబూ జహల్ చుట్టూ గుంపుగా చేరి, అతణ్ణి తమ రక్షణలో ఉంచుకున్నారు.

అబూ జహల్ దట్టమైన చెట్టు నీడలాంటి - బరిశెలు, కరవాలాల నీడలో ఉన్నట్లు ముష్రికుల చెప్పుకుంటుంటే "ముఆజ్ (రజి) బిన్ అమ్రూ" విన్నాడు. అబూ జహల్ వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరని కూడా వారనుకుంటున్నారు.

ముఆజ్ (రజి), ఈ మాటలు విన్నంతనే అతణ్ణి గురిగా చేసుకొని, సైనికుల రక్షణలో ఉన్న అబూ జహల్ వైపే వెడుతున్నాడు. అబూ జహల్ వద్దకు చేరుకోగానే, శత్రు సైనికులు ప్రతిఘటించారు. ముఆజ్ (రజి), గుంపుగా చేరిన సైనికులతో తలపడుతూనే, అవకాశం దొరగ్గానే అబూ జహల్ పై ఒక్క వ్రేటు వేశాడు. ముఆజ్ (రజి) కొట్టిన దెబ్బకు, అతని కాలు పిక్కతో సహా తెగి ఎగిరిపోయింది. రోకలి దెబ్బ తగిలి ఎగిరిపోయిన ఖర్జూరపు గింజలా ఎగిరిపోయింది ఆ కాలు.

ఇటు, ముఆజ్ (రజి), అబూ జహల్ పై వ్రేటు వేయగానే అబూ జహల్ కుమారుడు "అక్రమా" వచ్చి ముఆజ్ (రజి) భుజంపై తన ఖడ్గంతో వ్రేటు వేశాడు. దీనివల్ల తన గూడ వద్ద నుండి చేయి తెగిపోయి వ్రేలాడసాగింది. ముఆజ్ (రజి), తెగిపోయిన చేయిని వెనక వేసుకొని యుద్ధం సాగిస్తూనే ఉన్నాడు. యుద్ధంలో పోరాడుతున్నప్పుడు, మాటిమాటికి వ్రేలాడుతున్న చేయి తనకు అడ్డం వస్తూ బాధిస్తున్న మూలంగా, తెగిపోయిన చేయిపై తన కాలు వేసి గట్టిగా లాగి, తన శరీరం నుండి చేయిని వేరుచేసేశారు.

ఆ తరువాత, అబూ జహల్ దగ్గరకు "ముఅవ్విజ్ (రజి) బిన్ అఫ్రా" వచ్చాడు. "ముఅవ్విజ్ (రజి)" అప్పటికే గాయపడి ఉన్నాడు. వచ్చీ రాగానే అతను, తన ఖడ్గంతో అబూ జహల్ పై ఒక్క వ్రేటు వేశాడు. దాంతో అబూ జహల్ అక్కడనే కుప్పకూలిపోయాడు. కేవలం అతని శ్వాస ఒక్కటే ఆడుతోంది.

ఆ తరువాత వారిద్దరు మహాప్రవక్త (సల్లం) గారి దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పగా, *"మీలో ఎవరు అతణ్ణి చంపారు?"* అని అడిగారు ప్రవక్త శ్రీ (సల్లం).

ఆ ఇద్దరూ, *"నేనంటే నేను"* అని చెప్పారు.

*"మీ కరవాలాలను శుభ్రం చేశారా?"* అని అడిగారు దైవప్రవక్త (సల్లం).

*"లేదు. ఇంకా శుభ్రపరచలేదు."* అని ఆ ఇద్దరి సమాధానం.

మహాప్రవక్త (సల్లం) ఆ ఇద్దరి కరవాలాలను చూసి, *"మీరిద్దరూ కలిసి అతణ్ణి సంహరించారు."* అన్నారు.

అయితే, "అబూ జహల్" కు చెందిన సొత్తు అంతా "ముఆజ్ బిన్ అమ్రూ బిన్ జమూహ్"కు ఇచ్చారాయన (సల్లం).

ఆ తర్వాత "ముఅవ్విజ్ (ముఆజ్) బిన్ అఫ్రా (రజి)" ఆ యుద్ధంలోనే అమరగతినొందారు.

మహాప్రవక్త (సల్లం), తన అనుచరులతో...., *"అబూ జహల్ గతి ఏమైందో ఎవరు తెలుసుకొస్తారు?"* అని అడిగారు.

సహాబా (రజి) యుద్ధరంగంలో నలువైపుల తిరిగి అబూ జహల్ కోసం వెదుకనారంభించారు.

అంతలో ఓ చోట, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)కు అబూ జహల్ కోనఊపిరితో ఉండగా అగుపడ్డాడు. వెంటనే అబ్దుల్లా (రజి), అబూ జహల్ ని వధించే ఉద్దేశ్యంతో అటు వైపు కదిలారు.

అబ్దుల్లా (రజి), అబూ జహల్ దగ్గరకు వెళ్ళి, మెడపై కాలుపెట్టి తలను మొండెం నుండి వేరు చేద్దామని అతని గెడ్డం పట్టుకుంటూ...., *"ఓ అల్లాహ్ విరోధీ! చివరికి అల్లాహ్ నిన్ను అగౌరవం పాలు చేశాడు కదా?"* అని అన్నారు.

ఈ మాటలు విన్న అబూ జహల్...., *"నన్నెందుకు అగౌరవం పాలు చేశాడు? మీరు చంపుతున్న వ్యక్తికంటే మిన్న అయినవాడు మరెవ్వడూ లేడు. అయ్యో! పొలం దున్ని బ్రతికే కర్షకునికి బదులు మరెవరైనా నన్ను హతమారిస్తే బాగుండు, ఈ రోజు విజయం ఎవరిని వరించిందో చెప్పు."* అని అడిగాడు.

జవాబుగా హజ్రత్ అబ్దుల్లా (రజి)...., *"ఇంకెవరిది, దైవప్రవక్త (సల్లం) గారిదే విజయం."* అన్నారు.

అది విన్న ఆ దైవవిరోధి, తన మెడపై కాలు పెట్టి ఉండడం చూసి...., *"ఓ మేకలు కాసేవాడా! నీవు నీ కాలును ఓ ఉన్నతమైన, క్లిష్టమైన చోట పెట్టావు."* అన్నాడు. _(అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి) మక్కాలో మేకలు కాస్తూ ఉండేవారన్న విషయం గమనార్హం.)_

ఈ సంభాషణ అనంతరం "హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)" అతని మెడను మొండెం నుండి వేరు చేశారు. దాన్ని మహాప్రవక్త (సల్లం) గారి సన్నిధికి గొనివచ్చి...., *"దైవప్రవక్తా! ఇదిగో! అల్లాహ్ విరోధి అబూ జహల్ శిరస్సు"* అని ఆయన (సల్లం) ముందు పడవేశారు.

మహాప్రవక్త (సల్లం) దాన్ని చూసి మూడుసార్లు ఇలా పలికారు....; ↓

*"ఆయన తప్ప వేరే పూజ్యుడు లేని ఆ అల్లాహ్ సాక్షి! అల్లాహు అక్బర్. సర్వస్తోత్రాలు అల్లాహ్ కే. ఆయన తన వాగ్దానాన్ని సత్యం చేసి చూపించాడు. తన దాసునికి సహాయం అందించి ఒక్కడే అన్ని వర్గాలను ఓడించాడు."*

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)ను ఉద్దేశించి...., *"పదండి, అతని శవం ఎక్కడుందో చూయిద్దురుగాని"* అని అడగ్గా, సహాబా (రజి), అబూ జహల్ శవాన్ని ఆయన (సల్లం)కు చూపెట్టడం జరిగింది. ఆ శవాన్ని చూసి, *"ఇతను ఈ సమాజానికి చెందిన ఫిర్'ఔన్."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

_(↑ ఇదే సంఘటన వేరొక సీరతుల్ కితాబ్ లో ఈ విధంగా ఉంది ↓)_

అబూ జహల్ ఒకచోట కోనఊపిరితో మూలుగుతున్నాడు. అతను తన దగ్గరకు "అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి)" రావడం చూసి...., *"యుద్ధ పర్యవసానం ఏమిటి?"* అని అడిగాడు హీనస్వరంతో.

*"ముస్లింలు విజయం సాధించారు. నీ సైనికులు పారిపోయారు."* అని అన్నారు అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రజి).

తర్వాత ఆయన (రజి), అబూ జహల్ తల నరకడానికి ఖడ్గం పైకెత్తారు.

అబూ జహల్, ఆయన (రజి)ను వారిస్తూ...., *"ఆగాగు. నరకబడిన మా సైనికుల తలల మధ్య నా తల విశేషంగా కన్పించేలా, చూసేవారికి ఇది వారి నాయకుని శిరస్సు అన్నట్లు అగపడే విధంగా, నా మెడ క్రిందిభాగంతో కలిపి నరుకు."* అన్నాడు ఇంత అవమానం జరిగినా అహంకారాన్ని వదులుకోలేక!

హజ్రత్ అబ్దుల్లా (రజి), అతని మాటలు పట్టించుకోకుండా బరబరా శిరస్సు ఖండించి, దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చారు.

*ఇక్కడితో అకస్మాత్తుగా సంభవించిన ఈ చారిత్రాత్మక యుద్ధం "బద్ర్ యుద్ధం" ముగిసింది.*

*యుద్ధంలో హతులైన ఇరుపక్షాల సైనికులు : -*

ఈ యుద్ధం, ముష్రిక్కుల ఘోర పరాజయం మరియు ముస్లిముల ఘన విజయంతో పరిసమాప్తమైంది. ఇందులో పద్నాలుగు మంది ముస్లిములు షహీద్ అయ్యారు (అమరగతిని పొందారు). వారిలో ఆరు మంది ముహాజిర్లు, ఎనిమిది మంది అన్సారులు. కాని, బహుదైవారాధకులకు మాత్రం పెద్ద నష్టమే జరిగింది. వారిలో డెబ్భై మంది హతులయ్యారు. మరి డెబ్భై మంది బంధీలుగా చిక్కారు. వీరంతా ముష్రిక్కుల నాయకులు, సర్దారులు, పేరుమోసిన యోధానయోధులే. పెద్ద పెద్ద నాయకులతో సహా ఖురైష్ సైనికులు కూడా అనేకమంది వధించబడ్డారు.

విజయం ముస్లిం యోధుల్ని వరించింది. మహాప్రవక్త (సల్లం) కృతజ్ఞతా భావంతో అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ధర్మం గెలిచింది. అధర్మం పలాయనం చిత్తగించింది.

ఆయుధాలు పుష్కలంగా ఉన్నా, అత్యధిక సైనిక బలమున్నా కూడా, అవిశ్వాసులు డెబ్భై మందికి పైగానే వధించబడ్డారు. మరో డెబ్భై మంది ఖైదీలుగా పట్టుబడ్డారు. కాని, సరైన ఆయుధాలు, కావలసినన్ని వనరులు, తగిన సదుపాయాలు లేకపోయినా దైవం మీద చెక్కుచెదరని విశ్వాసంతో వచ్చిన ముస్లింయోధుల్లో కేవలం పద్నాలుగు మంది మాత్రమే వీరమరణం పొందారు.

*శత్రువుల శవాల పూడ్చివేత : -*

ఇక ఆ తర్వాత చూస్తే యుద్ధరంగం అంతా కళేబరాలతో నిండి ఉంది. శత్రువుల శవాలను ఒక కందకంలో వేయించారు ప్రవక్త (సల్లం). ఆ తర్వాత వారిని ఉద్దేశిస్తూ...., *"కందకంలో పడివున్న వారలారా! మీరు నాకు ఎలాంటి బంధువులు? ఇతరులు నన్ను విశ్వసించినా, మీరు మాత్రం నన్ను తిరస్కరించారు. ఇతరులు నాకు ఆశ్రయం కల్పించినా, మీరు మాత్రం నన్ను బలవంతంగా నా ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశారు. ఇతరులు నాకు సహాయం కోసం ముందుకు వచ్చారు. కాని, మీరు నాతో పోరాడేందుకు ముందుకు వచ్చారు. మీ ప్రభువు వాగ్దానం సత్యమైనదని ఇప్పటికయినా తెలిసిందా? నా ప్రభువు వాగ్దానం సత్యమైనదని అని నేనయితే గ్రహించాను."* అని అన్నారు.

ప్రవక్త సహచరులు ఆయన (సల్లం)ను...., *"ప్రవక్తా! మరణించిన వారికి చెబుతున్నారా!"* అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. దానికి ప్రవక్త (సల్లం) జవాబిస్తూ...., *"మీరు విన్నట్లే వారు నా మాటలు వింటున్నారు. అయితే, వాళ్ళు జవాబు చెప్పలేరంతే!"* అన్నారు. ఆ తర్వాత ప్రవక్త (సల్లం), ఆ కందకాన్ని మట్టితో నింపమన్నారు. (← ఇందులోని మరింత వివరణ రాబోయే పుటల్లో రానుంది)

*↑* *↑* *↑* *↑* *↑* *↑* *↑* *↑* *↑* *↑*

*ఇంతటితో "బద్ర్ సంగ్రామం"కు సంబంధించిన అన్ని పుటలు పూర్తయ్యాయి.*

*In Sha Allah రేపటి భాగములో...., "బద్ర్ సంగ్రామంలో, విశ్వాసాన్ని ఇనుమడింపజేసే సంఘటన"ల గురించి తెలుసుకుందాం.*

No comments:

Post a Comment