210

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 210            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 125*   
 *ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 

*బద్ర్ సంగ్రామం : - 9* 

మహాప్రవక్త (సల్లం) ఎదురుదాడికి ఆదేశం ఇచ్చినప్పుడు, శత్రువు చేసే దాడుల్లో తీవ్రత తగ్గిపోయి ఉంది. వారి ధైర్యాలు సన్నగిల్లుతున్నాయి. అందుకనే వివేచనతో కూడిన యుద్ధ కౌశల్యాన్నుపయోగించి తీసుకున్న నిర్ణయం, ముస్లిముల పరిస్థితికి మరింతగా బలం చేకూర్చింది. కారణం ఏమిటంటే, సహాబా (రజి)కు ఎదురు దాడి చేయమనే ఆదేశం అందినప్పుడు వారి జిహాద్ చేసే ఉద్రేకం, ఉద్వేగం, ఉత్సాహం ఉచ్ఛస్థాయిలోనే ఉన్నాయి.

అందుకనే ఓ నిర్ణయాత్మకమైన, శత్రువును తుడిచిపారవేసే దాడి చేయగలిగారు. వారు శత్రు వరుసల్లో చొరబడి వాటిని చిన్నాభిన్నం చేస్తూ వారి మెడలను నరుకుతూ ముందుకు వెళుతున్నారు. అదేకాకుండా, మహాప్రవక్త (సల్లం) స్వయంగా కవచాన్ని ధరించి ఉత్సాహంగా వారి వైపునకు రావడం, పూర్తి నమ్మకంతో...., *"త్వరలోనే ఈ వర్గం పరాజయం పాలవుతుంది, వారు వెన్నుజూపి పారిపోతూ కనిపిస్తారు."* అనే మాటలను అనడం విన్నారు.

అందుకని ముస్లిములలో నూతన శక్తి వచ్చినట్లయింది. వారు పూర్తి బలంతో దాడి చేశారు. ముస్లిముల వెంట (1000 మంది) దైవదూతలు కూడా ఉండి వారికి సహాయపడ్డారు.

_"ఇబ్నె సఅద్" ఉల్లేఖనంలో ఇలా ఉంది....; ↓_

*"ఆ రోజు మనిషి తల తెగి క్రిందపడిపోయేది. ఇతణ్ణి ఎవరు చంపారో తెలిసేదికాదు. అలాగే మనిషి చేయి తెగి క్రింద పడిపోయింది. ఆ చేతిని నరికింది ఎవరో అగుపడేవారు కారు."*

_"ఇబ్నె అబ్బాస్" ఇలా అంటారు....; ↓_

*"ఓ ముస్లిం, ఓ బహుదైవారాధకున్ని చంపడానికి అతని వెంటబడ్డాడు. హఠాత్తుగా ఆ బహుదైవారాధకునిపై కొరడా దెబ్బపడిన శబ్దం వినవచ్చింది. ఓ గుర్రపు రౌతు, _"హీజూమ్ ముందుకు నడు"_ అని అనడమూ వినవచ్చింది. ఆ ముస్లిం, ఆ ముష్రిక్ దగ్గరకి పోగా అతను వెల్లకిలా పడివున్నాడు. అతని ముక్కు, ముఖం పచ్చడి అయిపోయాయి. కొరడాతో కొట్టినట్లు అతని శరీరంపై అంతా ఆకుపచ్చగా మారిపోయింది. ఆ అన్సారీ ముస్లిం దైవప్రవక్త (సల్లం)తో ఈ విషయమే చెప్పగా, _"నీవు చెప్పేది నిజం. అది మూడో ఆకాశం నుండి అందిన సహాయం."_ అని అన్నారు."*

_"అబూ దావూద్ మాజినీ" ఇలా అంటారు....; ↓_

*"నేను ఓ ముష్రిక్ ను చంపడానికి అతని వెంటబడ్డాను. హఠాత్తుగా అతని తల నా కరవాలం క్రిందకి రాక పూర్వమే తెగిపడిపోయింది. ఇతణ్ణి మరెవరో సంహరించారన్న విషయం అప్పుడుగాని అర్థం కాలేదు."*

ఓ అన్సారి, "అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్"ను బంధీగా పట్టుకొని రాగా, అబ్బాస్ బిన్ ముత్తలిబ్ ఇలా అనసాగారు...., *"దైవసాక్షి! ఇతను నన్ను బంధించలేదు. నన్ను బంధించినది ఓ బట్టతల మనిషి. అతను ఎంతో అందంగా ఉండి, ఓ విచిత్రమైన మచ్చలుగల గుర్రంపై ఆశీనుడై ఉన్నాడు."* అని చెప్పగా, *"కాదు దైవప్రవక్తా! ఈయన్ను నేనే పట్టుకొని బంధించాను."* అన్నాడు ఆ అన్సారి. అప్పుడు మహాప్రవక్త (సల్లం), *"ఊరుకో! అల్లాహ్ ఓ దైవదూత ద్వారా నీకు సహాయపడ్డాడు."* అన్నారు.

*యుద్ధరంగం నుండి ఇబ్లీస్ పలాయనం : -*

"సురాఖా బిన్ మాలిక్ బిన్ జీషమ్ ముద్'లజీ" రూపంలో ఇబ్లీస్ వచ్చినట్లు, అతను ఇంకా వారి వెంటే ఉన్నట్లు మనం ఇదివరకే చెప్పుకున్నాం. కాని ముష్రిక్కులకు వ్యతిరేకంగా దైవదూతలు రంగంలోకి దిగగానే, ఇబ్లీస్ వెన్నుజూపి పారిపోనారంభించాడు.

అయితే, పారిపోతున్న అతణ్ణి, హారిస్ బిన్ హష్షామ్ పట్టుకున్నాడు. ఇంకా అతను "సూరాకా బిన్ మాలికే" అని అనుకుంటున్నాడతడు.

ఇబ్లీస్, హారిస్ బిన్ హష్షామ్ వక్షస్థలంపై గుద్దిన గుద్దుకు అతను వెల్లకిలా పడిపోయాడు. అతను పారిపోతూవుంటే బహుదైవారాధకులు...., *"సూరాకా! ఎక్కడికి వెళుతున్నావు? నీవు మాకు సహాయం చేస్తానని, మమ్మల్ని విడిచి ఎక్కడికీ వెళ్ళనని మాట ఇవ్వలేదా?"* అని అడిగారు.

జవాబుగా ఇబ్లీస్...., *"నేను ఇక్కడ చూస్తున్నది మీరు చూడలేరు. అల్లాహ్ అంటే నాకు భయంగా ఉంది. ఆయన శిక్ష ఎంతో కఠినమైన శిక్ష."* అంటూ పరుగెడుతూ సముద్రంలోకి దూరిపోయాడు.

*బిలాల్ (రజి) ప్రతీకారం : -*

శత్రుసైన్యంలో బిలాల్ (రజి)కు తన మాజీ యజమాని "ఉమయ్యా బిన్ ఖల్ఫ్" కనిపించాడు. తనను నానా విధాలుగా చిత్రహింసలకు గురిచేసిన వాడిని చూడగానే ఆయన (రజి)...., *"ఉమయ్యా! అవిశ్వాసుల నాయకుడా!"* అంటూ అరిచారు.

తనను అనేక రకాలుగా వాడు హింసలకు గురిచేసిన సంఘటనలు ఆయన (రజి)కు గుర్తుకు వచ్చాయి. ఆ వెంటనే అతణ్ణి వధించే ఉద్దేశ్యంతో ఉమయ్యా వైపు శరవేగంగా కదిలారు. ఇది చూసిన ఉమయ్యా, భయపడి ప్రాణభయంతో పరిగెత్తడానికి ప్రయత్నించాడు.

*"వాడు తప్పించుకుంటే నేను బ్రతకడం అనవసరం"* అంటూ బిలాల్ (రజి), ఉమయ్యా వెంటపడ్డారు.

ఇంతలో, ముస్లిం సైనికులు బిలాల్ (రజి)ని అడ్డుకుంటూ...., *"ఉమయ్యా వ్యవహారం మాకు వదిలేయ్. వాడి కథ మేము సమాప్తం చేస్తాం."* అని అన్నారు.

కాని, బిలాల్ (రజి) తన శక్తినంతా కూడదీసుకుని, ముస్లిముల పట్టు నుండి తప్పించుకొని ఉమయ్యా వైపు లంఘించి ఒక్క వ్రేటుకు నేలకూల్చారు. దెబ్బకు ఉమయ్యా అక్కడే ఊపిరి విడిచాడు. _(← ఇందులోని మరింత వివరణ ముందు పుటల్లో రానుంది)_

*అవిశ్వాసుల ఘోరపరాజయం : -*

కొద్దిసేపట్లోనే బహుదైవారాధకులు సైన్యంలో అపజయ సూచనలు, అస్తవ్యస్త సూచనలు ప్రారంభమయ్యాయి. వారి వరుసలు, ముస్లిముల ఎడతెగని దాడులతో చిన్నాభిన్నమవుతున్నాయి. యుద్ధం, దాని చరమ దశకు చేరుకుంది. ముష్రిక్కుల సైనిక గుంపులు, అస్తవ్యస్త పరిస్థితిలో వెన్నుజూపి పారిపోనారంభించాయి. త్రొక్కిసలాట ప్రారంభమైంది. ముస్లిములు వారిని గాయపరుస్తూ, చంపుతూ, బంధీలుగా పట్టుకుంటూ వారి వెంటపడ్డారు. ఇలా పూర్తిగా అపజయం పాలైపోయింది ఖురైష్ సైన్యం.

*గర్వంతో నీల్గిన అబూ జహల్ : -*

అయితే, అబూ జహల్ తన సైన్యంలో పుట్టుకొస్తున్న భయ చిహ్నాలను గమనించి ముస్లిం సైన్యాన్ని అడ్డుకోవడానికిగాను, గర్వంతో నీల్గుతూ వారి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

*"సైనికులారా! సురాకా వెళ్ళిపోవడం వల్ల మీరు ధైర్యాన్ని వీడకూడదు. ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన సహచరులు ముందే అతనితో కుట్ర పన్ని అతణ్ణి అలా చేయడానికి పురికొల్పారు. మీరు 'ఉత్బా', 'షైబా' మరియు 'వలీద్' మరణం వల్ల ధైర్యం కోల్పోకూడదు. వాళ్ళు ముగ్గురు తొందరపడి తమ మరణాన్ని ఆహ్వానించారు. లాత్ మరియు ఉజ్జా దేవుళ్ళ సాక్షి! మనం వారందరినీ త్రాళ్ళతో బంధించి వెనక్కు తీసుకుపోనంత వరకు విశ్రమించకూడదు. చూడండి! మీలో ఏ ఒక్కరూ వారి మనుషుల్ని సంహరించకూడదు. వారిని ప్రాణాలతో పట్టుకెళ్ళి వారికి తగిన శిక్షను విధిద్దాం."* అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.

అయితే, ఇతని ఈ గర్వం కొంతసేపట్లోనే అణగారిపోయింది. ఎందుకంటే ఇతను ప్రగల్భాలు పలికిన కొంత సమయానికే ముస్లింలు ఎదురుదాడి చేయడం, ఆ ఎదురుదాడి ధాటికి ముష్రిక్కుల వరుసలు కూలిపోవడం, చిందరవందర అయిపోవడం గమనించాడతడు. అప్పటికే అతను, తన చుట్టూ ముష్రిక్కుల గుంపును చేర్చుకొని ఒకే చోట నిలబడి ఉన్నాడు. ముష్రిక్కు సైనికులు చుట్టూ మూగి అతణ్ణి కరవాలాల ప్రహారాల నుండి, బరిశెల వ్రేటుల నుండి కాపాడుతూనే ఉన్నారు. కాని, ముస్లిముల సైనికులు తుఫానులా వచ్చి ఆ గుంపును కూడా చెదరగొట్టేశారు. ఆ తరువాత వారికి ఈ మహాదుష్టుడు అగుపడ్డాడు. అతను ఓ గుర్రమెక్కి చక్కర్లు కొడుతున్నాడు. ఇటు ఇద్దరు అన్సారు యువకులు "అబూ జహల్"ని అంతమొందించడానికి కాచుకొని ఉన్నారు.

*అబూజహాల్ సంహారం : -*

*ఈ విషయంలో "హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)"గారి ఉల్లేఖనం ఇలా ఉంది....; ↓*

అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి), బద్ర్ యుద్ధం రోజున యుద్ధం చేస్తూ శత్రు సైన్యంలో చొరబడ్డారు. హఠాత్తుగా ఆయన (రజి) వెనక్కు తిరిగి చూస్తే, తన ఇరుప్రక్కల ఇద్దరు యువకులున్నట్లు గమనించారు ★. అంటే, ఆయన (రజి) ఊహించని విషయమది.

_(★ → ఆ ఇద్దరు యువకుల పేర్లు "ముఆజ్ బిన్ అమ్రూ బిన్ జమూహ్" మరియు "ముఆజ్ (ముఅవ్విజ్) బిన్ అఫ్రా".)_

అంతలోనే ఓ యువకుడు అబ్దుర్రహ్మాన్ (రజి) దగ్గరకు వచ్చి రహస్యంగా...., *"బాబాయి! నాకు అబూ జహల్ ఎవరో చూపించరూ?"* అని అడిగాడు.

*"అబ్బాయీ! అబూ జహల్ ను చూపిస్తే అతణ్ణి ఏం చేయదలచుకున్నావు?"* అని అడిగారు అబ్దుర్రహ్మాన్ (రజి).

*"అతను, దైవప్రవక్త (సల్లం)ను తిడుతున్నాడు. ఎవరి చేతిలోనైతే నా ప్రాణాలున్నాయో ఆ అల్లాహ్ సాక్షి! నేనేగనక అతణ్ణి చూస్తే అతణ్ణి వెంటాడుతాను. చివరికి అతనో నేనో చనిపోవలసిందే."* అని అన్నాడు.

దానికి "అబ్దుర్రహ్మాన్ (రజి)" గారికి ఆశ్చర్యం వేసింది. ఇంతలోనే మరో యువకుడు వచ్చి, "అబ్దుర్రహ్మాన్ (రజి)" గారిని సైగలతో "అబూ జహల్" గురించి అడిగాడు.

అంతలోనే, అబ్దుర్రహ్మాన్ (రజి)కి "అబూ జహల్" తన సైన్యంలో తిరుగుతూ కనబడ్డాడు. అతణ్ణి చూసి...., *"అదిగో! వాడే మీ ఇద్దరికి కావలసిన వ్యక్తి."* అని అన్నారు.

ఆయన (రజి) మాటలు విన్నంతనే ఆ ఇద్దరు యువకులు కరవాలాలతో అబూ జహల్ వైపు దూసుకెళ్ళారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment