🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 208 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 123*
*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం*
*బద్ర్ సంగ్రామం : - 7*
*హిజ్రీ శకం 2 వ సంవత్సరం, రమజాన్ నెల 17 వ తేదీ, శుక్రవారం ఉదయం వేళ.*
*ఎదురెదురుగా నిలబడిన రెండు సైనిక దళాలు : - ↓*
ఎట్టకేలకు ముష్రిక్కులు సైన్యం బయటకు వచ్చింది. ఇరు సేనలు ఒకదానికొకటి అగుపిస్తున్నాయి. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఇలా "దుఆ" చేశారు....; ↓
*"ఓ ప్రభూ వీరు ఖురైషులు. గర్వపడుతూ, విర్రవీగుతూ నీకు వ్యతిరేకంగా సన్నద్ధులై వస్తున్నవారు. నీ ప్రవక్త (సల్లం)ను తిరస్కరించేవారు. ఓ అల్లాహ్ నీ సహాయం.... ఏ సహాయం అయితే నీవు చేస్తానని వాగ్దానం చేశావో, ఆ సహాయం అందించు. ఓ అల్లాహ్! ఈ రోజు వారిని హతమార్చు."*
అదేకాదు, దైవప్రవక్త (సల్లం), ఉత్బా బిన్ రబీయాను, అతని ఎరుపు రంగు ఒంటెపై ఎక్కి ఉండడం చూసి, *"ఒకవేళ ఆ జాతిలో ఎవరి వద్దయినా కొంత మేలు ఉంటే, ఆ ఎరుపు రంగు ఒంటెగల వాడి వద్దనే ఉంది. అతని మాట వింటే ఆ జాతి రుజుమార్గం పొంది ఉండేది."* అన్నారు.
ఈ సందర్భంగా మహాప్రవక్త (సల్లం) ముస్లిముల వరుసలను తీర్చిదిద్దారు. వరుసలను తీరుస్తున్నప్పుడు ఓ అసాధారణ సంఘటన జరిగింది. ఆయన (సల్లం) చేతిలో ఓ బాణం ఉంది. దానితో ఆయన (సల్లం) వరుసలను సరిచేస్తున్నారు. వరుసలో కొంత ముందుకు వచ్చి నిలుచున్న "హజ్రత్ సౌదా (రజి) బిన్ గజియా" పొట్టపై ఆ బాణంతో నొక్కి, *"వెనక్కు వెళ్ళి సరిగా నిలుచుండు."* అని చెప్పారు.
దానికి సౌదా (రజి)...., *"ఓ మహాప్రవక్తా! మీ బాణంతో నా పొట్టపై నొక్కి, మీరు నన్ను బాధించారు. నాకు ప్రతిఫలం కావాలి."* అని అన్నారు.
దైవప్రవక్త (సల్లం) తన పొట్టపై నుండి వస్త్రాన్ని తీసి...., *"ఇదిగో, నన్ను కూడా బాధించి మీ బాధను ఉపశమించుకోండి."* అని ఆయన (రజి) ఎదురుగా నిలబడ్డారు ప్రవక్త (సల్లం).
సౌదా (రజి), ఆయన (సల్లం)ను వాటేసుకొని ఆయన (సల్లం) పొట్టను ముద్దుపెట్టుకోనారంభించారు.
అందుకు దైవప్రవక్త (సల్లం)...., *"సౌదా (రజి)! మీరు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి?"* అని అడిగారు.
*"దైవప్రవక్తా! జరిగేదంతా మీకు తెలుసు. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చివరి సమయంలో నా శరీరం మీ శరీరంతో స్పృశించాలని అలా చేశాను అంతే."* అన్నారు సౌదా (రజి).
మహాప్రవక్త (సల్లం), ఆయన (రజి) ప్రేమానురాగాలకు అచ్చెరువొంది ఆయన (రజి)ను దీవించడం జరిగింది.
వరుసలు సరియైన తరువాత, *"నా చివరి ఆదేశం వెలవడనంతవరకు ఏ ఒక్కరూ యుద్ధం ప్రారంభించకూడదు."* అని ఆజ్ఞాపించారు ప్రవక్త (సల్లం). ఆ తరువాత యుద్ధం చేసే ప్రత్యేక విధానాన్ని చెబుతూ, *"బహుదైవారాధకులు మూకుమ్మడిగా మీపై విరుచుకుపడేటప్పుడు మీరు బాణాలు వదలాలి. వారి బాణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. (అంటే, ప్రారంభం నుండే బాణాలు వదిలి, వాటిని వ్యయపర్చకూడదు అని అర్థం). వారు మీపై వచ్చిపడే వరకు, మీ ఖడ్గాలను ఒరల్లో నుండి బయటకు తీయవద్దు."* అని చెప్పారు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), హజ్రత్ అబూ బక్ర్ (రజి)ని వెంటబెట్టుకొని పందిరి వద్దకు తిరిగి వెళ్ళిపోయారు. హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి) తన సైనిక దళంతో పందిరి ముందు పహారా కాస్తున్నారు.
మరో వైపు బహుదైవారాధకులు పరిస్థితి ఇలా ఉంది. అబూ జహల్, తీర్పు కోసం అల్లాహ్ ను ఇలా వేడుకుంటున్నాడు. ↓
*"ఓ అల్లాహ్! మాలో ఏ వర్గం అయితే బంధుత్వాన్ని త్రెంచడానికి, దుష్ప్రవర్తన చేయడంలో మితిమీరిపోయిందో దానిని ఈ రోజు విరిచిపారెయ్యి. ఓ ప్రభూ! మాలోని ఏ వర్గం అయితే నీకు అధిక ప్రియమైనదో, అతి సామీప్యంగలదో దానికి నీ సహాయాన్ని అందించు."* అంటూ ప్రార్థిస్తున్నాడు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దైవం ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. ↓
*"(ఓ సత్య తిరస్కారులారా!) మీరు తీర్పును కోరుతున్నట్లయితే, ఇదిగో, ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది. ఇకనయినా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది. ఒకవేళ మీరు మళ్ళీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది. మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకేవిధంగానూ పనికిరాదు - అల్లాహ్ విశ్వాసులకు తోడుగా ఉన్నాడు." (ఖుర్ఆన్ 8:19).*
*ప్రారంభమైన యుద్ధం : -*
రెండు పక్షాలు ముందుకొచ్చి పరస్పరం ఎదురెదురుగా నిల్చున్నాయి. దాంతో సమరాగ్ని రగులుకొన్నది.
అబూ జహల్ వికటాట్టహాసం చేస్తూ...., *"ఆమిర్! అదిగో నీ సోదరుని రక్తపరిహారం నీ ఎదుటకు వచ్చింది. లే, లేచి నీ జాతిని ఉద్రేకపరచు."* అని ఆజ్ఞాపించాడు.
"ఆమిర్ బిన్ హజ్రమీ" రంగంలోకి దిగి ముస్లింలకు సవాలు చేస్తూ ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. అతనికి పోటీగా "హజ్రత్ ఉమర్ (రజి)" బానిస "హజ్రత్ మిహ్'జా (రజి)" వచ్చారు.
ఆమిర్ మెరుపువేగంతో లంఘించి మిహ్'జా (రజి) మీద ఒక్క వ్రేటు వేశాడు. దాంతో ఆయన *"అల్లాహ్ అక్బర్"* అంటూ నేలకొరిగారు.
ప్రారంభంలోనే తమ యోధుడు, ముస్లిం సైనికుడ్ని ఓడించినందున తమ విజయానికి ఇది శుభసూచకమని, శుభారంభమని తలచి మురిసిపోయారు ఖురైషీయులు.
*తొడ చరిచి పోరుకు పిలిచినవారు : -*
ఆ తర్వాత యుద్ధజ్వాలలు మరింత ప్రజ్వరిల్లాయి. వెంటనే ఖురైష్ కు చెందిన ముగ్గురు గుర్రపు రౌతులు ముందుకు వచ్చారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకడు 'ఉత్బా', రెండవ వాడు అతని సోదరుడు 'షైబా'. వీరిద్దరు రబీయా కుమారులే. మూడవవాడు 'వలీద్'. ఇతను 'ఉత్బా' కుమారుడు.
వీరు, వారి వరుసలో నుండి ముందుకువచ్చి వ్యక్తిగతంగా యుద్ధం చేయమని తొడ చరిచి పిలిచారు. వారిని ఎదుర్కోవడానికి అన్సార్ కు చెందిన ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు. ఒకరి పేరు 'ఔఫ్'. రెండో ఆయన పేరు 'ముఅవ్విజ్'. వీరిద్దరు 'హారిస్' కుమారులు. వీరి తల్లి పేరు 'అఫ్రా'. మూడో యువకుడు 'అబ్దుల్లా బిన్ రవాహా'.
వీరిని చూసి ఖురైషీయులు, *"మీరు ఎవరు?"* అడిగారు.
దానికి వారు, *"మేము అన్సారులం."* అని జవాబిచ్చారు.
*"మీరు గౌరవనీయులైన ప్రత్యర్థులు. మీతో మాకు పని లేదు. మాకు కావలసినవారల్లా మా దాయాదులు, మా సోదరులు."* అన్నారు ఖురైషులు.
అంతలోనే వారిలోని ఒకడు, *"ఓ ముహమ్మద్ (సల్లం), మా వద్దకు మా జాతికే చెందిన వారిని పంపించు."* అని ప్రకటించాడు.
దైవప్రవక్త (సల్లం), అన్సారులను చూసి...., *"ఇది ఇస్లాం మరియు కుఫర్ ల మధ్య జరుగుతున్న మొదటి యుద్ధం. కనుక ఈ యుద్ధంలో ముందుగా అన్సారులను బలిచేయడం భావ్యం కాదు."* అని అన్నారు.
ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ముహాజిర్లలోని కొందరి పేర్లను పిలుస్తూ...., *"ఉబైదా బిన్ హారిస్, లేచి నిలబడు! హమ్'జా (రజి) లేవండి! అలీ (రజి) నీవు కూడా లేచి నిలబడు."* అన్నారు.
వీరు లేచి, ఆ ముగ్గురిని మార్కొనడానికి ఖురైషుల వైపు బయలుదేరారు. ఇది చూసిన ఖురైష్, *"ఆగండి, ముందు మీరు ఎవరో చెప్పండి?"* అని అడిగారు.
దానికి వారు, *"మేము ముస్లింలము, మక్కా వాసులం."* అని బదులిచ్చారు.
*"ఇప్పుడు మాకు సరైన జోడు."* అని అన్నారు ఖురైషీయులు.
ఆ తరువాత వీరి నడుమ పోరు ప్రారంభం అయ్యింది. అందరికంటే వయస్సులో పెద్దవారైన హజ్రత్ ఉబైదా (రజి), ఉత్బా బిన్ రబీయాను ఎదుర్కొన్నారు. అలాగే హమ్'జా (రజి), షైబాను మరియు అలీ (రజి) వలీద్ తో తలపడసాగారు.
హజ్రత్ హమ్'జా (రజి) మరియు హజ్రత్ అలీ (రజి)లు అయితే తమ ప్రత్యర్థులను సునాయాసంగా చంపేశారు. కానీ, ఉబైదా (రజి) మరియు ఆయన ప్రత్యర్థి నడుమ ఖడ్గయుద్ధం సాగుతూనే ఉంది. ఇద్దరిలోనూ ప్రతివాడూ గాయపడ్డాడు. ఇంతలోనే తమ ప్రత్యర్థుల పీచమణచిన హజ్రత్ హమ్'జా (రజి) మరియు హజ్రత్ అలీ (రజి)లు ఉత్బా పై విరుచుకుపడి అతణ్ణి మట్టుబెట్టారు.
ఆ తర్వాత హజ్రత్ ఉబైదా (రజి)ను ఎత్తుకొని తమ వారి దగ్గరకు వచ్చారు. హజ్రత్ ఉబైదా (రజి)గారి కాలు తెగిపోయి ఉంది. నోట మాట కూడా లేదు. అలా ఆయన అపస్మారక స్థితిలోనే, యుద్ధం అయిపోయిన నాలుగు అయిదు రోజులు, ముస్లిములు మదీనాకు తిరిగి వెళ్ళే వరకు ఉండిపోయారు. సఫ్రా లోయగుండా ప్రయాణించేటప్పుడు పరమపదించారు.
*మూకుమ్మడిగా విరుచుకుపడిన శత్రువు : -*
వ్యక్తిగతంగా జరిగిన యుద్ధ పరిణామం చెడుగా బయల్పడ్డంతో ఖురైషీయులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ఒకేసారి ముగ్గురు మహావీరులైన సర్దారులను పోగొట్టుకోవడం వలన వారి ఆగ్రహానికి హద్దులేకుండా పోయింది. ఒకేసారి అకస్మాత్తుగా ముస్లిములపై విరుచుకుపడ్డారు.
మరోవైపు ముస్లిములు తమ ప్రభువును సహాయపడమని వేడుకుంటూ, ఆయన మార్గంలో యుద్ధం చేయడానికి తమ తమ స్థానాల్లో నిలకడగా నిలబడి శత్రువు ఎదురు దాడిని ఎదుర్కోనారంభించారు. ఇలా ఒకేచోట నిలబడి వచ్చిపడే శత్రువును చెండాడనారంభించారు. అప్పుడు వారి నోట *"అహద్, అహద్"* అనే పదం ఒక్కటే వెలువడుతోంది.
*మహాప్రవక్త (సల్లం) గారు వేడుకోలు (దుఆ) : -*
ఇటు దైవప్రవక్త (సల్లం) వరుసలను క్రమంగా తీర్చిదిద్ది, పందిరి క్రిందికి చేరారు. అల్లాహ్ ముందు మోకరిల్లి, తన వర్గానికి సహాయపడమని, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని "దుఆ" చేయనారంభించారు. ఆ "దుఆ" ఇది....; ↓
*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment