207

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 207            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

     *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 122*    

*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 

*బద్ర్ సంగ్రామం : - 6* 

*యుద్ధ పర్యవేక్షణా కేంద్రం : -*

సహాబా (రజి) నీటి చెలమ దగ్గర విడిది చేయగానే, "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)" మదిలో మరో ఆలోచన వచ్చింది.

*"యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ, సైన్యానికి ఆదేశాలు జారీ చేయడానికిగాను మహాప్రవక్త (సల్లం) కోసం ఓ ప్రత్యేక స్థలాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? ఒకవేళ విజయానికి బదులు అపజయం ఎదురైన పక్షంలో, ఆ అనివార్య పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం ఎందుకు సంసిద్ధులై ఉండకూడదు?"* అనేదే ఆ ఆలోచన.

దీన్ని అమలు చేయడానికిగాను ఆయన (రజి), మహాప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నారు....; ↓

*"ఓ దైవప్రవక్తా! మేము తమ కోసం ఓ పందిరిని ఎందుకు వేయకూడదు? అందులో విశ్రాంతి తీసుకుంటూ యుద్ధాన్ని పర్యవేక్షించవచ్చు కదా? తమ దగ్గర వాహనాలను సైతం ఉంచుతాం. ఆ తరువాత మేము మా శత్రువుతో ఢీ కొంటాం. అల్లాహ్ మనకే గౌరవం ప్రాప్తం చేసి శత్రువుపై ఆధిక్యతను కలిగిస్తే సరేసరి. కాని, దానికి భిన్నమైన పరిస్థితి ఎదురైతే తమరు ఆ వాహనాన్ని ఎక్కి మదీనా వెళ్ళిపోవచ్చు. మాతో ఇక్కడికి రాలేకపోయిన వారు మదీనాలో ఉన్నారు. దైవప్రవక్తా (సల్లం)! నిజంగా వారు మిమ్మల్ని ప్రేమించే విషయంలో మాకంటే మేలైనవారు. యుద్ధం అనివార్యమైపోయిందని వారికి తెలిసి ఉంటే మాత్రం, వారు ఎన్నటికీ అక్కడ ఆగిపోయి ఉండేవారు కాదు. అల్లాహ్ మిమ్మల్ని వారి ద్వారా రక్షించగలడు. వారు మీ మేలు కోరేవారు. మీ వెంట జిహాద్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటారు."*

ఇది విన్న మహాప్రవక్త (సల్లం) ఆయన్ను మెచ్చుకొని దీవించారు. ముస్లిములు యుద్ధ మైదానం ఈశాన్య దిశగా ఓ ఎత్తయిన మట్టి తిన్నెపై ఆయన (సల్లం) కోసం ఓ పందిరి వేశారు. అక్కడి నుండి యుద్ధ మైదానం పూర్తిగా అగుపడుతుంది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి) గారి నేతృత్వంలో అన్సారులకు సంబంధించిన ఓ సైనిక పటాలాన్ని ఎంపిక చేశారు.

*సైన్యాన్ని క్రమబద్ధం చేసి రేయి గడపడం : -*

తదుపరి, దైవప్రవక్త (సల్లం) సైన్యాన్ని క్రమబద్ధీకరించారు. యుద్ధ మైదానానికి అరుదెంచి, తన చేతితో చూయిస్తూ...., *"రేపు ఫలానా వ్యక్తి ఇక్కడ మరియు ఫలానా వ్యక్తి అక్కడ హతుడవుతాడు ఇన్ షా అల్లాహ్, ఇది ఫలానా వ్యక్తి వధ్యస్థలం, అది ఫలానా వ్యక్తి వధ్యస్థలం ఇన్ షా అల్లాహ్."* అని చెబుతూ పోయారు.

అక్కడే ఓ చెట్టు బోదె దగ్గర కూర్చుని రాత్రి గడిపారు. ముస్లిముల హృదయాలు విశ్వాసంతో నిండిపోయి ఉన్నాయి. వారంతా ఉజ్వలమైన ఉదయం కోసం ఎదురు చూస్తూ గడిపారు. వారికి తెల్లారగానే తమ కళ్ళతో దైవం అవతరింపజేయబోయే శుభాలను చూస్తామనే నమ్మకం ఏర్పడింది. ఈ పరిస్థితిని దివ్యగ్రంథం "ఖుర్ఆన్" ఇలా వివరిస్తోంది....; ↓

*"తన తరఫున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి, షైతాను ప్రేరణలను మీనుండి పారద్రోలటానికీ, మీకు గుండె దిటవును కలిగించటానికి, మీ కాళ్ళకు నిలకడను ప్రసాదించటానికి ఆయన (ఆ సందర్భంగా) మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు." (ఖుర్ఆన్ 8:11).*

_(ఆ సమయంలో అల్లాహ్ వారికి ప్రసాదించిన మూడవ అనుగ్రహం ఏమిటంటే, వారు విడిది చేసిన ప్రదేశం వారికి అనువుగా ఉండేందుకు వర్షం కురిపించాడు. దాంతో వారు తహారత్, ఉజూ చేసి పరిశుభ్రత నొందడానికీ, బడలికను తీర్చుకోవడానికి వీలు కలిగింది. *"మీరు సజ్జనులైన దాసులై ఉండికూడా నీళ్ళకు దూరం అయిపోయారే!? అశుద్ధావస్థలో పోరాడితే మీకు విజయం ఎలా వర్తిస్తుంది?"* అని షైతాను పదే పదే ఆంతర్యంలో జనింపజేస్తున్న దుష్ప్రేరణలను పారద్రోలడానికి మంచి అవకాశం లభించింది.)_

ఈ రాత్రి శుక్రవారం, హిజ్రీ శకం - 2 రమజాన్ నెలకు చెందిన రాత్రి. దైవప్రవక్త (సల్లం) ఈ నెల 8 లేదా 12 వ తారీఖున మదీనా నుండి బయలుదేరారు.

*యుద్ధ రంగానికి మక్కా సైన్యం రాక - వారిలో పొడసూపిన పరస్పర మనస్పర్ధలు : -*

మరో వంక ఖురైషులు, లోయ ముఖ ద్వారం బయట తమ శిబిరంలో రేయి గడిపారు. ఉదయాన్నే తమ సైనిక పటాలాలతో మట్టి దిబ్బను దిగి బద్ర్ వైపునకు బయలుదేరారు. శత్రుసైన్యంలో దాహంతో ఉన్న కొంతమంది శత్రుసైనికులు, దైవప్రవక్త (సల్లం) గారు నిర్మించిన నీటి హౌజు వైపునకు కదిలి, ఆ నీటిని త్రాగడానికి ప్రయత్నించారు. కానీ, ముస్లిం సైనికులు వారిని పారద్రోలదలిచారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) వారిని వారిస్తూ...., *"వారిని త్రాగనివ్వండి. ఈ నీళ్ళు త్రాగిన ఏ శత్రువూ బ్రతికి బట్టకట్టలేడు."* అని అన్నారు.

కాని, ఆ నీటి హౌజు నుండి నీరు త్రాగిన ప్రతివాడు ఈ యుద్ధంలో చంపబడ్డాడు. ఒక్క "హకీమ్ బిన్ హిజామ్" తప్ప. అతను, ఆ తరువాత ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఓ ఉత్తముడైన ముస్లిముగా మారిపోయాడు. అతను ఎప్పుడైనా ఒట్టు వేసుకుంటే ఈ సంఘటనను గుర్తు చేసుకొని, *"నన్ను బద్ర్ యుద్ధం నుండి విముక్తునిగా చేసిన ఆ దైవం సాక్షి!"* అని ఒట్టు వేసుకునేవాడు.

మొత్తానికి ఖురైషులు అంతా స్థిమితపడ్డాక, మదీనా సైన్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి "ఉమైర్ బిన్ వహాబ్ జమ్'హీ"ని పంపించారు. ఉమైర్ గుర్రమెక్కి మదీనా సైన్యం చుట్టూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి...., *"ముస్లిం సైనికులు ఇంచుమించు మూడు వందల మంది దాకా ఉంటారు. కాని కొంచెం ఆగండి! వారికి ఎలాంటి సహాయం అయినా అందుతోందా లేదా, మరెక్కడైనా దాక్కొని ఉన్నారా చూసి వస్తాను."* అని చెప్పి తిరిగి తన గుర్రాన్ని దౌడు తీయించాడు.

ఆ విధంగా ఉమైర్, చాలా దూరం వరకు వెళ్ళినా అతనికి ఏదీ కనిపించలేదు. అతను తిరిగి వచ్చి ఖురైషులతో...., *"నాకు ఏమీ కనిపించలేదు. అయితే ఓ ఖురైష్ ప్రజలారా! నేను చావును మోసుకొని వచ్చిన పరిస్థితులను చూశాను. యస్రిబ్ ఒంటెలు వాటిపై స్వచ్ఛమైన మరణాలను మోసుకువచ్చాయి. వచ్చినవారి రక్షణ, మనుగడ, స్వయంగా వారి కరవాలాలే తప్ప మరేవీ కావు. దైవసాక్షి! నేను తలుస్తున్నట్లు వారి ఏ మనిషి అయినా మీ మనిషిని చంపనిదే చావడు. వారు మీ ప్రముఖులను ఏరికోరి చంపేస్తే, వారు మరణించాక జీవించి ఉండడం దండగ. అందుకని కాస్త నింపాదిగా ఆలోచించుకోండి."* అని అన్నాడు.

ఈ సమయంలో "అబూ జహల్"కు వ్యతిరేకంగా - కక్ష కట్టినవారు - ఓ క్రొత్త జగడాన్ని లేవదీశారు. ఈ వర్గం లేవనెత్తిన డిమాండు ప్రకారం, యుద్ధం చేయకుండానే మక్కాకు తిరిగిపోవాలి, అందుకని "హకీమ్ బిన్ హిజామ్"కు మంచి అవకాశం లభించింది. హకీమ్, ఉత్బా బిన్ రబీయా దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు....; ↓

*హకీమ్ : -* అబుల్ వలీద్! మీరు ఖురైషులకు చెందిన గౌరవనీయులైన పెద్ద మనిషి. ఆదేశ పాలనకు మీరు అర్హులైన సర్దారు కూడా. భవిష్యత్తులో మీరు, ఓ సత్కార్యం చేసిన వ్యక్తిగా ఎందుకు గుర్తించబడకూడదు ?

*ఉత్బా : -* హకీమ్! ఆ పని ఎలాంటిది? నన్నేం చేయమంటారు?

*హకీమ్ : -* మీరు, మీ వారిని వెనక్కు తీసుకొని వెళ్ళండి. మీ మిత్రపక్షానికి చెందిన అమ్రూ బిన్ హజ్రమీ వ్యవహారం (నఖ్లా సరియ్యాలో చంపబడిన వాడు) మీ నెత్తిన వేసుకోండి.

*ఉత్బా : -* సరే, అది నాకు సమ్మతమే. నావైపు నుండి పూచీ తీసుకోండి. అతను నా మిత్రపక్షంలోని వాడు. అతని రక్తపరిహారం కూడా నేనే భరిస్తాను. ఆ సరియ్యాలో వారు పోగొట్టుకున్న ధనానికి బాధ్యత కూడా నాదే. కాబట్టి హకీమ్, మీరు హున్జలియా కుమారుని దగ్గరకు వెళ్ళండి _(హున్జలియా, అబూ జహల్ తల్లి గనుక అతణ్ణి ఈ విధంగా సంబోధించడం జరిగింది)_. అతను వ్యవహారాలను చెడగొట్టడంలో, ప్రజలను ఉసిగొల్పడంలో మహా దిట్ట. అందుకని అతని నుండే నాకు శంక ఉంది.

ఆ తరువాత "ఉత్బా బిన్ రబీయా" నిలబడి, ఖురైష్ సైన్యాన్ని ఉద్దేశించి ఉపన్యసిస్తూ...., *"ఖురైష్ ప్రజలారా! మీరు ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన సహచరులతో యుద్ధం చేసి ఎలాంటి ఘనకార్యాన్ని నిర్వహించలేరు. దైవసాక్షి! మీరే గనక వారిని చంపేస్తే, మీకు ఎదురుపడే ముఖాలను మీరు చూడడానికైనా సిద్ధపడరు. ఎందుకంటే, మనిషి తన పినతండ్రి కుమారులను గాని, పిన్నమ్మ కుమారులను గాని, తమకే చెందిన కుటుంబసభ్యున్ని గాని చంపితే అది గొప్పతనమవుతుందా? అందుకని వెనక్కు వెడదాం పదండి. ముహమ్మద్ (సల్లం) మరియు అరేబియా జోలికే పోకండి. అరబ్బులే గనుక వారిని చంపితే, మీరు అనుకున్నది నెరవేరినట్లే. అలా జరగకపోతే, ముహమ్మద్ (సల్లం)తో ప్రవర్తించవలసిన తీరుగా ప్రవర్తించనందుకు దోషులైపోగలరు."* అని తన మాటలను వినిపించాడు.

ఇటు హకీమ్ బిన్ హిజామ్, అబూ జహల్ దగ్గరకు వెళ్ళినప్పుడు, అబూ జహల్ తన కవచాన్ని సరిచేసుకుంటున్నాడు. అతణ్ణి చూసి హకీమ్ ఇలా అన్నాడు...., *"ఓ అబుల్ హకం! ఉత్బా నన్ను మీ దగ్గరకి ఈ సందేశాన్నిచ్చి పంపించాడు."* అని, పై విషయం అంతా విశదీకరించాడు.

అది విన్న అబూ జహల్ అరికాలి మంట నెత్తికెక్కింది. ↓

*"దైవసాక్షి! ముహమ్మద్ (సల్లం) మరియు అతని సహచరుల్ని చూసి ఉత్బా గుండెలు అవిశిపోయాయి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. దైవసాక్షి! మేము వెనక్కు మల్లేదే లేదు. అల్లాహ్, మనకూ ముహమ్మద్ (సల్లం)కు నడుమ ఏదైనా తీర్పునిస్తే తప్ప. ఉత్బా అలా ప్రేలడానికి గల కారణం అతను ముహమ్మద్ (సల్లం)ను, అతని సహచరుల్ని ఒంటె భక్షకులుగా తలచడమే. ఉత్బా కుమారుడు కూడా ముహమ్మద్ (సల్లం) సైన్యంలో ఉన్నందుకే అతను మిమ్మల్ని బెదరగొడుతున్నాడు.*

_(ఉత్బా కుమారుడు "అబూ హజీఫా బిన్ ఉత్బా" ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించినవారిలో ఉన్నారు. మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినవారు)._

ఉత్బా, అబూ జహల్ చెప్పిన మాటల్లో, *"దైవసాక్షి! ఉత్బా గుండెలు అదిరిపోయాయి"* అనే మాట వినగానే; ఉత్బా, *"ఓహో ఆ పిరుదల నుండి పాదాలు తీసినవానికి (లేదా పిరుదలపై అత్తరు పూసుకున్నవానికి) ★ త్వరలోనే తెలుస్తుంది. ఎవరి గుండెలు అవిశిపోతున్నాయో?"* అని చిందులేశాడు.

_(★ → ఇది అరబిక్ సామెత. అంటే, అమాయకుడు లేదా పిచ్చివాడు అని అర్థం)_

అబూ జహల్ కు, ఈ సంక్షోభం ముదిరిపోతుందనే భయం పట్టుకుంది. వెంటనే "ఆమిర్ బిన్ హజ్రమీ"ని (ఇతను సరియ్యా బిన్ హజాష్ లో మరణించిన అమ్రూ బిన్ హజ్రమీ సోదరుడు) పిలిపించి...., *"మీ మిత్రపక్షం అయిన ఉత్బా మిమ్మల్ని వెనక్కు తీసుకొనిపోవడానికి చూస్తున్నాడు. మేము మీ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోజూస్తున్నామో మీకు తెలుసు. కాబట్టి లేచి నిలబడండి. మీ సోదరుని మరణాన్ని గుర్తు చేసుకోండి."* అని అన్నాడు.

ఇది విన్న ఆమిర్ కు పౌరుషం ముంచుకొచ్చింది. కట్టుకున్న వస్త్రాన్ని విప్పేసి నగ్నంగా నిలబడి...., *"అయ్యో అమ్రూ ! అయ్యో అమ్రూ!"* అంటూ అరిచాడు. దీనికి అతని తెగ వారు మరింత రెచ్చిపోయారు. వారి వైఖరి మరింత కఠినంగా మారిపోయింది. యుద్ధం చేసే కోరిక మరింత హెచ్చింది. ఉత్బా చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. ఈ ప్రయత్నం విఫలం అయిపోయింది.

*ఎదురెదురుగా నిలబడిన రెండు సైనిక దళాలు : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment