206

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 206            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 121*     
*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం*
*బద్ర్ సంగ్రామం : - 5*
*శత్రువు ఆచూకీ తెలుసుకునే ప్రథమ ప్రయత్నం : -*
దైవప్రవక్త (సల్లం) "బద్ర్" చేరిన తర్వాత, సౌర్ గుహ సహచరి అయిన తన మిత్రుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)"ను వెంట తీసుకొని శత్రువు ఆచూకీ తెలుసుకోవడానికి స్వయంగా బయలుదేరారు. దూరంగా ఉండి మక్కా సైనికదళాన్ని పరిశీలించేటప్పుడు ఓ ముసలి అరబ్బు వారికి తారసపడ్డాడు. 
శత్రువుల ఆచూకీ తెలుసుకునేందుకు దైవప్రవక్త (సల్లం), ఆ ముసలి అరబ్బుతో...., *"ఖురైషీయుల సైన్యం మరియు ముహమ్మద్ మరియు ఆయన (సల్లం) సైన్యం వివరాలేమిటో చెప్పండి?"* అని అడిగారు

_(దైవప్రవక్త (సల్లం), రెండు దళాలను గురించి అడగడంలోని ఔచిత్యం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లం) వ్యక్తిత్వం ఆ ముసలి అరబ్బుకు తెలియకుండా ఉండాలన్నదే.)_

కాని ఆ ముసలి అరబ్బు...., *"మీరు ఏ జాతికి చెందిన వారో తెలిపితేనే చెబుతాను."* అని అన్నాడు.

దానికి మహాప్రవక్త (సల్లం)...., *"అలా కాదు నీవే ముందు ఎవరివో చెబితే నేను చెబుతాను."* అన్నారు.

*"ఓహో ! ఇది బదులుకు బదులా !"* అన్నాడు ముసలివాడు.

*"ఔను."*

*"నాకు తెలిసినంత మట్టుకు ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన అనుచరులు ఫలానా రోజున బయలుదేరారు. చెప్పేవాడు గనక ఆ విషయం సరిగ్గా చెప్పి ఉంటే ఇప్పడు ముహమ్మద్ (సల్లం) ఫలానా చోట ఉండి ఉంటారు."* - అని చెప్పి, ప్రస్తుతం ముస్లిముల సైన్యం ఉన్న చోటు గురించి చెప్పాడు - అలాగే ఖురైషీయులు సైన్యం గురించి చెబుతూ...., *"ఖురైషులు కూడా ఫలానా చోట విడిది చేసి ఉంటారు."* - అని చెప్పి, ప్రస్తుతం ఖురైషులు సైన్యం ఉన్న చోటునే చూయించాడతడు.

ముసలివాడు తన మాటను పూర్తి చేసి...., *"మీరెవరో చెప్పారు కాదు?"* అని అడిగాడు.

దానికి దైవప్రవక్త (సల్లం)...., *"మేము ఒకే నీటికి సంబంధించిన వారము."* అని వెనక్కు మళ్ళిపోయారు.

*"ఒకే నీళ్ళా? అంటే ఇరాక్ నీళ్ళా?"* అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు.

*మక్కా సైన్యం గురించి అందిన ముఖ్యవార్తలు : -*

ఆ రోజు సాయంత్రమే ప్రవక్ర శ్రీ (సల్లం), శత్రుజాడను తెలుసుకోవడానికి ఓ క్రొత్త వేగుల బృందాన్ని పంపించడం జరిగింది. ఈ కార్యం నెరవేర్చుకు రావడానికి ఈ బృంద సభ్యులుగా ముహాజిర్లయిన "హజ్రత్ అలీ (రజి)", "జుబైర్ బిన్ అవామ్ (రజి)" మరియు "సఅద్ బిన్ అబీ విఖాస్ (రజి)"లు వెళ్ళారు.

వీరు నేరుగా బద్ర్ నీటి చెలమ వద్దకు వెళ్ళగా, అక్కడ ఇద్దరు బానిసలు మక్కా సైన్యం కోసం నీరు నింపడం చూశారు. ముహాజిర్లు వెంటనే వారిద్దరిని బంధించి, దైవప్రవక్త (సల్లం) సన్నిధికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రవక్త శ్రీ (సల్లం) నమాజు చేస్తున్నారు.

సహాబా (రజి), ఆ ఇద్దరు బానిసలను ప్రశ్నించనారంభించారు. వారు, *"మేము ఖురైషులకు నీరు త్రాగించే బానిసలము, మమ్మల్ని నీళ్ళ కోసం వారు పంపించారు."* అని చెప్పారు.

ఈ సమాధానం సహాబా (రజి)కి రుచించనందున వారిని చితకబాదారు. వీరిద్దరూ "అబూ సుఫ్'యాన్" మనుషులనుకుంటున్నారు వారు - ఎందుకంటే, ఇంకా ఆ వర్తక బిడారాన్ని సొంతం చేసుకోవాలనే ఆశ వారిలో ఉంది కాబట్టి - సహాబా (రజి) వారిని కొట్టి విషయం రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఆ దెబ్బలకు తాళలేక, *"మేము అబూ సుఫ్'యాన్ మనుషులమే!"* అని అనగానే కొట్టడం ఆపేసేవారు.

దైవప్రవక్త (సల్లం) నమాజు పూర్తి చేసుకుని కొంత కోపంగా...., *"వీరిద్దరు నిజం పలుకుతూ ఉంటే మీరు వారిని బాదుతున్నారు, అబద్ధమాడితే వదిలేశారు. దైవసాక్షి! వీరిద్దరు చెప్పేదే సరైనది. వీరు ఖురైష్ ల మనుషులు."* అన్నారు.

ఆ తరువాత ఆయన (సల్లం) ఆ ఇద్దరు బానిసలతో, ఖురైష్ సైన్యం గురించి ఇలా అడిగారు....;

*ముహమ్మద్ (సల్లం)" : -* సరే, మీరిప్పుడు ఖురైషీయుల గురించి చెప్పండి!

*బానిసలు : -* ఈ లోయ ముఖ ద్వారం చివర ఉన్న ఆ మట్టి దిబ్బ వెనుకే ఖురైషు సైన్యం విడిది చేసి ఉంది.

*ముహమ్మద్ (సల్లం) : -* ఎంత మంది వరకు ఉంటారు ఆ సైన్యంలో?

*బానిసలు : -* ఓ! చాలా మంది ఉన్నారు.

*ముహమ్మద్ (సల్లం) : -* వారి సంఖ్య ఎంతై ఉంటుంది?

*బానిసలు : -* మాకు తెలియదు.

*ముహమ్మద్ (సల్లం) : -* సరే, రోజుకు ఎన్ని ఒంటెలు తెగుతున్నాయి?

*బానిసలు : -* ఓ రోజు తొమ్మిది, మరో రోజు పది వరకు తెగుతున్నాయి.

*ముహమ్మద్ (సల్లం) : -* ఓహో, అయితే వారి సంఖ్య తొమ్మిది మరియు పది వందలకు మధ్యన ఉంటుంది.

అపుడు మహాప్రవక్త (సల్లం), తన అనుచరుల వైపు తిరిగి ఇలా అన్నారు....; ↓

*"మీ కంటే మూడు రెట్లు అధికంగా ఉన్న శత్రువులతో మీరు పోరాడవలసి ఉంది. అధైర్యపడకండి. జయాపజయాలు దైవాధీనం. దేవుని మీద భారం వేసి యుద్ధానికి సిద్ధంగా ఉండండి."* అని ధైర్యాన్నిచ్చారు.

ఆ తర్వాత బానిసల వైపు చూస్తూ....; ↓

*ముహమ్మద్ (సల్లం) : -* వారిలో ఖురైషులకు చెందిన సర్దారులు, ధనవంతులు ఎవరెవరున్నారు? (అని అడిగారు)

*బానిసలు : -* రబీయా ఇద్దరు కుమారులు ఉత్బా మరియు షైబా, అబుల్ బక్తరీ బిన్ హష్షామ్, హకీమ్ బిన్ హిజామ్, నౌఫిల్ బిన్ ఖువైలిద్, హారీస్ బిన్ ఆమిర్, తఅయిమా బిన్ అద్దీ, నజ్ర్ బిన్ హారీస్, జమ్ఆ బిన్ అస్వద్, అబూ జహల్ బిన్ హష్షామ్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్. (అంటూ మరికొందరి పేర్లు కూడా చెప్పారు)

మహాప్రవక్త (సల్లం), సహాబా (రజి) వైపు తిరిగి...., *"చూశారా! మక్కా తన హృదయ శకలాలను (గౌరవనీయులైన సర్దారులను) మీ ముందుకు తెచ్చి పడేసింది."* అని అన్నారు.

*దైవకారుణ్యం (వర్షం) కురిసిన వేళ : -*

సూర్యుడు అస్తమించాడు. అరుణ రేఖలు మటుమాయమై నక్షత్రాలు ఒక దాంతో ఒకటి పోటీ పడుతూ శరవేగంతో ప్రత్యక్షం కాసాగాయి. ముస్లిం యోధులు చేయవలసిన పనులన్నీ చేసిన తరువాత అందరూ నిద్రలోకి ఒరిగిపోయారు. కాస్సేపటికి అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమయ్యింది.

దాంతో సైనికులంతా మేల్కొన్నారు. చకచకా నేల మీద చిన్నచిన్న మళ్ళు చేసి వర్షపునీటిని ఆపుకున్నారు. ఇసుక నేల కావడంవల్ల పొడిపొడిగా ఉన్న ఇసుకంతా పేరుకొని నేల గట్టిపడింది. ఇప్పుడు సులభంగా తిరగడానికి నేల అనుకూలంగా మారింది.

అయితే ఖురైషీయులు శిబిరాలు వేసుకున్న మట్టి ప్రదేశం బురద బురదగా మారింది. వారు, తమకు అనుకూలంగా ఉందనుకున్న గట్టినేల చివరకు ఇలా రోతగా తయారయింది. పైగా అది జారుతూ కాలు తీసి పెట్టాలంటే భయంగా ఉంది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి శత్రువులు కంగారుపడసాగారు.

_(తర్వాతి రోజు)_

*ఖురైషు సైనిక కేంద్రాల వైపునకు కదిలిన ముస్లిములు : -*

ముష్రిక్కులకంటే ముందే బద్ర్ నీటి చెలమ వద్దకు చేరాలని, వారు దాన్ని హస్తగతం చేసుకోకుండా చేయడానికి, మహాప్రవక్త (సల్లం) తమ సేనలను ముందుకు కదిలించారు. అలా ఆయన (సల్లం) "ఇషా" సమయం అయ్యేటప్పటికల్లా చెలమల్లోని ఓ సమీప చెలమకు చేరిపోయారు. ఈ సందర్భంగా "హజ్రత్ హబ్బాబ్ (రజి) బిన్ మున్జిర్" ఓ అనుభవజ్ఞుడైన సైన్యాధ్యక్షునిగా దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి ఇలా అడిగారు....; ↓

*హబ్బాబ్ (రజి) : -* దైవప్రవక్తా (సల్లం)! తమరు ఈ ప్రదేశం వద్దకు అల్లాహ్ ఆదేశం మేరకు వచ్చారా? లేదా యుద్ధనీతి ప్రకారమా? ఇక్కడి నుండి మనం వెనక్కుగానీ ముందుకుగానీ వెళ్ళే అవకాశం ఉండదు మరి.

*ముహమ్మద్ (సల్లం) : -* లేదు, మనం ఇక్కడకు వచ్చింది యుద్ధనీతిని అనుసరించే!

*హబ్బాబ్ (రజి) : -* ఇది సరియైన స్థలం కాదు. తమరు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఖురైషులకు దాపులో ఉన్న చెలమ దగ్గరకు వెళ్ళి ఆగాలి. ఆ తరువాత మనం తక్కిన చెలమలన్నింటిని పూడ్చేద్దాం. మన చెలమ దగ్గర ఒక తొట్టి కట్టి అందులో నీరు నిలువ ఉంచుకోవాలి. ఆ తరువాత మనం ఖురైషులతో యుద్ధం ప్రారంభించినప్పుడు మనకు త్రాగడానికి నీరు లభిస్తుంది. వారికి మాత్రం నీరు కరువైపోతుంది.

అద్భుతమైన ఈ సలహా విని దైవప్రవక్త (సల్లం), హబ్బాబ్ (రజి)తో...., *"హబ్బాబ్ (రజి)! నీవు సరైన సలహానే ఇచ్చావు."* అని అన్నారు.

ఆ తర్వాత మహాప్రవక్త (సల్లం), తమ సైన్యాన్ని వెంటబెట్టుకొని రాత్రి నడిఝాముకు శత్రు శిబిరం దాపులోని ఓ చెలమ దగ్గరకు చేరిపోయారు. అక్కడ సహాబా (రజి) ఓ హౌజు కట్టి తక్కిన చెలమన్నింటినీ పూడ్చేశారు.

*యుద్ధ పర్యవేక్షణా కేంద్రం : -*

సహాబా (రజి) నీటి చెలమ దగ్గర విడిది చేయగానే, "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)" మదిలో మరో ఆలోచన వచ్చింది. యుద్ధాన్ని పర్యవేక్షిస్తూ, సైన్యానికి ఆదేశాలు జారీ చేయడానికిగాను మహాప్రవక్త (సల్లం) కోసం ఓ ప్రత్యేక స్థలాన్ని ఎందుకు ఎంచుకోకూడదు?....

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment