205

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 205            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 120*     

*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 

*బద్ర్ సంగ్రామం : - 4* 

*సత్యాసత్యాల మధ్య సంకుల సమరం : -*

మదీనాలో ముస్లింలు యుద్ధ సన్నాహాలలో నిమగ్నులైపోయారు. కానీ, చాలీచాలని వనరులతో ఖురైషీయులతో తలపడటం అంటే సామాన్యమా? సైనికులందరికీ కలిపి మూడు గుర్రాలు, డెబ్భై ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఒంటె మీద ముగ్గురు నలుగురు చొప్పున కూర్చోవలసి వచ్చింది. దైవప్రవక్త (సల్లం) కూర్చున్న ఒంటె మీద కూడా మరో ఇద్దరు యోధులు కూర్చున్నారు. అప్పటికీ వాహనాలు సరిపడక అనేకమంది కాలినడకన బయలుదేరారు.

ఆయుధాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఖడ్గం ఉంటే బల్లెం లేదు; బల్లెం ఉంటే ఖడ్గం లేదు. ధనుర్భాణాలు కూడా తగినన్ని లభించలేదు. అంతేకాదు, అనేకమంది యోధులు కడుపునిండా తిండి లభించని కారణంగా బక్కచిక్కిన శరీరాలతో సన్నగా కూడా ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో యుద్ధరంగంలో దిగడం అంటే మృత్యువుని కొనితెచ్చు కోవడమే.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లాం రక్షణ కోసం ఖడ్గం చేపట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందువల్ల దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరులు దైవం మీద భారం వేసి హిజ్రీశకం 2 వ సంవత్సరం రమజాన్ నెలలో రణరంగానికి బయలుదేరారు.

వారంతా మదీనా పొలిమేరలు దాటినా తర్వాత, దైవప్రవక్త (సల్లం) ఓసారి సైనికులందర్నీ పరిశీలించారు. సైన్యంలో 13, 14 ఏండ్ల బాలయోధులు కూడా ఉన్నారు.

*"పిల్లలు యుద్ధంలో పాల్గొనడం మంచిది కాదు. వారంతా పట్టణం తిరిగి వెళ్ళిపోవాలి."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఈ మాట విని పిల్లలు నిరుత్సాహపడ్డారు. అయినా వారు నిరాశ చెందలేదు.

*"అయితే మేము జిహాద్ పుణ్యం కోల్పోవలసిందేనా?"* అన్నాడు ఒక బాలుడు.

*"మీరింకా పిన్న వయసులో ఉన్నారు. యుద్ధజ్వాలలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీకింకా తెలియదు. వాటి దగ్గరకు వెళ్ళిన ప్రతి వ్యక్తినీ అవి దహించవేస్తాయి."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

*"మేము దైవప్రసన్నత పొందడానికి మాత్రమే ఈ యుద్ధంలో పాల్గొంటున్నాము. యుద్ధజ్వాలల్లో దూకడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాటికి ఆహుతి అయి అమరగతి నొందితే మాకు స్వర్గం లభించదా?"* (అన్నాడు ఆ బాలుడు.)

*"తప్పకుండా లభిస్తుంది బాబూ! కాని, ఆ యుద్ధజ్వాలలు చూసి మీరు భయపడిపోతారేమో ఆలోచించుకోండి."* అని ప్రవక్త (సల్లం) సమాధానం.

*"దైవప్రవక్తా! మీరా విషయం గురించి ఆందోళన చెందకండి. మేమలా భయపడే వాళ్ళం కాము."* అన్నాడు మరో పిల్లవాడు.

*"ఔను దైవప్రవక్తా! సమరోత్సాహం మా నరనరాల్లో వ్యాపించి ఉంది. మేము యుద్ధ తీవ్రత చూసి భయపడి పారిపోయే పిరికిపందలం కాము. మా ఊపిరి పోయే వరకు పోరాడే వీరయోధులం."* అన్నాడు వేరొక పిల్లవాడు.

*"నా ప్రియతమ బాలయోధులారా! మీ సమరోత్సాహానికి నేను అభినందిస్తున్నాను. ప్రతి ముస్లింలో ధర్మయుద్ధం పట్ల ఇలాంటి ఆసక్తి, ఉత్సాహాలు ఉండవలసిందే. అంతర్యాలలో ఉండే ఈ సమరోత్సాహమే ఇస్లాం పట్ల ధృఢవిశ్వాసానికి ప్రబల నిదర్శనం. కాని, మనం ఇప్పుడు చేయబోతున్న యుద్ధం తొలియుద్ధం. దీని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకని మీరు పట్టణం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది."* అన్నారు దైవప్రవక్త (సల్లం) పరిపరి విధాల నచ్చజెబుతూ.

*"దైవప్రవక్తా! మేము మీ ఆజ్ఞ శిరసావహిస్తాం. కాని, తిరిగి వెళ్ళిపోవాలంటే మాకు చాలా బాధగా ఉంది."* అన్నారు కొందరు పిల్లలు.

దైవప్రవక్త (సల్లం) ధర్మయుద్ధం పట్ల పిల్లల హృదయాల్లో ఉన్న ఆసక్తి చూసి చాలా ఆశ్చర్యపోయారు. కాస్సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక ఈటె తీసుకుని దానిపై ఒక గుర్తు పెట్టారు.

*"అయితే ఒక పని చేద్దాం. నా చేతిలో ఉన్న బల్లెం మీద ఈ గుర్తు చూశారా? ఈ గుర్తు వరకు పొడుగ్గా ఉన్న పిల్లల్ని మాత్రమే సైన్యంలో భర్తీ చేసుకుంటాం. మిగిలిన పిల్లలు తిరిగి వెళ్ళిపోవాలి."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"ఆ.... అలాగే చేయండి దైవప్రవక్తా!"* అన్నారు పిల్లలు ముక్తకంఠంతో.

*"సరే మీరంతా కాస్త ముందుకు రండి."*

ఈ ఆదేశం వినగానే దాదాపు 60 మంది పిల్లలు సైనిక పంక్తుల్లో నుంచి బయటికి వచ్చి దైవప్రవక్త (సల్లం) ముందు నిలబడ్డారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఒక్కొక్క బాలుడి పక్కన ఈటె నిలబెట్టి అతని పొడవు కొలిచి చూడటం మొదలు పెట్టారు. ఈటె మీదున్న గుర్తు వరకు పొడవున్న పిల్లల్ని వదిలి, ఆ గుర్తు వరకు పొడవురాని పిల్లల్ని పక్కకు తీస్తున్నారు.

అప్పుడు ఒక పిల్లవాడు తన ఎత్తు కొంచెం తక్కువ ఉన్నట్లు భావించి, పాదాల మునివ్రేళ్ళపై నిల్చున్నాడు.

దైవప్రవక్త (సల్లం) అది గమనించి చిరునవ్వు నవ్వారు. దైవప్రసన్నత కోసం ధర్మయుద్ధంలో పాల్గొనే ఉద్దేశ్యంతో ఆ అబ్బాయి చూపిన అతి తెలివికి ఆయన (సల్లం) అబ్బురపడ్డారు.

*"అబ్బాయ్! నీ అతితెలివి ఎంతో ప్రశంసనీయమైనది. నీ హృదయంలో ఎగిసిపడుతున్న సమరోత్సాహమే నిన్ను ఈ అతితెలివికి పురిగొల్పింది. అంచేత నువ్వు సైన్యంలో చేరడానికి అనుమతిస్తున్నాను."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

దైవప్రవక్త (సల్లం) నోట ఈ మాట వినగానే ఆ పిల్లవాడు, తనకు గొప్ప నిధి ఏదో లభించినట్లు పట్టరాని సంతోషంతో గంతులేస్తూ సైన్యంలోకి పరిగెత్తాడు.

ఆ తరువాత మరికొందరు పిల్లలు కూడా అతడ్ని అనుసరిస్తూ కాలి మునివ్రేళ్ళ మీద నిలబడ్డారు. కాని, వారిలో చాలా మంది పిల్లల పొడవు ఈటె మీదున్న గుర్తు దాకా రాలేదు. అందువల్ల అలాంటి పిల్లలు నిరుత్సాహంతో పట్టణం తిరిగి వెళ్ళిపోయారు.

అలా పంపగా మొత్తం యోధులు 313 మంది మిగిలారు. వీరిని తీసుకుని దైవప్రవక్త (సల్లం) అక్కడ్నుంచి బయలుదేరారు.

*ఇస్లామీయ సైనికదళం సాగించిన మిగతా ప్రయాణం : -*

అలా ముందుకు సాగుతూ, ఇస్లామీయ సైనికదళం పగలంతా ప్రయాణం చేసి చీకటి పడే సమయానికి "రౌహా" అనే ప్రదేశం చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే మజిలీ చేశారు. దైవప్రవక్త (సల్లం) ఉజూ చేసి నమాజ్ చేయడంలో నిమగ్నులైపోయారు. చివరి రుకూ తర్వాత ఆయన (సల్లం) అవిశ్వాసుల్ని శపిస్తూ, *"దేవా! అబూ జహల్ ఈనాటి సమాజానికి ఫిరౌన్ లాంటివాడు. అతడ్ని సజీవంగా వదిలిపెట్టకు."* అని ప్రార్థించారు.

ఇక ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరుతూ "బద్ర్" చేరుకున్నారు.

_(ఇటు మరో ప్రక్క, ముస్లిముల ప్రత్యర్థులైన మక్కా అవిశ్వాసులు, దాదాపు వెయ్యి మంది సైనికబలగంతో తమ బలపరాక్రమాలను ప్రదర్శిస్తూ, "బద్ర్" దాపుకు చేరి ఒక చిన్న మట్టి దిబ్బ వెనుక ఆగిపోయారు. ఈ మట్టి తిన్నె "బద్ర్" లోయ ప్రక్కన దాని దక్షిణ ముఖద్వారం వద్ద ఉంది.)_

*శత్రువు ఆచూకీ తెలుసుకునే ప్రథమ ప్రయత్నం : -*

దైవప్రవక్త (సల్లం) "బద్ర్" చేరిన తర్వాత, సౌర్ గుహ సహచరి అయిన తన మిత్రుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)"ను వెంట తీసుకొని శత్రువు ఆచూకీ తెలుసుకోవడానికి స్వయంగా బయలుదేరారు. దూరంగా ఉండి మక్కా సైనికదళాన్ని పరిశీలించేటప్పుడు ఓ ముసలి అరబ్బు వారికి తారసపడ్డాడు. దైవప్రవక్త (సల్లం), అతడితో...., *"ఖురైషీయుల సైన్యం మరియు ముహమ్మద్ మరియు ఆయన (సల్లం) సైన్యం వివరాలేమిటో చెప్పండి?"* అని అడిగారు. _(ఇక్కడ, రెండు దళాలను గురించి అడగడంలోని ఔచిత్యం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లం) వ్యక్తిత్వం ఆ ముసలి అరబ్బుకు తెలియకుండా ఉండాలన్నదే.)_

ఇందుకు ఆ ముసలి అరబ్బు సమాధానం...., ↓

*In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment