204

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 204            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 119*    

*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 

 *బద్ర్ సంగ్రామం : - 3* 

మహాప్రవక్త (సల్లం) అలా ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఉన్న "జఫ్రాన్" లోయగుండా వెడుతున్నారోలేదో, మదీనా నుండి వర్తక బిడారం మరియు అటు మక్కా నుండి వస్తున్న సైన్యం గురించి వర్తమానం అందింది. (అంటే, మక్కా అవిశ్వాసులు మదీనాపై దాడిచేయడానికి బయలుదేరారనే వర్తమానం, దైవప్రవక్త (సల్లం)కు అందింది.)

ఈ వర్తమానాన్ని లోతుగా అధ్యయనం చేసిన తరువాత ఇక ఓ భీకర పోరాటం తప్పదనే నిర్ణయానికి వచ్చారాయన (సల్లం). ఇప్పుడు ధైర్యసాహసాలు, తెగింపును ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని తలిచారు.

ఉపద్రవం మెరుపు వేగంతో ముంచుకొస్తోంది. ఈ పరిస్థితులో దుష్టులను ధైర్యంగా ఎదుర్కోకపోతే ఇస్లామీయ ఉద్యమం శాశ్వతంగా నిర్వీర్యమైపోతుంది. మదీనాలో ముహాజిర్ల జీవన పరిస్థితులు మెరుగుపడలేదు. అటు అన్సారులకు ధార్మిక జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకొని సుశిక్షితులయ్యే అవకాశం ఇంకా సరిగా లభించలేదు.

మరోవైపు యూదులు, హద్దుమీరిన విరోధంతో కత్తులు నూరుతున్నారు. అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ముస్లింలుగా నటిస్తున్న వంచకులు. వీరు ముస్లింలలో కలిసి ఉంటూ క్షణానికో రంగు మారుస్తూ చీడపురుగుల్లా అంతర్గత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖురైషీయులు మదీనాపై దాడిచేస్తే ప్రస్తుతం ఉన్న కొద్దిమంది ముస్లింలు అంతమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ వారు మదీనాపై దాడి చేయకుండా సైనిక బలప్రదర్శనతో తమ వాణిజ్య బృందాన్ని తప్పించి సురక్షితంగా తీసుకెళ్లినా, ముస్లింలు తమ ప్రత్యర్థుల్ని ఎదుర్కోలేని పిరికిపందలని దేశంలో అపహాస్యంపాలు కావలసివస్తుంది. వారి ప్రభావం పూర్తిగా అడుగంటిపోతుంది.

అక్కడితో ఆ విషయం ఆగిపోదు. మదీనా దరిదాపుల్లో ఉన్న తెగలన్నీ ఖురేషియుల అండతో ముస్లింల మీద విజృంభిస్తాయి. మదీనాలో ఉన్న బహుదైవారాధకులు, యూదులు, కపట ముస్లింలు స్వైరవిహారం చేస్తారు. అప్పుడు ముస్లింలకు ఊపిరి పీల్చుకోవడం కూడా దుర్భరమవుతుంది.

పరిస్థితులు ఇలా హఠాత్తుగా మారిపోయినందున మహాప్రవక్త (సల్లం) ఓ ఉన్నత సైనిక సలహా సంఘాన్ని సమావేశపరిచారు. ఈ సమావేశంలో ఎదురైన పరిస్థితిని గురించి వివరించి వారి సలహాలను అడిగారు. ఈ సందర్భంలో ముస్లిముల్లోని ఓ వర్గం భీకర యుద్ధం మాట వినగానే కంపించిపోయింది. వారి గుండెలు గడగడలాడాయి. వారి ఈ పరిస్థితినే వివరిస్తూ దివ్యగ్రంథం ఇలా అంటోంది....; ↓

*"నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం గురించి - అది సత్యమని స్పష్టం అయిన తరువాత కూడా - తాము మృత్యువు వైపుకు తరుమబడుతున్నట్లు, దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే (భీతిల్లి) నీతో వాదులాటకు దిగారు." (ఖుర్ఆన్ 8:5,6).*

కాని, సైన్యాధ్యక్షుల విషయానికి వస్తే, వీరిలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" లేచి నిలబడి ఎంతో సమంజసమైన మాటలు పలికారు. ఆ తరువాత "హజ్రత్ ఉమర్ (రజి)" లేచారు, ఆయన కూడా మేలైన పలుకులే పలికారు. ఆ తరువాత "హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రూ (రజి)" లేచి...., *"ఓ దైవప్రవక్తా (సల్లం)! అల్లాహ్ తమకు ఏ మార్గమైతే చూపించాడో, ఆ మార్గం పైన్నే మీరు నడవాలి. మేము మీ వెంటే ఉంటాము. దైవసాక్షి! మేము, హజ్రత్ మూసా ప్రవక్త (అలైహి)తో బనీ ఇస్రాయీల్ ప్రజలు, "ఓ మూసా! నీవూ, నీ ప్రభువు ఉభయులూ పోయి పోరాడండి. మేము ఇక్కడే కూర్చొని ఉంటాము" అని పలికినట్లు పలకము. మేము చెప్పేదల్లా, మీరు, మీ ప్రభువు ఉభయులూ వెళ్ళి పోరాడండి. మేము కూడా మీ వెంటే ఉండి పోరాడుతాం. తమరిని (సల్లం) సత్యంతో ప్రభవింపజేసిన ఆ అల్లాహ్ సాక్షి! ఒకవేళ మీరు మమ్మల్ని 'బర్కె గిమాద్' వరకు తీసుకువెళ్ళినా, మేము దారంతా పోరాడుతూనే మీ వెంట అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధమే."* అని అన్నారు.

ఈ మాటలను విన్న దైవప్రవక్త (సల్లం) వారిని దీవించడం, వారి కొరకు "దుఆ" చేయడం జరిగింది.

(హజ్రత్ అబూ బక్ర్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి) మరియు హజ్రత్ మిగ్దాద్ (రజి)) ↓

ఈ ముగ్గురూ ముహాజిర్లే. వీరి సంఖ్య ఆ సైన్యంలో తక్కువ. దైవప్రవక్త (సల్లం), అన్సార్ ల సలహా కూడా తెలుసుకోదలిచారు. ఎందుకంటే వారి సంఖ్య అధికం, యుద్ధం అసలు భారం వారి భుజస్కంధాలపైన్నే పడనుంది. 'బైతె అక్బా' ప్రకారం వారు మదీనా నుండి బయటకు వచ్చి యుద్ధం చేయాలని లేదు. అందుకని ఆయన (సల్లం) ఆ ముగ్గురు సర్దారుల మాటలు విన్న తరువాత...., *"ప్రజలారా! మీరు కూడా నాకు సలహా ఎందుకివ్వరూ?"* అని అడిగారు. అంటే, అన్సారుల నోట కూడా ఏదైనా వినదలచుకున్నారాయన (సల్లం).

ఈ విషయాన్ని, అన్సారులకు చెందిన ధ్వజవాహకుడు అయిన "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)" గుర్తించి దైవప్రవక్త (సల్లం)తో...., *"దైవసాక్షి! ఓ దైవప్రవక్తా! బహుశా తమరు మా సలహా ఏమిటో తెలుసుకోదలచుకుంటున్నారా?"* అని అడిగారు.

దానికి *"అవును"* అని బదులిచ్చారాయన (సల్లం).

అపుడు "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)", అన్సారుల తరఫున తమ నిర్ణయాన్ని ఇలా వినిపించారు....; ↓

*"అయితే వినండి!మేమైతే మిమ్మల్ని విశ్వసించాము. మిమ్మల్ని ధృవపరిచాము. మీరు తెచ్చినదంతా సత్యమని సాక్ష్యం ఇచ్చాము. దానిపై మిమ్మల్ని విధేయిస్తామని, మీ మాటలను జవదాటమని ప్రమాణం కూడా చేశాము. కాబట్టి, ఓ మహాప్రవక్త (సల్లం)! మీరు అనుకున్న దాని ప్రకారమే కానివ్వండి, మిమ్మల్ని సత్యంలో ప్రభవింపజేసిన ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను! మీరే గనక మమ్మల్ని తీసుకుని సముద్రంలో దూకదలచుకుంటే దూకేయండి. మాకు చెందిన ఏ ఒక్క మనిషి కూడా వెనక్కు అడుగు వేయడు. రేపు మా శత్రువులతో ఢీకొనదలిస్తే దానికి మేము వెనుకంజవేసే వారము కాము. మేము యుద్ధ వీరులం, రణశూరులం. బహుశా అల్లాహ్ మీకు మా యుద్ధకౌశలం ఏమిటో చూపించదలిచాడేమో. అప్పుడు చూద్దురు గాని మా ప్రతాపం. మీ కళ్ళు చల్లబడగలవు. అల్లాహ్ శుభం కలిగించుగాక."* అని తమ నిర్ణయాన్ని దైవప్రవక్త (సల్లం)కు ఎరుకపరిచారు.

_↑ మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది ↓_

"హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)", దైవప్రవక్త (సల్లం)తో ఇలా విన్నవించుకున్నారు....; ↓

*"దైవప్రవక్తా! అన్సారులు, మదీనాలో మాత్రమే సహాయపడతారేమోనని, బహుశా మీకు శంక ఉండి ఉంటుంది. అందుకని నేను అన్సారుల తరఫున చెబుతున్నాను. తమరు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా, మరెవ్వరితో సంబంధాలు పెట్టుకున్నా, మేము మాత్రం మీతోనే ఉంటాం. మా ధనసంపద నుండి తమరు ఏది తీసుకున్నా, ఇంకొకరికి ఏది ఇచ్చినా అది మాకు ఇష్టమైన కార్యమే అవుతుంది. ఈ వ్యవహారంలో మీ తీర్పే మాకు శిరోధార్యం. మేము దాన్ని విధేయిస్తాము. దైవసాక్షి! మీరు ముందుకు అడుగేస్తూ 'బర్కె గిమాద్' వరకు వెళ్ళినా మేము మీ వెంటే ఉంటాం. ఒకవేళ మీరు మమ్మల్ని తీసుకుని సముద్రంలో దూకదలచుకున్నా మీ వెంట సముద్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్నాం."*

"హజ్రత్ సఅద్ (రజి)" గారి ఈ మాటలు విన్న దైవప్రవక్త (సల్లం) గారి ముఖారవిందం ఆనందంతో వికసించింది.

*"ఇక పదండి. సంతోషంగా ముందుకు అడుగేయండి. అల్లాహ్ నాకు రెండు వర్గాల్లో నుండి ఒక వర్గం గురించి వాగ్దానం చేశాడు. అల్లాహ్ సాక్షి! ఇప్పుడు నాకు జాతి వధ్యస్థలాలు అగుపడుతున్నాయి."* అని సెలవిచ్చారు మహాప్రవక్త (సల్లం).

*"ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి! అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు. అదే సమయంలో అల్లాహ్ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి, అవిశ్వాసులను కూకటి వేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు. అపరాధులకు ఎంతగా సహించరానిదయినా సరే సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా నిగ్గుతేలాలన్నది (ఆయన అభిమతం)." (ఖుర్ఆన్ 8:7,8).*

*సత్యాసత్యాల మధ్య సంకుల సమరం : -*

మదీనాలో ముస్లింలు యుద్ధ సన్నాహాలలో నిమగ్నులైపోయారు. కానీ, చాలీచాలని వనరులతో ఖురైషీయులతో తలపడటం అంటే సామాన్యమా? సైనికులందరికీ కలిపి మూడు గుర్రాలు, డెబ్భై ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఒంటె మీద ముగ్గురు నలుగురు చొప్పున కూర్చోవలసి వచ్చింది. దైవప్రవక్త (సల్లం) కూర్చున్న ఒంటె మీద కూడా మరో ఇద్దరు యోధులు కూర్చున్నారు. అప్పటికీ వాహనాలు సరిపడక అనేకమంది కాలినడకన బయలుదేరారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

✍🏻✍🏻     *®@£€€q*   *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment