203

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 203            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 118*    
*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 
*బద్ర్ సంగ్రామం : - 2* 

*వర్తక బిడారం ప్రమాదంలో ఉందని మక్కాకు వర్తమానం తీసుకొచ్చిన జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ : -*

జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ ఎంతో వేగంగా మక్కాకు వచ్చాడు. అరబ్బు సంప్రదాయం ప్రకారం తన ఒంటె ముక్కును కోశాడు, ఒంటె అంబారీని బోర్లించాడు, తన చొక్కా చించుకుని మక్కా లోయలో ఆ ఒంటె పై నిలబడి...., *"ఓ ఖురైష్ వర్గమా! మీ వర్తక బిడారం.... మీ వర్తక బిడారం.... అబూ సుఫ్'యాన్ వెంట తెస్తున్న మీ వర్తక బిడారంపై ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన అనుచరులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు పొందగలరన్న నమ్మకం నాకు లేదు. రక్షించుకోండి.... రక్షించుకోండి."* అని పెద్దపెట్టున అరవనారంభించాడు.

ఇప్పటికే "నఖ్లా" ఉదంతంతో మండిపోతున్న ఖురైష్ అవిశ్వాసులకు "జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ" తెచ్చిన ఈ సమాచారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వారి గుండెల్లో రగిలిన కోపాగ్ని జ్వాలలు మింటికెగిశాయి.

ఇప్పుడు మక్కాలో మిగిలింది రెండే రెండు వర్గాలకు చెందినవారు. ఒక వర్గం యుద్ధం కోసం బయలుదేరే వర్గం. మరొక వర్గం తాను యుద్ధానికి బయలుదేరలేకపోయినప్పటికీ తన వంతుగా ఎవరినో ఒకరిని యుద్ధానికి పంపే ప్రయత్నం చేసే వర్గం. ఇలా దాదాపు అందరూ యుద్ధం కోసం బయలుదేరిన వాళ్ళే.

మరుక్షణమే యుద్ధవీరుల్ని సమావేశపరిచారు. కార్చిచ్చులాంటి ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని తీవ్రంగా రెచ్చగొట్టారు. ఉద్రేకపూరితులైన యువకులు యుద్ధ సన్నాహాలకు ఉరకలు వేశారు. కత్తులు, ఈటెలు, బాకులు, విల్లంబులు ధరించారు. ఒంటెలు, గుర్రాలు సిద్ధం చేశారు. కాని, పిరికిపంద "అబూ లహబ్" మాత్రం ముస్లిం యోధులతో పోరాడటానికి సాహసించ లేకపోయాడు. ఏదో కుంటిసాకు చెప్పి తనకు బదులు మరో వ్యక్తిని నాల్గువేల రూపాయల ప్రతిఫలం మీద కుదుర్చుకొని యుద్ధానికి పంపాడు.

కొంతమంది తమ అసామాన్య వాగ్ధాటితో ప్రజలను రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపించసాగారు. "సుహైల్" అనే అతను ఖురైష్ వీరుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు....; ↓

*"గాలబ్ వీరపుత్రులారా! ముస్లిములు మన వాణిజ్య బిడారాలపై దాడి జరపడాన్ని మీరు సహించగలరా? మనకు ఏ కొరతా లేదు. లేండి, కళ్ళు తెరవండి. పౌరుషంతో శత్రువుని ఎదుర్కోవడానికి నడుం కట్టండి."*

*యుద్ధానికి బయలుదేరిన మక్కా సైన్యం : -*

ప్రారంభంలో వారి సంఖ్య పదమూడొందలు. వంద గుర్రాలు, ఏడు వందల ఒంటెలు కూడా సమకూరాయి. కాల్బల సైనికులు ధగధగ మెరిసే ఉక్కు కవచాలు ధరించారు. సైనికుల్ని ఉద్రేకపరచడానికి పౌరుషపదాలతో పాటలు పాడే పడతులు కూడా వెంట ఉన్నారు. ఉత్సాహంతో రొమ్ములు విరుచుకొని సమర వాయిద్యాలతో, దిక్కులు పిక్కుటిల్లే నినాదాలతో అట్టహాసంగా బయలుదేరారు మక్కా బహుదైవారాధకులు.

దారిలో ఎక్కడ ఒయాసిస్సు కన్పిస్తే అక్కడ మజిలీ చేసి సేద తీర్చుకుంటున్నారు. ప్రతీకారంతో ఊగుతూ, పళ్ళు పట పట నూరుతూ ఒక్కొక్క మజిలీ దాటుకుంటూ ముందుకు పయనిస్తున్నారు. 

మక్కా సైనిక బలగానికి సైన్యాధ్యక్షుడు "అబూ జహల్ బిన్ హష్షామ్". ఖురైష్ కు చెందిన తొమ్మండుగురు గౌరవనీయులు సైన్యానికి ఆహార సరఫరా బాధ్యతను తీసుకోవడం జరిగింది. ప్రతి రోజు తొమ్మిది లేక పది ఒంటెలు తెగేవి.

*బనూ బక్ర్ తెగల సమస్య : -*

మక్కా సైన్యం బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు వారికి, బనూ బక్ర్ తెగలతో వైష్యమ్యాలు ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. అందుకని వెనుక నుండి ఈ తెగలు వారిపై దాడి చేస్తాయోమోనన్న భయం పట్టుకుంది. ఇలా వారు రెండు అగ్ని గుండాల నడుమ మాడిపోతామేమో అని బెంగపడనారంభించారు. సరిగ్గా అదే సమయంలో "ఇబ్లీస్ (షైతాను)", బనూ కనానా సర్దారు "సూరాకా బిన్ మాలిక్ బిన్ జఅషమ్ ముద్'లజీ" రూపంలో ప్రత్యక్షమై...., *"నేను మీకు మిత్రుణ్ణి, బనూ కనానా తెగ మీకు ఏ స్థితిలోనూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడరని జామీను ఇస్తున్నాను."* అని అన్నాడు.

"సురాకా బిన్ మాలిక్" రూపంలో ఉన్న "ఇబ్లీసు" ఇచ్చిన ఈ హామీతో మక్కావాసుల ఎలాంటి జంకు లేకుండా బయలుదేరారు.

*ప్రమాదం నుండి బయట పడిన వర్తక బిడారం : -*

అబూ సుఫ్'యాన్ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడో ఆ వివరాలు ఇలా ఉన్నాయి....,

సిరియా నుండి బయలుదేరి అతను రహదారిపై ప్రయాణం సాగిస్తున్నాడే గాని ఎంతో మెలుకువతో వ్యవహరిస్తున్నాడు. సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. "బద్ర్" సమీపానికి వచ్చిన తరువాత తన బిడారాన్ని ఆపి ముందుకు వెళ్ళి "మజ్దీ బిన్ అమ్రూ"ను కలసి మదీనా సైనికదళం గురించి ఆరా తీశాడు. "మజ్దీ" మాత్రం తాను అసాధారణమైన విషయం ఏదీ కనుగొనలేదని చెబుతూ, ఇద్దరు ఉష్ట్రారోహుల్ని మాత్రం చూడడం తటస్థించిందని, ఫలానా మట్టి దిబ్బ దగ్గర ఆగారని, తమ తోలు సంచుల్లో నీరు నింపుకుని వెళ్ళారని చెప్పాడు. ఇది విన్న అబూ సుఫ్'యాన్ పరుగున అక్కడికి వెళ్ళాడు.

ఆ ప్రాంతంలో ఒక చోట కనిపించిన ఒంటె పేడ తీసుకొని త్రుంచి చూశాడు. అందులో ఖర్జూరపు విత్తనాలు కనిపించాయి. ఇది మదీనా ప్రజలు తమ ఒంటెలకు పెట్టే ప్రత్యేకమైన మేత. అంటే ముస్లిం సైనికులు ఈ దరిదాపుల్లోనే ఎక్కడో పొంచి ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ అనుమానం కలగ్గానే అబూ సుఫ్'యాన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిడారం వైపునకు పరుగు తీశాడు. తన బిడారాన్ని పశ్చిమ దిశ వైపునకు మళ్ళించి సముద్ర తీరం వైపునకు నడిపించాడు. "బద్ర్" నుండి వెళ్ళే బిడార మార్గాన్ని ఎడమ వైపున వదిలి ముందుకుసాగాడు. 

ఇలా తన బిడారాన్ని ముస్లిముల చేతిలో పడకుండా కాపాడుకోగలిగాడు. వెంటనే తాను క్షేమంగా తప్పించుకున్న వార్తను మక్కా సైన్యానికి పంపడం జరిగింది. ఆ వార్త 'హుజ్ఫా'లో ఉన్న ఆ సైన్యానికి అందింది.

*తమ వర్తక బిడారం క్షేమంగా బయటపడిందని, మక్కా సైన్యానికి తెలిసిన వార్త : -*

మక్కా సైన్యం విర్రవీగుతూ, ప్రజల ముందు తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, దైవమార్గానికి అడ్డుపడుతూ, పదునైన ఆయుధాలతో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం) అంటే మిడిసిపడుతూ, పగ తీర్చుకునే ఉద్దేశ్యంతో, పౌరుషం, ఆత్మాభిమానం ఉట్టిపడేటట్లు మదీనా వైపునకు బయలుదేరారు. వారి మదిలో ఉన్నదల్లా ఒక్కటే. *"దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన అనుచరగణం మక్కా వర్తక బిడారాల వైపు కన్ను వేయడానికి ఎలా సాహసించారు?"* అన్నదే.

ఎట్టకేలకు వీరు అతి వేగంగా ఉత్తర దిశగా "బద్ర్" వైపునకు వెడుతున్నారు. ఉస్ఫాన్ మరియు ఖుదైద్ లోయలను దాటి 'హుజ్ఫా' చేరుకున్న తరువాత "అబూ సుఫ్'యాన్" పంపిన వార్త అందింది వారికి.

'హుజ్ఫా' చేరుకున్న అవిశ్వాసుల సైన్యం వద్దకు మక్కా నుంచి ఒకతను శరవేగంతో వచ్చి, వర్తక బిడారాలు క్షేమంగా బయటపడ్డాయన్న వార్తను ఇలా వినిపించాడు....; ↓

*"సోదరులారా! ఏ వర్తక బిడారాలను కాపాడటానికి మీరు వెళ్తున్నారో అవి ముస్లిముల బారి పడకుండా సురక్షితంగా మక్కా చేరుకున్నాయి. మీరు ఇక వెనక్కి వెళ్ళండి. వెళ్ళిపోవడమే మనకు శ్రేయస్కరం. ముస్లిములను ఎదుర్కోవాలనే ప్రయత్నం మానుకొని మక్కా వెళ్ళిపోండి."*

ఈ వార్త విన్న మక్కా సైన్యం వెనక్కు మరలడానికి సిద్ధపడింది. కాని, ఖురైష్ కు చెందిన ముష్కర నాయకుడు "అబూ జహల్" లేచి...., *"దైవసాక్షి! మనం వెనక్కు మరలడానికి వీల్లేదు. బద్ర్ మైదానానికి వెళ్ళి, అక్కడ మూడు రోజుల వరకు వేచి చూస్తూ, ఒంటెలను జిబహ్ చేసి విందు ఆరగిద్దాం. సారాయి త్రాగుతూ నాట్యకత్తెల నాట్యాన్ని తిలకిద్దాం. అరేబియా మొత్తం మన ఈ ప్రయాణం గురించి వేనోళ్ళ పొగడాలి. ఇలా వారిపై మన ప్రభావం పడాలి."* అని బీరాలు పలికాడు.

అయితే "అబూ జహల్" చేసిన ప్రసంగానికి భిన్నంగా "అఖ్నస్ బిన్ షురైఖ్" అనేవాడు...., *"లేదు! మనం మక్కాకు వెనక్కు మళ్ళడంలోనే శ్రేయం ఉంది."* అని సలహా ఇచ్చాడు.

అయినా అతని మాటలు వారి చెవులకెక్కలేదు. అందుకని అతడు బనూ జహ్రా తెగను వెంటబెట్టుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. అతను బనూ జహ్రా తెగకు మిత్రపక్షం వాడు. అంతేకాదు, బనూ జహ్రా సైన్యానికి సర్దారు కూడా. ఈ బనూ జహ్రా సైన్యం మొత్తం దాదాపు మూడొందల మంది. వీరిలో ఏ ఒక్కడూ "బద్ర్ యుద్ధం"లో పాల్గొనలేదు. ఆ తరువాత బనూ జహ్రా తెగవారు "అఖ్నస్ బిన్ షురైఖ్" తీసుకున్న నిర్ణయానికి సంబరపడిపోయి, అతణ్ణి ఎంతో గౌరవిస్తూ అతణ్ణి విధేయించనారంభించారు.

బనూ జహ్రాయే కాకుండా, బనూ హాషిమ్ తెగవారు కూడా వెనక్కు మళ్ళుదామని నిర్ణయించుకున్నారు. కాని, అబూ జహల్ ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ, *"మేము వెనక్కు మళ్ళేంత వరకు ఈ వర్గం మమ్మల్ని వీడిపోవడానికి వీల్లేదు."* అని పట్టుబట్టాడు.

ఇటు మరోప్రక్క, ఖురైషీయులు తన సలహా పాటించనందుకు *"వర్తక బిడారాలు క్షేమంగా బయటపడ్డాయి."* అన్న వార్త తీసుకొచ్చిన వ్యక్తి, వారి విముఖతను చూసి విచారిస్తూ వారి మానాన వారిని వదిలిపెట్టి మక్కా వెళ్ళిపోయాడు. "అబూ సుఫ్'యాన్"ను కలుసుకొని తన మాటలు ఎవరూ వినలేదని చెబుతూ జరిగిన వృత్తాంతం వివరించాడు.

అబూ సుఫ్'యాన్ ఈ సంగతి విని విచారం వెలిబుచ్చుతూ ఇలా అన్నాడు. ↓

*"అయ్యో ఖురైష్ ప్రజలారా! ఎంత మైకంలో పడిపోయారు మీరు! ఇంతకూ ఇదంతా అబూ జహల్ పని. అతనెందుకు వింటాడు. అతనిప్పుడు సైన్యాధిపతి అయ్యాడు కదా! కానీ అతను జనాన్ని పెడదారి పట్టించి చాలా అన్యాయం చేస్తున్నాడు. సొంత నిర్ణయాలు తప్ప ఎదుటివారి సలహాలోని ఉచితానుచితాలు గ్రహించే విచక్షణాజ్ఞానం నశించింది. దాని పర్యవసానం అనుభవిస్తాడులే."* అన్నాడు.

మొత్తానికి మక్కా సైన్యం, ముస్లిములను ఎదుర్కునేందుకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. బనూ జహ్రా యోధులు తిరిగి వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు వారి సైనికుల సంఖ్య ఒక్క వెయ్యిగానే ఉండిపోయింది. వీరు "బద్ర్" వైపునకు చొచ్చుకొని పోతున్నారు. "బద్ర్" దాపుకు చేరి వారు ఓ చిన్న మట్టి దిబ్బ వెనుక ఆగిపోయారు. ఈ మట్టి తిన్నె, బద్ర్ లోయ ప్రక్కన దాని దక్షిణ ముఖద్వారం వద్ద ఉంది.

*ఇస్లామీయ సైన్యానికి ఎదురైన సంక్లిష్ట పరిస్థితి : -*

మహాప్రవక్త (సల్లం) అలా ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఉన్న "జఫ్రాన్" లోయగుండా వెడుతున్నారోలేదో, మదీనా నుండి వర్తక బిడారం మరియు అటు మక్కా నుండి వస్తున్న సైన్యం గురించి వర్తమానం అందింది. (అంటే, మక్కా అవిశ్వాసులు మదీనాపై దాడిచేయడానికి బయలుదేరారనే వర్తమానం, దైవప్రవక్త (సల్లం)కు అందింది.)

ఈ వర్తమానాన్ని లోతుగా అధ్యయనం చేసిన తరువాత ఇక ఓ భీకర పోరాటం తప్పదనే నిర్ణయానికి వచ్చారాయన (సల్లం). ఇప్పుడు ధైర్యసాహసాలు, తెగింపును ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని తలిచారు.

*ఒకవేళ మక్కా సైన్యాన్ని తమ ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు సంచరించడానికి వీలు కల్పిస్తే ఖురైషుల ఆత్మబలం మరింత పెరిగిపోవచ్చు. వారి రాజకీయ పెత్తనం పరిధి మరింత విస్తరించవచ్చు. ముస్లిముల సందేశ ప్రచార పిలుపు మందగించి బలహీనపడవచ్చు. ఆ తరువాత ఇస్లామీయ సందేశాన్ని ఎవరూ పట్టించుకోకుండా, ఇస్లాం అంటే గిట్టని ప్రతివాడు ముస్లిములపై పెత్తనం చెలాయించే ప్రయత్నమూ చేయవచ్చు.*

ఇదంతా ఒక ఎత్తయితే, *మక్కా సైన్యం మదీనా వైపునకు పురోగమించదు అనే నమ్మకం ఏమిటి? ఈ సైనిక చర్యను మదీనా వరకు పొడిగించి, ముస్లిములను వారి ఇండ్లల్లో చొరబడి హతమార్చే ప్రయత్నం చేయదనే పూచీ ఏమిటి? అవును! ఒకవేళ మదీనా సైన్యం తరఫున ఏ ఒక్క పొరపాటు జరిగినా ఇదంతా సాధ్యమే. అలా జరగకపోయినా సరే, ఇప్పటివరకు మదీనా ముస్లిముల పేరు చెప్పగానే దిగులుపడిపోయే పరిస్థితికి, వారి ఖ్యాతికి దెబ్బతగలవచ్చును కూడా.*

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment