202

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 202            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 117*   
*ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* 
*బద్ర్ సంగ్రామం : - 1* 
*హిజ్రీ శకం - 2, రమజాన్ మాసంలోని ఓ రోజు : -*
దైవప్రవక్త (సల్లం), సహాబా (రజి)లతో కలిసి ఏదో చర్చలో నిమగ్నులైయున్నారు. ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ ప్రశాంత వాతావరణాన్ని అలుముకున్నాయి. అంతలో ఒక వార్త క్షణాల్లో మదీనా నగరమంతా వ్యాపించింది.

*"వెయ్యి ఒంటెల వర్తక బృందం చెప్పలేనంత సంపదతో సిరియా నుంచి మక్కాకు బయలుదేరింది. ఈ బృందం, మదీనా సమీపంగుండా మక్కాకు వెళుతుంది. మక్కా పురప్రముఖుడైన "అబూ సుఫ్'యాన్" ఈ వర్తక సమూహానికి అధిపతి."*

(కాబాలో నిషేధాన్ని విధించినది అతనే. దైవప్రవక్త (సల్లం)ను హత్య చేయాలని కుట్ర పన్నింది అతనే.)

_(↑ మరింత వివరంగా ↓)_

*గజ్వాకు పురికొల్పిన కారణాలు : -*

'గజ్వయె ఉషైరా'లో, ఖురైష్ చెందిన ఓ వర్తక బిడారం మక్కా నుండి సిరియా వెడుతూ మహాప్రవక్త (సల్లం) గారి చేతిలో పడకుండా తప్పించుకొని పోయిందన్న విషయం మనం ఇదివరకే (198 వ భాగములో) చదువుకున్నాం.

(మరింత అర్థవంతం కోసం చదవండి, ఇస్లాం చరిత్ర - 198 వ భాగములోని "7. గజ్వయె జిల్ ఉషైరా" అధ్యాయం.)

ఈ బిడారమే సిరియా నుండి తిరిగి వస్తోందని తెలిసి దైవప్రవక్త (సల్లం), "తల్హా బిన్ ఉబైదుల్లాహ్ (రజి)" మరియు "సయీద్ బిన్ జైద్ (రజి)"లకు పరిస్థితులేమిటో తెలుసుకురమ్మని ఉత్తర దిశగా పంపించారు.

ఈ ఇద్దరు సహాబీలు 'హవార్' అనే ప్రదేశం వరకు వెళ్ళి అక్కడనే ఆగిపోయారు. "అబూ సుఫ్'యాన్" ఆ బిడారాన్ని తీసుకొని ఆ మార్గాన వెళ్ళగా, ఆ సహాబీలు పరుగున మదీనాకు వచ్చి విషయం మహాప్రవక్త (సల్లం)కు చెప్పారు.

*"దైవప్రవక్తా! ఈ బిడారంలో మక్కావాసులకు చెందిన బోలెడు ధనం ఉంది. అంటే, ఒక వేయి ఒంటెలు, ఆ ఒంటెలపై యాభై వేళ దీనార్ల (రెండు వందల అరవై రెండున్నర కిలోల బరువు బంగారం) విలువ గల వర్తక సామాగ్రి ఉంది. దాన్ని రక్షించడానికి కేవలం నలభై మందే ఉన్నారు."*

మదీనావాసులకు ఇది స్వర్ణావకాశం. అప్పటి పరిస్థితులు ధనలేమికి గురి అయి ఉన్నాయి. ఈ పరిస్థితి మదీనా వాసులకు సైనికపరంగా రాజకీయంగా, ఆర్థికంగా కృంగదీస్తున్న పరిస్థితి. అందువలన ప్రవక్త శ్రీ (సల్లం), *"ఈ ఖురైష్ కాన్వాయ్ ధనంతో వస్తోంది కాబట్టి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళండి, బహుశా అల్లాహ్ మీ కోసం యుద్ధధనాన్ని పంపించి ఉంటాడు."* అని ప్రకటించారు.

అయితే ప్రవక్త శ్రీ (సల్లం) ఎవ్వరినీ వెళ్ళడానికి మాత్రం బలవంతపెట్టలేదు. దీన్ని కేవలం ప్రజల ఇష్టంపై వదిలేశారు.

ఈ ప్రకటన చేసినప్పుడు, "వర్తక బిడారం తమ నుంచి తప్పించుకుంటుందని, ఆ వర్తక బిడారానికి బదులు ఖురైషీయుల సైన్యంతో "బద్ర్" మైదానంలో భీకర యుద్ధం జరుగబోతుంది." అన్న విషయం తెలియదు. అందుకనే చాలా మంది సహాబా (రజి) మదీనాలోనే ఉండిపోయారు. వారు అనుకున్నదాని ప్రకారం, మహాప్రవక్త (సల్లం) గారి ఈ ప్రయాణం గతంలోని "గజ్వాలు"లాంటివి అని తలచడం. అందుకని వారు ఈ గజ్వాలో చేరకపోయినా మందలించడం జరగలేదు.

*ఇస్లామీయ సైనికశక్తి మరియు నాయకత్వ విభజన : -*

మహాప్రవక్త (సల్లం) బయలుదేరేటప్పుడు ఆయన (సల్లం) వెంట మూడు వందల మంది కంటే కొంత ఎక్కువ మంది ఉన్నారు (అంటే 313 లేదా 314 లేదా 317మంది). వీరిలో 82 లేదా 83 లేదా 86 మంది ముహాజిర్లు, మిగతావారు అన్సారులు. అన్సారుల్లోను 61 మంది "అవస్" తెగకు చెందినవారు. 170 మంది "ఖజ్రజ్" తెగవారు.

ఈ గజ్వాకు వెళ్ళే సైనికులు, ఎలాంటి యుద్ధ సన్నాహం లేకుండా బయలుదేరినవారు.

పటాలం మొత్తంలో కేవలం రెండు గుర్రాలున్నాయి (ఒకటి "హజ్రత్ జుబైర్ (రజి) బిన్ అవామ్"గారి గుర్రం, మరొకటి "హజ్రత్ మిగ్దాద్ (రజి) బిన్ అస్వద్ కందీ"గారి గుర్రం). దీనికితోడు డెబ్భై ఒంటెలు, ఒక్కొక్క ఒంటెపై ముగ్గురేసి వ్యక్తులు వంతులువారీగా స్వారీ చేస్తున్నారు. తమ దగ్గర తగినన్ని వాహనాలు లేకపోయినప్పటికీ వాళ్ళు కొద్ది దూరం కాలి నడకన నడుస్తూ, మరికొద్ది దూరం వాహనాలపై స్వారీ చేసుకుంటూ, నిప్పులు చెరుగుతున్న ఎండలో ముందుకు పోతున్నారు. ఓ ఒంటె దైవప్రవక్త (సల్లం), "హజ్రత్ అలీ (రజి)" మరియు "హజ్రత్ ముర్సిద్ (రజి) బిన్ అబీ ముర్సిద్" భాగంలో ఉంది. దీనిపై ఈ ముగ్గురు వంతులవారీగా స్వారీ చేస్తూ వెళ్ళారు.

మదీనా నాయకత్వాన్ని మరియు నమాజు చేయించే భాద్యతను మొదట "హజ్రత్ ఇబ్నె మక్తూమ్ (రజి)" గారికి అప్పగించడం జరిగింది. కాని, మహాప్రవక్త (సల్లం) 'రౌహ' అనే ప్రదేశానికి చేరిన తరువాత ఆయన, "అబూ లుబాబా బిన్ అబ్దుల్ మున్జిర్ (రజి)" గారికి మదీనా నాయకత్వాన్ని అప్పగించి పంపించారు. సైన్యాన్ని రెండు దళాలుగా విభజించడం జరిగింది.

(1) ముహాజిర్ల దళం. (2) అన్సారుల దళం.

ముహాజిర్ల పతాకం "హజ్రత్ అలి (రజి)"కు, అన్సారుల పతాకాన్ని "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)"కు, అన్ని దళాల పతాకం "హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ అబ్'దరీ (రజి)"కు ఇవ్వడం జరిగింది. ఇది శ్వేత వర్ణ పతాకం. 'మైమనా' (కుడి పార్శ్వం) కమాండరుగా "హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)" మరియు 'మైసరా' (ఎడమ పార్శ్వం) కమాండరుగా "హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రూ (రజి)"లను నియమించడం జరిగింది - మనం ఇదివరకే చెప్పుకున్నట్లు పూర్తి సైనిక దళంలో కేవలం ఇద్దరే గుర్రపు రౌతులున్నారు - 'సాకా' (మధ్య భాగం) కమాండరుగా "హజ్రత్ ఖైస్ బిన్ అబీ సఅసా"కు అప్పగించడం జరిగింది. ఇక ఈ దళానికి స్వరసైన్యాధ్యక్షులుగా స్వయంగా మహాప్రవక్త (సల్లం) గారే వ్యవహరించారు.

*బద్ర్ వైపునకు ప్రయాణమైన ఇస్లామీయ సైనిక దళం : -*

మహాప్రవక్త (సల్లం) ఈ సంపూర్ణమైన సైన్యాన్ని వెంటగొని మదీనా ముఖద్వారం నుండి మక్కాకు వెళ్ళే రహదారి పై ప్రయాణిస్తూ 'బిఇరె రౌహా' వరకు వెళ్ళారు. అక్కడి నుండి ముందుకు కదిలి మక్కా మార్గాన్ని ఎడమ వైపునకు వదిలేసి కుడి ప్రక్కకు మళ్ళి 'నాజియా' చేరారు (ఆయన గమ్యస్థానం బద్ర్).

నాజియా ఓ మూల మలుపు తిరిగి 'రహ్కాన్' లోయను దాటారు. ఇది 'నాజియా' మరియు 'సఫ్రా' కనుమ నడుమన గల లోయ. ఇది దాటి సఫ్రా కనుమ, ఆ కనుమ దాటి సఫ్రా లోయ దాపుకు వెళ్ళిపోయారు. అక్కడి నుండే ఆయన (సల్లం), జుహైనా తెగకు చెందిన ఇద్దరు మనుషుల్ని బద్ర్ పరిస్థితులేమిటో తెలుసుకురండని పంపించడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు "బసీస్ బిన్ ఉమర్" మరియు "అద్దీ బిన్ అబిజ్జగ్బా"లు. వీరు ఆ వర్తక బిడారం ఆచూకీ తెలుసుకొని రావడానికి బయలుదేరినవారు.

*అబూ సుఫ్'యాన్ వర్తక బృందంలో కలవరపాటు : -*

మరో ప్రక్క, వర్తక బిడారాన్ని రక్షించుకుంటూ వస్తున్న అబూ సుఫ్'యాన్ ఎంతో జాగరూకతను అవలంబిస్తూ కదుల్తున్నాడు. మక్కా మార్గం ప్రమాద భూయిష్టమైనదనే విషయం అతనికి బాగా తెలుసు. అందుకని అతను పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి వేగులను పంపిస్తున్నాడు. అతనికి తారసపడుతున్న ఒంటెల బిడారాలను ఆపి పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నాడు. ఇలా అతనికి, దైవప్రవక్త (సల్లం) మరియు ఆయన అనుచరగణం తన బిడారంపై దాడి చేయడానికి సమాయత్తమవుతున్న విషయం తెలిసిపోయింది.

*"ఒంటెల మీద లక్షల విలువగల సామగ్రి ఉంది. వీటిని కాపాడేవారు చాలా తక్కువమంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు చిక్కితే, అమ్మో! ఇంకేమైనా ఉందా! పోతే సామగ్రి పోతుంది. కాని దేహంలో ఎముకలు కూడా మిగలవే."*

ఈ ఆలోచన రాగానే అబూ సుఫ్'యాన్ హడలిపోయాడు. తక్షణమే అతను "జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ" అనే వ్యక్తికి ప్రతిఫలం ముట్టజెప్పి, *"ముస్లింలు మన వర్తక బిడారాలను అడ్డగించడానికి వస్తున్నారు. వెంటనే మాకు సహాయపడి వ్యాపార సామగ్రిని కాపాడుకోవాలి."* అని చెప్పి మక్కాలోని ఖురైషీయులకు వార్త పంపించాడు.

ఆ తర్వాత అబూ సుఫ్'యాన్ వర్తక బిడారాలను వేరే వైపునకు దారి మళ్ళించి తీసుకుపోయాడు.

*ఇదే సమయంలో మక్కాలోని పరిస్థితులు : -*

మదీనాలో మహాప్రవక్త (సల్లం), ఆయన అనుయాయులు ఇస్లాం విప్లవ కిరణాలను దేశం నలుదిశలా ప్రసరింపజేస్తుంటే, మక్కాలో ఖురైషీయుల గుండెల్లో గుర్రాలు పరుగెత్తసాగాయి.

ఇదిలా ఉండగా ఓ రోజు నెత్తిమీద పిడుగు పడినంత పనయింది. "నఖ్లా" ప్రాంతంలో ముస్లిములు తమ వ్యాపార బృందాన్ని దోచుకున్నారని, "అమ్రూ బిన్ హజ్రమీ" అనే మనిషిని చంపి మిగిలినవారిని ఖైదీలుగా బంధించి తీసుకెళ్ళారని గూఢచారి సందేశం వచ్చింది. (మరింత అర్థవంతం కోసం చదవండి ఇస్లాం చరిత్ర - 198 వ భాగములోని "8. సరియ్యయె నఖ్లా" అధ్యాయం.)

ఈ గూఢచారి సందేశం విని ఖురైషీయులు ఆగ్రహంతో చిందులు తొక్కారు. కసి, పగ తారాస్థాయికి చేరాయి. ఇక ఎంతమాత్రం సహించకూడదు. అటో ఇటో తెల్చుకోవాలనుకున్నారు.

కాని, ఆ తర్వాత వారిపై మరో పిడుగు పడింది.

(అబూ సుఫ్'యాన్ బృందంలోని జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ, "తమ వర్తక బిడారాన్ని రక్షించుకోవాలి" అని వర్తమానం తీసుకొచ్చాడు.)

జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ ఎంతో వేగంగా మక్కాకు వచ్చాడు. అరబ్బు సంప్రదాయం ప్రకారం తన ఒంటె ముక్కును కోశాడు, ఒంటె అంబారీని బోర్లించాడు, తన చొక్కా చించుకుని మక్కా లోయలో ఆ ఒంటె పై నిలబడి...., *"ఓ ఖురైష్ వర్గమా! మీ వర్తక బిడారం.... మీ వర్తక బిడారం.... అబూ సుఫ్'యాన్ వెంట తెస్తున్న మీ వర్తక బిడారంపై ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన అనుచరులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు పొందగలరన్న నమ్మకం నాకు లేదు. రక్షించుకోండి.... రక్షించుకోండి."* అని పెద్దపెట్టున అరవనారంభించాడు.

ఇప్పటికే "నఖ్లా" ఉదంతంతో మండిపోతున్న ఖురైష్ అవిశ్వాసులకు "జమ్ జమ్ బిన్ అమ్రూ గిఫారీ" తెచ్చిన ఈ సమాచారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వారి గుండెల్లో రగిలిన కోపాగ్ని జ్వాలలు మింటికెగిశాయి.

ఇప్పుడు మక్కాలో మిగిలింది రెండే రెండు వర్గాలకు చెందినవారు. ఒక వర్గం యుద్ధం కోసం బయలుదేరే వర్గం. మరొక వర్గం తాను యుద్ధానికి బయలుదేరలేకపోయినప్పటికీ తన వంతుగా ఎవరినో ఒకరిని యుద్ధానికి పంపే ప్రయత్నం చేసే వర్గం.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment