201

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 201            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 116*     

*ఖిబ్లా దిశ మార్పు : -*

"బషీర్ బిన్ బరా (రజి)" ఆహ్వానంపై ఓ రోజు దైవప్రవక్త (సల్లం), ఆయన ఇంటికి వెళ్ళారు. వచ్చిన పని పూర్తయ్యేటప్పటికి "జుహర్" నమాజు వేళయింది. దైవప్రవక్త (సల్లం), అక్కడున్న అనుచరులకు నాయకత్వం వహించి నమాజు చేయించసాగారు. రెండవ రకాతులో అకస్మాత్తుగా దైవసందేశం అవతరించింది....; ↓

*"(ఓ ప్రవక్తా!) నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికీ ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము, నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము. కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపుకు త్రిప్పుకో. మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పాలి. (ఖిబ్లా మార్పుకు సంబంధించిన) ఈ విషయం, తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు. అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు." (ఖుర్ఆన్ 2:144).*

ఈ సందేశం అవతరించగానే దైవప్రవక్త (సల్లం) నమాజు స్థితిలోనే "బైతుల్ మఖ్దిస్" వైపు నుంచి "కాబా" వైపుకు మరలారు. వెనుక ఉన్న సహచరులు కూడా ఆయన (సల్లం)ని అనుసరిస్తూ "కాబా" దిశకు మరలారు.

ఆ తరువాత మదీనా, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లిములందరికీ, "ఖిబ్లా" మార్పు గురించి దండోరా వేయించి తెలియజేశారు. "ఖిబ్లా" మార్పు ప్రకటన వినిపించే సమయంలో కొందరు "రుకూ"లో ఉన్నారు. వెంటనే వారు "రుకూ" స్థితిలోనే "కాబా" వైపునకు తమ దిశను మార్చుకున్నారు.

కొత్తగా వచ్చిన ఈ మార్పుకు యూదులు ఆశ్చర్యపోయారు.

*"ఏమైంది ఈ ముస్లిములకు, బైతుల్ మఖ్దిస్ ఉన్న దిక్కుకు తిరిగి నమాజ్ చేసేవారల్లా అకస్మాత్తుగా కాబా దిశకు తిరిగారు? గత దైవప్రవక్తలు "బైతుల్ మఖ్దిస్"నే తమ ఆరాధనా కేంద్రంగా చేసుకున్నారు కదా! తరతరాల నుంచి వస్తున్న ఖిబ్లాను ఇప్పుడు ఎందుకు మార్చాడు?"* అంటూ ముఖం చిట్లించుకున్నారు, తమ ప్రతిష్ఠేదో దిగజారిపోతున్నట్లు. 

నిజమే మరి. తమ జాతిలో ప్రభవించిన దైవప్రవక్తలంతా "బైతుల్ మఖ్దిస్"నే ఖిబ్లాగా చేసుకున్నారు. అలాంటి తమ ఖిబ్లా వైపుకే ముస్లిములు కూడా మరలి నమాజ్ చేస్తుంటే, *"అబ్బ! వీరు మా బైతుల్ మఖ్దిస్ వైపుకే తిరిగి నమాజ్ చేస్తున్నారు."* అని సంబరపడిపోయారు. తమ జాతి ఔన్నత్యాన్ని గురించి ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. కాని ఇప్పుడు ముస్లిములు తమ ఖిబ్లాను మార్చుకునేటప్పటికి వారిలో అసూయ ఏర్పడింది.

యూదులు, దేవుడు ఓ ప్రత్యేక దిశలో ఉంటాడనుకున్నారేమో! లేక ఖిబ్లా మార్పును ఒక దిశ నుంచి మరొక దిశకు చేసిన సాధారణమార్పు మాత్రమేనని భావిస్తున్నారేమో!!

ఖిబ్లా మార్పు గురించి ఈ క్రింది "ఖుర్ఆన్" సూక్తులు అవతరించాయి....; ↓

*""వీరు ఏ ఖిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో దాన్నుంచి మరలటానికి కారణం ఏమిటీ?" అని మూర్ఖజనులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : తూర్పు పడమరలు (అన్నీ) అల్లాహ్ వే. తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు." (ఖుర్ఆన్ 2:142).*

*"అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక "న్యాయశీల సమాజం" (ఉమ్మతె వసత్)గా చేశాము - మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము). ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగి పోయేవారో తెలుసుకునే (పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ "ఖిబ్లా"గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు." (ఖుర్ఆన్ 2:143).*

*"ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ 'ఖిబ్లా'ను అనుసరించరు. వారి 'ఖిబ్లా'ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి 'ఖిబ్లా'ను అనుసరించరు. ఒకవేళ నువ్వు - జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా - వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా!" (ఖుర్ఆన్ 2:145).*

*"మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్ - సల్లం - ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పి పుచ్చుతుంది. అయితే ఇది నీ ప్రభువు తరఫు నుంచి వచ్చిన (స్పష్టమైన) సత్యం. (జాగ్రత్త!) నీవు మాత్రం సంశయాల్లో ఊగిసలాడేవారి సరసన చేరకు." (ఖుర్ఆన్ 2:146,147).*

*"ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి. మీరు ఎక్కడ ఉన్నాసరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు." (ఖుర్ఆన్ 2:148).*

*"నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా (నమాజు కోసం) నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. ఇదే నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలియకుండా లేదు. ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదె హరాం వైపునకు త్రిప్పు. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పండి - జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి (ఇలాగే చేయండి). వారిలోని దుర్మార్గులకు (వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంతమాత్రాన మీరు వారికి) భయపడకండి. నాకు మాత్రమే భయపడండి - నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తి గావించటానికి, మీరు సన్మార్గగాములు అవటానికి." (ఖుర్ఆన్ 2:149,150).*

వేలాది సంవత్సరాల నుంచి ప్రపంచ నాయకత్వం వహిస్తున్న యూదుల్ని తొలగించి, ఆ స్థానంలో సత్యధర్మం ఆశ్రయించిన ముస్లింలను నిలబెట్టడమే ఈ "ఖిబ్లా" మార్పు అంతరార్థం. కాని, జాత్యోన్మాదులైన యూదులకు ఈ విషయం అర్థం కాలేదు. ముస్లింల ద్వారా దేవుని ధరిత్రిపై ధర్మసంస్థాపన గావించి, ప్రపంచజాతుల మధ్య నీతి, నిజాయితీలకు; న్యాయం, ధర్మాలకు మరియు సమతా, సౌభ్రాతృత్వాలకు వారిని ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దటానికి ఈ మార్పు తొలిమెట్టని; దైవధర్మాన్ని తారుమారు చేసి జాత్యహంకారంతో విర్రవీగుతూ అంతిమ దైవప్రవక్త అందజేసిన ధర్మాన్ని నిరాకరించినందువల్లనే తమకు ఈ అవమానమని వారు తెలుసుకోలేకపోయారు.

నిజం చెప్పాలంటే, ప్రపంచంలో మానవుల కోసం నిర్మించబడ్డ మొట్టమొదటి ఆరాధనాలయం మక్కాలో ఉన్న "కాబా"యే. అల్లాహ్, దానికి ఎన్నో శుభాలనిచ్చి దాన్నొక అంతర్జాతీయ ప్రబోధనా కేంద్రంగా నిర్ణయించాడు. అరబ్బు తెగలన్నిటికీ మూల పురుషుడైన "హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)" నిర్మించిన ఆరాధనాలయం కూడా "కాబా"యే. అందువల్లనే, అల్లాహ్ ఈ పురాతన ఆలయాన్నే మళ్ళీ "ఖిబ్లా"గా నిర్ణయించాడు.

*ఖిబ్లా మార్పు గురించి విని కంగారుపడ్డ ఖురైషీయులు : -*

ఖిబ్లా మార్పు గురించి మక్కా ఖురైషీయులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు కూడా అదేదో తమ పాలిట పెద్ద అపశకునంగా భావించి బెంబేలు పడిపోయారు. మొన్నటివరకు ముస్లింల విశ్వాసాలు, వారి ఖిబ్లా, వారి ఆరాధనలు అన్నీ తమకు భిన్నమైనవిగా, అపరిచితమైనవిగా ఉండటం వల్ల తమ ధార్మిక సత్తాకు ముప్పులేదనుకున్నారు. కాని, ఖిబ్లా మార్పుతో ముస్లింల దృష్టి ఇప్పుడు "కాబా" మీద పడిందని; అంచేత ఎప్పటికైనా వారు "కాబా" గృహాన్ని వశపరచుకొని మక్కాలో తమకు నిలువ నీడలేకుండా చేసేలా ఉన్నారని తలచి తల్లడిల్లిపోయారు. అందువల్ల ఇప్పుడు వారి హృదయాల్లో ముస్లింల పట్ల పగ, ద్వేషం మునుపటి కంటే మరింత అధికమయ్యాయి.

*బయటపడ్డ కపట యూదుల మనస్తత్వం : -*

*"నమాజు చేసేటప్పుడు ఇక బైతుల్ మఖ్దిస్ అభిముఖంగా కాక, కాబా గృహానికి అభిముఖంగా నిలబడి నమాజు చేయాలి."* అనే ఆదేశం వెలువడిన తర్వాత, దీని వల్ల ఒనగూడిన మరో ప్రయోజనం ఏమిటంటే, అప్పటివరకు, కేవలం ముస్లింలలో చీలిక తేవడానికి కపట నాటకమాడుతూ ముస్లింలుగా ప్రకటించుకుంటూ ఉన్న బలహీనులైన కపట యూదులు, "కాబా" గృహాన్ని "ఖిబ్లా"గా చేసిన తరువాత తమ కాపట్యాన్ని దాచుకోలేక బయటపడిపోయారు. ముస్లిములను వీడి తమ అసలు వర్గాల్లోనికి పోయి చేరారు.

ఇలా ముస్లిముల నుండి అనేక మంది విద్రోహులు బయటకు వెళ్లిపోవడం జరిగింది.

ఖిబ్లా మార్పు సంఘటనలోని మరో సున్నితమైన విషయం ఏమిటంటే, ఇక ఓ కొత్త శకం ఆరంభం కానుంది. ఆ శకం, ఈ ఖిబ్లాను హస్తగతం చేసుకోనంతవరకు ప్రారంభం కాజాలదు. ఎందుకంటే, ఓ జాతికి ఓ ఖిబ్లా నిర్ణయించబడి అది శత్రువుల చేతిలో ఉంటే ఎలా? అందుకని దాన్ని శత్రువుల చేతి నుండి ఏదో విధంగా హస్తగతం చేసుకోవడం అవసరం అన్నదే సున్నిత విషయం.

ఈ ఆదేశాలు, ఈ సూచనలు అవతరించిన తరువాత ముస్లిముల ఆనందం అతిశయించింది. వారిలో దైవమార్గంలో జిహాద్ చేసే ఉత్సాహం, శత్రువును మార్కొనే కోరిక మరింత పెల్లుబుకింది.

     🛡⚔  *ఇస్లామీయ ప్రథమ నిర్ణయాత్మక సంగ్రామం* ⚔🛡

        🛡⚔ * బద్ర్ సంగ్రామం (గజ్వయె బద్రె కుబ్రా)* ⚔🛡

                            *↓* 

*In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment