🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 198 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 113*
*5. గజ్వయె బువాత్ (రబీ ఉల్ అవ్వల్ మాసం, హిజ్రీ శకం - 2, క్రీ.శ. సెప్టెంబర్ 623) : -*
ఈ పోరాటం కోసం దైవప్రవక్త (సల్లం) రెండొందల మంది సహాబా (రజి)లను తోడ్కొని బయలుదేరారు. దీని లక్ష్యం కూడా ఖురైష్ వర్తక బిడారాన్ని అడ్డుకోవడం. ఈ బిడారంలో "ఉమయ్యా బిన్ ఖల్ఫ్" వెంట ఖురైషులకు చెందిన వంద మంది మరియు రెండొందల ఒంటెలున్నాయి. మహాప్రవక్త (సల్లం) 'రిజ్వా' దాపులోని 'బువాత్' ★ వరకు వెళ్ళారు. కాని, అది వారికి తారసపడలేదు.
_(★ → బువాత్ మరియు రుజ్వా అనేవి "జుహైనా" కొండ వరసల్లోని రెండు కొండలు. అసలు అవి రెండూ ఒకే పర్వతానికి చెందిన శాఖలు. ఇవి సిరియా వెళ్ళే రహదారి ప్రక్కన మదీనాకు 48 మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలు.)_
ఈ "గజ్వా" సందర్భంలో దైవప్రవక్త (సల్లం) మదీనాకు "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)"ను అమీరుగా చేసి వెళ్ళడం జరిగింది. దీని పతాకవర్ణం కూడా తెలుపే. ఇది "హజ్రత్ సఅద్ బిన్ అబీ విఖాస్ (రజి)" గారి చేతిలో ఉంది.
*6. గజ్వయె సుఫ్'వాన్ (రబీ ఉల్ అవ్వల్ మాసం, హిజ్రీ శకం - 2, క్రీ.శ. సెప్టెంబర్ 623) : -*
ఈ పోరాటానికి వెళ్ళడానికి కారణం, "జబిన్ జాబిర్ ఫహారీ" అనే బహుదైవారాధకుడు ఓ చిన్న సైనిక పటాలంతో వచ్చి మదీనా పరిసర పచ్చిక మైదానాల్లో మేస్తున్న కొన్ని పశువుల్ని తోలుకొని వెళ్ళడం. దైవప్రవక్త (సల్లం) డెబ్భై మంది సహాబా (రజి)లతో అతణ్ణి వెంటాడారు. "బద్ర్" దరిదాపులో ఉన్న సఫ్వాన్ లోయ వరకు వెళ్ళినా అతడు వారికి దొరకలేదు. ఎలాంటి పోరాటం జరగకుండానే తిరిగి వచ్చారు.
ఈ "గజ్వా"ను కొందరు "గజ్వాయె బద్ర్రె ఊలా (మొదటి బద్ర్ పోరాటం)"గా అభివర్ణిస్తారు. ఈ "గజ్వా"కు వెళ్ళేటప్పుడు దైవప్రవక్త (సల్లం) మదీనా పాలనా పగ్గాలను "జైద్ బిన్ సాబిత్ (రజి)"కు అప్పగించి వెళ్ళడం జరిగింది. ఈ "గజ్వా" పతాకం రంగు తెలుపు. దీన్ని "హజ్రత్ అలీ (రజి)"ను ఎత్తుకొని ఉన్నారు.
*7. గజ్వయె జిల్ ఉషైరా (జమాదిల్ ఊలా మరియు జమాదిల్ ఉఖ్రా మాసాలు, హిజ్రీ శకం - 2, క్రీ.శ. నవంబరు, డిసెంబరు 623) : -*
ఈ సైనిక కార్యంలో నూటా యాభై లేదా రెండొందల మంది ముహాజిర్లు పాల్గొన్నారు. అయితే, ఈ దండు వెంట వెళ్ళమని మహాప్రవక్త (సల్లం) ఎవ్వరినీ బలవంత పెట్టలేదు. స్వారీ కోసం కేవలం ముప్పై ఒంటెలే ఉన్నాయి. ఈ సైనికులు వంతులవారీగా వాటిపై స్వారీ చేశారు. ఈ సరియ్యా లక్ష్యం, సిరియాకు వెళ్ళే ఓ వ్యాపార బిడారం. ఇది మక్కా నుండి బయలుదేరినట్లు, దాని వెంట ఖురైషులకు చెందిన బోలెడు వర్తక సామాగ్రి ఉన్నట్లు తెలిసింది.
దైవప్రవక్త (సల్లం), దాన్ని పట్టుకోడానికి "జుల్ అషైరా" వరకు వెళ్ళారు. అప్పటికే బిడారం చేయి దాటిపోయింది. సిరియా నుండి తిరిగి వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన బిడారమే అది. అయితే, దానికి బదులుగా "బద్ర్ యుద్ధం" సంభవించింది.
ఈ సైనిక కార్యం కోసం దైవప్రవక్త (సల్లం), జమాదిల్ ఊలా నెల చివరి రోజుల్లో బయలుదేరినట్లు ఇబ్నె ఇస్'హాక్ ఉల్లేఖనం ఉంది. తిరిగి జమాదిల్ ఉఖ్రాలో తిరిగివచ్చారు. ఈ కారణంగానే మాసానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం విషయంలో చరిత్రకారుల నడుమ అభిప్రాయ భేదం ఉంది.
ఈ "గజ్వా"లో దైవప్రవక్త (సల్లం), బనూ ముద్'లిజ్, వారి మిత్రపక్షాలైన బనూ జమ్రా తెగలతో నిర్యుద్ధ ఒడంబడికను చేసుకోవడం జరిగింది.
ప్రయాణంలో మదీనా బాగోగులను చూడడానికి మహాప్రవక్త (సల్లం), "హజ్రత్ అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్ మగ్జూమమీ (రజి)"కి బాధ్యతను అప్పజెప్పారు. ఇప్పుడు కూడా ఈ "గజ్వా" ధ్వజం తెలుపు రంగుదే. ఈ పతాకం "హజ్రత్ హమ్'జా (రజి)" గారి చేతిలో ఉంది.
*8. సరియ్యయె నఖ్లా (రజబ్ మాసం, హిజ్రీ శకం - 2, క్రీ.శ. జనవరి 624) : -*
ఈ సైనిక కార్యానికి మహాప్రవక్త (సల్లం), హజ్రత్ అబ్దుల్లా బిన్ హాజష్ (రజి) గారిని నాయకునిగా నియమించి పంపించారు. ఇందు పన్నెండు మంది ముహాజిర్లే ఉన్నారు. ఇద్దరేసి వ్యక్తులకు ఒక ఒంటె చొప్పున ఉంది. వీరు, వాటిపై వంతులవారీగా ఎక్కి వెళ్ళారు. ఈ పటాలం అమీరు (నాయకుడు)కు మహాప్రవక్త (సల్లం) ఓ లేఖ అందిస్తూ, *"రెండు రోజుల ప్రయాణం చేసిన తరువాత గాని దీన్ని చదవాలి."* అని తాకీదు చేశారు.
కనుక, రెండు రోజుల వరకు ప్రయాణించిన తరువాత ఆయన ఈ ఉత్తరాన్ని చదివారు. అందు ఇలా రాసి ఉంది...., *"మీరు నా ఈ లేఖను చదివినప్పుడు ముందుకు సాగి మక్కా మరియు తాయెఫ్ నడుమగల "నఖ్లా" వరకు వెళ్ళి ఆగండి. అక్కడ ఖురైషులకు చెందిన ఓ బిడారం కోసం కాచుకొని ఉండండి. మాకు సమాచారం పంపించండి."*
దళం నాయకుడు అది చదివి ప్రవక్త (సల్లం)ను విధేయిస్తూ తన అనుచరులకు విషయాన్నంతా చెప్పి, *"నేను మిమ్మల్నెవరినీ బలవంతం పెట్టడంలేదు. ఎవరు దైవమార్గంలో అమరగతి నొందదలిచాడో నా వెంట రండి, మరెవరికైతే తమ ప్రాణాలు కాపాడుకోవాలని ఉందో ఇక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళవచ్చు. ఇక నా విషయానికొస్తే నేను ముందుకే వెడతాను."* అని అన్నాడు.
ఈ మాటలు విని సహచరులంతా ఉత్సాహంతో నాయకుడ్ని అనుసరించడానికే అంగీకరించారు. అబ్దుల్లా (రజి) వారిని తీసుకొని "నఖ్లా" బయలుదేరారు. దారిలో 'బహ్రాన్' అనే ప్రదేశానికి చేరుకునేటప్పటికి అక్కడ "సఅద్ బిన్ అబీ విఖాస్ (రజి)", ఉత్బా బిన్ గుజ్వాన్ (రజి)"ల ఒంటెలు తప్పిపోయాయి. వీరిద్దరు తమ ఒంటెల్ని వెతుక్కోవడానికి బయలుదేరారు. ఇలా వారు వెనకపడిపోయారు. దారిలో కొందరు ఖురైష్ సైనికులు వారికి ఎదురయి వారిద్దర్ని బంధించి మక్కా తీసుకెళ్ళారు.
అటు, అబ్దుల్లా (రజి) దళం నఖ్లా చేరుకుంది. అక్కడ ఈ యోధులు ఖురైషీయుల కోసం ఎదురుచూస్తూ పొంచి ఉన్నారు.
అది రజబ్ నెల చివరి రాత్రి . ఈ మసక వెల్తురులో వారికి ఓ వర్తక బిడారం కనిపించింది. అది మరికాస్త సమీపానికి వచ్చింది. చూస్తే, అది ఖురైషీయుల వర్తకబిడారం. దానిపై ద్రాక్ష, జంతుచర్మాలు పుష్కలంగా ఉన్నాయి. బిడారం వెంట "అబ్దుల్లా బిన్ ముగైరా" ఇద్దరు కుమారులు "ఉస్మాన్" మరియు "నౌఫిల్"లు ఉన్నారు. వీరిద్దరు కాకుండా "అమ్రూ బిన్ హజ్రమీ" మరియు "హకీమ్ బిన్ కైసాన్ మౌలా ముగైరా"లు కూడా ప్రయాణిస్తున్నారు.
*"ఖురైషీయుల వాణిజ్య బృందం దగ్గరకి వచ్చింది. ఇప్పుడేం చేద్దాం?"* అబ్దుల్లా (రజి) సహచరులతో సంప్రదించారు.
*"ఈ రోజు వీరిని విడిచిపెడితే మక్కా (హరం)లో ప్రవేశిస్తారు. హతమారిస్తే, పవిత్ర మాసాన్ని అగౌరపరచినట్లవుతోంది."* అన్నారు కొందరు.
(మరొక ఉల్లేఖనంలో కొన్ని పదాలు అదనంగా కానవస్తాయి...., → *"మనం గనక పోరాటంలో పాల్గొంటే నిషిద్ధ మాస పవిత్రతను ఉల్లంఘించినట్లవుతుంది. రాత్రి గడిచేవరకు వేచి చూస్తే, వీరు 'హరాం (మక్కా)' హద్దుల్లోనికి వెళ్ళిపోతారు."* అని పరిపరి విధాల ఆలోచనలో పడిపోయారు.)
దాంతో అందరూ ఆలోచనలో పడిపోయారు. యుద్ధం చేయడానికి జంకుతున్నారు. అయితే, ఖురైషులు తమను దోచుకున్న సంగతి గుర్తొచ్చింది. అందువల్ల వారు, వాణిజ్యబృందంతో యుద్ధం చేయడానికే నిశ్చయించుకున్నారు.
ముస్లిములు యుద్ధానికి సిద్ధమయ్యారు. "వాఖిద్ బిన్ అబ్దుల్లా తమామి" విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలారు. అది సరాసరి "అమ్రూ బిన్ హజ్రమీ" శరీరంలోనికి దూసుకుపోయింది. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతనే వాణిజ్య బృందం నాయకుడు.
మిగతా వారు "ఉస్మాన్" మరియు "హకీమ్"లను బంధించారు. అయితే "నౌఫిల్" మాత్రం పారిపోవడంలో కృతకృత్యుడయ్యాడు.
ఆ తరువాత వీరు, ఇద్దరు ఖైదీలు మరియు బిడారంలోని వర్తక సామగ్రినంతా వెంటబెట్టుకొని మదీనా చేరారు. యుద్ధ ధనం నుండి ఖమ్స్ (అయిదో వంతు) తీసి పంచుకున్నారు కూడా ★. ఇవి ఇస్లామీయ చరిత్రలోని మొదటి ఖమ్స్, మొదటి హత్య మరియు మొదటి బందీలు.
_(★ → చరిత్రకారుల కథనం మాత్రం ఇదే. అయితే, ఖమ్స్ (అయిదో వంతు) ధనం తీసి పంచుకునే ఆదేశం "బద్ర్ యుద్ధం" జరిగినప్పుడు అవతరించిన ఆదేశం. ఈ కారణంగా ఖమ్స్ పంపకం గురించి వచ్చిన వివరాలన్నీ "బద్ర్ యుద్ధం" తరువాతివే. అంతకు పూర్వం ఖమ్స్ పంపకం గురించి ముస్లిములకు తెలియదు.)_
అలా వీరు, విజయోత్సాహంతో మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు ఈ శుభవార్త తెలియజేశారు. కాని, దైవప్రవక్త (సల్లం) వారిని చూడగానే ఆగ్రహోదగ్రులయి...., *"ఏమిటీ! మీరు పవిత్రమాసంలో రక్తపాతం జరిపారా? నేనందుకోసం మిమ్మల్ని పంపలేదే!"* అన్నారు.
(వేరొక ఉల్లేఖనంలో...., → "దైవప్రవక్త (సల్లం), వారి ఈ ప్రవర్తనను నిరసిస్తూ, *"నేను మిమ్మల్ని హరాం (నిషిద్ధ) నెలలో యుద్ధం చేసే ఆదేశం ఇవ్వలేదు, ఖైదీలు మరియు ధన పంపకం గురించి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు."* అని అన్నారు.")
అంతే, అబ్దుల్లా (రజి), ఆయన సైనిక సహచరుల గుండెలు ఝల్లుమన్నాయి.
*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment