197

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 197            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 112*     

*యుద్ధం చేయడానికి విశ్వప్రభువు నుంచి అనుమతి : -*

మక్కా అవిశ్వాసుల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. మదీనా ముస్లిములపై కవ్వింపు చర్యలకు పాల్పడసాగారు. అప్పుడు ఆత్మరక్షణ, ధర్మరక్షణల కోసం కత్తిపట్టి శత్రువులతో పోరాడటానికి అల్లాహ్ అనుమతి లభించింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) శత్రువుల కుట్రలు తెలుసుకోవడానికి ముస్లిములను కొన్ని బృందాలుగా చేసి మదీనా పట్టణం వెలుపల వివిధ ప్రాంతాలకు పంపించారు. ఈ బృందాలకు, శత్రువులతో యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వలేదు. శత్రువుల వర్తక బిడారాలను నిరోధించి, తమ సైనిక శక్తిని చూపి శత్రువుల గుండెల్లో బెదురు పుట్టించడమే వీరి లక్ష్యం. అందువల్ల వీరు ఆ పని నిర్వహిస్తూ, మదీనా దరిదాపుల్లోని తెగలతో శాంతి ఒప్పందాలు కూడా చేసుకున్నారు.

అటు మక్కాలో ఖురైష్ నాయకులకు తాము "ఇబ్నె ఉబై" ద్వారా పన్నిన పథకం విఫలమైనట్లు గూఢచారి వర్గాల ద్వారా తెలిసింది. తక్షణమే వారు దారున్నద్వాలో సమావేశమయ్యారు.

*"ఇతరుల్ని నమ్ముకొని బతుకుబండి లాగడం బుద్ధిహీనుల పని. తమ బాహుబలం పట్ల నమ్మకం ఉన్నవారే విజయం సాధించగలుగుతారు."* అన్నాడు అబూ జహల్.

*"నిజమే, మనం ఇతరుల మీద ఆధారపడటానికి బదులు మన దారి మనమే రూపొందించుకోవాలి."* అన్నాడు మరొక నాయకుడు.

*"మిత్రులారా! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన వాణిజ్యబృందం ఈ రోజు సిరియాకు బయలుదేరబోతోంది. మనం, మన పెట్టుబడుల్ని దానికిచ్చేయాలి. వ్యాపారంలో వచ్చే లాభం మొత్తాన్ని ఆయుధాలు, వాహనాలు తదితర యుద్ధసామాగ్రి కోసం వినియోగించాలి. ఈ విధంగా యుద్ధ ఖర్చుల సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు మనం సర్వసన్నద్ధులయి ముస్లిముల మీద గట్టి దెబ్బతీయగలం. మరో వైపు "అబ్దుల్లా బిన్ ఉబై"కు కూడా గుణపాఠం చెప్పవచ్చు."* అన్నాడు అబూ జహల్.

*"భేష్! చాలా బాగుంది పథకం"* అన్నారు మిగిలిన నాయకులంతా ముక్తకంఠంతో.

వెంటనే వారు తమ తమ పెట్టుబడుల్ని వాణిజ్య బృందానికి అప్పగించారు.

ఆ సమావేశంలో పాల్గొన్న "కర్జ్ బిన్ జాబిర్" అనే నాయకుడు ఏదో ఓ ఘనకార్యం వెలగబెట్టి ఇతర నాయకులపై తన ఆధిక్యత చాటుకోవాలని భావించాడు. మరునాడే అతను మూడొందల మంది యోధుల్ని తీసుకొని మక్కా నుంచి బయలుదేరాడు.

మదీనా శివారు ప్రాంతానికి చేరుకొని, అక్కడ పశువుల్ని మేపుకుంటున్న కాపర్లపై దాడిచేశాడు. అతను, నిరాయుధులైన పశువుల కాపర్లను నిర్దాక్షిణ్యంగా చితకబాది అనేక ఒంటెల్ని దోచుకెళ్ళాడు. ఒక కాపరిని హతమార్చడం కూడా జరిగింది.

ఈ సంగతి తెలిసిన ముస్లిం సైనిక బృందాలు వెంటనే శత్రువుల్ని పట్టుకోవడానికి వెంటాడాయి. కాని, వారు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు. దాంతో ముస్లిం సైనిక బృందాలు వెనక్కి తిరిగి వచ్చాయి. 

ఇది మక్కా ఖురైషుల నుంచి ఓ బహిరంగ హెచ్చరిక, ఒక సవాలు. మూడొందల మైళ్ళ దూరం సయితం ప్రయాణం చేసి, మీ ఆస్తుల్ని దోచుకొనిపోగల సత్తా తమకుందని ముస్లిములకు తెలియజేయడమే ఈ కవ్వింపు చర్యల ఉద్దేశ్యం. (← ఇందులోని వివరాలు ముందు రాబోతున్నాయి)

*యుద్ధ అనుమతి గురించి మరొక సీరతుల్ కితాబ్ ప్రకారం : - ↓*

*యుద్ధం అనుమతి : -*

మదీనాలో ముస్లిముల మనుగడకే సవాలుగా నిలుచున్న ఆ విషమ ఘడియల్లోనే అల్లాహ్ ముస్లిములకు యుద్ధం చేసే అనుమతిని ఇచ్చాడు. కాని, ఆ యుద్ధం వారిపై విధిగా చేయడం జరుగలేదు. ఈ సందర్భంలో అల్లాహ్ ఆదేశాలు ఏవైతే అవతరించాయో అవి ఇలాగున్నాయి...., ↓

*"ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్ వారిని ఆదుకోగల శక్తి గలవాడు." (ఖుర్ఆన్ 22:39).*

ఆ తరువాత ఈ ఆయత్ లకు సంబంధించినవే మరికొన్ని ఆయత్ లు అవతరించాయి. వాటిలో, ఈ అనుమతి కేవలం యుద్ధానికి బదులు యుద్ధమే కాకుండా అసత్యాన్ని తుదముట్టించి అల్లాహ్ చిహ్నాలను నెలకొల్పడం అని చెప్పడం జరిగింది.

*"(ఈ విశ్వాసులు ఎలాంటివారంటే) మేము గనక వారికి భూమిలో అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాతు (అనే విధ్యుక్త దానధర్మాన్ని) చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్ ఆధీనంలోనే ఉంది." (ఖుర్ఆన్ 22:41).*

ఈ అనుమతి హిజ్రత్ తరువాత మదీనాలో అవతరించిన అనుమతి. మక్కాలో కాదు అన్న విషయం ఇట్టే అర్థం అవుతోంది. అయితే దాని అవతరణ కాలం ఖచ్చితంగా చెప్పలేకుండా ఉన్నాం.

యుద్ధం చేసే అనుమతి అయితే అవతరించింది. కాని ఏ పరిస్థితిల్లో ఈ అనుమతి అవతరించిందో, ఆ పరిస్థితి ఖురైష్ యొక్క హద్దులు మీరి ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఉత్పన్నమైందే. అందుకని, ముస్లిములు తమ అధికార పరిధిని ఖురైషులు ప్రయాణించే వ్యాపార మార్గం వరకు విస్తరింపజేయాలన్నది వివేచనతో కూడిన విషయం. ఈ మార్గం మక్కా నుంచి సిరియాకు వెళ్ళే మార్గం. కాబట్టి, దైవప్రవక్త (సల్లం) ఈ అధికార విస్తరణ కోసం రెండు ప్రణాళికల్ని సిద్ధం చేశారు.

*1 →* ఏ తెగలైతే ఈ వ్యాపార రహదారికి ఇరుప్రక్కలు లేదా ఈ మార్గం నుండి మదీనా వరకు వ్యాపించి ఉన్న భూభాగంలో నివసిస్తున్న తెగలతో మిత్రత్వం, సహాయ సహకారాలు మరియు నిర్యుద్ధ ఒడంబడిక చేసుకోవడం.

*2 →* రెండో ప్రణాళిక, ఈ రహదారిపైకి గస్తీ పటాలాలను పంపించడం.

మొదటి ప్రణాళిక విషయంలో, గతంలో యూదులతో చేసుకున్న ఒడంబడికలాంటి ఒడంబడికనే వీరితో చేసుకోవడం. మహాప్రవక్త (సల్లం) సైనిక కవాతులు, గస్తీలు ప్రారంభించడానికి ముందు జుహ్నియా తెగతో అలాంటి ఒడంబడిక (అంటే మిత్రత్వం, సహాయ సహకారాలు అందించుకోవడం మరియు నిర్యుద్ధ ఒడంబడిక అన్నమాట) కుదుర్చుకోవడం జరిగింది. వీరి ఆవాసం మూడు మజిలీల్లో - అంటే ఒక్కొక్క మజిలీ 45 నుండి 50 మైళ్ళ దూరంలో - ఉంది. ఇదే కాకుండా గస్తీ సమయంలో మరికొన్ని తెగలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ వివరాలు ముందు రాబోతున్నాయి.

*సరాయా మరియు గజ్వాలు : -*

_("గజ్వా" అంటే మహాప్రవక్త (సల్లం) స్వయంగా పాల్గొన్న సైనిక యాత్ర. ఆ యాత్రలో యుద్ధం జరిగినా జరగకపోయినా అది "గజ్వా"గానే పిలువబడుతుంది. అలాగే "సరియా" అంటే దైవప్రవక్త (సల్లం) పాల్గొనని సైనిక యాత్ర. "సరియా"కు బహువచనమే "సరాయా".)_

యుద్ధం చేసే అనుమతి లభించగానే పై రెండు ప్రణాళికలను అమలు చేయడానికి గాను ముస్లిములు సైనిక గస్తీలను నిర్వహించనారంభించారు. మదీనా పరిసర ప్రాంతాల్లోని మార్గాల్లో, ముఖ్యంగా మక్కా నుండి మదీనాకు వచ్చే ప్రధాన రహదారిపై దృష్టిని ఉంచవలసి ఉంది. ఈ మార్గాలపై నివసించే తెగలతో సంధి కూడా కుదుర్చుకోవలసి ఉంది.

ఈ సైనిక గస్తీల ముఖ్యోద్దేశం, మదీనా పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న బద్దూలకు, ఆటవిక జాతులకు మరియు వివిధ తెగలకు, ముస్లిములు ఇది వరకటిలా బలహీనులు కారు, శక్తిని బాగా పుంజుకున్న వర్గమన్న విషయం తెలిసిరావడం. అదే కాకుండా ఖురైషులు అవలంబిస్తున్న తీవ్రమైన వైఖరికి, వారు మునుముందు తీవ్రమైన దుష్పరిణామాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించడం.

ఇప్పటికైనా మక్కా ఖురైషులు తమ వైఖరిని సరిదిద్దుకుని, దైవమార్గంలో ముస్లిములకు అడ్డుగా నిలువకుండా దైవప్రచార సందేశాన్ని స్వతంత్రంగా అరేబియాలో విస్తరింపజేసే వీలును కలిపిస్తే, వారి ఆర్థిక, ఔపాధిక వనరుల్ని రక్షించుకోగలరని, దానికి వారు ముస్లిములతో సంధికి దిగిరావాలని చెప్పడం.

ఈ ప్రధాన ఉద్దేశ్యాలను దృష్టిలో పెట్టుకునే ముస్లిములు తమ సైనిక గస్తీలను అధికం చేయనారంభించారు.

*ఈ "సరాయా" మరియు "గజ్వా"లకు సంబంధించిన వివరాలు టూకీగా ఇవి...., ↓*

*1. సరియా సీఫల్ బహ్ర్ ★ (రమజాన్ మాసం, హిజ్రీ శకం - 1, క్రీ.శ. మార్చి 623) : -*

_(★ → "సీఫుల్ బహ్ర్" అంటే సముద్ర తీరం అని అర్థం.)_

అల్లాహ్ ప్రవక్త (సల్లం), "హజ్రత్ హమ్'జా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రజి)"ను ఈ సరియాకు నాయకునిగా చేసి ముప్పై మంది ముహాజిర్లతో సిరియా నుండి వచ్చే ఓ ఖురైషుల వర్తక బిడారాన్ని కనుగొనేందుకు పంపించడం జరిగింది. ఆ బిడారంలో మూడు వందల మంది వరకు ఉన్నారు. వీరిలో "అబూ జహాల్" కూడా ఉన్నాడు.

ముస్లిములు "గీజ్"★ అనే పరిసర ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ బిడారం వారికి ఎదురైంది. ఇరుపక్షాలు యుద్ధం కోసం బారులు తీరారు. కాని, జుహైనా తెగకు చెందిన ఓ సర్దారు "మజ్దీ బిన్ అమ్రూ" ఇరుపక్షాలకు మిత్రుడైనందున, అతను ప్రయత్నం చేసి ఆ యుద్ధం జరగకుండా ఆపేశాడు.

_(★ → "గీజ్" అంటే, ఎర్ర సముద్రం దాపున "యంబూ" మరియు "మర్వా" నడుమగల ఓ ప్రదేశం.)_

"హజ్రత్ హమ్'జా (రజి)" చేతిలో ఉన్న యుద్ధ పతాకం, దైవప్రవక్త (సల్లం) తమ చేతుల మీదుగా ఆయనకు ఇచ్చిన మొదటి పతాకం. దాని రంగు తెలుపు. దాన్ని "హజ్రత్ అబూ మర్సిద్ కనాజ్ బిన్ హసీన్ గన్వీ (రజి)" ఎత్తుకొని ఉన్నారు.

*2. సరియ్యా రాబిగ్ (షవ్వాల్ మాసం, హిజ్రీ శకం -1, క్రీ.శ. ఏప్రిల్ 623) : -*

మహాప్రవక్త (సల్లం), "హజ్రత్ అబూ ఉబైదా బిన్ హారిస్ బినుల్ ముత్తలిబ్ (రజి)" గారికి అరవై మంది ముహాజిర్ల ఉష్ట్రారోతుల్నిచ్చి పంపించిన "సరియ్యా" అది. "రాబిగ్" లోయలో "అబూ సుఫ్'యాన్" ఎదురుపడ్డాడు. అతని వెంట రెండొందల మంది ఉన్నారప్పుడు. ఇరుపక్షాలు బాణాలు సంధించుకున్నాయి. అంతేతప్ప ఎలాంటి యుద్ధం జరగలేదు.

ఈ "సరియ్యా"లో మక్కాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముస్లిములతో వచ్చి కలసిపోయారు. వారిలో ఒకాయన "హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రూ అల్ బహ్రానీ (రజి)", ఇంకొకరు "ఉత్బా బిన్ గుజ్వాన్ (రజి)".

వీరిరువురు ఇదివరకే ఇస్లాం స్వీకరించారు. ఎలాగో ఓలాగు ముస్లిములతో చేరిపోదామనే ఉద్దేశ్యంతోనే ఈ బిడారం వెంట వచ్చినవారు.

"హజ్రత్ అబూ ఉబైదా (రజి)" జెండా రంగు కూడా తెలుపే. ఇది "హజ్రత్ మిస్తహ్ బిన్ అసాసా బిన్ ముత్తలిబ్ బిన్ అబ్దె మునాఫ్ (రజి)" గారి చేతిలో ఉంది.

*3. సరియ్యా ఖర్రార్ ★ (జీఖాదా మాసం, హిజ్రీ శకం - 1, క్రీ.శ. మే 623) : -*

*(★ → "హుజ్ఫా"కు దాపున ఉన్న ఓ ప్రదేశం.)*

ఈ "సరియ్యా" అమీర్ గా దైవప్రవక్త (సల్లం), "హజ్రత్ సఅద్ బిన్ అబీ విఖాస్ (రజి)"ను నియమించారు. వారి వెంట ఇరవై మంది సైనికులున్నారు. వీరిని కూడా ఖురైషుల వర్తక బిడారం ఆచూకీ కోసమే పంపించడం జరిగింది. వెళ్ళేటప్పుడు "ఖర్రార్" దాటి వెళ్ళవద్దని తాకీదు కూడా చేసి పంపించడం జరిగింది. వీరు కాలినడకనే బయలుదేరారు. రాత్రి పూట ప్రయాణిస్తూ పగటి పూట ఎవరి కంటబడకుండా దాగి ఉండేవారు.

ఐదో రోజు ఉదయాన "ఖర్రార్"కు చేరినప్పుడు, బిడారం ఒక రోజు ముందే వెళ్ళిపోయిందని తెలిసింది. ఈ "సరియ్యా" పతాకం కూడా తెలుపు రంగుదే. దీన్ని "హజ్రత్ మిగ్దాద్ బిన్ అమ్రూ (రజి)" ఎత్తుకొని ఉన్నారు.

*4. గజ్వయె అబ్'వా లేదా వద్దాన్ ★ (సఫర్ మాసం, హిజ్రీ శకం - 2, క్రీ.శ. ఆగష్టు 623) : -*

*(★ → మక్కా మరియు మదీనా నడుమన ఉన్న ప్రదేశం. ఇది "రాబిగ్" నుండి "మదీనా"కు వెళ్ళే మార్గం పై 29 మైళ్ళ దూరాన ఉంది. "అబూ వద్దాన్" అనేది దాని దాపులోనే ఉన్న మరో ప్రదేశం పేరు.)*

ఈ సైనిక కార్యంలో డెబ్భై మంది ముహాజిర్ల వెంట దైవప్రవక్త (సల్లం) కూడా ఉన్నారు. మదీనా బాధ్యనంతా ఆయన (సల్లం), "హజ్రత్ సఅద్ (రజి) బిన్ ఉబాదా"కు అప్పగించి వెళ్ళారు. ఈ ఆపరేషన్ ధ్యేయం, మార్గమధ్యంలోనే ఓ వర్తక బిడారాన్ని అడ్డుకోవడం. మహాప్రవక్త (సల్లం), వద్దాస్ వరకు వెళ్ళినా అది తారసపడలేదు.

ఈ గజ్వాలోనే దైవప్రవక్త (సల్లం) బనూ జమ్రా తెగ సర్దారు, "అమ్రూ బిన్ మఖ్షిజ్జమరీ"తో స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పందం ఇలా రాయబడింది.

*"ఇది జమ్రా కోసం అల్లాహ్ ప్రవక్త (సల్లం) తరఫున రాసి ఇచ్చిన పత్రం. వీరు తమ ధన ప్రాణాల విషయంలో నిశ్చింతగా ఉండాలి. వీరిపై ఎవరైనా దాడి చేస్తే వారికి వ్యతిరేకంగా సహాయం చేయడం జరుగుతుంది. అయితే, వీరు దైవధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే తప్ప. ఈ ఒప్పందం శాశ్వతమైన ఒప్పందం. మా సహాయం కోసం వారిని పిలిచినప్పుడు వారు రావలసి ఉంటుంది."*

మహాప్రవక్త (సల్లం) స్వయంగా బయలుదేరిన సైనిక ఆపరేషన్ ఇది. పదిహేను రోజుల వరకు మదీనాను వదిలి బయట గడిపి తిరిగి వచ్చారయన (సల్లం). ఈ సైనిక పటాలం జెండా రంగు తెలుపు. "హజ్రత్ హమ్'జా (రజి)" దాన్ని ఎత్తుకున్నారు.

*5. గజ్వయె బువాత్ (రబీ ఉల్ అవ్వల్ మాసం, హిజ్రీ శకం - 2, క్రీ.శ. సెప్టెంబర్ 623) : - ↓*

*In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment