196

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 196            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 111*     

             *సాయుధ పోరాటాలు*

దైవప్రవక్త (సల్లం) మక్కా వదలి మదీనాకు వలసపోయిన దగ్గర్నుంచి, మక్కా ఖురైషీయులు ఆగ్రహావేశాలతో భావికర్తవ్యం గురించి తీవ్రంగా ఆలోచించసాగారు.

*"చూస్తుండగానే ముస్లిములు అనేకమంది మక్కా పట్నం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ముహమ్మద్ (సల్లం) కూడా మనందరి కళ్ళు గప్పి మదీనా వెళ్ళిపోయాడు. అక్కడ అంతకుముందే చాలా మంది ఆయన (సల్లం)ని విశ్వసించి ఉన్నారు. ఆ తరువాత మదీనా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముహమ్మద్ (సల్లం) ప్రభావం పడుతోంది. ఇలా దేశమంతా ముస్లిములు వ్యాపించి కొద్ది కాలంలోనే మనల్ని నిలువ నీడ లేకుండా చేసేస్తారు. ఆ పరిస్థితి రాకముందే మనం ముహమ్మద్ (సల్లం) ఉద్యమాన్ని మొగ్గలోనే త్రుంచివేయాలి."* ఈ ఆలోచనతో బహుదైవారాధకులు తల్లడిల్లిపోయారు.

మక్కా ఖురైషీయుల పోరు పడలేక దైవప్రవక్త (సల్లం) మదీనా వస్తే, ఇక్కడ మరో విధమైన శత్రువులు తయారయ్యారు. వారే, ముస్లిముల రూపాల్లో ఉన్న గోముఖవ్యాఘ్రాలు (మునాఫిఖ్ లు). వారికి "అబ్దుల్లా బిన్ ఉబై" నాయకుడు. మదీనా ప్రజలు అతడ్ని రాజుగా చేయబోయే తరుణంలో దైవప్రవక్త (సల్లం) వచ్చి మదీనా పౌరుల హృదయాలను చూరగొని వారికి అగ్రనాయకులయ్యారు. అందుకే, దైవప్రవక్త (సల్లం) అంటే "అబ్దుల్లా బిన్ ఉబై"కు కసి.

పైకి ముస్లిముగా మారి లోలోన కుట్రలు పన్నుతూ అవకాశం కోసం చూస్తున్న కపటాగ్రేశ్వరుడు. అతనికి యూదులు కూడా తోడయ్యారు. అమాయక ప్రజల్లో అసత్య ప్రచారం చేసి ఇస్లాం పట్ల అనుమానాలు, అపోహలు రేకేత్తించడమే వారి నిత్యకృత్యాలు.

_↑ ఇందులోని మరియు ఆ తరువాత జరిగిన సంఘటనలలో మరింత వివరణ ↓_

*హిజ్రత్ అనంతరం ఖురైషీయులు పన్నిన కుట్రలు, కుతంత్రాలు - అబ్దుల్లా బిన్ ఉబైతో జరిగిన సంప్రదింపులు : -*

మక్కా దైవతిరస్కారులు ముస్లిములపై జరిపిన హింసా దౌర్జన్యాలెలాంటివో, ముస్లిములు హిజ్రత్ చేసి మదీనాకు తరలి వచ్చేటప్పుడు వారికి వ్యతిరేకంగా జరిపిన అక్రమాలు, హిజ్రత్ చేసినందుకు గాను ముస్లిముల ఆస్తిపాస్తులు హస్తగతం చేసుకున్న తీరు వగైరాల గురించి మనం ఇదివరకే చదువుకుని ఉన్నాం.

కాని, ఇప్పుడు వారి ఆగడాలు ఇంకా సమసిపోలేదు. వారు తమ రాక్షస ప్రవృత్తిని ఇంకా వదలలేకపోయారు. పైగా, ముస్లిములు వారి పట్టు నుండి జారిపోయినందున వారి ఆ ఆగ్రహం మరింత పెచ్చు పెరిగిపోయింది. ముస్లిములకు మదీనాలో ఓ ప్రశాంతమైన నెలవు లభ్యం అయిందని తెలసి అగ్గిమీద గుగ్గిలమైపోయారు.

అందుకని వారు "అబ్దుల్లా బిన్ ఉబై"ను - అతను ఇంకా బాహాటంగా బహుదైవారాధకుడుగానే ఉన్నాడు - అన్సార్ నాయకత్వం కోసం ఎన్నుకోబడిన వ్యక్తిగా, దైవప్రవక్త (సల్లం) మదీనాకు రాకపోయినట్లయితే అన్సారులు అతనినే తమ రాజుగా నియమించుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారన్న విషయం ఖురైషులకు బాగా తెలుసు _(← ఇదే విషయం, 188 వ భాగములో మనం తెలుసుకున్నాం)._

గనుక "అబ్దుల్లా బిన్ ఉబై" పలుకుబడిని, స్థాయిని దృష్టిలో పెట్టుకొని, అతనికి ఓ బెదిరింపు లేఖను పంపించారు. ఆ లేఖలో "అబ్దుల్లా బిన్ ఉబై"ను, అతని బహుదైవారాధక అనూయాయులను సంబోధిస్తూ...., ↓

*"మీరు మా మనిషికి శరణమిచ్చి ఉన్నారు. అందుకని మేము అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాం. మీరు అతనితో యుద్ధం అన్నా చేయండి లేదా అతణ్ణి మదీనా నుండి వెళ్ళగొట్టనన్నా వెళ్ళగొట్టండి. అలా కాని పక్షంలో మేము, మా పూర్తి బలంతో మీపై దాడిచేసి మీ యోధులనందరిని సంహరించేస్తాం. మీ స్త్రీల మానాన్ని, శీలాన్ని కూడా కొల్లగొడ్తాం జాగ్రత్త"* అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

ఈ లేఖ అందీఅందగానే "అబ్దుల్లా బిన్ ఉబై" తన బహుదైవారాధక మిత్రులందరినీ, ఖురైషుల ఆదేశాలను పాలించడానికి సమావేశపరిచాడు. ఈ విషయంలో అతను తొందరపడడానికి కారణం లేకపోలేదు. అదేమిటంటే, దైవప్రవక్త (సల్లం) అతని నుండి అధికారాన్ని, రాచరికాన్ని లాక్కున్నందున, అతని మనస్సులో ఆయన (సల్లం) ఎడల విద్వేషం బాగా పెరిగిపోయి ఉంది.

అతనికి ఈ లేఖ అందడంతోనే అతనూ, అతని అనుయాయులు దైవప్రవక్త (సల్లం)తో యుద్ధం చేయడానికి సమాయత్తమయ్యారు. ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియగానే ఆయన (సల్లం) వారి దగ్గరకు వచ్చి...., *"ఖురైషులు చేసిన బెదిరింపుకు మీరు అతిగా ప్రభావితులై ఉన్నారట్లుంది. మీరు మిమ్మల్ని నష్ట పెట్టదలచుకుంటే చెప్పండి, ఖురైష్ మాత్రం మీకు అంత నష్టం కలిగించలేరు. మీరు మీ కుమారులతో, సోదరులతో పోరాడదలచుకున్నారా?"* అని చెప్పారు.

బహుదైవారాధకులు, దైవప్రవక్త (సల్లం) మాటల్లోని యదార్థం గ్రహించి, ఒప్పందానికే కట్టుబడి ఉంటామని చెప్పారు. ఆ తరువాత వారంతా "అబ్దుల్లా బిన్ ఉబై" వైపు అసహ్యంగా, అనుమానాస్పదంగా చూసి వెళ్ళిపోయారు. ఇబ్నె ఉబై నిర్ఘాంతపోయి గుడ్లప్పగించి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.

"అబ్దుల్లా బిన్ ఉబై" అప్పుడైతే యుద్ధానికి సంబంధించిన ఆలోచనను మానుకున్నాడు. అతని అనుయాయులు బెదిరిపోయారు, విషయం వారికి అర్థమైంది కనుక అతను మిన్నకుండిపోయాడు. అయితే ఖురైషులతో అతని రహస్య మంతనాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. అతను ముస్లిములు మరియు బహుదైవారాధకుల నడుమ చిచ్చుపెట్టే ఏ అవకాశాన్నీ చేజారకుండా జాగ్రత్తపడనారంభించాడు. దీనికిగాను, అతను యూదులతో కూడా ఈ విషయంలో సహాయం పొందడానికి మంతనాలను సాగిస్తూనే ఉన్నాడు. మహాప్రవక్త (సల్లం) గారి వివేచన, ఉన్నట్లుండి రగిలే చిచ్చును ఆర్పివేస్తూ ఉండేది.

*ఖురైషీయుల కుట్ర గురించి తెలిసి, ఆగ్రహించిన ముస్లిములు : -*

మక్కా ఖురైషీయుల యుద్ధదాహం సంగతి, ముస్లిం యువకుల్లో రక్తం ఉడికించింది. శత్రువులు తమను చిత్రహింసలు పెట్టి, కట్టుబట్టలతో జన్మభూమిని వీడిపోయేలా చేసిన దుర్భర రోజులు వారి కళ్ళ ముందు ఇంకా మెదలుతూనే ఉన్నాయి. అందువల్ల, *"ఇక అన్యాయాన్ని ఎంతమాత్రం సహించకూడదు, దౌర్జన్యాన్ని అరికట్టాలి, ఇస్లామీయ ఉద్యమ మార్గంలో అవరోధాలు సృష్టిస్తున్న శత్రువులకు గుణపాఠం నేర్పాలి, కాబా దర్శనానికి పెట్టిన ఆంక్షల్ని అంతమొందించి దైవభాక్తులకు స్వేచ్ఛ కలిగించాలి."* అని నిర్ణయించుకున్నారు యువకులు.

ఆ తరువాత వారు దైవప్రవక్త (సల్లం)ను కలుసుకొని, శత్రువులతో యుద్ధం చేయడానికి అనుమతి అడిగారు. కాని, కారుణ్యమూర్తి (సల్లం) యుద్ధానికి బదులు సంధికి, పగసాధింపుకు బదులు క్షమాపణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు. నిజానికి ఇప్పటి పరిస్థితి చూస్తే, ఖడ్గానికి బదులు ఖడ్గంతో జవాబియ్యకపోతే పరిస్థితి విషమించేలా ఉంది. కాని, దానికైనా విశ్వప్రభువు నుండి అనుమతి రావాలి కదా? అందువల్ల అప్పటిదాకా సహనం వహించమని దైవప్రవక్త (సల్లం) వారికి నచ్చజెప్పారు.

*ముస్లిములను మస్జిదె హరాంలో ప్రవేశించకుండా అడ్డుకోవడం : -*

ఆ కాలంలోనే "హజ్రత్ సఅద్ బిన్ ముఆజ్ (రజి)" ఉమ్రా చేయడానికి మక్కాకు వెళ్ళారు. ఆయన, "ఉమయ్యా బిన్ ఖల్ఫ్"కు అతిథిగా ఉండి, అతనితో...., *"నేను కాబా గృహ ప్రదక్షిణ చేసుకోవడానికి ఖాళీగా ఉన్న సమయం ఏదో చెప్పండి?"* అని అడిగారు.

ఉమయ్యా ఆయన్ను మధ్యాహ్న సమయంలో వెంట బెట్టుకుని బయలుదేరగా మార్గంలో "అబూ జహల్" కలిశాడు. అపుడు అబూ జహల్, ఉమయ్యాను సంబోధిస్తూ....,

*అబూ జహల్ : -* అబూ సుఫ్'వాన్! నీ వెంట ఉన్న ఈ వ్యక్తి ఎవరూ?

*ఉమయ్యా* : - ఈయన సఅద్ (రజి).

అని పరిచయం చేశాడు. అప్పుడు అబూ జహల్, సఅద్ (రజి)ను ఉద్దేశించి....,

*అబూ జహల్ : -* ఓహో! నీవు ఎంత తీరిగ్గా కాబా గృహం తవాఫ్ చేస్తున్నావే! మిమ్మల్ని, ధర్మభ్రష్టులు వారి రక్షణలో తీసుకున్నారు కదా! మీరు వారికి సహాయపడతామని బీరాలు కూడా పలుకుతున్నారట. విను! దైవసాక్షి! నీవేగనక అబూ సుఫ్'వాన్ వెంట ఉండి ఉండకపోతే నీ ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళేవాడవు కావు!

ఇది విన్న హజ్రత్ సఅద్ (రజి)కు కోపం వచ్చి....,

*సఅద్ (రజి) : -* నీవు కూడా బాగా విను, దైవసాక్షి! నీవే గనక నన్ను ఈ తవాఫ్ చేయకుండా అడ్డుకున్నావో, నేను కూడా నీ దృష్టిలో అంతకంటే విలువైన దాన్నుండి అడ్డుకోగలను. (అంటే, "మదీనావాసుల దాపు నుండి వెళ్ళే నీ (వర్తక బిడారాన్ని) మార్గం నుండి అన్నమాట." అని బదులిచ్చారు.)

*ముహాజిర్లకు ఖురైషుల బెదిరింపు : -*

ఆ పిదప ఖురైషీయులు, ముస్లిముల వద్దకు, *"మీరు మక్కా నుండి తప్పించుకొని బయటపడ్డారని గర్వపడకండి, మేము యస్రిబ్ కు చేరి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాం."* అనే బెదిరింపును పంపించారు.

ఇది కేవలం ఒక బెదిరింపే కాదు, దైవప్రవక్త (సల్లం)కు ఖురైష్ ఎత్తుగడలు, దురాలోచనల గురించి పూర్తిగా తెలిసిన పిమ్మట ఆయన (సల్లం) రాత్రిపూట నిద్రించేవారుకారు. సహాబా (రజి) గారి పహారాలో ఉండేవారు (సహీ బుఖారి).

*సహీ ముస్లిం గ్రంథంలోని హజ్రత్ ఆయిషా (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం....; ↓*

మహాప్రవక్త (సల్లం) మదీనాకు అరుదెంచిన తరువాత ఓ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు. *"నా సహాబాల్లో ఎవరైనా ఈ రాత్రి నా వద్ద పహారా కాస్తే ఎంత బాగుండును."* అని కూడా అన్నారు.

అంతలోనే ఆయుధాల చప్పుళ్ళు వినరాగా, *"ఎవరూ?"* అని అడిగారు.

*"నేను 'సఅద్ బిన్ అబీ వికాస్"ను దైవప్రవక్తా!"* అని సమాధానం వచ్చింది.

*"ఎందుకొచ్చినట్లు"* అని అడిగారాయన (సల్లం).

*"నా మనస్సులో మీ గురించి ప్రమాద శంక ఉత్పన్నమైంది. అందుకని నేను పహారా కాయడానికి వచ్చాను"* అని బదులిచ్చారాయన.

ఇది విన్న దైవప్రవక్త (సల్లం) ఆయన్ను దీవించి నిశ్చింతగా నిద్రపోయారు.

ఈ పహారాలు కొన్ని రాత్రుల వరకే పరిమితం కాలేదన్న విషయం గమనార్హం. ఈ పహారాలు శాశ్వతంగా ఉండేవి. ఓ రాత్రి దైవప్రవక్త (సల్లం) గారు ఉన్నచోట పహారా కాయడం జరుగుతోంది. అప్పుడు, *"అల్లాహ్ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు"* అనే దివ్యవాణి అవతరించింది.
అప్పుడు మహాప్రవక్త (సల్లం) తల బయటకు తీసి, *"ప్రజలారా! వెనక్కు వెళ్ళిపోండి, అల్లాహ్ నన్ను రక్షించే బాధ్యత తీసుకున్నాడు."* అన్నారు.

ఈ ప్రమాదం కేవలం మహాప్రవక్త (సల్లం) గారొక్కరి మట్టుకే పరిమితంగా లేదు. ముస్లిములందరికీ ప్రమాద శంక ఉండింది.

*హజ్రత్ ఉబై బిన్ కఅబ్ (రజి) గారి ఉల్లఖనం ప్రకారం....; ↓*

దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరులు మదీనాకు అరుదెంచిన తరువాత, అన్సారులు వారికి తమ వద్ద రక్షణ కల్పించినప్పటి నుంచి పూర్తి అరేబియా ద్వీపకల్పమే సంఘటితంగా ఆయన (సల్లం)కు ఎదురు నిలిచింది. అందుకని వారు ఆయుధాలు లేకుండా రాత్రి గడపడంగానీ, నిరాయుధులుగా తిరగడంగానీ చేయలేదు.

*యుద్ధం చేయడానికి విశ్వప్రభువు నుంచి అనుమతి : -*

మక్కా అవిశ్వాసుల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. మదీనా ముస్లిములపై కవ్వింపు చర్యలకు పాల్పడసాగారు. అప్పుడు ఆత్మరక్షణ, ధర్మరక్షణల కోసం కత్తిపట్టి శత్రువులతో పోరాడటానికి అల్లాహ్ అనుమతి లభించింది.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment