🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 195 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 110*
*ముస్లిములకు శిక్షణ : -*
మదీనాకు వలసవచ్చిన తొలి రోజుల్లో దైవప్రవక్త (సల్లం) ఎక్కువ సమయాన్ని మస్జిద్ లోనే గడుపుతుండేవారు. అక్కడ ఆయన (సల్లం), ముస్లిములకు ఇస్లాం విధులేమిటో, మానవీయ విలువలేమిటో తెలియజేస్తూ వారికి ప్రేమ, సోదరభావాలను గురించి శిక్షణ ఇస్తుండేవారు. దయ, జాలి, సానుభూతుల్ని గురించి ఉద్భోదిస్తుండేవారు. *"విశ్వాసం అంటే ఏమిటి"*, *"విశ్వాసులు నిర్వహించవలసిన బాధ్యతలేమిటి"*, *"దైవప్రీతి పొందటానికి ఏం చెయ్యాలి"* మొదలైన విషయాల్ని ఆయన (సల్లం) తన అనుచరులకు బోధిస్తూ ఉండేవారు.
దైవప్రవక్త (సల్లం), ప్రజలకు "ఖుర్ఆన్" వాణి వినిపించాలన్నా, ఉపన్యాసమివ్వాలన్నా లేదా ఏదైనా కొత్త విషయం తెలియజేయాలన్నా మస్జిద్ లొనే చేసేవారు. ప్రజలు ఆయన (సల్లం) చుట్టూ గుమిగూడేవారు. దైవప్రవక్త (సల్లం) ప్రసంగం చేయవలసివస్తే వేదిక మొదటి మెట్టు ఎక్కి నిలబడేవారు. సంభాషణ కొరకైతే రెండవ మెట్టుపై కూర్చుండేవారు.
ముహాజిర్ ముస్లిములకు దైవప్రవక్త (సల్లం) సాన్నిహిత్య భాగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండేది. వారు స్వేచ్ఛగా ఆయన (సల్లం) దగ్గరకు వస్తూ పోతుండేవారు. అనుక్షణం, ఆయన (సల్లం) వెన్నంటి ఉంటూ, మంచి శిక్షణ పొందేవారు.
ఇక అన్సార్ ముస్లిములయితే దైవప్రవక్త (సల్లం)ను చూసి, తమకు అత్యంత దయామయుడైన నాయకుడు లభించాడని సంబరపడిపోయేవారు. ఆయనే (సల్లం), వేరుపడిన వారి హృదయాలను కలిపి, వారి అంతర్గత గాయాలకు ఉపశమనం చేకూర్చారు. ఒకప్పుడు వారు పరస్పరం పచ్చి నెత్తురు తాగే ఆగర్భశత్రువుల్లా ఉండేవారు. దైవ సందేశహరుని (సల్లం) రాకతో వారిప్పుడు ప్రాణమిత్రులయి పోయారు.
దైవప్రవక్త (సల్లం) ముస్లిములకు దయార్ద్ర హృదయుడైన తండ్రిలాంటి వారు; ఎంతో వాత్సల్యం, సానుభూతులుగల సోదరుని వంటివారు; ఆదర్శవంతమైన మంచి నాయకుడు. ఎక్కడైనా ఎవరైనా కలిస్తే ముందుగా దైవప్రవక్త (సల్లం) వారికి సలాం చేసి కరచాలనం చేసేవారు. ఎవరైనా ఏదైనా కావాలని వస్తే, వారు చెప్పకముందే వారి అవసరాలు ఏమిటో విచారించేవారు. ఆయన (సల్లం) ముఖం నిత్యవికసిత పద్మం. ఆయన (సల్లం) నమ్రత, సౌమ్యతలకు ప్రతీక.
ఓ సారి దైవప్రవక్త (సల్లం) ఒక సమావేశానికి వెళ్ళారు. ఆయన (సల్లం) రావడం చూసి ఆయన (సల్లం) అనుచరులంతా గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. కాని ఇది ఆయన (సల్లం)కు నచ్చలేదు.
*"కూర్చున్నవారు ఏ ఒక్కరి గౌరవసూచకంగా లేచి నిలబడకూడదు. ఇది ఇస్లామేతర పధ్ధతి. ముస్లిమేతరులు, తమ నాయకుల పట్ల గౌరవమర్యాదలు వ్యక్తపరచుకోవడానికి ఇలా లేచి నిలబడతారు."* అన్నారు ఆయన (సల్లం).
ప్రజలు, దైవప్రవక్త (సల్లం) పాదపద్మాలను కళ్ళకు అద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని, ఆయన (సల్లం) అలాంటి పనిని కూడా వ్యతిరేకించారు.
🌹🌹 *"మీరు నన్ను మరీ పైకెత్తకండి. క్రైస్తవులు, "ఈసా (అలైహి)"ను దేవుని స్థాయి కన్నా పైకెత్తారు. మీరలా చేయకండి. నేను దేవుని దాసుడ్ని మాత్రమే. కనుక మీరు నన్ను దేవుని దాసుడిగా, ఆయన ప్రవక్తగా మాత్రమే పరిగణించండి."* అని చెప్పారు ఆయన (సల్లం). 🌹🌹
ఆడంబరాలన్నా, పటాటోపాలన్నా ఆయన (సల్లం)కు ఎంతమాత్రం నచ్చవు. ఆయన (సల్లం), నిరాడంబరత, నిర్మలత, ఆప్యాయత, అనురాగాలు మూర్తీభవించిన మహానాయకుడు.
ఓ సారి ఆయన (సల్లం) ప్రజలకు హితోపదేశం చేస్తూ ఇలా అన్నారు....; ↓
*"నరకాగ్ని నుండి కాపాడుకోవడం గురించి చింతించండి. దాని కోసం ఓ ఖర్జూరపు పండయినా సరే దానం చేయండి. ఇది కూడా లభించకపోతే మంచి మాటలు పలకండి. (ఇదీ సత్కార్యమే). ప్రతి సత్కార్యానికి పదింతలు పుణ్యం లభిస్తుంది."*
*"అన్నిటికంటే మంచిపని ఏమిటి?"* అడిగాడు ఒకతను.
*"నిరుపేదలకు అన్నదానం చేయండి. తమవారని, పరాయివారని భేదభావం చూపకుండా ప్రతి ఒక్కరికీ సలాం చేయండి."* అన్నారు ఆయన (సల్లం) సమాధానంగా.
*అజాన్ (అదాన్)*
మదీనాలో, మొదట నమాజ్ కోసం ప్రజలను పిలువడానికి ఏ పధ్ధతీ లేదు. ప్రజలు తమంతటా తామే మస్జిద్ లో గుమిగూడి సామూహికంగా నమాజ్ చేసేవారు. అప్పుడు ముస్లిములు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఎలాగో పని జరిగిపోయింది. ఇప్పుడు ముస్లిం జనసంఖ్య అధికమయింది. "నమాజ్ వేళయింది" అని దూరాన ఉన్న వారికి తెలియజేయడానికి ఒక పధ్ధతి అంటూ ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
అప్పుడు కొందరు అనుచరులు యూదుల మాదిరిగా "బాకా" ఊద్ధామని సూచించారు. మరికొందరు "గంట" కొడ్దామన్నారు. కాని, దైవప్రవక్త (సల్లం)కు ఈ బాకా ఊదుడు, గంటకొట్టుడు నచ్చలేదు. మరికొందరు కూడా దీన్ని వ్యతిరేకించారు.
అయితే, "క్రైస్తవుల మాదిరిగా శంఖం పూరిద్దాము" అని ఇంకొందరు అన్నారు. ఈ సలహా చాలా మందికి నచ్చింది. ఎందుకంటే యూదుల కంటే, క్రైస్తవులు ముస్లిముల పట్ల కాస్త సన్నిహితంగా మసలుకుంటారు. వీరు, యూదుల్లా ఇస్లాం ను విరోధించే, కుట్రలు పన్నే దుర్మార్గులు కాదు.
ఈ విషయం పై ఏకీభావం కుదరగానే శంఖం ఏర్పాటు చేయమని, దైవప్రవక్త (సల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ని ఆదేశించారు. సరేనని హజ్రత్ ఉమర్ (రజి) ఇంటికి వెళ్ళిపోయారు.
హజ్రత్ ఉమర్ (రజి) అదే ఆలోచనలతో ఆ రాత్రి నిద్రపోయారు. కాస్సేపటికి స్వప్న జగత్తులో (కలలో) విహరించసాగారు.
*"గంటేమిటి గంట!! అజాన్ చెప్పండి, అజాన్"* అన్నారు ఎవరో కలలో కనిపించి.
ఉషోదయమయింది. హజ్రత్ ఉమర్ (రజి) మేల్కొన్నారు. ఈ విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియజేద్దామని బయలుదేరారు. అంతలో ఎక్కడనుంచో మధురాతి మధురమైన పలుకులు వినిపించసాగాయి.
*"అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అష్'హదుఅన్ లాఇలాహ ఇల్లల్లాహ్...."*
ఈ మధుర వచనాలు విని, హజ్రత్ ఉమర్ (రజి) గబగబా నడచి మస్జిద్ కు చేరుకున్నారు. హృదయాల్లో అమృతం చిలికించే ఈ సుమధుర ధ్వని, మస్జిద్ పక్కనే ఉన్న ఓ ఇంటి కప్పు పైనుండి వస్తోంది. చూస్తే, ఆ ఇంటి కప్పుపై హజ్రత్ బిలాల్ (రజి) నిలబడి ఉన్నారు. మస్జిద్ దగ్గర అటూ ఇటూ అనేకమంది ముస్లిములు నిలబడి వింటున్నారు ఆ విచిత్ర పలుకులు.
*"ఎవరు తెలిపారు ఈ ఆజాన్ పలుకులు?"* అడిగారు ఉమర్ (రజి) ఆశ్చర్యంతో.
*"ఇందాక అబ్దుల్లా బిన్ జైద్ (రజి) వచ్చి, రాత్రి తన కలలో జరిగిన సంఘటన తెలియజేశారు. ఆయన కలలో ఒక మనిషి ఎదురుగా వచ్చి నిల్చున్నాడట. అతని చేతిలో ఓ శంఖం ఉంది"* అంటూ ఒకతను విషయం ఇలా వివరించాడు....,
అప్పుడు అబ్దుల్లా *"ఏమయ్యా! ఈ శంఖం అమ్ముతావా?"* అని అడిగాడు.
దానికా వ్యక్తి, *"దీన్ని తీసుకొని ఏం చేస్తావు?"* అని అడిగాడు.
*"నమాజ్ వేళయిందని ప్రకటిస్తాను"* అన్నారు అబ్దుల్లా.
*"ఇంతకంటే మంచి విషయం చెప్పనా?"* అన్నాడా వ్యక్తి మళ్ళీ.
*"చెప్పండి, ఏమిటో ఆ విషయం"* అన్నారు అబ్దుల్లా.
*"నమాజ్ వేళ అయినప్పుడు ఇలా ప్రకటించు.... "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్....""* అన్నాడా వ్యక్తి విషయం తెలియజేస్తూ.
అబ్దుల్లా, తెల్లవారుజామున మేల్కొనగానే గబగబా మస్జిద్ కు వెళ్ళారు. అక్కడ దైవప్రవక్త (సల్లం)ని కలుసుకుని ఈ విషయం చెప్పారు. అజాన్ పలుకులు కూడా ఆయన (సల్లం)కు తెలియజేశారు.
దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని, *"అబ్దుల్లా! ఇది నిజమైన కల. ఆ పలుకులు బిలాల్ (రజి)కు చెప్పు. అతను వాటిని బిగ్గరగా ప్రకటిస్తాడు. అతని కంఠం చాలా పెద్దది"* అన్నారు.
హజ్రత్ ఉమర్ (రజి) ఇదంతా విని, దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళారు.
*"దైవప్రవక్తా! మిమ్మల్ని సత్యాన్నిచ్చి పంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను. రాత్రి నేను కూడా అబ్దుల్లా కన్న కలలాంటిదే కన్నాను."* అన్నారు ఆయన.
*"ఇదంతా దేవుని అనుగ్రహం ఉమర్ (రజి)! నా దగ్గర క్కూడా దీన్ని గురించి దైవసందేశం వచ్చింది."* అన్నారు దైవప్రవక్త (సల్లం) చిరునవ్వుతో.
ఈ విధంగా "అజాన్" సాంప్రదాయం ఏర్పడింది. బిలాల్ (రజి) కంఠస్వరం చాలా బిగ్గరగా, గంభీరంగా, శ్రావ్యంగా ఉంటుంది. అందువల్ల దైవప్రవక్త (సల్లం), ఆయన్నే "ముఅజ్జిన్"గా నియమించారు. ఆయన (రజి), ప్రతి నమాజ్ వేళకు వచ్చి, మస్జిద్ పక్కనుండే ఇంటి కప్పుపై నిలబడి నమాజ్ కోసం అజాన్ పిలుపునివ్వడం ప్రారంభించారు.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment