194

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 194            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 109*   

 *రాళ్ళకుప్పల్లో రత్నం : -* 

అలాంటి రాళ్ళకుప్పల్లోనే ఓ విశిష్ట రత్నం మెరిసింది. ఒక యూదయువకుని అంతరంగంలో ఓ వినూత్న కిరణం ప్రసరించింది. "ఇస్లాం"పట్ల అతని హృదయసాగరంలో విశ్వాస కుసుమం వికసించింది.

ఆ రోజు నుంచి అతను, దైవప్రవక్త (సల్లం) దర్శనం కోసం ఎంతగానో తపించిపోసాగాడు. లోగడ అతను ఎన్నో సార్లు దైవప్రవక్త (సల్లం)ను చూశాడు. కాని, ఆ చూపుల్లో విశేషమేమీ లేదు. దృష్టి కాకతాళీయంగా పడింది, మళ్ళీ చెదిరిపోయింది. అంతే.

కాని, ఈ రోజు దృష్టి పడగానే అంతర్యంలో అనిర్వచనీయమైన ప్రకంపనాలేవో ఎగసిపడుతున్నాయి. ఇంటి నాలుగు గోడల మధ్య ఏ మహనీయుని పేరు ఉచ్చరించడమే పెద్ద నేరమో, ఆ మహాత్ముని పట్ల అభిమానం ఇప్పుడతని హృదయ కుహురంలో తిష్ఠ వేసుకుంది. అది పూర్తిగా వికసించిన అనురాగ కుసుమం. ఉభయ లోకాలను ఉత్తేజపరచే దాని పరిమళాన్ని ఇప్పుడు కప్పిపుచ్చడం అంత సులభం కాదు. ఆశ, భయాల మధ్య చెలరేగిన ఘర్షణతో అతని మెదడు వేడెక్కిపోయింది.

 *"పద. ఇప్పుడే ఆ దివ్య సమావేశానికి హాజరయి ఆయన (సల్లం) బోధామృతాన్ని తనివితీరా ఆస్వాదించు"* అని మనస్సు ప్రేరేపిస్తుంటే, *"ఔను, సత్వరమే వెళ్ళి ఆ అందాల రేడుని ఆపాద మస్తకం దర్శించుకుందాం. ఇహపర లోకాల శుభాలను మూట కట్టుకుందాం"* అని నయనాలు మారాము చేస్తున్నాయి.

కాని ఎలా....? లూసా, ఆ సమావేశానికి పోవడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా! తల్లిదండ్రులు తాట వలుస్తారే! సంఘం వేలివేస్తుందే!! ఉక్కు గోడల మధ్య హృదయం బందీ అవుతుందే!!!

ఆశ, భయాల మధ్య సాగిన సంఘర్షణలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో ఆశ పాక్షిక విజయం సాధించింది. శక్తినంతా కూడదీసుకొని ఆసక్తి అడుగుని ముందుకు వేయించింది. కాళ్ళు మస్జిద్ ముఖద్వారం పక్కగా నడుస్తుంటే కళ్ళు లోపలికి తొంగిచూసి కాస్తంత చల్లదనం పొందాయి.

కాని, మరోసారి మస్జిద్ వైపు పోవడానికి ధైర్యం చాలడం లేదు. అందువల్ల ఈసారి ఆ యువకుడు మస్జిద్ కు వెళ్ళే దారిలో ఓ ప్రక్కన కూర్చొని నిరీక్షించసాగాడు. కాస్సేపటికి మానవమహోపకారి (సల్లం) మస్జిద్ నుండి వస్తుంటే, ఆయన (సల్లం) ముఖ వర్చస్సుని కళ్ళ ద్వారా తస్కరించి గుండెల్లో భద్రపరచుకున్నాడు.

ఈ విధంగా రోజులు గడచిపోతున్నాయి. అంతరంగంలో జనించిన ప్రేమాగ్నికణం ప్రజ్వరిల్లుతూనే ఉంది. చివరికి ఈ అభిమాన జ్వరం తీవ్రమయి కంటికి కునుకు లేకుండా చేసింది. హృదయంలోని భారం తీసివేయడానికి తనివితీరా ఏడుద్దామన్నా స్వేచ్ఛ లేకుండా పోయింది. దాంతో మనోభారం అధికమయి ఆ యువకుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. 

వ్యాధి నివారణ కోసం అతని తండ్రి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. గొప్ప గొప్ప వైద్య నిపుణుల్ని పిలిపించాడు. కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. శరీర సంబంధమైన వ్యాధి అయితే ఏదో రకంగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కాని మనోవ్యాధికి ముందేముంటుంది? అందులో ఇది ప్రేమ జబ్బాయే!

ఎన్ని మందులు వాడినా, ఎన్ని అంత్రాలు వేసినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పైగా అది దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రాణ సంకటంగా తయారయింది. చివరికి విప్పారిన పువ్వులాంటి ఆ నవయువకుడు క్రుంగి కృశించిపోయి ఎముకల గూడులా మారిపోయాడు.

కొడుకు పరిస్థితి చూసి తల్లి తల్లడిల్లిపోయింది. తండ్రి నిరాశా నిస్పృహలతో పిచ్చివాడిలా తయారయ్యాడు. బంధువుల ముఖాలపై కూడా విచారఛాయలు అలుముకున్నాయి. ప్రేమవ్యాధి, ఇప్పుడు జీవిత సరిహద్దు వైపుకు వేగంగా పరుగిడుతోంది. నీరసం గంటగంటకు అధికమవుతోంది. నోట మాట వెలువడటం కూడా కష్టమయి పోయింది. అప్పుడప్పుడు వినపడే మూల్గుడు ఇంటి వాతావరణాన్ని కకావికలం చేస్తోంది.

రోగిలాగే సూర్యుడు కూడా నీరసంతో క్షణక్షణానికి తేజోవిహీనుడైపోతున్నాడు. నింగిని నలువైపులా నుంచి కారుమబ్బులు కమ్ముతున్నట్లు పుడమితల్లిని చీకటి తెరలు త్వరత్వరగా కప్పివేయసాగాయి.

యువకుడు బలాన్నంతా కూడదీసుకుని ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కాని గొంతులోని మాట గొంతులోనే పూడుకుపోయింది. పెదవులు వణుకుతుంటే కాంతి విహీనమైన కళ్ళతో తండ్రి వంక అసహాయంగా చూస్తుండిపోయాడు.

కొడుకు దుస్థితి చూసి తండ్రి తల్లడిల్లి పోయాడు. చెవి దగ్గర ముఖం పెట్టి, *"బాబూ! ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?"* అని అడిగాడు అమితమైన వాత్సల్యంతో.

*"నాన్న...."* హీనస్వరంతో కాస్తంత పెదవులు విచ్చుకున్నాయి.

*"నా జీవితపు చివరి కోరికను మీరు సంతోషంగా నెరవేరుస్తానంటే చె....బు....తా....ను"* గొంతు మళ్ళీ పూడుకుపోయింది.

*"నా చిట్టి తండ్రీ! నువ్వు కోరితే చాలుగానీ ఎంత మూల్యం చెల్లించయినా, చివరికి తలతాకట్టు పెట్టయినా సరే నీకోరిక తీర్చనూ? చెప్పు నాయనా! నీకోరిక ఏమిటో సంకోచం లేకుండా చెప్పు. ఇప్పుడే ఈ క్షణంలోనే తీర్చుతాను!"* పుత్రప్రేమ పురివిప్పింది.

*"నాన్నా! మీరు ఏమనుకోకుంటే...."* పెదవులు వణికాయి.

*"నాన్నా! కొన్నాళ్ళ నుంచి నేను ముహమ్మద్ మహనీయుని (సల్లం) పట్ల కలిగిన భక్తి విశ్వాసాలతో లోలోనే దహించుకుపోతున్నాను. మీకు భయపడి నేనీ రహస్యాన్ని బయట పెట్టలేకపోయాను. కాని ఆయన (సల్లం) జ్ఞాపకం నన్ను అనుక్షణం తినేస్తుంది. కళ్ళు మూసినా, తెరచినా ఆయన (సల్లం) రూపమే నా మనస్సులో మెదులుతోంది....*

        *నాన్నగారూ! ఒక్కసారి.... ఒక్కసారి అంటే ఒక్కసారి ఆ మహాత్ముడ్ని ఇక్కడికి పిలుచుకు రారూ? ఆయన (సల్లం) దివ్యమోమును తనివితీరా తిలకించి తరిస్తాను. ఆయన (సల్లం) నోట ముక్తి శుభవార్త విని తృప్తిగా ఊపిరి విడుస్తాను. నాన్న! ఒక్కసారి...."*

కొడుకు కోరిక విని తండ్రి మండిపడ్డాడు. కానీ, కోపాన్ని పళ్ళ మధ్య బిగబట్టి ఎలాగో తనను తాను తమాయించుకున్నాడు. ఎంతైనా కన్నకొడుకు కదా! అందులో లేకలేక కలిగిన ఏకైక సంతానం!! తనకు ఇష్టమున్నా లేకపోయినా ఈ స్థితిలో కొడుకు కోరిక నెరవేర్చక తప్పదు మరి. ఓ వేడి నిట్టూర్పు విడుస్తూ అన్నాడు...., *"సరేలే నాయనా! ఈ మాట నాకు తీవ్రమైన అసంతృప్తి కలిగించినా, నువ్వు విచారపడుతూ క్రుంగిన మనస్సుతో ఇహలోకం వీడటం నాకిష్టం లేదు. నీ కోరికను తీర్చడానికి ఇప్పుడే వెళ్తున్నాను. రేపటి నుంచి మన జాతి ప్రజలు నన్ను, యూదసమాజం శత్రువుగా పరిగణిస్తారు. అయినా నీకోసం ఈ అపవాదుని కూడా సహిస్తాను."*

అంతర్యం అభ్యంతరం పెడ్తున్నా కాళ్ళు బలవంతంగా అతడ్ని మస్జిద్ వైపునకు లాక్కెళ్ళాయి. మస్జిద్ ముఖద్వారం దగ్గరే నిలబడి...., *"నేను ముహమ్మద్ (సల్లం)ని కలుసుకోవడానికి వచ్చాను. లోపల ఉంటే కాస్త కబురు చేయండి."* అన్నాడు అక్కడున్నవారితో.

కొన్ని క్షణాల తరువాత దైవసందేశహరుని సుమధుర వాక్కు వినిపించింది.

*"చెప్పండి, నాతో ఏం పనిపడి వచ్చారు?"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఈ పలుకులు యూదుని కర్ణపుటాలకు తాకి హృదయంలో క్షణం పాటు సంచలనం సృష్టించాయి.

*"నా ఏకైక కుమారుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. మీమీది ప్రేమాభిమానాలతో వాడు పిచ్చివాడయిపోయాడు. మీ విశిష్ఠ వ్యక్తిత్వం, యావత్తు అరబ్బుల్ని ఉన్మాదులుగా చేసింది. అది నా కొడుకుని కూడా పిచ్చివాణ్ణి చేసింది. ఆ పిచ్చితోనే మావాడు చిక్కి శల్యమై ఇప్పుడు కాటికి కాల్లుజాపి కూర్చున్నాడు. వాడు తన చివరి కోరికగా మీ దర్శన భాగ్యం పొంది, మీనోట ముక్తి శుభవార్త వినాలని ఉబలాటపడుతున్నాడు."* అన్నాడు ఆ యువకుని తండ్రి.

యూదుడి మాటలు వినగానే దైవప్రవక్త (సల్లం) ముఖపద్మం విప్పారింది.

*"పదండి, అదృష్టజాతకుడైన ఆ యువకుడ్ని చూసి వద్దాం. అతడ్ని స్వాగతించడానికి నభోమండలంలో హంగామా మొదలయింది."* అన్నారు ఆయన (సల్లం) తన అనుచరులతో.

ప్రవక్త (సల్లం) కోసం ఎదురుచూసి చూసి యువకుని కళ్ళు మూతలు పడ్డాయి.

తండ్రి తలగడ వైపున నిల్చున్నాడు. మహాప్రవక్త (సల్లం) అనుచరుల మధ్య యువరోగికి ఎదురుగా నిలబడ్డారు. తండ్రి కొడుకు మీద వంగి ఆప్యాయతగా అతని తల నిమురుత...., *"నాయనా! కళ్ళు తెరు. ఇదిగో నీ విశ్వాస కేంద్రబిందువు నీ ముంగిట వాలింది. నీ అభిమాన నాయకుడు ముహమ్మద్ (సల్లం) నీ ముందు నిల్చున్నారు. కళ్ళు తెరు బాబు!"* అన్నాడు.

మహనీయ ముహమ్మద్ (సల్లం) పేరు వినగానే పోతున్న ప్రాణమల్లా గిర్రున తిరిగొచ్చింది. కాస్సేపటికి యువరోగి కళ్ళు మెల్లిగా తెరచుకున్నాయి. ఎదురుగా, అందాలరేడు వరాల పూలహారంతో శోభాయమానంగా వెలుగుతూ నిల్చున్నాడు.

*"మహానుభావా! ఎదలో భక్తివిశ్వాసాల సిరిసంపదలు పెట్టుకొని అంతిమ గమ్యం వైపు పయనిస్తున్నాను. మీ సేవకుల జాబితాలో ఈ సేవకుని పేరు కూడా చేర్చుకోండి. సాటిలేని ఏకైక దైవాన్ని విశ్వసించినప్పటికీ, జీవితంలో ఒక్కసారైనా ఆయన ప్రసన్నత కోసం సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే భాగ్యానికి నోచుకోలేకపోయాను. ఇలాంటి స్థితిలో నాకు మోక్షం లభిస్తుందని ఆశించగలనా?"* అన్నాడు ఆ యువకుడు దైవప్రవక్త (సల్లం) వైపే తదేకంగా చూస్తూ.

*"ఆందోళన పడకు నాయనా! దేవుని ఏకత్వాన్ని అంగీకరిస్తూ ఓ సారి "సద్వచనం" పఠించు. నీ మోక్షానికి నేను హామీ ఇస్తాను."* అన్నారు దైవప్రవక్త (సల్లం) అభయమిస్తూ.

యువకుని తండ్రి ఈ మాటలు వినగానే చెప్పలేని భావావేశాలతో వివశుడయిపోయి కొడుక్కి ఇలా హితవు చేశాడు.

*"నా చిట్టితండ్రీ! నువ్వు ఎంతో అదృష్టవంతుడువి. నా మనసులో ఎంత విరోధం ఉన్నా, ఈ పలుకులు సత్యవ్రతుడయిన ఒక దైవప్రవక్త నోట వెలువడ్డాయన్న వాస్తవాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను. ఒక దాసునికి స్వయంగా దైవప్రవక్తే ఇలాంటి హామీ ఇస్తున్నాడంటే ఇంతకంటే అదృష్టం అతనికి మరేమీ ఉండదు. ఆయన (సల్లం) దగ్గర నువ్వు స్పష్టమైన మాటల్లో వాగ్దానం తీసుకుని ఇస్లాం పరిధిలో ప్రవేశించు."* తండ్రి హితబోధ యువకుడ్ని మరింత ఉత్సాహపరిచింది.

*"మహానుభావా! సమాధి మజిలీ మొదలు స్వర్గానికి చేరుకునే దాకా మీరిస్తున్న హామీతో నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. "అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.""* అన్నాడు ఆ యువకుడు.

యువకుని నోట వెలువడ్డ ఈ సద్వచనం వాతావరణంలో మౌనంగా ప్రతిధ్వనించింది. ఆ వెనువెంటనే అతను శాశ్వతంగా కన్నుమూశాడు. ఇంట్లో వారంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.

యువకుని తండ్రి దుఃఖం నుండి తేరుకుని...., *"మహాత్మా! ఇప్పుడీ భౌతికకాయం మాది కాదు. అంత్యక్రియలు జరిపే బాధ్యత మీకే అప్పగిస్తున్నాను."* అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) అతని అభ్యర్థనను మన్నించారు.

*"విశ్వాసాభిమానాల ఈ అమూల్య నిక్షేపాన్ని చేతుల మీదికి ఎత్తుకోండి. పెళ్ళికొడుకు ఊరేగింపులా, ఈ జనాజా (శవం) మదీనా వీధుల గుండా సాగుతుంది."* అన్నారు ఆయన (సల్లం).

ఈ వార్త క్షణాల్లో మదీనా అంతటా కార్చిచ్చులా వ్యాపించింది. జనాజాలో పాల్గొనడానికి జనం తండోపతండాలుగా మస్జిద్ కు వచ్చారు. మదీనా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చారు.

అంతిమ సందర్శనార్థం ముఖం మీది వస్త్రం తొలగించారు. ఆశ్చర్యం! ఆ యువకుని ముఖం పున్నమి చంద్రునిలా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పెదవులపై చిరునగవు నాట్యమాడుతోంది.

సందర్శనం తరువాత, అశేషప్రజానీకం వెంటరాగా జనాజా శ్మశానవాటిక వైపు బయలుదేరింది. పోయేవాడు ఒట్టిచేతులతో పోవడం లేదు. అతను దైవప్రవక్త (సల్లం) ప్రదానం చేసిన వస్త్రాల కఫన్ పొరల్లో పారలౌకిక ధనరాసుల్ని దాచుకొని మరీ వెళ్తున్నాడు.

అందుకే ఈ రోజు పురవీధులు ఇసుక వేస్తే రాలనంత జనంతో క్రిక్కిరిసి పోయాయి. చివరికి దైవప్రవక్త (సల్లం) కూడా, వీధులు ఇరుకైపోయి కాలిమునివ్రేళ్ళ మీద నడుస్తున్నారు.

ఈ రోజు జనాజా వెంట ఇంతమంది జనం ఎక్కడ్నుంచి వచ్చారో చాలా మంది జనానికి అర్థం కాలేదు. వారిలో కొందరు సంగతేమిటో అడుగుదామని ఉత్కంఠతతో సమయం కోసం ఎదురుచూస్తున్నారు. కాని, ఆసక్తి అణచుకోలేక ఒకతను అడగనే అడిగాడు...., *"ఏమిటీ విశేషం దైవప్రవక్తా (స)!"* అని.

*"ఈ యువకుని జనాజాలో పాల్గొనడానికి ఈ రోజు ఊర్ధలోకం నుంచి కారుణ్యదూతలు కాలు తీసి పెట్టలేనంత అసంఖ్యాకంగా వచ్చి చేరారు!"* అంటూ దైవప్రవక్త (సల్లం) అసలు విషయం చెప్పారు.

ఈ మాట విని అనుచరులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తపరిచారు. జనాజా "జన్నతుల్ బఖీ" శ్మశానానికి చేరుకుంది. భౌతిక కాయాన్ని దించడానికి దైవప్రవక్త (సల్లం) సమాధిలోకి దిగారు. ఆయన (సల్లం), తన పవిత్ర హస్తాలతో జనాజాని అందుకొని సమాధిలో దించారు.

చాలా సేపటి తరువాత, ఆయన (సల్లం) సమాధి నుండి బయటికి వచ్చారు. ఆయన (సల్లం)ని చూసి అనుచరులు మళ్ళీ ఆశ్చర్యపోయారు. ఆయన (సల్లం) బట్టలు తడిసిపోయాయి. లలాటం పై చెమటచుక్కలు తుషారబిందువుల్లా మెరసిపోతున్నాయి. ముఖంలో మాత్రం దరహాసం తొణికిసలాడుతోంది.

అంత్యక్రియలు ముగిసిన తరువాత అనుచరులు తమ ప్రియతమ నాయకుని చుట్టూ మూగి అత్యంతాసక్తితో అడిగారు....,

*"దైవప్రవక్తా! మీ ముఖానికి ఈ రోజు ఇంతగా చెమట పట్టిందేమిటి? బట్టలు కూడా తడసిపోయాయే! చూస్తే సమాధిలో మీరు చాలా శ్రమ పడినట్లు అన్పిస్తోంది."*

దైవప్రవక్త (సల్లం) అనుచరుల మాటలు విని చిరునవ్వు చిందించారు.

*"సమాధి మొదలు స్వర్గం చేరేదాకా, తనపై నా కారుణ్యఛాయలు ఉండాలని, ఈ యువకుడు ముందుగానే నా నుండి హామీ తీసుకున్నాడు. అందువల్ల అతని కోసం ఇప్పుడు వందలాది అప్సరసలు వచ్చి గుమిగూడారు. వారు, తమ ప్రియుడి ముఖారవిందంలోని సౌందర్య మకరందం జుర్రుకోవడానికి నలువైపుల నుంచి అతనిపై విరుచుకుపడ్డారు. వారు నా పాదాల పై నుంచి పరుగెత్తి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అందుకే నేను చెమటతో తడసి ముద్దయి పోయాను."* అన్నారు ఆయన (సల్లం).

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) నోట అమృతం చిందించే ఈ పలుకులు విని, ప్రియ అనుచరులు అమితమైన ఆనందంతో పొంగిపోయారు. వారి ఆత్మలు దేహాలలో ఉరకలు వేసే ఉత్సాహంతో ఊగిపోయాయి. వారి విశ్వాసం ద్విగుణీకృతమయి వినూత్న కాంతులతో వెలిగిప

No comments:

Post a Comment