193

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 193            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 108*

 *యూదుల ఆగడాలు : -* 

యూదులు హద్దుమీరిన జాత్యహంకారంతో సత్యాన్ని నిరాకరించడమేగాక, దైవప్రవక్త (సల్లం)కు బద్ధ విరోధులైపోయారు. వారు తమ పగ, విరోధ భావాలను ఇంకా బహిర్గతం చేయలేదు. దైవప్రవక్త (సల్లం), మదీనాలో ప్రముఖ వ్యక్తిగా, ప్రజలకు ప్రియతమ నాయకునిగా రూపొందేవరకు, యూదులు ప్రతీకారాగ్నిని తమ హృదయాల్లోనే అణచి పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి హృదయాలు అగ్నిపర్వతాల్లా ప్రతీకారసెగలు కక్కనారంభించాయి.

యూదుల్లో కొందరు, దైవప్రవక్త (సల్లం) సందేశానికి ప్రభావితులైనవారు కూడా ఉన్నారు. అలాంటివారిలో "హసీన్ (రజి)" తరువాత "అసద్ (రజి)" ప్రముఖుడు. వారిద్దరూ ఇస్లాం స్వీకరించడంతో, యూదులు విలవిల్లాడిపోయారు. ఇక ఏమాత్రం సహించకూడదని భావించి, దైవప్రవక్త (సల్లం)ను విరోధించడానికి సిద్ధమయ్యారు.

యూదుల్లో అత్యధిక మంది దైవప్రవక్త (సల్లం)కు బహిరంగంగా శత్రువులయ్యారు. అయితే కొందరు మాత్రం ఇంకా తాము ముస్లిములేనని చెప్పుకుంటూ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళుగా ఉండిపోయారు. వారి కాపట్యం, దుష్టసంకల్పాలు వారు దైవప్రవక్త (సల్లం)ను అడిగే ప్రశ్నల ద్వారానే బహిర్గతమవుతాయి.

*"దైవప్రవక్తా! సకల సృష్టిరాశిని దేవుడు సృష్టించాడు కదా! మరి దేవుడ్ని ఎవరు సృష్టించారు?"* అంటారు వారు ఒక్కొక్కప్పుడు.

*"దైవప్రవక్తా! దేవుని ఆకారం ఎలా ఉంటుంది? ఆయనకు కాళ్ళు చేతులు ఉంటాయా? ఇతర శరీర అవయవాలు ఎలా ఉంటాయి?"* అంటారు మరొకప్పుడు.

*"ముహమ్మద్ (సల్లం) గారూ! మీరు నిజంగా దేవుని ప్రవక్తే అయితే, కాస్త ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు చూపించండి. ఆయన్ని చూసి మేము ఆయన మాటలు వింటాం."* అంటారు ఇంకొక్కప్పుడు.

*"ముహమ్మద్ (సల్లం) గారూ! మీరు వినిపిస్తున్న ఈ సూక్తులు నిజంగా దేవుని దగ్గరనుండి వస్తున్నాయా? మరి అవి తౌరాత్ సూక్తులతో పోలిఉండటం లేదేమిటి? ముహమ్మద్ (సల్లం) గారూ! మీరు ఒప్పుకోండి, ఒప్పుకొకపోండి. మొత్తానికి ఏదో భూతం మీకీమాటలు నేర్పుతోంది. లేదా ఎవరైనా మనిషే అయి ఉంటాడతను. మనిషయితే అతను మహా తెలివగలవాడిలా కన్పిస్తున్నాడండోయ్!!"* ఇలా ప్రేలుతుంటారీ దైవవిరోధులు.

*"దైవసాక్షిగా చెబుతున్నాను. ఈ సూక్తులన్నీ సాక్ష్యాత్తు దేవుని దగ్గర నుండే వస్తున్నాయి. నేను దైవప్రవక్తను. ఈ సంగతి మీకు తెలియనిది కాదు. ఇది మీ దగ్గరున్న తౌరాత్ లో కూడా ఉంది. అలాంటప్పుడు మీరిలా నన్ను వ్యర్థప్రశ్నలు అడుగుతారెందుకు? ఈ విధంగా నన్ను వేధించడం వల్ల మీకు ఒరిగేదేమిటి?"* అంటారు దైవప్రవక్త (సల్లం) వారి మాటలు విని ఎంతో ఆవేదనగా.

*"మీరు చెప్పే మాటలపై మాకు నమ్మకం కుదరడం లేదు. అంచేత, వ్రాతపూర్వకమైన గ్రంథాన్ని ఏకంగా ఆకాశం నుండి అవతరింపజెయ్యండి. దాన్ని మేము స్వయంగా చదివి విశ్వసిస్తాం."* అంటారు యూదులు.

*"సోదరులారా! దైవానికి భయపడండి. ఇస్లాం ను విశ్వసించండి. దైవసాక్షి! నేను మీ దగ్గరకి తెచ్చినదంతా సత్యమేనని మీకు బాగా తెలుసు. కాని మీరు తెలిసి కూడా నన్ను వ్యతిరేకించడం శోచనీయం."* అంటూ బాధాతప్త హృదయంతో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు దైవప్రవక్త (సల్లం).

మహానీయ ముహమ్మద్ (సల్లం), దైవప్రవక్తని తమ అంతరాత్మలు ఘోషిస్తున్నా వాటిని ఖాతరు చేయకుండా యూదులు ఆయన (సల్లం)ని తిరస్కరించి ఆయన (సల్లం)పై కత్తిగట్టారు.

అంతేకాదు, అన్సారులు, ముహాజిర్ల మధ్య విభేదాలు సృష్టించడానికి సయితం ప్రయత్నించారు. అన్సారులు దైవమార్గంలో తమ సిరిసంపదల్ని ఖర్చు పెట్టడం, నిరుపేద ముహాజిర్లకు ఆర్థిక సహాయం అందజేయడం వంటి సత్కార్యాలు చేస్తుంటే వారు ఓర్వలేక పోయేవారు.

*"ఎందుకు మీరిలా వృధాగా డబ్బు ఖర్చు పెట్టి జేబులు ఖాళీ చేసుకుంటారు? రేపటి రోజు మీ దగ్గర ఏమీ మిగలకపోతే ఏం చేస్తారు? కాస్త ముందూ వెనుకా అలోచించి మరీ ఖర్చు పెట్టండి."* అంటారు వారు.

వారి పగటి వేషాల్ని గురించి దైవప్రవక్త (సల్లం) త్వరలోనే తెలుసుకున్నారు.

మదీనా యూదుల్లో "షాస్ బిన్ ఖైస్" అనే వృద్ధుడొకడు ఉన్నాడు. అతనోసారి అన్సార్ ముస్లిములు సమావేశమై ఉన్నప్పడు వారి పక్కగా పోవడం జరిగింది. సమావేశంలో అవస్, ఖజ్రజ్ తెగలవాళ్ళున్నారు. అందరూ సంతోషంతో ఇష్టాగోష్టి జరుపుకుంటున్నారు. సభావాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సర్వత్రా ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తున్నాయి. అందరి పెదవులపై దరహాసాలు తోణికిసలాడుతున్నాయి. సంభాషణల్లో మాధుర్యం ఉట్టిపడుతోంది. సమావేశం సద్భావం, సౌభ్రాతృత్వాల వెలుగుకిరణాలు విరజిమ్ముతోంది. కాని, "షాస్ బిన్ ఖైస్" ఈ దృశ్యం చూసి నఖశిఖ పర్యంతం మండిపడ్డాడు.

*"ఈ సమావేశంలో బనీఖీలా నాయకుడు కూడా ఉన్నాడే! పైగా ఇతను వీరితో కలసి మెలసి సన్నిహితంగా మాట్లాడుతున్నాడే!! ఇలా ఇతను అవస్, ఖజ్రజ్ తెగలతో కలసిపోతే మనపై పెద్ద విపత్తు వచ్చిపడుతుంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి."* అనుకున్నాడు మనస్సులో ఆ వృద్ధ యూదుడు.

అనుకోవడమే తడవుగా అతను ఓ యూద యువకుడ్ని కలుసుకొని, విషయం చెప్పి ఇలా ఉసిగొల్పాడు...., *"చూడబ్బాయ్! వెంటనే నీవు ఆ సమావేశంలోకి వెళ్ళు. అక్కడ కాస్సేపు మౌనంగా కూర్చో. ఆ తరువాత "బఆస్" యుద్ధ ప్రస్తావన తీసుకురా. ఆ యుద్ధంలో జరిగినదంతా చాకచక్యంతో వారి ముందు వెల్లడించు. ఆనాడు అవస్, ఖజ్రజ్ తెగవాళ్ళు పరస్పరం విద్వేష విషం వెదజల్లుకుంటూ పాడుకున్న పాటల్ని కూడా ప్రసావించు."* అని ఉసిగొల్పాడు.

"బఆస్" యుద్ధం అవస్, ఖజ్రజ్ తెగల మధ్య జరిగిన భయంకర యుద్ధం. అందులో ఉభయ తెగలవాళ్ళు పచ్చినెత్తురు తాగడానికి సిద్ధమై చివరికి సర్వనాశనం కొని తెచ్చుకున్నారు. ఆనాటి దుష్పరిణామాలు తలచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అది అజ్ఞాన కాలంలో జరిగిన దుర్ఘటన. అప్పటికి ఆ తెగలకు దైవధర్మం అంటే, జ్ఞానజ్యోతి అంటే ఏమిటో బొత్తిగా తెలియదు.

ఆ యువకుడు అన్సారుల సమావేశంలోకి పోయి ఓ చోట నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కాస్సేపయ్యాక వారి మధ్య విద్వేషాగ్ని రగుల్కొల్పాడు. సమావేశంలో "బఆస్" యుద్ధ ప్రస్తావన వచ్చింది.

ఇంకేముంది, చూస్తుండగానే సమావేశం తీరుతెన్నులు మారిపోయాయి. క్రమేణా ఇరుతెగల మధ్య వేడి పుంజుకుంది. ఆనాటి సంఘటనలు, అప్పటి విద్వేషపూరిత కవితలు బయటపెట్టి, ఉభయులు పరస్పరం దూషించుకున్నారు. మాటా మాటా పెరిగింది. ఇద్దరు వ్యక్తుల్లో వివాదం కాస్త ముదిరింది. అందులో ఒకరు అవస్ తెగ మనిషి, మరొకరు ఖజ్రజ్ తెగకు చెందిన వ్యక్తి.

*"అయితే ఆనాటి రుచి చూడటానికి సిద్ధమేనా?"* అన్నాడు వారిద్దరిలో ఒకడు.

*"పద. మేమిందుకు సిద్ధంగానే ఉన్నాం."* అన్నాడు రెండోవాడు రోషంతో. 

రక్తపు హోలీ ఆడాల్సిన స్థలం కూడా నిర్ణయమైపోయింది. రెండు వర్గాలు లేచి నడుం బిగించాయి. పరస్పరం కాటేసుకోవడానికి బుసలు కొట్టసాగాయి.

*"ఖడ్గాలు పట్టుకురండి....! బరిసెలు తెండి....!! రంగంలోకి దూకండి....!!! కత్తులు ఝుళిపించండి....!!!!"*

అరుపులు, కేకలతో పట్టణ వీధులు మార్మోగిపోయాయి. ఈ కోలాహలం గురించిన వార్త దైవప్రవక్త (సల్లం)కు క్షణాల్లో తెలిసిపోయింది. ఆయన (సల్లం) వెంటనే కొందరు ముహాజిర్ అనుచరుల్ని వెంటబెట్టుకొని ఆ ప్రదేశానికి చేరుకున్నారు.

అక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి పోరుకు సిద్ధమవుతున్న అన్సార్ ముస్లిముల చేతుల్లో కత్తులు ధగధగ మెరిసిపోతున్నాయి. మహాప్రవక్త (సల్లం) తక్షణమే మెరుపు తీగలా వారి మధ్యకు వచ్చి నిలబడ్డారు. అంతే, రెండు వర్గాల్లో గందరగోళం ఒక్కసారిగా సద్దు మణిగింది.

*"ముస్లింలారా! దైవానికి భయపడండి. నేను మీ మధ్య జీవించి ఉండగానే ఏమిటీ అజ్ఞానపు అరుపులు, నినాదాలు? ఓసారి దేవుడు చేసిన మేళ్ళను జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆయన మిమ్మల్ని "ఇస్లాం" వరం అనుగ్రహించి సంపన్నుల్ని చేశాడు. విశ్వాసభాగ్యం ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చాడు. సత్యతిరస్కారం నుంచి విమోచనం కలిగించాడు. అజ్ఞానపు ఊబి నుండి వెలికితీశాడు. పరస్పర ప్రేమాభిమానాలతో మీ సంబంధ బాంధవ్యాలను తీర్చిదిద్దాడు. అలాంటప్పుడు ఈ ప్రేలాపనలు, పరుగిళ్ళేమిటి?"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ మహనీయుని నోట వెలువడిన ఈ అమృత పలుకులతో వారి కళ్ళముందున్న చీకటి తెరలు పటాపంచలయి పోయాయి. ఒక్కసారిగా వారు మత్తు నుండి తేరుకున్నారు. తమవల్ల జరిగిన పొరపాటు ఏమిటో తెలుసుకొని సిగ్గుతో తలలొంచుకున్నారు. వెంటనే రెండు తెగలవాళ్ళు పరస్పరం ఆలింగనం చేసుకొని కుమిలి కుమిలి రోదించారు. ఆ తరువాత వారంతా తమ ప్రియతమ నాయకుని వెంట వెళ్ళిపోయారు.

ఈ కుట్రకు కారకుడయిన ఆ వృద్ధయూదుడు, తన పథకం విఫలమైనందుకు లోలోన కుతకుతలాడి పోయాడు. గుండెల్లో మండుతున్న విద్వేషజ్వాలలతో చిర్రెత్తిపోయాడు. కాని చేసేదేమీలేక ముఖం మాడ్చుకొని మౌనంగా ఉండిపోయాడు.

*రాళ్ళకుప్పల్లో రత్నం : -*

అలాంటి రాళ్ళకుప్పల్లోనే ఓ విశిష్ట రత్నం మెరిసింది. ఒక యూదయువకుని అంతరంగంలో ఓ వినూత్న కిరణం ప్రసరించింది. "ఇస్లాం"పట్ల అతని హృదయసాగరంలో విశ్వాస కుసుమం వికసించింది.

ఆ రోజు నుంచి అతను, దైవప్రవక్త (సల్లం) దర్శనం కోసం ఎంతగానో తపించిపోసాగాడు. లోగడ అతను ఎన్నో సార్లు దైవప్రవక్త (సల్లం)ను చూశాడు. కాని, ఆ చూపుల్లో విశేషమేమీ లేదు. దృష్టి కాకతాళీయంగా పడింది, మళ్ళీ చెదిరిపోయింది. అంతే.

కాని, ఈ రోజు దృష్టి పడగానే అంతర్యంలో అనిర్వచనీయమైన ప్రకంపనాలేవో ఎగసిపడుతున్నాయి. ఇంటి నాలుగు గోడల మధ్య ఏ మహనీయుని పేరు ఉచ్చరించడమే పెద్ద నేరమో, ఆ మహాత్ముని పట్ల అభిమానం ఇప్పుడతని హృదయ కుహురంలో తిష్ఠ వేసుకుంది. అది పూర్తిగా వికసించిన అనురాగ కుసుమం. ఉభయ లోకాలను ఉత్తేజపరచే దాని పరిమళాన్ని ఇప్పుడు కప్పిపుచ్చడం అంత సులభం కాదు. ఆశ, భయాల మధ్య చెలరేగిన ఘర్షణతో అతని మెదడు వేడెక్కిపోయింది.

*↑ ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment