192

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 192            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 107*
*జాత్యహంకారంతో సత్యతిరస్కారం : -*

మదీనాలో యూదులు కూడా చాలా మంది ఉన్నారు. సిరియా వరకు వీరికి వర్తక సంబంధాలున్నాయి. మదీనాలో వీరే అందరికంటే ఎక్కువ ధనవంతులు. అందువల్ల వీరి అధికారమే చెలామణి అవుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రశాంతంగా మనుగడ సాగించాలంటే ఒక్కటే మార్గం ఉంది. యూదులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. దైవప్రవక్త (సల్లం) వారితో స్నేహఒప్పందం చేసుకోవాలని భావించారు.

మదీనాలో ముస్లిములు, యూదులు స్వేచ్చగా ఉండాలి. ఒకరి మతాన్ని ఒకరు అవమాన పరచుకోకూడదు. ఒకరి ఆస్తులు మరొకరు దోచుకోరాదు. బయటి నుంచి ఎవరైనా శత్రువు వచ్చి పట్టణం మీద దాడి చేస్తే ఏకమై ఎదుర్కోవాలి. యుద్ధంలో లభించే సమరసొత్తు సమానంగా పంచుకోవాలి. దైవప్రవక్త (సల్లం), ఒప్పందంలో ఈ విషయాల్ని ప్రతిపాదించినప్పుడు యూదులు సంతోషంగా అంగీకరించారు. అందరూ ఒకచోట గుమికూడి ఒప్పందం రాసుకున్నారు.

● *↑ దైవప్రవక్త (సల్లం), యూదులతో చేసిన ఈ ఒప్పందాన్ని గూర్చి మరింత వివరణ ↓*

*యూదులతో జరిగిన ఒప్పందం : -*

మహాప్రవక్త (సల్లం) హిజ్రత్ తరువాత ముస్లిముల మధ్య విశ్వాసం, రాజకీయం, సమైక్యతల ద్వారా ఇస్లామీయ సమాజ పునాదుల్ని పటిష్టపరచిన తరువాత ముస్లిమేతరులతో తమ సంబంధాలను ధృఢపర్చుకోవడం వైపునకు దృష్టిని మళ్ళించారు. ఈ విషయంలో ఆయన (సల్లం) ధ్యేయం, మానవాళి అంతా శుభశాంతుల్ని ఆస్వాదించాలన్నదే. దానికితోడు, మదీనా, దాని పరిసర ప్రాంతాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పడాలన్నదే.

కాబట్టి, ఆయన (సల్లం) విశాల హృదయంతో, అనాగరిక, విద్వేషపూరిత, వైషమ్యభరిత ప్రపంచం, ఇప్పటివరకు ఊహించలేనటువంటి చట్టాలతో ఓ క్రొత్త సంవిధానాన్ని ప్రవేశపెట్టారు.

మదీనాపురానికి పొరుగున ఉన్నవారు యూదులు అన్న విషయం మనం ఇదివరకే తెలుసుకున్నాం. వీరు రహస్యంగా ముస్లిముల ఎడల శత్రుత్వభావం కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణకుగాని, కుతంత్రాలకుగాని పాల్పడలేదు. అందుకని మహాప్రవక్త (సల్లం) వారితో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో వారికి, వారి మతం, ధనప్రాణాలకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడం జరిగిందే తప్ప, వారి ఎడల శత్రుత్వం వహిస్తూ వారిని దేశ బహిష్కరణకు గురిచేయడంగానీ, వారి ఆస్తిపాస్తులను జప్తు చేసుకోవడంగానీ, విద్వేషభరితమైన రాజకీయం నడపడంగానీ చెయ్యలేదు.

ముస్లిములకు, ముస్లిములకు నడుమ జరిగిన ఒప్పందం లాంటిదే ఆ ఒప్పదం కూడా. ఇప్పుడు ఆ ఒప్పందంలోని ప్రధాన షరతులు ఏవో చర్చించుకుందాం. ↓

*ఒప్పందంలోని ముఖ్యాంశాలు : -*

*❥ ═┄*  బనూ ఔఫ్ కు సంబంధించిన యూదులు, ముస్లిములతో కలసిపోయి ఒకే సమాజంగా ఉంటారు. యూదులు తమ ధర్మంపైనా, ముస్లిములు ఇస్లాం ధర్మంపైనా స్వతంత్రంగా నడుచుకోవచ్చు. అది యూదులు, ముస్లిములు మరియు వారి బానిసలు మరియు సంబంధీకుల హక్కు. బనూ ఔఫ్ తెగే కాకుండా మిగతా యూదుల హక్కులు కూడా ఇలాగే ఉంటాయి.

*❥ ═┄*  యూదులు, ముస్లిములు వారి వారి ధనాన్ని వారి ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునేందుకు భాధ్యులు.

*❥ ═┄*  ఏ శక్తి అయినా ఈ ఒప్పందంలోని ఓ వర్గంతో యుద్ధానికి పాల్పడితే, దానికి వ్యతిరేకంగా వీరు ఉభయులు కలసి యుద్ధం చేయాల్సి ఉంటుంది.

*❥ ═┄*  ఈ ఒప్పందానికి సంబంధించిన ఉభయ వర్గాలు, తమ పరస్పర సంబంధాలను సదాచారం, సుహృద్భావం మరియు ప్రయోజనాల ప్రాతిపదికపై ఏర్పరచుకోవలసి ఉంటుందే తప్ప, దుర్మార్గం మరియు పాపాల ప్రాతిపదికపై కాదు.

*❥ ═┄*  ఏ వ్యక్తినీ మిత్రపక్షం కారణంగా నేరస్తునిగా నిలబెట్టడానికి వీల్లేదు.

*❥ ═┄*  పీడితునికి సహాయం అందించండం జరుగుతుంది.

*❥ ═┄*  యుద్ధంకోనసాగే వరకు యూదులు కూడా ముస్లిములకు తోడు ఆ యుద్ధానికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది.

*❥ ═┄*  ఈ ఒప్పందంలోని ప్రతి వర్గానికి సంబధించినవారు, మదీనాలో కలహాలను రేపడం, రక్తపాతాన్ని సృష్టించడం హరాం(నిషిద్ధం).

*❥ ═┄*  ఈ ఉభయ వర్గాల నడుమ కలహాలను సృష్టించే మనస్పర్ధలు ఏవైనా, ప్రస్తుతం లేనటువంటి క్రొత్త పరిస్థితి ఏదైనా ఉత్పన్నమైతే దాని తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం) మాత్రమే ఇవ్వగలరు.

*❥ ═┄*  ఖురైషులకు, వారి సహాయకులకూ ఎలాంటి రక్షణ కల్పించడం జరుగదు.

*❥ ═┄*  ఎవరైనా యస్రిబ్ పైకి దండెత్తి వస్తే, వారిని అందరూ కలసి ఎదుర్కొంటారు. ప్రతి ఒక పక్షమూ తన తన పరిసరాలను సంరక్షించుకునే బాధ్యతను కలిగి ఉంటుంది.

*❥ ═┄*  ఈ ఒప్పందం, ఏ నేరస్తుడూ మరే దౌర్జన్యపరుడూ విషయంలో అడ్డుగా నిలవదు.

         ఈ ఒప్పందం జరిగిన తరువాత మదీనా మరియు దాని పరిసర ప్రాంతాలు సురక్షితమైన పాలన క్రిందకి వచ్చేశాయి. ఈ ప్రభుత్వ రాజధాని మదీనాగా, దైవప్రవక్త (సల్లం), ఆ ప్రభుత్వానికి పాలకులుగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వ ఆదేశాలు, అధికారం పూర్తిగా ముస్లిములదే. ఇలా మదీనా నగరం "ఇస్లాం"కు రాజధానిగా మారిపోయింది.

శాంతి సౌభాగ్యాల పరిధిని మరింత విస్తరింపజేసేందుకు దైవప్రవక్త (సల్లం) ఆపై ఇతర తెగలతో, పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి ఒప్పందాలనే చేసుకోవడం జరిగింది. వీటిలో కొన్నింటి ప్రస్తావన మునుముందు చెప్పుకోవడం జరుగుతుంది.●

యూదులలో కొందరు నిజమైన దైవభీతి, మంచి నీతి నడవడికలు కలవారు కూడా ఉన్నారు. అలాంటివారు, దైవప్రవక్త (సల్లం) ముఖవర్చస్సు చూడగానే, *"ఈయన తప్పక దైవప్రవక్త అయిఉంటాడు. మన గ్రంథాల్లో ఈయన్ని (సల్లం) గురించే భవిష్యత్ ప్రకటనలు ఉన్నాయి. అంతిమ దైవసందేశహరుడు ఈయనే (సల్లం). మనం ఏ జీవన విధానం మరచిపోయామో దాన్నే ఈయన (సల్లం) ప్రచారం చేస్తున్నాడు."* అని గ్రహించి విశ్వాసులైపోయారు.

అయితే యూదులలో అత్యధికమంది, తమ మతానికి వ్యతిరేకంగా దైవప్రవక్త (సల్లం) బోధించే విషయాలు వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. ప్రారంభంలో వారు దైవప్రవక్త (సల్లం), ఆయన సహచరులు మదీనా వచ్చినందుకు సంతోషించారు. శాంతి ఒప్పందం చేసుకోవడానికి కూడా అంగీకరించారు. అయితే, దానికి ఓ కారణం ఉంది. దైవప్రవక్త (సల్లం)ను తమలో కలుపుకోవాలని, తమ ఆచార వ్యవహారాల రంగులో ఆయన్ని రంగరిద్దామని అనుకున్నారు. ఈ విధంగా ముస్లిములను కూడా తమ వైపు సులభంగా తిప్పుకోవచ్చని తలచారు. అలా అయితే తమ మతం అరేబియాలో బాగా ప్రాచుర్యం పొంది మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందని భావించారు. ఇలా, దేశమంతా తమ జాతిపేరు మార్మోగుతుందని ఆశించారు.

యూదులు ఏంతో కాలం నుంచి ఒక ప్రవక్త కోసం నిరీక్షిస్తున్నారు. ఆ ప్రవక్త ఏఏ ప్రాంతాలలో ప్రభావిస్తాడని ఆశిస్తున్నారో, ఆయా ప్రాంతాలకు వెళ్ళి నివసించసాగారు. రాబోయే ఆ ప్రవక్త తమ మతాన్నే అనుసరిస్తాడని ఊహించారు. ఆయన వచ్చిన తరువాత తమ మతం బలం పుంజుకుంటుందని, క్రైస్తవ మతం నామరూపాల్లేకుండా పోతుందని కలలుగన్నారు. కాని ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త (సల్లం) వచ్చి తమ మతాన్ని గాకుండా అసలు ధర్మం ప్రకటిస్తూ, క్రొత్త విషయాలు బోధించసాగారు. మొదటినుంచీ తమ దగ్గరున్న మతవిషయాలు ప్రజలకు బోధిస్తుండేవారికి ఇవి కర్ణకఠోరంగా తోచాయి. అలాంటి వారు దైవప్రవక్త (సల్లం)ను, ఆయన అనుచరుల్ని ఎలా సహిస్తారు?

ఈ విధంగా యూదులు కట్టుకున్న పేకమేడలు నిలువునా కుప్పకూలిపోయాయి. దాంతో వారు ముస్లిముల మధ్య అనుక్షణం ఆందోళనతో నివసించవలసి వచ్చింది. మున్ముందు దైవప్రవక్త (సల్లం) తమపాలిట పెన్నిధి అవుతారనుకుంటే, ఇప్పుడాయన వారి పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. అందువల్ల, యూదులు స్నేహఒప్పందాన్ని గాలికి వదిలేసి ఆయన (సల్లం)కు, ఆయన అనుచరులకు బద్ధశత్రువులుగా మారారు.

యూదులు స్వతహాగా అలజడులు సృష్టించడంలో, జగడాలు పెట్టడంలో ఎంతో సిద్ధహస్తులు. *"ఇతరుల మధ్య చిచ్చు పెట్టండి, తమ పని నేరవేర్చుకోండి"* అన్నది వారి రాజనీతి. ఆ నీతినే వారు ఇక్కడ కూడా ప్రయోగించారు. వారు ముస్లిములలో విభేదాలు సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కాని అది ఫలించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అవస్, ఖజ్రజ్ తెగవాళ్ళు బహుదైవారాధకులుగా ఉన్నప్పుడే యూదులకు వారి వాసన గిట్టేది కాదు. ఇప్పుడు వారు ఇస్లాం స్వీకరించి మరింత సంఘటితమయ్యారు. వారి ఐకమత్యం చూసి యూదులు అసూయాగ్నిలో పడి మలమల మాడసాగారు.

*"ఇక తమకు మదీనాలో పుట్టగతులుండవు. తమ అధికారపీఠం కాస్తా పరాధీనమై పోయింది. తమ నాయకత్వానికి నూకలు చెల్లిపోయాయి. ఇకనుంచి మదీనాలో ముహమ్మద్ (సల్లం) రాజ్యమే సాగుతుంది. ఆయన (సల్లం)కే పట్టం లభిస్తుంది. ఆయన (సల్లం) మాటే చలామణి అవుతుంది. ఆయన (సల్లం) ఆదేశమే శాసనం అవుతుంది."* అనుకున్నారు వారు.

మహాప్రవక్త (సల్లం) మదీనా వచ్చిన కొన్నాళ్ళకే యూదుల ముఖాలు మాడిపోయాయి. వారి పరిస్థితి గమనించి, ఆయన (సల్లం) వారి నాయకుల్ని, ధర్మవేత్తల్ని చర్చలకు పిలిపించారు.

*_(ఆ తరువాత జరిగిన సంఘటనలు, ఇస్లాం చరిత్ర భాగము - 189 లో "హజ్రత్ అబుల్లా బిన్ సలాం (రజి)" గారి ఇస్లాం స్వీకార ఉదంతంలో మనం చూడవచ్చు. "అబుల్లా బిన్ సలాం" అసలు పేరు "హసీన్ బిన్ సలాం (రజి)". మరింత వివరణ కోసం 189 వ భాగమును చదవండి.)_*

హసీన్ బిన్ సలాం (రజి), యూదుల వ్యతిరేకతను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆయన ఇస్లాంలో స్థిరంగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా స్థిరంగా ఉన్నారు. ధర్మావలంబనలో హసీన్ (రజి) కనబరచిన స్థిరత్వం, పట్టుదల చూసి దైవప్రవక్త (సల్లం) ఎంతో సంతోషించారు. ఆయనకు "అబ్దుల్లా" అని పేరు పెట్టారు.

యూదుల మటుకు లోలోన ఉడికిపోసాగారు. తమ జాతిలో గొప్పపండితుడు, ఎంతో ప్రతిభావంతుడైన నాయకుడు అనుకున్న హసీన్ (రజి) కాస్తా ముస్లిం అయిపోయాడు. ఇప్పుడేం చేయాలి?

మదీనాలో ముహమ్మద్ (సల్లం) గనక నిలదోక్కుకుంటే తమ హోదా, అంతస్తులకు భంగం వాటిల్లుతుందని, తమ నాయకత్వం చాప కింద నీరోస్తుందని యూదులు మొదటే అనుమానపడ్డారు. ఇప్పుడు ఆయన (సల్లం) సందేశం విస్తరిస్తే తమ ధర్మానికి గాకుండా తమ ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తుందని వారు భయపడిపోయారు.

ముహమ్మద్ (సల్లం) దైవప్రవక్త అని, ఆయన (సల్లం) తెచ్చే దివ్యసందేశం "మూసా (అలైహి)" సందేశాన్ని పునరుజ్జీవింపజేసి ఆయన దౌత్యాన్ని పరిపూర్తి చేస్తుందని యూదులకు బాగా తెలుసు. ఈయన (సల్లం) తౌరాత్ లోని మార్పులు సంస్కరిస్తారని కూడా వారికి తెలుసు. అయినా యూదులు తలబిరుసుతో అంతిమ దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఆయన (సల్లం) బోధించే విషయాలు ఒక్కటీ వినకూడదని నిశ్చయించుకున్నారు.

*యూదుల ఆగడాలు : -*

యూదులు హద్దుమీరిన జాత్యహంకారంతో సత్యాన్ని నిరాకరించడమేగాక, దైవప్రవక్త (సల్లం)కు బద్ధ విరోధులైపోయారు. వారు తమ పగ, విరోధ భావాలను ఇంకా బహిర్గతం చేయలేదు. దైవప్రవక్త (సల్లం), మదీనాలో ప్రముఖ వ్యక్తిగా, ప్రజలకు ప్రియతమ నాయకునిగా రూపొందేవరకు, యూదులు ప్రతీకారాగ్నిని తమ హృదయాల్లోనే అణచి పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి హృదయాలు అగ్నిపర్వతాల్లా ప్రతీకారసెగలు కక్కనారంభించాయి.

యూదుల్లో కొందరు, దైవప్రవక్త (సల్లం) సందేశానికి ప్రభావితులైనవారు కూడా ఉన్నారు. అలాంటివారిలో "హసీన్ (రజి)" తరువాత "అసద్ (రజి)" ప్రముఖుడు. వారిద్దరూ ఇస్లాం స్వీకరించడంతో, యూదులు విలవిల్లాడిపోయారు. ఇక ఏమాత్రం సహించకూడదని భావించి, దైవప్రవక్త (సల్లం)ను విరోధించడానికి సిద్ధమయ్యారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment