🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 190 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 105*
*దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరగణం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత....;*
*ముస్లిముల సౌభ్రాతృత్వం : -*
మస్జిదె నబవీని నిర్మించి దైవప్రవక్త (సల్లం), ముస్లిముల్లో కలుపుగోలుతనాన్ని, ప్రేమైక వాతావరణాన్ని సృష్టించే ఓ కేంద్రాన్ని నెలకొలిపినట్లే, ముహాజిర్లు మరియు అన్సారుల నడుమ సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించే మరో కార్యాన్ని కూడా చేబట్టారు. మానవచరిత్రలోనే ఇది ఉజ్వలమైన ఘన కార్యమని చెప్పుకోవడం జరుగుతోంది.
*"ఇబ్నె ఖైమ్" తన గ్రంథంలో ఇలా చెబుతారు...., ↓*
తరువాత మహాప్రవక్త (సల్లం), "హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి)" గారి ఇంటిలో ముహాజిర్లు మరియు అన్సారుల నడుమ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పారు. వారు మొత్తం తొంభై మంది. సగం మంది ముహాజిర్లు మరి సగం మంది అన్సారులు.
ఆ సౌభ్రాతృత్వం ప్రకారం, వారు పరస్పరం ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పంచుకోవాలి. మరణం తరువాత రక్తసంబంధీకులైన బంధువులకు బదులు ఒకరికొకరు వారసులైపోవాలి.
ఇది ఆ సౌభ్రాతృత్వానికి సంబంధించిన మౌలిక అంశం.
అప్పుడుగాని అన్సార్ మరియు ముహాజిర్లలో వస్తున్న వారసత్వ సంబంధమైన ఆదేశం రద్దు అయిపోయింది. కాని, సౌభ్రాతృత్వం గురించి వారు చేసిన ప్రమాణం మాత్రం మిగిలే ఉంది.
మహాప్రవక్త (సల్లం) మరో సుహృద్భావ ఒప్పందం కూడా చేయించారు అని చెప్పుకోవడం జరుగుతోంది. ఆ ఒప్పందం ముహాజిర్లకూ ముహాజిర్లకూ మధ్య చేయించిన ఒప్పందం.
అయితే, ఈ విషయంలో ముహాజిర్లకు ముహాజిర్లకు నడుమ కావలసిన ఇస్లామీయ సౌభ్రాతృత్వం, ఐకమత్యం విషయంలో అలాంటి ఒప్పందం అవసరం కూడా లేదు. కాని ముహాజిర్ల వ్యవహారం వేరు, అన్సారుల వ్యవహారం వేరు.
ఈ సౌభ్రాతృత్వం ధ్యేయం - ముహమ్మద్ గజాలి రాసినట్లు - అజ్ఞాన దురభిమానాలు పటాపంచలైపోవాలని, ఆత్మాభిమానం గాని, గౌరవభావం గాని పూర్తిగా ఇస్లాం కే చెందాలని, జాతి, వంశం, రంగు, దేశానికి సంబంధించిన తారతమ్యాలన్నీ సమసిపోవాలన్నదే. ప్రజల్లో పాతుకుపోయిన ఔన్నత్యం మరియు నీచత్వపు భావనలను కొలిచే కొలమానం కేవలం మానవత్వం మరియు దైవభీతే కావాలన్నది.
దైవప్రవక్త (సల్లం) ఈ సౌభ్రాతృత్వాన్ని కేవలం మాటల మటుకే సరిపెట్టలేదు. దాన్ని రక్తం మరియు ధనంతో సంబంధం గల ఓ ఆచరణాత్మకమైన ప్రమాణంగా ఖరారు చేశారు కూడా. శ్లాఘించడానికి ఇది ఉత్త ఇస్లామీయ శుభాకాంక్షలు కావు. ఈ ఐకమత్యంలో త్యాగం, ప్రేమభావాలు కూడా మిళితమై ఉన్నాయి. కాబట్టే ఆ సౌభ్రాతృత్వపు ప్రమాణం, ఈ నవసమాజాన్ని ఉజ్వలమైన ఘనకార్యాలతో నింపేసింది.
*ముహాజిర్లు మరియు అన్సారుల నడుమ సౌభ్రాతృత్వంలోని మరింత వివరణ : - ↓*
*_అన్సారులు* → ఆదుకున్నవారు - మదీనా ప్రజలు_
*_ముహాజిర్లు* → వలసవచ్చినవారు - మక్కా ముస్లిములు_
ఆ రోజు మదీనా పట్టణం అన్సారులు, ముహాజిర్ల కలయికతో కళకళలాడుతోంది. వారి మధ్య దైవప్రవక్త (సల్లం) నిలబడి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని గురించి బోధిస్తున్నారు. ఆ మహనీయుని నైతిక శిక్షణ వల్ల అనుచరుల్లో ఇదివరకే చాలా వరకు పరస్పర సోదరభావం పెనవేసుకున్నది. ఇప్పుడీ ప్రత్యేక సమావేశంలో బోధించే ఇస్లాం హితవులతో వారు మరింత ఉత్తేజితులయ్యారు.
ప్రసంగం ముగిసిన తరువాత కట్టుబట్టలతో మాత్రమే వచ్చిన ముహాజిర్ల వైపు చూపిస్తూ, *"ఇదిగో వీరు మీ సోదరులు"* అని అన్సారులకి గుర్తు చేశారు. ఆ తరువాత వరుసగా ఒక్కొక్క ముహాజిర్ ను, ఒక్కొక్క అన్సార్ ని పిలిచి, *"ఈ రోజు నుంచి మీరిద్దరు పరస్పరం అన్నదమ్ములు"* అని చెప్పనారంభించారు.
ప్రవక్త అనుచరులకు ప్రవక్త (సల్లం) ఆదేశానికి మించిన విషయం మరేదిలేదు. ఆయన (సల్లం) ఆజ్ఞాపిస్తే చాలు, తోటి సోదరుని కోసం ప్రాణమైనా అర్పించడానికి సిద్ధం. అన్సారులు పరమసంతోషంతో తమ ముహాజిర్ సోదరులని గుండెలకు హత్తుకున్నారు.
ఆ తరువాత అన్సార్ ముస్లిములు తమతమ ధార్మిక సోదరులని తమ ఇళ్ళకు తీసుకెళ్ళి తమతో సమానంగా సకల సౌకర్యాలు కల్పించారు. ఉన్న ఆస్తిలో అర్థభాగం పంచిచ్చారు. తమకు చెందిన వస్తువులనీ, ఎంత విలువైనదైనాసరే, రెండు సమానభాగాలుగా విభజించి ఇచ్చారు. ఈ విషయంలో "సఅద్ బిన్ రబీయా అన్సారీ (రజి)" అయితే మరింత ముందుకు పోయారు. ఆయన అన్సార్ ముస్లిములలో కెల్లా గొప్ప ధనికుడు. అల్లాహ్ ఆయనకు సిరిసంపదలతో పాటు విశాల హృదయం కూడా ఇచ్చాడు.
"హజ్రత్ సఅద్ బిన్ రబీ (రజి)" తన ముహాజిర్ సోదరుడు "హజ్రత్ "అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)"ను తీసుకొని ఇంటికి వెళ్ళారు.
ఆయన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)కు చూపించి వీటిలో అర్థభాగం మీదని చెప్పారు. తరువాత ఆయన్ని మరో గదిలోకి పిలిచుకెళ్ళి కూర్చోబెట్టారు. అపుడు సఅద్ (రజి), అబ్దుర్రహ్మాన్ (రజి)తో ఇలా అన్నారు...., ↓
*సఅద్ (రజి) : -* సోదరా! నేను నా యావత్తు ఆస్తిపాస్తుల్ని, సమస్త వస్తుసామాగ్రిని మీకు చూపెట్టాను. అందులో మీకు సగం ఇచ్చేశాను. మీకిష్టమైనవి నిస్సంకోచంగా మీరు తీసుకోవచ్చు.
సఅద్ బిన్ రబీయా (రజి) తన సహజ ధోరణిలో చెప్పుకుపోతున్నారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) ఆయన మాటల్ని మౌనంగా వింటున్నారు.
*సఅద్ (రజి) : -* సోదరా! నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో మీకిష్టమైన ఆమెను ఎన్నుకుంటే నేనామెకు విడాకులిస్తాను. ఇద్దత్ గడువు ముగిసిన తరువాత మీరు ఆమెను నిస్సంకోచంగా వివాహం చేసుకోండి. మీరు నా ధార్మిక సోదరులు. నాకున్న ప్రతి వస్తువులో అర్థభాగం మీకు రావలసిన హక్కు. వీటిని నేను సంతోషంగా ఇస్తున్నాను, స్వీకరించండి.
*అబ్దుర్రహ్మాన్ (రజి) : -* నా ప్రియ సోదరా! దైవం మీ వ్యాపారంలో మరింత శుభం, సమృద్ధులు కలిగించుగాక! ఈ అసామాన్య సోదరభావానికి తగిన బహుమానం కూడా ప్రసాదించుగాక! నాకు వీటిలో ఏదీ అవసరం లేదు. నాకు బజారుకు పోయే దారి చూపండి చాలు. (అన్నారు ఎంతో వినయంతో)
కేవలం కట్టుబట్టలతో వచ్చిన ముహాజిర్ ముస్లిములకు ఎన్నెన్ని వస్తువుల అవసరం ఉంటుందో చెప్పనవసరం లేదు. అంతకంటే ఎక్కువే ఇవ్వడానికి అన్సార్ ముస్లిములు ముందుకొచ్చారు. కాని, ఇక్కడ చూస్తే ముహాజిర్ ముస్లిం తనకేమి అవసరం లేదంటున్నాడు. అన్సార్ ముస్లిం *"ఇది మీ హక్కే, తీసుకోండి"* అంటున్నాడు. సోదరుడు కాని సోదరుని పట్ల సొంత అన్నదమ్ముల్లో కూడా ఇలాంటి అనురాగం అప్యాయతలు కానరావు. గత చరిత్రలో కూడా ఎక్కడా కన్పించవు. మహాప్రవక్త (సల్లం) ఇచ్చిన సుశిక్షణ, ఆయన కనబరిచిన సమయస్పూర్తి అలాంటివి మరి!
ఇస్లాంలోని విశ్వమానవ సౌభ్రాతృత్వం, ముహాజిర్లు మరియు అన్సార్ల మధ్య విడదీయని అనుబంధం ఏర్పరిచింది. ఎనలేని వాత్సల్యం జనింపజేసింది. ఒకరికొకరు ప్రేమా, సానుభూతులతో మెలగసాగారు. ప్రతి ఒక్కడూ తనకు ఇష్టమైనదే తన సోదరుని కోసం ఇష్టపడుతున్నాడు. ఆ సోదరునికి చీమకుట్టినా తనకే కుట్టినట్లు భాదపడేవాడు.
ముహాజిర్ ముస్లిములు స్వతహాగా కష్టజీవులు. వారికి ఇలా రోజుల తరబడి అన్సార్ ముస్లిముల ఆస్తులు హరిస్తూ కూర్చోవడం ఇష్టం లేదు. అందువల్ల కాస్త అవకాశం దొరగ్గానే కష్టపడి పనిచేయనారంభించారు. కొంత మంది వ్యాపారం చేపట్టారు. మరి కొంతమంది అన్సారుల పొలాల్లో సేద్యం చేయడానికి, ఇంకొందరు ఇతర కాయకష్టం చేయడానికి పూనుకున్నారు. కష్టేఫలే అన్నారు. దైవానుగ్రహం వల్ల వారు అనతికాలంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించారు. వారి ఆత్మాభిమానం కూడా వారిని ఇతరుల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రేరేపించింది.
ముహాజిర్లలో కొందరు చాలా నిరుపేదలు కూడా ఉన్నారు. వీరు ఏ వ్యాపారం చేయడానికి వీల్లేకుండా పోయింది. అంచేత వీరు ఒక్కోసారి కడుపునిండా తిండిలేక మూడేసి రోజులు అవస్థపడుతూ ఉండవలసి వచ్చేది. తలదాచుకోవడానికి కనీసం చిన్న గూడు కూడా లేదు. అందువల్ల దైవప్రవక్త (సల్లం) వారి పట్ల ఎంతో సానుభూతి, శ్రద్ధ వహించేవారు. ప్రజా ధనాగారం నుంచి వారికి కనీసవసరాలు సమకూర్చేవారు. మస్జీద్ ఆవరణలో ఒక అరుగు ఉంది. ఆ అరుగు మీదే వీరు రాత్రుళ్ళు గడుపుతుండేవారు.
*సఅద్ (రజి) మరియు అబ్దుర్రహ్మాన్ (రజి)ల మధ్య ఏర్పడిన ఈ గాఢ సోదర బంధం గురించి సహీ బుఖారీ గ్రంథంలో ఇలా ఉంది....; ↓*
మహాప్రవక్త (సల్లం) మదీనాకు అరుదెంచిన తరువాత "హజ్రత్ అబ్దుర్రహ్మాన్ (రజి) బిన్ ఔఫ్" గారికీ మరియు "హజ్రత్ సఅద్ (రజి) బిన్ రబీయా" గారికి నడుమ సౌభ్రాతృత్వాన్ని నెలకొలిపారు. ఆ తరువాత హజ్రత్ సఅద్ (రజి), అబ్దుర్రహ్మాన్ (రజి) గారితో, *"అన్సారుల్లోకెల్లా ధనవంతుణ్ణి నేనే. మీరు నా సొత్తును రెండు భాగాలుగా చేసి (సగం) తీసుకోండి. నాకు ఇద్దరు భార్యలు. మీరు వారిని చూసుకోండి. వారిలో మీకు ఎవరు నచ్చారో చెప్పండి. ఆమెకు తలాక్ ఇచ్చి, ఇద్దత్ కాలం గడిచిన తరువాత మీకిచ్చి వివాహం చేసేస్తాను."* అని అన్నారు. దానికి అబ్దుర్రహ్మాన్ (రజి), *"అల్లాహ్ మీ సంతానాన్ని, మీ ధనాన్ని వృద్ధిపరచుగాక. మీ సంత ఎక్కడుంది?"* అని అడిగారు.
ఆయనకు "బనీ ఖునైకా" సంతను చూపెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, ఆయన చేతిలో జున్ను మరియు నెయ్యి పాత్రలున్నాయి. అలా ఆయన రోజూ సంతకు వెళ్ళి వచ్చేవారు. ఓ రోజు ఆయన, ప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వస్త్రాలపై పసుపు రంగు ఛాయలు కనబడుతున్నాయి. *"అదేమిటీ?"* అని దైవప్రవక్త (సల్లం) ఆయన్ను ప్రశ్నించారు.
*"నేను వివాహం చేసుకున్నాను."* అని బదులిచ్చారు అబ్దుర్రహ్మాన్ (రజి).
*"మహర్ ఎంత కట్టారు?"* అని అడిగారు మహాప్రవక్త (సల్లం).
*"ఓ నవాహ్ (ఖర్జూరపు గింజ) బరువు బంగారం (అంటే ఒకటింబావు తులం)"* అని బదులిచ్చారు.
*ఇలాగే "హజ్రత్ అబూ హురైరా (రజి)" గారి ఉల్లేఖనం ఒకటుంది...., ↓*
అన్సార్ లు దైవప్రవక్త (సల్లం) గారి వద్దకు వచ్చి, *"తమరు మాకు, మా ఈ (ముహాజిర్) సోదరులకు మధ్య మా ఖర్జూరపు తోటల్ని పంచెయ్యండి"* అని అడిగారు. దానికి మహాప్రవక్త (సల్లం), *"అలా జరుగదు"* అని అనగా, *"సరే! మా పనులను చేయమనండి, వారిని మా పంటలో భాగస్వాములుగా చేస్తాం"* అని అన్నారు. దానికి *"సరే"* అని ఒప్పుకోవడం జరిగింది.
అన్సారులు తమ ముహాజిర్ సోదరులను ఎలా గౌరవించారో, వారి ఎడల ప్రేమ, వాత్సల్యం మరియు త్యాగాలను ఎలా ప్రదర్శించారో ఈ రెండు సంఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే ముహాజిర్లు కూడా వీరి ఈ తెగువకు, త్యాగానికి ఎంత విలువనిచ్చి గౌరవించారో తెలుస్తోంది. అన్సార్లు చేసిన ఈ త్యాగాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టమొచ్చినట్లు ప్రయోజనం పొందే ప్రయత్నం మాత్రం చేయలేదు వారు. కేవలం దిగజారిన తమ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోడానికిగాను దానికి తగ్గట్లుగానే అన్సార్ల నుండి ప్రయోజనం పొందారు.
ఈ సౌభ్రాతృత్వపు ప్రమాణం, ఓ అమూల్యమైన వివేచనా కార్యం, దూరదృష్టితో కూడిన రాజకీయ చతురత మరియు ముస్లిములు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కూడా అని చెప్పవచ్చు.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment