🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 189 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 104*
*┄─═✦═✦═✦═✦═✦═✦═✦═✦═✦═✦═✦═✦═─┄*
*❥❥ మూడవ వర్గం : - యూదుల వర్గం*
వీరు అష్వరీల మరియు రోమనుల దౌర్జన్యాలను సహించలేక, పారిపోయి వచ్చి మదీనాలో స్థిరపడిన విషయం ఇదివరకే చెప్పుకున్నాం. వాస్తవంగా వీరు "హిబ్రూ" జాతివారు. కాని హిజాజ్ (అరేబియా)లో స్థిరపడిన తరువాత వారి వేషధారణ, భాష, సభ్యతాసంస్కారాలన్నీ అరబ్బుల రంగును పులుముకున్నాయి. చివరికి వారి వంశాలు, తెగల పేర్లు కూడా అరబ్బు వంశాలు, తెగల పేర్లుగా మారిపోయాయి.
వీరు అరబ్బులతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇంత జరిగినా జాతి దురభిమానం మాత్రం వారిని వదలిపెట్టలేదు. వారు అరబ్బుల్లో చేరకుండా, బనీ ఇస్రాయీల్, యూద జాతిగా గర్వపడేవారు.
అలా అరబ్బుల్ని నీచంగా చూస్తూ వారిని "ఉమ్మీ"లుగా పిలిచేవారు. ఉమ్మీ అంటే నిరక్షరాస్యుడు, తెలివిలేనివాడు, అనాగరికుడు, నీచుడు మరియు దళితుడు, అస్పృశ్యుడని అర్థం.
వీరి నమ్మకం ప్రకారం, అరబ్బుల సంపద వారికి ధర్మసమ్మతమైనది, దాన్ని తమ ఇష్టమొచ్చినట్లు వ్యయపరచవచ్చు. వీరి ఈ వైఖరిని దైవగ్రంథం ఇలా వివరిస్తోంది.
*"గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటి వాడంటే, అతడిపై నమ్మకంతో మీరు ధన, కనక రాశిని అప్పగించినా, దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు, కేవలం ఒక దీనార్ విషయంలో కూడా మీరు అతణ్ణి నమ్మితే, అతడు దానికి, మీరు అతడి నెత్తిపై నిలుచుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి ఈ నైతిక స్థితికి కారణం, వారు ఈ ఈ విధంగా అనుకోవడమే."*
*"నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు." (ఖుర్ఆన్ 3:75).*
అంటే, ఉమ్మీల సొమ్మును కాజేసినా మమ్మల్ని ప్రశ్నించడం జరగదు అని అర్థం. ఈ యూదుల్లో తమ ధర్మ ప్రచారం ఎడల ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. వారి వద్ద మిగిలిపోయిన వారి ధర్మమల్లా, జ్యోతిష్యం, ఇంద్రజాలం, భూతవైద్యం, మంత్రతంత్రాలే. ఇవే వారికి సర్వస్వం. వీటిని చూసుకొని వారు మా అంతటి జ్ఞానులు, ధార్మిక నాయకులు ఇంకెవ్వరూ లేరని విర్రవీగేవారు.
యూదులకు ధనార్జన కళల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ధాన్యం, ఖర్జూరం, సారాయి మరియు వస్త్ర వ్యాపారం అంతా వారి చేతుల్లోనే ఉండేది. వీరు ధాన్యాన్ని, సారాయిని దిగుమతి చేసుకుంటూ ఖర్జూరాన్ని ఎగుమతి చేసేవారు. ఇదే కాకుండా వీరికి మరిన్ని వ్యాపకాలు కూడా ఉండేవి. తమ వ్యాపార సామాగ్రిని రెండింతలు, మూడింతల లాభాలతో అరబ్బులకు విక్రయించేవారు. అంతటితో సరిపుచ్చుకోకుండా వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. అరబ్బు షేకులకు పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీకి ఇచ్చేవారు. ఈ డబ్బును ఆ సర్దారులు తమ బడాయి కోసం ఖర్చు పెడుతూ తమను పొగిడే కవులకు, భట్రాజులకు కానుకలుగా సమర్పించి గర్వపడేవారు.
ఇటు ఈ యూదులు ఈ ఋణం క్రింద వారి ఆస్తుల్ని, భూమిని, పొలాలను, తోటలను కుదువ పెట్టుకునేవారు. అలా కొన్నేళ్ల తరువాత వాటికి యజమానులైపోయేవారు.
ఈ యూదులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ యుద్ధజ్వాలల్ని రేకెత్తించడంలో మహా మేధావులు. ఎంతో విజ్ఞతతో తమ చుట్టూ నివసిస్తున్న తెగల్లో వైషమ్యాలను రేకెత్తించి, ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని ఉసిగొల్పి తమాషా చూసేవారు. ఆ తెగలకు వీరి కుతంత్రాలను గురించి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్త పడేవారు.
ఈ కారణంగా ఆ తెగల్లో, ప్రజ్వరిల్లే క్రోధాగ్ని, యుద్ధ జ్వాలలుగా రగిలి ఆరని చిచ్చులా తయారయ్యేది. ఒకవేళ ఈ యుద్ధ జ్వాలలు చల్లారుతున్నట్లు కనబడితే, యూదుల చేతులు దానికి ఆజ్యం పోసి మరింత రగిల్చేవి. ఈ తెగల్లో యుద్ధాలను రేకెత్తించి తమకు తెలియనట్లు ఓ మూలన కూర్చుని తమాషా చూస్తూ ఉండేవారు. అయితే, ఆ యుద్ధాలు ఆగిపోకుండా పెద్ద మొత్తంలో డబ్బును వడ్డీలకిచ్చి జాగ్రత్త పడేవారు. ఇలా వారు, తమ యూద సమాజాన్ని సంరక్షించుకుంటూ, మరో వైపు తమ వడ్డీ వ్యాపారం చల్లబడకుండా చూస్తూ, చక్రవడ్డీ ద్వారా సంపదను పెంచుకుంటూ ఉండేవారు.
*యస్రిబ్ లో నివసిస్తున్న ఆ మూడు ప్రముఖ యూద తెగలు ఇవి: ↓*
1. బనూ ఖైనుఖా : - ఇది ఖజ్రజ్ తెగకు అండదండలుగా ఉండే తెగ. వీరి నివాసం మదీనా.
2. బనూ నజీర్
3. బనూ ఖురైజా : - ఈ రెండు తెగలు అవస్ తెగకు మిత్రపక్షాలు. వీరు మదీనా చుట్టుపట్ల నివసించే యూద తెగలు.
ఎప్పటి నుండో ఈ తెగలే అవస్ మరియు ఖజ్రజ్ తెగల నడుమ యుద్ధజ్వాలల్ని రేకెత్తిస్తున్న తెగలు. "బుఆస్" యుద్ధంలో తమ తమ మిత్రపక్షాలకు తోడు నిలిచాయి కూడా.
ఇస్లాం పట్ల శతృత్వం వహించడంలో ఈ యూద తెగలు మున్ముందు ఉండేవి. వారి నైజమే అది. ఎందుకంటే, వారి ప్రవృత్తిని, వారి నైజాన్ని స్థిమితంగా ఉంచడానికి ప్రవక్త రావాలి. అయితే ఇప్పుడు వచ్చిన దైవప్రవక్త మాత్రం వారి జాతికి చెందినవాడు కాదు. అదేకాకుండా, ఇస్లాం సందేశం భగ్న హృదయాలకు సాంత్వన చేకూర్చి వైషమ్యాలను రూపుమాపే సందేశం. అన్ని వ్యవహారాల్లో నీతి నిజాయితీలను నెలకొల్పి పవిత్రమైన, ధర్మసమ్మతమైన విషయాల వైపునకు ఆహ్వానించే ధర్మం.
అంటే, యస్రిబ్ కు చెందిన తెగలన్నీ పరస్పరం ఒకటైపోవాలన్నది దీని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో అవి తప్పకుండా యూదుల కబంధహస్తాల నుండి బయటపడిపోకతప్పదు.
ఫలితంగా యూదుల వ్యాపార కార్యకలాపాలన్నీ నీరుగారిపోగలవు. వారి వడ్డీ వ్యాపారం కాస్తా దివాలా తీస్తుంది. ఇదేకాదు, ఈ తెగలు మేల్కొని, వారు హస్తగతం చేసుకున్న ఆస్తుల్ని, వడ్డీ క్రింద జమ కట్టుకున్న పొలాలను, తోటల్ని ఎక్కడ లాక్కుంటారో అనే భయం కూడా వారికి పట్టుకుంది.
ఇస్లామీయ సందేశం, మదీనాలో తన నివాసాన్ని ఏర్పరచు కోదలచుకుంటున్న విషయాన్ని గమనించిన యూదులు, ఆనాటి నుండే రాబోయే పరిణామాలను గురించి అంచనా వేయనారంభించారు. అందుకనే, దైవప్రవక్త (సల్లం) మదీనాలో అవతరించినప్పటి నుండే ఇస్లాం మరియు ముస్లిముల పట్ల వారి శతృత్వం పెరగనారంభించింది. ఈ విషయాన్ని చాలా కాలం గడచిన తరువాతగాని వారు బయటపెట్టలేదు. దీనికి సంబంధించిన వివరాలు "ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖించిన సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు.
*"ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ సఫియా బిన్తె హుయ్ బిన్ అఖ్తబ్ (రజి)" ఇలా ఉల్లేఖించారని ఆయన అంటారు. ఆమె ఇలా సెలవిచ్చారు...., ↓*
"నేను, నా తండ్రి మరియు నా పినతండ్రి "అబూ యాసిర్" దృష్టిలో అత్యంత ప్రియమైనదాన్ని. నేను వారి పిల్లలతో కలసి వారి వద్దకు వెళ్ళినప్పుడు నన్నే ముందు ఎత్తుకునేవారు. దైవప్రవక్త (సల్లం) అరుదెంచి, ఖుబాలో "బనూ అమ్రూ బిన్ ఔఫ్"కు అతిధులైనప్పుడు నా తండ్రి "హుయ్ బిన్ అఖ్తబ్" మరియు నా పినతండ్రి "అబూ యాసిర్" కలసి ఉదయాన్నే దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధిలో హాజరయ్యారు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. వచ్చేటప్పుడు వారి వాలకం బాగా అలసిసొలసిపోయి నడిచేవారిలా ఉంది. నేను ఎప్పటిలాగానే వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వారిద్దరిలో ఏ ఒక్కరూ నా వైపు దృష్టి సారించలేని బాధలో ఉన్నారప్పుడు. అప్పుడే నేను నా పినతండ్రి, నా తండ్రి గారైన "హుయ్ బిన్ అఖ్తబ్"తో మాట్లాడగా విన్నాను.
*"అతను ఆయనేనా?"* నా పినతండ్రి ప్రశ్న.
*"దైవసాక్షి! ఆ వ్యక్తి ఆయనే"* తండ్రిగారి సమాధానం.
*"ఆయన్ను మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలిగారా?"*
*"అవును, బాగానే గుర్తుపట్టగలిగాను"* మా తండ్రి గారి జవాబు.
*"అయితే ఇప్పుడు ఆయన విషయంలో మీరేం చేయదలిచారు?"*
*"శత్రుత్వం - దైవసాక్షి! నేను బ్రతికి ఉన్నంతకాలం (శత్రుత్వాన్నే వహిస్తాను)."*
ఈ ఉల్లేఖనాన్ని బలపరుస్తూ మరో ఉల్లేఖనం "సహీ బుఖారి" గ్రంథం నుండి లభిస్తోంది. ఇందు "హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం (రజి)" గారి ఇస్లాం స్వీకార ఉదంతం ఉల్లేఖించబడింది.
ఈయన ఓ గొప్ప యూద పండితుడు. ఈయనకు, దైవప్రవక్త (సల్లం) బనూ నజ్జార్ తెగలోనికి వచ్చిన విషయం తెలిసి, ఆయన (సల్లం) సన్నిధికి హాజరయ్యారు. కొన్ని ప్రశ్నలను అడిగిన పిదప, మహాప్రవక్త (సల్లం) వాటికి సరైన సమాధానాలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు జవాబు కేవలం ఒక దైవప్రవక్త మాత్రమే ఇవ్వగలరు. దైవప్రవక్త (సల్లం) నోట ఆ ప్రశ్నలకు జవాబులు విన్న "హజ్రత్ అబ్దుల్లా బిన్ సలాం" అప్పుడే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లం)తో...., *"ఓ దైవప్రవక్తా! యూద జాతి అపనిందలు వేసే జాతి. నేను ఇస్లాం స్వీకరించిన విషయం చెప్పి, నా గురించి ఏమైనా అడిగితే వారు నాపై అపనిందలు మోపగలరు."* అని అన్నారు.
కాబట్టి, మహాప్రవక్త (సల్లం) యూదుల్ని పిలిపించారు. వారు ప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చినప్పుడు, అబ్దుల్లా బిన్ సలాం వారికి అగుపడకుండా ఇంట్లోనికి వెళ్ళి దాక్కున్నారు.
మహాప్రవక్త (సల్లం), ఆ యూదులను ఉద్దేశించి...., *"అబ్దుల్లా బిన్ సలాం ఎలాంటి మనిషి?"* అని అడిగారు.
*"ఆయన గొప్ప పండితుడు, గొప్ప పండితుని కుమారుడు. ఉత్తముడైన వ్యక్తి, ఉత్తమ వ్యక్తి సంతానం."*
మరో ఉల్లేఖనంలో ఈ పదాలు కూడా ఉన్నాయి. ↓
*"ఆయన మా సర్దారు, మా సర్దారు కుమారుడు."* మరో ఉల్లేఖనంలో...., *"మాలోకెల్లా ఉత్తముడైన వ్యక్తి, ఉత్తముడైన వ్యక్తి సంతానం"* అని అన్నారు.
*"సరే, ఒకవేళ అబ్దుల్లా ముస్లిము అయిపోతేనో!"* అడిగారు దైవప్రవక్త (సల్లం).
యూదులు మూడు సార్లు ఇలా అన్నారు, *"అల్లాహ్ ఆయన్ను దాన్నుండి రక్షించుగాక"* అని.
ఆ తరువాత "అబ్దుల్లా బిన్ సలాం" లోపలి నుండి బయటకు వచ్చి...., *"అష్'హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్'హదుఅన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ (అల్లాహ్ తప్ప మరే పూజ్యుడూ లేడని, ముహమ్మద్ (సల్లం) ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను)"* అని పలికారు.
ఇది విన్నంతనే యూదులు ఏక కంఠంతో...., *"ఇతను అతి చెడ్డవాడు. అతి దుర్మార్గుడైన వ్యక్తి కుమారుడు"* అన్నారు. (వెంటనే) ఆయన చెడుగులన్నిటిని ఏకరువు పెట్టనారంభించారు.
ఓ ఉల్లేఖనంలో, "ఈ మాటలు విన్న అబ్దుల్లా బిన్ సలాం, వారినుద్దేశించి...., *"ఓ యూదులారా! దైవానికి భయపడండి. ఆయన తప్ప మరే ఆరాధ్య దైవంలేని ఆ అల్లాహ్ సాక్షి! ఈయన (సల్లం) అల్లాహ్ ప్రవక్త అన్న విషయం, సత్యం కోసం ప్రభవింపజేయబడిన విషయం మీకు బాగా తెలుసు"* అన్నారు.
కాని యూదులు మాత్రం, *"నీవు అసత్య విషయాన్ని పలుకుతున్నావు"* అని బయటకు వెళ్ళిపోయారు" అని ఉంది.
యూదుల విషయంలో, దైవప్రవక్త (సల్లం)కు కలిగిన ప్రప్రథమ అనుభవం ఇది. ఇది మదీనా నగరంలో ప్రవేశించిన మొదటి రోజే జరిగిన సంఘటన.
ఇదంతా మదీనా అంతర్గత పరిస్థితి. మదీనా వెలుపల ముస్లిములకు బద్ధ శత్రువులు ఖురైష్ వారు. ముస్లిములు వారి ఆధీనంలో ఉన్నప్పుడు వారిని భయకంపితులుగా చేయడానికి, వారిని పీడించడానికి ఉపయోగించిన పద్ధతులు అనేకం. రకరకాల దౌర్జన్యాలకు, ఆగడాలకు వారిని బలిచేశారు. పకడ్బందీగా పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేపట్టారు. సహనం కోల్పోయే మానసిక వ్యధలకు గురిచేశారు. ఆ తరువాత, ముస్లిములు హిజ్రత్ చేసి మదీనాకు వచ్చేసిన తరువాత, వారి ఆస్తిపాస్తుల్ని, ఇండ్లను, భూముల్ని, ధనసంపదను పూర్తిగా ఖబ్జా చేసుకున్నారు. ముస్లిముల కుటుంబసభ్యులు, భార్యాపిల్లల నడుమ అడ్డుగోడగా నిలవడమే కాకుండా, దొరికినవారినల్లా బంధించి నానా హింసలకు గురిచేశారు.
అంతటితో ఆగిపోయినా బాగుండేది. ఆపై దైవసందేశ ప్రచార నాయకుడైన దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం)ను సైతం హత్య చేసి, ఆయన (సల్లం) పిలుపును నామరూపాల్లేకుండా చేయడానికి కుట్రలు కూడా పన్నారు. ఆ కుట్రలను, ఆ దుష్టపన్నాగాలను అమలుపరిచేందుకు తమ శక్తిసామర్థ్యాలన్నిటిని కూడగట్టుకున్నారు.
దీనికి తోడు ముస్లిములు ఏదో విధంగా మక్కాకు అయిదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనాకు వలస వెళ్ళిపోతే, ఖురైషులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించి హేయమైన రాజకీయ నాటకం కూడా ఆడారు. అంటే, ఖురైషులు మక్కా పౌరలైనందున, బైతుల్లా (కాబా గృహం) దాపున ఉండేవారు గనుక అరబ్బులలో వారికి మంచి పలుకుబడి, అధికారం, రాచరిక హోదాలు ఉండేవి. దాన్ని ఆసరాగా చేసుకుని అరేబియా ద్వీపకల్పంలో నివసించే ఇతర బహుదైవారాధకులను ఉసిగొల్పి, మదీనాను బాయ్'కాట్ చేస్తూ ఏకాకిగా చేశారన్నమాట.
ఆ కారణంగా మదీనాకు దిగుమతులు దాదాపుగా ఆగిపోయాయి. దీనికి తోడు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చేవారి సంఖ్య అధికం కాసాగింది. వాస్తవానికి, మక్కాకు చెందిన బహుదైవారాధకులకూ మరియు ముస్లిముల క్రొత్త స్థావరం అయిన మదీనాకూ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నట్లయింది. దీనికి ముస్లిములనే భాద్యులుగా నిలబెట్టడం జరిగింది. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైన విషయం.
ముస్లిముల ఆస్తిపాస్తులను కొల్లగొట్టినందుకు, వారిపై దౌర్జన్యాల పరంపరలు సాగించినందుకు, వారి జీవితాలతో చెలగాటమాడినందుకు, ముస్లిములు కూడా వారి ఎడల అదే విధంగా ప్రవర్తిస్తూ, వారి ఆస్తిపాస్తులను హస్తగతం చేసుకునే హక్కు, దౌర్జన్యాలకు ప్రతిగా వారిపై దౌర్జన్యం చేసే హక్కు, వారి జీవితాలతో చెలగాటమాడే హక్కు ముస్లిములకు దక్కింది. ఇకపై ముస్లిములను నాశనం చేస్తూ, వారిని నామరూపాలు లేకుండా చేసే మార్గం లేకుండా జాగ్రత్త పడవలసిన తరుణం ఆసన్నమైంది.
*↑ ↑ ↑ ↑ ↑ ↑*
*ఇవీ, మదీనాకు అరుదెంచిన తరువాత మహాప్రవక్త (సల్లం) గారి ముందు ఉన్న సమస్యలు.*
మహాప్రవక్త (సల్లం) ఈ సమస్యలకు సంబంధించి మదీనాలో, దైవదౌత్య పాత్రను, నాయకత్వాన్ని నిర్వహించడం జరిగింది. ఏ జాతి అయితే, మన్నింపుకు, కారుణ్యానికి తగినదో లేదా కాఠిన్యానికి పాత్రమైనదో ఆ జాతి ఎడల ఆయన అలానే ప్రవర్తించవలసి వచ్చింది. కాఠిన్యం కన్నా కారుణ్యమే అధికంగా ఉందనడంలో సందేహం లేదు. ఇలా కొన్ని సంవత్సరాల్లోనే అధికార పగ్గాలు ఇస్లాం మరియు ముస్లిముల చేతిలోనికి వచ్చేశాయి. రాబోయే పుటల్లో ఈ విషయాలకు సంబంధించిన వివరాలే చెప్పడం జరిగింది.
*ఈద్ సందర్భంగా తరువాతి భాగమును 18/06/2018 నుండి కొనసాగిస్తాము.*
*దైవప్రవక్త (సల్లం), మదీనాకు హిజ్రత్ చేసిన తరువాత...., నవ సమాజ నిర్మాణం. In Sha Allah తరువాతి భాగములో....;*
No comments:
Post a Comment