🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 187 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 102*
*"సహీ బుఖారీ"లో "హజ్రత్ అనస్ (రజి)" గారి ఉల్లేఖనం ఇలా ఉంది. ↓*
దైవప్రవక్త (సల్లం), *"ఇక్కడకు ఎవరి ఇళ్ళు దగ్గర్లో ఉంది?"* అని అడగగా, హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రజి), *"నా ఇళ్ళు! దైవప్రవక్త (సల్లం)! అదిగో నా ఇళ్ళు. ఇదే దాని గుమ్మం"* అని అన్నారు. మహాప్రవక్త (సల్లం) ఆయనతో, *"వెళ్ళండి, వెళ్ళి సేద తీర్చుకోడానికి నా కోసం చోటును చూడండి"* అని అన్నారు. హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి), *"పదండి, మీరిద్దరూ పదండి. అల్లాహ్ శుభాలు చేకూరుస్తాడు"* అని అన్నారు.
*హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి) ఆతిథ్యం : -*
హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి) ఇళ్ళు రెండంతస్తులది. ఆయన, పై అంతస్తును దైవప్రవక్త (సల్లం) కోసం కేటాయించారు. కాని, దైవప్రవక్త (సల్లం) క్రింది అంతస్తులో ఉండటానికే ఇష్టపడ్డారు.
హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి), దైవప్రవక్త (సల్లం)కు కావలసిన ఇతర అవసరాలన్నీ సమకూర్చారు.
ఆ రాత్రి ఇషా నమాజ్ తరువాత దైవప్రవక్త (సల్లం) తన పడక గదిలోనికి ప్రవేశించారు. ఆ తరువాత అబూ అయ్యూబ్ (రజి) మరియు ఆయన భార్య, పై అంతస్తులోకి వెళ్ళిపోయారు. తలుపులు మూసి పడుకోవడానికి ఉపక్రమించాగానే, హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి)కు హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చి భార్యను లేపారు.
*"అయ్యయ్యో! మనం ఎంత పొరపాటు చేశాం!! దైవప్రవక్త (సల్లం) మనకు క్రింద ఉండటమా! ఎంత అపచారం!! ఆయన (సల్లం) పైన మనం నడవడం భావ్యమేనా? ఆయన (సల్లం)పై దైవవాణి అవతరిస్తుంది కదా! దైవవాణికి, ఆయన (సల్లం)కు మధ్య ఉండి మనం అడ్డుతగలడమా!! ఇలా అయితే మనం సర్వనాశనమైనట్లే"* అన్నారు అబూ అయ్యూబ్ (రజి) ఆందోళనగా.
*"నిజమేనండి! ఇప్పుడెం చేద్దాం?"* అన్నారు ఆయన అర్థాంగి.
*"ఈ రాత్రి మనం గది మధ్యలో పడుకోకుండా ఓ మూలాన ఒదిగి కూర్చుందాం"* అంటూ లేచి నిలబడ్డారు.
ఈ విధంగా ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ గదిలో ఓ మూలాన ఒదిగి కూర్చొని గడిపారు. నడవాల్సి వచ్చినప్పుడు గోడలకు ఆనుకుని మెల్లగా నడిచేవారు.
తెల్లవారింది. హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి) క్రిందకి దిగి, దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నారు....,
*అబూ అయ్యూబ్ (రజి) : -* దైవప్రవక్తా! రాత్రి నేను, నా భార్య ఇద్దరం మేల్కొనే ఉన్నాం.
*ముహమ్మద్ (సల్లం) : -* ఎందుకు? ఏమయింది?
*అబూ అయ్యూబ్ (రజి) : -* మీరు క్రింది అంతస్తులో, మేము పై అంతస్తులో ఉండటం నాకు భావ్యం అనిపించలేదు. మేము పై భాగాన ఉండి నడిచేటప్పుడు దుమ్ము ధూళి మీ పై పడితే మీకు బాధ కలుగుతుంది. అదీగాక మీకు, దైవవాణికి మధ్య మేము అడ్డుపడినవాళ్ళం అవుతాము. ఈ ఆలోచన మమ్మల్ని రాత్రి నిద్ర పోనివ్వలేదు.
*ముహమ్మద్ (సల్లం) : -* అబూ అయ్యూబ్! దాన్ని పట్టించుకోకు. ప్రతిరోజూ నా కోసం ఎందరో వస్తూ పోతుంటారు. అంచేత నేను క్రింది అంతస్తులో ఉండటమే మంచిది. మీరు నిశ్చింతగా పై అంతస్తులోనే ఉండండి. (అని అన్నారు.)
అది జనాన్ని గజగజ వణికించే చలికాలం. ఓ రోజు రాత్రి, పై అంతస్తులో నీటికుండ పగిలి నేలంతా తడిసింది. వెంటనే అబూ అయ్యూబ్ (రజి) దంపతులిద్దరూ ఆ నీటిని ఎత్తి పారేయడంలో నిమగ్నులైపోయారు. కాని, ఇది సాధ్యమయ్యే పనికాదు. నీరు ఇంకిపోతూ క్రింది అంతస్తులోకి కారే ప్రమాదం ఏర్పడింది. దానివల్ల దైవప్రవక్త (సల్లం)కు బాధ కలగవచ్చు. అంచేత వారు కప్పుకునేందుకు ఉన్న ఒకే ఒక గొంగళిని ఒలికిన నీటిపై వేసి దాన్ని తీశారు.
తెల్లవారిన తరువాత అబూ అయ్యూబ్ (రజి), దైవప్రవక్త (సల్లం) దగ్గరకి వచ్చి...., *"దైవప్రవక్తా! మీరు క్రింది అంతస్తులో ఉండి మేము పై అంతస్తులో ఉండటం ఏం బాగాలేదు"* అంటూ రాత్రి జరిగిన సంఘటన వివరించారు. ఇంటి పై అంతస్తులోకి మారమని పదేపదే ప్రాధేయపడ్డారు.
చివరికి దైవప్రవక్త (సల్లం), ఆయన అభ్యర్థనను మన్నించి మేడ పై అంతస్తులోకి మారారు. ఈ విధంగా ఆయన (సల్లం), అబూ అయ్యూబ్ (రజి) ఇంట్లో ఉండసాగారు.
ఈలోగా మస్జిద్ నిర్మాణం పూర్తయింది. దాన్ని బంకమన్ను, పచ్చి ఇటుకలతో లేపారు. ఖర్జూరపు చెట్ల మ్రానులను దూలాలుగా ఉపయోగించారు. ఆకులతో కప్పు వేసి దాన్ని బంకమన్నుతో అలికారు. మస్జిద్ నిర్మాణంలో, అనుచరులతో పాటు దైవప్రవక్త (సల్లం) కూడా పాల్గొన్నారు. మస్జిద్ లో నమాజు చేయించే చోట ప్రసంగవేదికగా ఓ ఖర్జూరపు మొద్దు కోసి నిలబెట్టారు. ఇలా కొన్నాళ్ళలోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది.
*వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం, దైవప్రవక్త (సల్లం) మదీనాలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు*
*నవ సమాజ నిర్మాణం : -*
మహాప్రవక్త (సల్లం), మదీనాలో "బనూ నజ్జార్" తెగకు చెందిన "హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారి (రజి)" గారి ఇంటి ముందు, శుక్రవారం, రబీ ఉల్ అవ్వల్ 12 హిజ్రీ శకం ఒకటి (27 సెప్టెంబర్, 622) రోజున వచ్చి ఆగారనీ, అప్పుడే అది ఆయన (సల్లం) విడిది అయిందీ అన్న విషయం మనకు తెలిసిందే. ఆ తరువాత ఆయన (సల్లం), అబూ అయ్యూబ్ అన్సారి (రజి) గారి ఇంట ప్రవేశించారు.
*మస్జిదె నబవీ నిర్మాణం : -*
ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) మొట్టమొదటిగా "మస్జిదె నబవీ" నిర్మాణాన్ని చేబట్టారు. ఆయన (సల్లం) గారి ఒంటె ఎక్కడైతే కూర్చున్నదో ఆ ప్రదేశమే "మస్జిదె నబవీ" కోసం ఎన్నుకోబడింది. ఈ స్థలం ఇద్దరు అనాధ బాలురకు చెందిన స్థలం. మహాప్రవక్త (సల్లం) దాన్ని ఆ ఇద్దరికి డబ్బిచ్చి కొన్నారు. స్వయంగా మస్జిద్ నిర్మాణంలో పాల్గొంటూ, ఇటుక రాళ్ళు మోయనారంభించారు. అలా మోస్తూనే ఇలా ప్రార్థించనారంభించారు.
*"ఓ అల్లాహ్! జీవితం కేవలం పరలోక జీవితమే, ఓ ప్రభూ! అన్సారులను, ముహాజిర్లను మన్నించు."*
ఇంకా ఇలా పలికేవారు కూడా. ↓
*"ఈ బరువు ఖైబర్ బరువు కాదు. మా ప్రభువు సాక్షి! ఇది ఎంతో పుణ్యకార్యం, మరెంతో పవిత్ర కార్యం కూడాను."*
మహాప్రవక్త (సల్లం) గారి ఈ పని చేసే తీరును చూసి సహాబాల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయేది. సహాబా (రజి) ఇలా చెప్పుకునేవారు. ↓
*"దైవప్రవక్త (సల్లం) పని చేస్తూ ఉండగా మనం చూస్తూ కూర్చుంటే ఇది మనల్ని మార్గభ్రష్టుల్ని చేసెయ్యగలదు."*
ఈ స్థలంలో బహుదైవారాధకుల సమాధులు కొన్ని ఉన్నాయి. కొంత ఖాళీ ప్రదేశం కూడా ఉంది. ఖర్జూరం మరియు గర్'ఖద్ చెట్లు కూడా కొన్ని ఉన్నాయి.
మహాప్రవక్త (సల్లం), బహుదైవారాధకుల సమాధుల్ని పెకలించివేయించారు. ఖాళీ ప్రదేశాన్ని చదును చేయించారు.
ఖర్జూరపు చెట్లను పెకిలించి ఖిబ్లా వైపు నాటించారు - అప్పుడు బైతుల్ మగ్దిస్ ఖిబ్లాగా ఉండేది - గుమ్మం రెండు ప్రక్కల పునాదులు రాతితో కట్టారు. గోడలు పచ్చి ఇటుకలు, మట్టితో నిర్మించబడ్డాయి. పైకప్పుగా ఖర్జూరపు ఆకుల్ని, మట్టల్ని వేసి కప్పారు. స్తంభాలు ఖర్జూరపు కాండాలు, నేలపై ఇసుక మరియు సన్నటి కంకర రాళ్ళు పరచబడ్డాయి.
ద్వారాలు మొత్తం మూడు. ఖిబ్లా వైపు గోడ నుండి, వెనుక వైపు ఉన్న గోడ మధ్య దూరం వంద మూరలు. వెడల్పు కూడా దాదాపు అంతే లేదా కొంచెం తక్కువ. పునాది దాదాపు మూడు మూరల లోతు ఉంది.
దైవప్రవక్త (సల్లం), మస్జిద్ ప్రక్కగా కొన్ని ఇండ్లను (పాకలు) కూడా నిర్మించారు. వాటి గోడలు కూడా పచ్చి ఇటుకలే. పైకప్పు కూడా ఖర్జూరపు బోదెల కమ్మీలు మరియు ఖర్జూరపు ఆకులతో నిర్మించడం జరిగింది. ఇవే మహాప్రవక్త (సల్లం) గారి సతీమణుల హుజ్రాలు (గదులు). ఈ హుజ్రాల నిర్మాణం పూర్తి అయిన తరువాత దైవప్రవక్త (సల్లం), అబూ అయ్యూబ్ అన్సారి (రజి) గారి ఇంటి నుంచి వీటిలోనికి మారారు.
మస్జిద్ కేవలం నమాజు చేసుకోవడానికే కాదు. అదో యూనివర్సిటి కూడాను. ఇందు ముస్లిములు ఇస్లామీయ బోధనలను అధ్యయనం చేసేవారు. ఇదో సమావేశ కేంద్రం కూడా. ఇందు సంవత్సరాల తరబడి అజ్ఞాన కాలంనాటి మారణకాండ, వైషమ్యం, పరస్పర యుద్ధాల్లో నిమగ్నమై ఉండిన తెగలకు చెందిన వ్యక్తులు వాటన్నిటిని మరచిపోయి పరస్పరం ప్రేమానురాగాలతో కలసిమెలసి ఉండేవారు. ఇదే కాదు, అది ఈ చిన్న రాజ్యాన్ని నడిపే వ్యవస్థకు కేంద్రం కూడాను. అక్కడి నుండే రకరకాల ముఖ్యకార్యాలను నిర్వహించడానికి ప్రతినిధి బృందాలను పంపించడం జరిగేది. అదేకాకుండా ఈ మస్జిద్ స్థాయి ఓ పార్లమెంటు లాంటిది. ఇక్కడ సలహా సంఘం మరియు వ్యవస్థాగతమైన సమావేశాలు కూడా జరిగేవి.
వీటన్నిటికి తోడు ఈ మస్జిద్, నిలువనీడలేని, భార్యా పిల్లల్ని పోగొట్టుకున్న నిరుపేద నిర్భాగ్యులు తలదాచుకునే స్థలం. వారంతా ముహాజిర్లే. మక్కా నుండి హిజ్రత్ చేసి వచ్చినవారే.
*దైవప్రవక్త (సల్లం) కుటుంబసభ్యులు మక్కా నుండి మదీనాకు రాక : -*
దైవప్రవక్త (సల్లం), మక్కాలో ఉన్న తన కుటుంబసభ్యుల్ని, ఇతర బంధువుల్ని మదీనాకు పిలుచుకొని రావడానికి జైద్ బిన్ హారిసా (రజి)ను, అబూరాఫె (రజి)ను మక్కా పంపించారు.
వారిద్దరూ మక్కా వెళ్ళి ప్రవక్త (సల్లం) సతీమణులు సౌదా (రజి), ఆయిషా (రజి), ప్రవక్త (సల్లం) కుమార్తెలు ఫాతిమా (రజి), ఉమ్మెకుల్సూమ్ (రజి), జైద్ (రజి) భార్య ఉమ్మెఈమాన్ - బర్కా (రజి), వారి కొడుకు ఉసామా (రజి), అబూ బక్ర్ (రజి) అర్థాంగి ఉమ్మెరూమాన్ (రజి), ఆయన సంతానం అబ్దుల్లా (రజి), అస్మా (రజి) తదితరులకు విషయం తెలియజేసి ప్రయాణానికి సిద్ధం చేశారు. ప్రవక్త (సల్లం) కుమార్తె జైనబ్ (రజి)ని పంపడానికి, ఆమె అవిశ్వాసి భర్త "అబుల్ ఆస్" నిరాకరించినందున ఆమెను వదిలివేయవలసి వచ్చింది. ఆమె తప్ప మిగిలినవారంతా సంతోషంతో మదీనా చేరుకొని తమ ఆప్తులను కలుసుకున్నారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లం), తన కుటుంబసభ్యుల్ని తీసుకొని అబూ అయ్యూబ్ (రజి) ఇళ్ళు వదిలేసి, మస్జిద్ ప్రక్కన నిర్మించిన పాకలకు వచ్చి నివసించసాగారు.
ఆయన (సల్లం) మదీనా వచ్చిన తరువాత ఇస్లాం స్వీకార వేగం పుంజుకుంది. అనేక మంది దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరుల ప్రచారం, సుగుణాలతో ప్రభావితులై ఇస్లాం స్వీకరిస్తున్నారు.
కానీ, కొన్నాళ్ళకు ఓ విషాద సంఘటన జరిగింది. బనూ నజ్జార్ ఉపతెగకు నాయకుడైన "హజ్రత్ అబూ అమామా (రజి)" అకస్మాత్తుగా వ్యాధిగ్రస్తులయి కొన్ని రోజుల్లోనే చనిపోయారు. దైవప్రవక్త (సల్లం) తల్లివైపు బంధువుల పూర్వీకులు "బనూ నజ్జార్" తెగకు చెందినవారే. అంచేత దైవప్రవక్త (సల్లం), ఈ విషాదవార్త విని ఎంతో చలించిపోయారు. ఆ సందర్భంలో ఆయన (సల్లం) మాట్లాడుతూ, *"ఈ సంఘటన సత్యతిరస్కారులకు 'ఇతనేం ప్రవక్తో! అతని శిష్యుల్లో ఒకడు హఠాత్తుగా చనిపోయాడ'ని నన్ను ఎత్తిపొడిచే అవకాశం కల్పించింది."* అని అన్నారు.
ఆ తరువాత బనూ నజ్జార్ తెగవాళ్ళు వచ్చి, *"దైవప్రవక్తా! అబూ అమామా మా నాయకుడిగా ఉండేవారు. ఇప్పుడాయన చనిపోయారు. అందువల్ల దయచేసి ఆయన స్థానంలో మాలో నుంచి ఎవరినయినా మాకు నాయకుడిగా నియమించండి."* అని విన్నవించుకున్నారు.
దైవప్రవక్త (సల్లం) ఓ క్షణం ఆలోచించి, *"బనూ నజ్జార్ తెగవాళ్ళు నాకు మామ వరుస అవుతారు. అంటే నేను మీలోని వాణ్ణే అయ్యాను. అంచేత నేనే మీకు నాయకుడ్ని ఎందుకు కాకూడదు?"* అన్నారు.
బనూ నజ్జార్ తెగవాళ్ళు ఈ మాట విని అవధులు దాటిన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, *"మహాప్రసాదం. దైవప్రవక్తా! మహాప్రసాదం!! మీరే నాయకులైతే ఇక మాకు కావాల్సిందేముంది."* అని అన్నారు.
విశ్వకారుణ్యమూర్తి (సల్లం) తమ తెగవాళ్ళలో నివాసం ఏర్పరచుకోవడమే గాకుండా, తమకు నాయకుడు కూడా అవ్వడంతో నజ్జార్ తెగవాళ్ళు చాలా సంబరపడ్డారు. ఇక ఆ తెగలోని బాలబాలికల సంతోషం అంతా ఇంతా కాదు. సర్వత్రా హర్షమే హర్షం! ఎక్కడ చూసినా ఆనంద కుసుమాలే వెల్లివిరిశాయి!!
హజ్రత్ బిలాల్ (రజి) గారికి కొంత స్వస్థత చేకూరినప్పుడు గొంతువిప్పి బాధాకరంగా కలువరిస్తూ, *"మక్కా లోయలో నేను ఏ రాత్రి అయినా గడపగలనా? నా చుట్టూ ఇజ్'ఖుర్ మరియు జలీల్ (గడ్డి) ఉంటాయా? ఏ రోజైనా నేను మజిన్నా చెలమ దగ్గరకు పోగలనా? నాకు షామా మరియు తుఫైల్ (కొండలు) కనిపిస్తాయా?"* అంటూ తన బాధను వ్యక్తపరిచేవారు.
హజ్రత్ ఆయిషా (రజి), మహాప్రవక్త (సల్లం) గారి సన్నిధికి వెళ్ళి బిలాల్ (రజి) గారి ఈ పరిస్థితినే తెలుపగా, ఆయన (సల్లం)...., *"ఓ అల్లాహ్! మా దృష్టిలో ఈ మదీనాను మక్కా వలెనే ప్రియమైనదిగా చెయ్యి. దానికంటే మరింత ప్రియమైనదిగా చెయ్యి. ఈ మదీనా వాతావరణాన్ని మా కోసం ఆరోగ్యవంతమైనదిగా మలుచు. దీని "సాఅ" మరియు "ముద్" (ధాన్యం కొల పాత్రలను)లకు శుభాన్ని చేకూర్చు. ఇక్కడి ఉష్ణోగ్రతను తగ్గించి దాన్ని "హుజ్ఫా"కు తరలించు."* అని ప్రార్థించారు. అల్లాహ్, దైవప్రవక్త (సల్లం) గారి ప్రార్థనను మన్నించాడు. పరిస్థితులు మారిపోయాయి.
మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తొలి రోజుల్లో "అజాన్" పిలుపు కూడా ఆరంభమైంది. ఇది అయిదు పూటలు మదీనాలో మారుమ్రోగేది. ఈ "అజాన్" పిలుపు విన్నంతనే మదీనా జీవితం ఒక్కసారే స్థాణువై వినేది. ఈ అజాన్ విషయంలో "హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ బిన్ అబ్'దర్'బా (రజి)" గారి స్వప్న వృత్తాంతం చెప్పుకోదగింది. (వివరాలు జామె తిర్మిజీ, సునన్ అబూ దావూద్, ముస్నదె అహ్మద్ మరియు సహీహ్ ఇబ్నె ఖజామాల్లో చూడవచ్చు.)
*↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑ ↑*
*ఇక్కడి వరకు పవిత్ర జీవిత చరిత్రకు సంబంధించిన ఓ దశ మరియు ఇస్లామీయ సందేశ ప్రచారానికి సంబంధించిన ఓ శకం (అంటే మక్కా జీవితకాల శకం) పూర్తి అయింది.*
*In Sha Allah రేపటి భాగములో...., మదీనాలో గడిపిన పవిత్ర జీవితం, హిజ్రత్ నాటి మదీనా పరిస్థితులు గురించి....;*
No comments:
Post a Comment