186

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 186            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 101*

              *మహాప్రవక్త (సల్లం) మదీనా ప్రవేశం* 

దైవప్రవక్త (సల్లం), మదీనాకు వస్తున్నారని మదీనావాసులందరికి తెలిసిపోయింది. ఇంకేముంది! ఆనందభరితమైన ఓ కలకలం బయలుదేరింది. ముస్లిములు, యూదులు, బహుదైవారాధకులు అంతా అమిత సంతోషంతో ఎగిరి గంతులేశారు. ఆనంద డోలికల్లో ఊగుతూ గానాలాపనం చేయసాగారు. అంతులేని అనురాగంతో, ఆగలేని ఆత్రంతో ఆడసాగారు. పరమసంతోషంతో పరవశించిపోతూ పాడసాగారు. ప్రతి మనిషి కళ్ళలో దైవసందేశహరుని (సల్లం) కోసం నిరీక్షణా జ్యోతులు వెలిగిపోతున్నాయి.

చిన్నారి పిల్లలు సైతం సంతోషంతో వీధి వీధి తిరుగుతూ *"ప్రియప్రవక్త వస్తున్నారు, త్వరలో వస్తున్నారు"* అని చెబుతూ అపార సంతోషంతో గంతులేయసాగారు. వారు ప్రతిరోజూ ఉదయాన్నే పట్టణం బయటికెళ్ళి, కళ్ళలో వత్తులు వేసుకుని దైవప్రవక్త (సల్లం) వచ్చే దారి వైపు గంటల తరబడి చూసేవారు. అలా మధ్యాహ్నం దాకా చూసి, వచ్చే జాడ కనపడక పోవడంతో నిరాశపడి ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితిలో ఓ రోజు హఠాత్తుగా....,

 *"మదీనా ప్రజలారా! మీరు ఎవరికోసం ఇన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్నారో ఆయన (సల్లం) వచ్చేశారు"* అని ఓ గుట్ట పైనుంచి ఒక యూదుని గొంతు పట్టణంలో ప్రతిధ్వనించింది.

అంతే, ఆ కేక విని మదీనా ప్రజావాహిని ఆనందాతిశయంతో పరవళ్ళుతొక్కింది. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అబాలగోపాలమంతా బిలబిలమంటూ ఇళ్ళలో నుంచి బయటికి వచ్చారు. ప్రతి ఒక్కడూ పట్టరాని సంతోషంతో వీధుల్లోకి దూసుకు వచ్చాడు. అందరి కళ్ళు, పూర్ణశశాంకుడ్ని చూసిన కలువ పువ్వుల్లా ఒక్కసారిగా వికసించాయి. బాలబాలికల ఆనందం, అవధులు దాటింది. ప్రతి ఒక్కడూ తనకేదో గొప్ప పెన్నిధి లభించబోతున్నట్లు మహా సంబరపడిపోతున్నాడు. 

ఎక్కడ చూసినా ఒకటే సందడి. ఆఖరికి చంటిపిల్లలు సయితం ఏడ్పులు మానేసి, సంతోషంతో కేరింతలు కొట్టడం ప్రారంభించారు. అంతా ఆనందడోలికల్లో ఉర్రూతలూగసాగారు. ముస్లింలు, యూదులు, బహుదైవారాధకులు.... ఒకరేమిటీ? యావన్మంది ప్రజలు కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా ఆ విశిష్ట వ్యక్తి దర్శనభాగ్యం కోసం తహతహలాడి పోతున్నారు.

 *"ఇంకా మీరిక్కడే ఉన్నారా? కదలండి మానవ మహోపకారి (సల్లం) వస్తున్నారు. బయలెడండి ఆయన దివ్యమోము తనివితీరా చూసి తరిద్దాము. నడవండి మన ప్రియ నగరాన్ని పావనం చేయడానికి విశ్వకారుణ్యమూర్తి (సల్లం) వస్తున్నారు. పదండి ఆ మహానీయుడికి స్వాగతగానం చేద్దాం."* 

 *"రండి రండి, త్వరగా రండి. ధర్మస్థాపన కోసం దైవసందేశహరుడు వస్తున్నాడు. ఎదురెళ్ళి తీసుకొద్దాము. పగ, ప్రతీకారం, స్వార్థం, ద్వేషం, దుఃఖం, దురాచారాలు ఆవరించిన మన హృదయాల్లో జీవనజ్యోతి వెలిగించడానికి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) వస్తున్నారు, అతిథ్యమిద్దాం పదండి."* 

 *"ఎన్నాళ్ళో నుంచో ఎదురుచూస్తున్న మన ఆశాజ్యోతి మహానీయ ముహమ్మద్ (సల్లం) పట్టణంలో ప్రవేశిస్తున్నారు పరుగెత్తండి."* 

ముందుగా, పెద్దలు, వృద్ధులు స్వాగతం చెప్పడానికి అంతులేని ఉత్సాహంతో పట్టణం బయటికి పోయి నిరీక్షించసాగారు. అలా చూస్తుండగానే వారి కళ్ళు తళుక్కున మెరిసాయి. ఆయన (సల్లం) వచ్చేశారు. నిరీక్షణా ఘడియలకు గడిపెట్టి వచ్చేశారు. ప్రియ సహచరులు ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకుని ఆయన (సల్లం)ని తీసుకువస్తున్నారు.

కాని శతకోటి తారల మధ్య భాసిల్లుతున్న పూర్ణ శశాంకునిలా, మందీమార్బలం మధ్య రాజలాంఛనాలతో, అట్టహాసంగా వస్తున్న రాజాధిరాజులా ప్రత్యేకతలేవీ లేకుండా అతి నిరాడంబరంగా, అందరిలో కలసిపోయి ఎలాంటి ఆర్భాటం లేని అతి సామాన్యుడిలా ఆయన (సల్లం) వస్తున్నారు.

అందువల్ల మదీనావాసులకు దైవప్రవక్త (సల్లం)ను గుర్తించడం కష్టమయి పోయింది. అయితేనేం? వారి హృదయచక్షువులు గుర్తిస్తున్నాయి. వారి దేహంలోని అణువణువులో ప్రవక్త ప్రేమాభిమానాలు జీర్ణించుకుపోయాయి. 

ఎండ తీక్షణంగా ఉండటంతో ప్రియ సహచరుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ముందుకొచ్చి, దైవప్రవక్త (సల్లం) తల మీద దుప్పటి లాగి పట్టుకున్నారు. అప్పుడు గ్రహించారు మదీనావాసులు ఆయనే దైవసందేశహరుడని. 

ఎడతెరపి లేకుండా జనం తండోపతండాలుగా వస్తున్నారు. "ఖుబా" నుంచి "మదీనా" వరకు మూడు మైళ్ళ పొడవున దైవప్రవక్త (సల్లం)కు ఇరువైపులా అనుచరులు బారులుతీరి నిలబడ్డారు. అక్కడక్కడ వారి మధ్య కొందరు పిల్లలు కూడా ముందుకు తోసుకుంటూ ఆ మహానీయుడ్ని చూడటానికి ఆరాటపడిపోతున్నారు.

అది శుక్రవారం, దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో "బనీసాలమ్" వాడలోకి వచ్చేటప్పటికి జుమా నమాజ్ వేళయింది. అంతా కలసి అక్కడ నమాజ్ చేశారు. తరువాత ఆయన (సల్లం) బయలుదేరి తన మాతృమూర్తి వంశస్థులు నివసిస్తున్న ప్రదేశం మీద కాలు మోపారు. తన రక్తమాంసాల కోసం ఎగబడిన ఖురైషీయులకు వ్యతిరేకంగా తన పట్ల అచంచల విశ్వాసంతో ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధమైన ధర్మ యోధుల పవిత్ర నగరంలో అడుగుపెట్టారు.

అదో అద్భుత సన్నివేశం. మదీనా చరిత్రలో కనీవినీ ఎరగని అపూర్వ సంఘటన. ప్రతి కుటుంబం, దైవప్రవక్త (సల్లం)ను తన అతిథిగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ప్రతిఒక్కరూ దగ్గరకొచ్చి *"దైవప్రవక్తా! మా ఇంటికి రండి, మా అతిథిగా ఉండండి. మా ఇళ్ళు విశాలంగా ఉంది. మా దగ్గర అన్ని సౌకర్యాలున్నాయి."* అని ప్రాధేయపడుతున్నారు.

దైవప్రవక్త (సల్లం) చిరునవ్వుతో వారికి కృతఙ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోతున్నారు. ఒంటె ముకుతాడు కొంచెం వదులు చేసి, *"ఈ ఒంటె ద్వారా అల్లాహ్ నన్ను ఎక్కడుండమని సూచిస్తాడో అక్కడుంటాను."* అన్నారు.

దైవప్రవక్త (సల్లం) కూర్చున్న ఒంటె మదీనా వీధుల్లో నడుస్తోంది. ఒంటెకు కుడి, ఎడమలా, వెనుక వైపునా ప్రియశిష్యులు నడుస్తున్నారు. ఒంటె ముందు కొంచెం దూరంలో జనసమూహం చేసే హర్షధ్వానాలు మిన్ను ముడ్తున్నాయి. చిన్నారి బాలికలు గెంతులు వేస్తూ, డప్పులు వాయిస్తూ ఆనందాతిశయంతో ఇలా పాడుతున్నారు:

 *"సీనాయి కొండల నుంచి మా ముందు పున్నమి చంద్రుడు ఉదయించాడు. దైవాన్ని వేడుకునే భక్తులారా! దైవానికి కృతజ్ఞులయి ఉండటమే మన కర్తవ్యం. మాలో ప్రవేశించే మహానుభావా! ఇక్కడ నీ అమృత ప్రవచనాలే మాకు వీనులవిందు."* 

పురుషులు ఎత్తయిన ప్రదేశాలు ఎక్కి చూడసాగారు. స్త్రీలు, ఇండ్ల కప్పుల పైకెక్కి తమ ప్రియతమ అతిథిని తిలకించసాగారు.

దైవప్రవక్త (సల్లం) ఒంటె అలా నడచి నడచి చివరకు విశాలమైన ఓ మైదానంలోకి ప్రవేశించి కూర్చున్నది. అప్పుడు జనం *"అల్లాహుఅక్బర్"* అంటూ దిక్కులు పిక్కుటిల్లేలా నినదించారు. మరుక్షణమే ఒంటె లేచి ముందుకు కొంచం దూరం నడిచింది. ఆ తరువాత గిర్రున వెనక్కి తిరిగొచ్చి కూర్చున్నది. కూర్చోగానే మోర కిందికి వాల్చి తోకాడించడం మొదలెట్టింది. జనం మరోసారి *"అల్లాహుఅక్బర్"* నినాదం చేశారు.

ఆ ప్రదేశం నజ్జార్ వంశానికి చెందిన ఇద్దరు అనాథబాలురధి. ఆ ప్రదేశానికి దగ్గర్లోనే "అబూ అయ్యూబ్ (రజి)" గారి రెండంతస్థులమేడ ఉంది. అందువల్ల ఆయన వెంటనే దైవప్రవక్త (సల్లం) అనుమతితో ఆయన (సల్లం) సామాగ్రిని తన ఇంటికి చేర్చారు.

దైవప్రవక్త (సల్లం) ఒంటె దిగి *"ఈ చోటు ఎవరిది?"* అని అడిగారు మస్జిద్ నిర్మించాలన్న ఉద్దేశ్యంతో.

"హజ్రత్ ముఆజ్ బిన్ అఫ్'రా (రజి)" ముందుకు వచ్చి, *"ఈ భూమి సహెల్, సుహైల్ అనే అనాథ పిల్లలది. పసితనంలోనే తండ్రిని కోల్పోయారు. ప్రస్తుతం వీరిద్దరు నా సంరక్షణలో ఉన్నారు. మీరు సంతోషంగా ఇక్కడ మస్జిద్ నిర్మించవచ్చు. పిల్లలకు నేను నచ్చజెబుతాను"* అని చెప్పారు.

దైవప్రవక్త (సల్లం) ఆ ఇద్దరు పిల్లల్ని పిలిపించి విషయం తెలియజేశారు. పిల్లలు భూమిని ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించారు. అయితే, దైవప్రవక్త (సల్లం) ఉచితంగా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దానికి తగిన ధర చెల్లించి తీసుకున్నారు.

మరుసటి రోజు దైవప్రవక్త (సల్లం) అనుచరులు చెట్లు నరికి ఆ స్థలాన్ని చదును చేశారు. ఆ తరువాత మస్జిద్ నిర్మాణం ప్రారంభమయింది. 

దైవప్రవక్త (స), "హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి)"కు అతిథి అయ్యారు. దాంతో "అబూ అయ్యూబ్ (రజి)" ఆనందం అంతా ఇంతా కాదు. తనకు ప్రపంచంలోని నిక్షేపాలన్నీ లభించినట్లు పరమానందంతో పరవశించి పోయారు.

 *మహాప్రవక్త (సల్లం), మదీనా ప్రవేశం గురించి వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం : - ↓* 

దైవప్రవక్త (సల్లం), మదీనాకు విచ్చేస్తున్నందున, నగరం వాడవాడల్లో, వీధుల్లో దైవ స్తోత్రాలు మిన్నుముడుతున్నాయి. అన్సార్ కు చెందిన బాలికలు సంతోషాతిరేకంతో ఇలా పాటలు పాడుతున్నారు. ↓

 *"దక్షిణ దిశ కొండల్లో నుండి పున్నమి చంద్రుడు మాపై ఉదయించాడు.* 

 *ఆయన (సల్లం) తెచ్చిన ధర్మం సత్యసందేశం ఎంత మేలైందో! దీనికి మనం అల్లాహ్ కు కృతజ్ఞతలు చూపాలి.* 

 *నీకు విధేయత చూపటం మా విధి. నిన్ను నీ ప్రభువు మా కోసం పంపించాడు."* 

ఆ పాటల్లోని కొన్ని పంక్తులు ఇలా ఉన్నాయి. ↑

అన్సారులు (మదీనావారు) ఏమంత గొప్ప ధనికులు కూడా కాదు. అయినా దైవప్రవక్త (సల్లం) తమ వద్దనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోనారంభించారు.

మహాప్రవక్త (సల్లం), అన్సార్ లకు చెందిన ఏ ఇంటి ముందునుంచైనా, ఏ వాడలో నుండి అయినా వెడుతూ ఉంటే ప్రజలు వచ్చి ఆయన (సల్లం) స్వారీ చేస్తున్న ఒంటె ముక్కు త్రాటిని పట్టుకుని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దైవప్రవక్త (సల్లం)ను తమ ఇంటికి వచ్చి దిగమని వేడుకుంటున్నారు. కాని మహాప్రవక్త (సల్లం) మాత్రం, *"ఒంటె ముక్కు త్రాటిని వదిలేయండి. ఇది అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించి నడుస్తోంది"* అని చెప్పేవారు.

ఇలా ఒంటె నడుస్తూనే ఉంది. ఈనాడు "మస్జిదె నబవీ" ఉన్న చోటికి వచ్చి కూర్చుండిపోయింది. అయినా మహాప్రవక్త (సల్లం) క్రిందికి దిగలేదు. ఆ ఒంటె తిరిగి లేచింది. కొంత దూరం వెళ్ళి తిరిగొచ్చి అదే స్థలంలో కూర్చుండిపోయింది. అప్పుడు గాని దైవప్రవక్త (సల్లం) క్రిందికి దిగలేదు. ఇది ప్రవక్త (సల్లం) అమ్మమ్మగారి తెగ "బనూ నజ్జార్"కు చెందిన వాడ. ఆయన (సల్లం) మనోగతం కూడా అక్కడనే ఆగాలని ఉంది. దానికి అల్లాహ్, ఆ ఒంటెను అక్కడే ఆగమని ఆదేశించాడు.

బనూ నజ్జార్ తెగవారు ఆయన (సల్లం)ను తమ తమ ఇండ్లకు గొనిపోవడానికి విన్నపాలు చేయనారంభించారు. కాని, "హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రజి)" మాత్రం అంబారీతో సహా ఆయన (సల్లం)ను ఎత్తుకొని తన ఇంటిదారి పట్టారు. ఇటు "హజ్రత్ అసఅద్ బిన్ జురారా (రజి)" వచ్చి దైవప్రవక్త (సల్లం) గారి ఒంటె ముక్కుతాడు పట్టుకొని తన ఇంటికి గొనిపోయారు. ఆ ఒంటె ఆయన దగ్గరనే ఉండిపోయింది.

 *"సహీ బుఖారీ"లో "హజ్రత్ అనస్ (రజి)" గారి ఉల్లేఖనం ఇలా ఉంది. ↓* 

దైవప్రవక్త (సల్లం), *"ఇక్కడకు ఎవరి ఇళ్ళు దగ్గర్లో ఉంది?"* అని అడగగా, హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రజి), *"నా ఇళ్ళు! దైవప్రవక్త (సల్లం)! అదిగో నా ఇళ్ళు. ఇదే దాని గుమ్మం"* అని అన్నారు. మహాప్రవక్త (సల్లం) ఆయనతో, *"వెళ్ళండి, వెళ్ళి సేద తీర్చుకోడానికి నా కోసం చోటును చూడండి"* అని అన్నారు. హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి), *"పదండి, మీరిద్దరూ పదండి. అల్లాహ్ శుభాలు చేకూరుస్తాడు"* అని అన్నారు.

 *మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment