🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 185 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 100*
*(మహాప్రవక్త (సల్లం) మదీనా ప్రవేశం : -)*
*1000 సంవత్సరాల క్రితం జరిగిన యమన్ చక్రవర్తి "తుబ్బవుల్ హుమైరీ" గారి గాధ : - - : అంతిమ దైవప్రవక్త కోసం, 1000 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న "తుబ్బవుల్ హుమైరీ" గారి లేఖ : - 2*
హుమైరీ (మదీనా) నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధం చేయసాగాడు. ఇలా అనేక వారాలు గడచిపోయాయి. కాని అంత గొప్ప సైన్యం ఉండి కూడా హుమైరీ మదీనాను జయించలేకపోయాడు. చివరికతను మదీనా ప్రజల స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. మదీనా వాసుల్లో ఏదైనా బలహీనత ఉంటే, దాన్ని వాడుకొని మదీనాపై మెరుపు దాడి చేయవచ్చని అతని ఉద్దేశ్యం.
కాని, ఆ ప్రయత్నంలో కూడా హుమైరీ సఫలం కాలేదు. వారాలు, నెలలు గడుస్తున్నా మదీనావాసుల విషయంలో ఒక్క బలహీనత గురించి కూడా ఆరాతీయలేకపోయాడు.
చివరికి ఓ రోజు ఉదయం, తనిఖీ నిమిత్తం సైనిక శిబిరాల మధ్య హుమైరీ నడుస్తుంటే, శిబిరాల ముందు ఖర్జూరపు విత్తనాలు కన్పించాయి. వాటిని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. తన సైనికుల కోసం తీసుకురాబడిన ఆహారవస్తువులలో ఖర్జూర పండ్ల ఛాయలు కూడా లేవు. మరి సైనిక శిబిరాల ముందు ఈ ఖర్జూరపు విత్తనాలు ఎలా వచ్చిపడ్డాయి!! ఈ విషయాన్ని గురించి చక్రవర్తి సైనికుల్ని నిలదీశాడు.
*"మహారాజా! ప్రతిరోజూ తెల్లవారుజామున యస్రిబ్ వాసులు పట్టణ ప్రాకారం పైనుంచి ఇటు మా వైపు ఖర్జూరపండ్లు నిండిన గోతాలు విసిరివేస్తారు. ఆ పండ్లు తీసుకుని మేము తింటున్నాము."* అంటూ తెలియజేశారు సైనికులు.
ఈ విషయం విని చక్రవర్తి మరింత ఆశ్చర్యపోయాడు.
*"ఆశ్చర్యంగా ఉందే! మనం ఎన్నో నెలల నుంచి ఈ నగరాన్ని దిగ్బంధం చేసి ఉంచాం. బయటి నుంచి ఎలాంటి ఆహారపదార్థాలు సరఫరా కాకుండా, వాళ్ళను ఆకలితో మాడ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నాము. మనం ఈ నగరాన్ని, నగరవాసుల్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యాం. కాని, ఈ వింత మనుషులు యుద్ధ సమయంలో కూడా తమ శత్రువుల పట్ల మిత్ర వైఖరి ప్రదర్శిస్తున్నారే!"* చక్రవర్తి నోట అప్రయత్నంగా వెలువడ్డాయి ఈ మాటలు.
అతను తీవ్రంగా ఆలోచించాడు. కాని, ఎంత ఆలోచించినా విషయం అర్థం కాలేదు.
అప్పుడు మదీనా నగర ప్రముఖులతో సంబంధం ఏర్పరుచుకుని, ఈ విషయాన్ని గురించి ఆరా తీయవలసిందిగా తన సైనికాధికారులను ఆదేశించాడు.
వెంటనే సైనికాధికారులు మదీనా నాయకుల్ని కలుసుకొని విషయం ఏమిటని విచారించారు. వారీ విషయాన్ని నగరంలోని తమ మతపెద్దలకు చేరవేశారు. ఆ మతపెద్దలు ఇలా తెలియజేశారు.
*"మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాము. మాలో కొందరు ఖైబర్ నుంచి, కొందరు సిరియా నుంచి, కొందరు ఈజిప్టు నుంచి, మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. మేము యూదులం. ఈ నగరానికి అంతిమ దైవప్రవక్త (సల్లం) వస్తారని తౌరాత్, జబ్బూర్ వంటి మతగ్రంథాల్లో మేము చదివి ఉన్నాము. అందువల్ల మేమిక్కడ నివసిస్తూ ఆయన (సల్లం) కోసం నిరీక్షిస్తున్నాము.*
*రానున్న అంతిమ దైవప్రవక్త ప్రేమమూర్తి, కరుణామయుడు, గొప్ప అతిథిసత్కారి అని కూడా మా మతగ్రంథాల్లో ఉంది. అందువల్ల మేము ఆ మహానుభావుని సుగుణాలను కూడా అలవరచుకోవడానికి కృషి చేస్తున్నాము."*
మదీనావాసులు పలికిన ఈ మాటలు, వారి సద్వర్తనం, అతిథి మర్యాదలు "హుమైరీ"ని ఎంతగానో ప్రభావితం చేశాయి. దాంతో అతని హృదయం ద్రవించింది. కళ్ళు అప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి.
*"ఆ దైవప్రవక్త ఇంకా పుడమిపై ప్రభవించనే లేదు. అప్పుడే వీరు ఆయన గుణగణాలు, అలవాట్లను అలవరచుకోవడం మొదలెట్టారే!"* ఈ భావన హుమైరీ అంతరాత్మను ఒక్క ఊపు ఊపేసింది.
*"అయ్యయ్యో! నేను, ఆ కారుణ్యప్రవక్త ప్రభవించే శుభయుగంలో పుట్టి ఉంటే ఎంత బాగుండేది!! ఆ మహానీయుడిని విశ్వసించి తరించేవాడిని. ఆయన (సల్లం), తన జాతి ప్రజలు పెట్టే బాధలు భరించలేక ఇక్కడకు వలస వస్తే నేనాయన్ని తనివితీరా సేవించేవాడ్ని"* అంటూ అతను కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగాడు.
అంతిమ దైవప్రవక్త (సల్లం) గురించి మరికొన్ని వివరాలు తెలిసిన తరువాత మదీనా పట్ల హుమైరీ ఆసక్తి మరింత పెరిగింది. అందువల్ల మదీనాలో ప్రవేశించి అక్కడి పవిత్ర వీధులను, ఇళ్ళను దర్శించుకునేందుకు అనుమతించమని అతను నగర పెద్దలను అభ్యర్థించాడు. వారందుకు సంతోషంగా అనుమతించారు.
అనుమతి లభించగానే తుబ్బవుల్ హుమైరీ తన సైన్యాన్ని వెంటబెట్టుకుని నగరంలోకి ప్రవేశించాడు.
అదొక విచిత్ర సన్నివేశం. వేలాది మందితో కూడిన ప్రజావాహిని అమితమైన భక్తి విశ్వాసాలతో తన్మయత్వం చెందుతూ, *"ఓ ముహమ్మద్! ఓ ముహమ్మద్!!"* అని నినదిస్తూ మదీనా వీధుల గుండా సాగిపోతోంది. అందరూ ఎంతో వినయవిధేయతలతో తలలు వంచి నడుస్తున్నారు. కొందరి కళ్ళలో నుంచి కన్నీరు ధారాపాతంగా కారిపోతోంది.
వారందరి ముందు, చక్రవర్తి తుబ్బవుల్ హుమైరీ చెదరిన జుట్టుతో మాటిమాటికి ముహమ్మద్ మహనీయుని (సల్లం) పేరు ఉచ్చరిస్తూ, చంటి పిల్లవాడిలా విలపిస్తూ, తనను తాను మైమరచి భక్తిపారవశ్యంతో ఊగుతూ నడుస్తున్నాడు. అప్పుడప్పుడు అతను, వీధుల ఇరుప్రక్కల ఉన్న గోడలను, చెట్లను అప్రయత్నంగా ముద్దాడుతున్నాడు.
*"ఓ యస్రిబ్ నగరమా! యస్రిబ్ నగరవీధులా!! నేను మీ యజమాని సేవకుణ్ణి. దీనికి మీరే సాక్ష్యులు. ఓ పవిత్ర యస్రిబ్ నగర ప్రాకారమా! ప్రాకారం ద్వారాలా!! నేను మీ ప్రభువు యొక్క నమ్మిన బంటుని. దీనికి మీరే సాక్ష్యులు. యస్రిబ్ నగరమా! నేను నీ పవిత్ర గృహాల గోడలను, ఆ గృహాల తలుపులను ముద్దాడుతున్నాను. నీ ధూళిని మహాభాగ్యంగా తలచి కళ్ళకు అద్దుకుంటున్నాను.*
*ఓ భూమండలమా! ఈ నగరం నా ప్రభువు, ప్రియ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లం)కు నిలయం కానున్నది. ఈ నగరం నుంచే సౌభాగ్యభానుడు ఉదయించి తన దివ్య తేజస్సుతో లోకంలోని కారుచీకట్లను పారద్రోలుతాడు. అందుకే ఇక్కడి అణువణువూ, చివరికి ఓ చిన్న ధూళి రేణువు సైతం ఎంతో పవిత్రమైనది.*
*ముహమ్మద్ (సల్లం) దేవుని ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ మహానీయుడు ప్రభవించేదాకా నేను జీవించి ఉంటే నేనాయనకు తప్పకుండా నా సహాయసహకారాలు అందజేస్తాను, ఆయన విరోధులతో పోరాడుతాను, ఆయన విచారాన్ని పోగొడుతాను."*
చక్రవర్తి హుమైరీ, రానున్న అంతిమ దైవప్రవక్త (సల్లం) పట్ల అపార విశ్వాసం, గౌరవ భావాల మైకంలో ఇలా ఆ మహానీయుడ్ని పదేపదే స్మరిస్తూ మదీనా వీధుల్లో పిచ్చివాడిలా నడుస్తున్నాడు. అతని వెనుక వేలాది మంది అతని సైనికులు కూడా తమ భక్తి విశ్వాసాలు చాటుకుంటూ అతడ్ని అనుసరిస్తున్నారు.
ఈ విధంగా హుమైరీ చక్రవర్తి మదీనా వీధులన్నీ తిరగడం ముగిసిన తరువాత నగర వీధులన్నీ పరిశుభ్రం చేయించాడు. యూద పండితులతో పాటు ఇక్కడే నివసిస్తూ అంతిమ దైవప్రవక్త (సల్లం) కోసం నిరీక్షిద్దామనుకున్నాడు.
కాని, యమన్ లో అతను లేకపోవడం చూసి, విరోధులు తిరుగుబాటు లేవదీశారు. దాంతో హుమైరీ యమన్ కు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల అతను మదీనాలో నాలుగొందల మంది యూద పండితులకు అందమైన ఇళ్ళు కట్టించి, వారు సుఖంగా జీవించడానికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించాడు.
*ఆ తరువాత తన స్వహస్తాలతో ఒక లేఖ రాసి, దానిపై రాజముద్రవేసి, దాన్ని ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి, ఆ పెట్టెను, తాళం చెవులను "షాముల్" అనే ఓ పండితునికి అప్పగించాడు.*
అప్పగిస్తూ, షాముల్ తో చక్రవర్తి హుమైరీ ఇలా అన్నాడు. ↓
*"ఈ లేఖను అంతిమ దైవప్రవక్త (సల్లం)కు అందజేయాలి. ఆ అదృష్టం నీకు లభించకపోతే, నీ సంతానానికి ఆ లేఖ(ను ఆయన (సల్లం)కు) అందజేయాలి. వారిక్కూడా ఆ భాగ్యం లభించకపోతే వారు తర్వాతి తరం వారికి అప్పగించాలి. ఇలా అంతిమ దైవప్రవక్త (సల్లం) ప్రభవించేవరకు ఈ పరంపర కొనసాగాలి."*
చక్రవర్తి హుమైరీ ఈ విధంగా తాకీదు చేశాడు. ఆ తరువాత హుమైరీ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.
రేయింబవళ్ళు యథాప్రకారం ఒకదాని వెంట ఒకటి సాగిపోతున్నాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోతున్నాయి. ఈ కాలచక్రంలో దశాబ్దాలు, శతాబ్దాలు కూడా గడచిపోయాయి. *హుమైరీ వెళ్ళిపోయిన దాదాపు వేయి సంవత్సరాల తరువాత ఇప్పుడు అంతిమ దైవప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లం) మక్కా నుంచి మదీనా వలస వస్తున్నారని తెలిసింది....*
(1000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ సమాప్తం. ప్రస్తుతం హిజ్రీ శకం - 1.)
"హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి)" ఆలోచనల నుంచి తేరుకొని, గబగబా ఆ లేఖచుట్ట తీసి, "అబూలైలా" అనే ఓ నమ్మకస్తుడైన మనిషికి ఇచ్చి, దాన్ని దైవప్రవక్త (సల్లం)కు అందజేయమని చెప్పి పంపించారు.
వెంటనే, అబూలైలా నగరానికి వస్తున్న మహాప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్నాడు.
దైవప్రవక్త (సల్లం), "అబూలైలా"ని దూరం నుంచే చూసి...., *"నువ్వు అబూలైలావా? అయితే నీ దగ్గర "తుబ్బవుల్ హుమైరీ" రాసిన లేఖ ఉందా?"* అని అడిగారు చిరునవ్వుతో.
దైవప్రవక్త (సల్లం) తనను పేరు పెట్టి పిలవడమే కాకుండా, హుమైరీ లేఖ సంగతి కూడా ప్రస్తావించడంతో అబూలైలా ఆశ్చర్యచకితుడై పోయాడు.
అదీకాక అతను దైవప్రవక్త (సల్లం)ను ఎప్పుడూ చూడలేదు. అతను క్షణం పాటు మ్రాన్పడిపోయి చూస్తూ...., *"మీరెవరండీ! మీ ముఖంలో మాంత్రికుడి ఛాయలు కూడా లేవే!!"* అన్నాడు.
*"నా పేరు ముహమ్మద్ (సల్లం) బిన్ అబ్దుల్లా. అల్లాహ్ నన్ను ప్రవక్తగా నియమించి పంపాడు. దివ్యగ్రంథాన్ని కూడా నాపై అవతరింపజేశాడు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).
అప్పుడు అబూలైలా జేబులో నుంచి లేఖ తీసి శ్రీవారికి అందజేశాడు. ఆ లేఖలో ఈ విధంగా రాసి ఉంది...., ↓
*"అబ్దుల్లా కుమార రత్నం, అంతిమ దైవప్రవక్త, దైవసందేశహరులయిన ముహమ్మద్ (సల్లం)కు విర్దా కుమారుడు తుబ్బా వ్రాస్తున్న లేఖ ఇది....*
*ముహమ్మద్ మహానుభావా! నేను మిమ్మల్ని, మీపై అల్లాహ్ అవతరింపజేసే గ్రంథాన్ని నిండు హృదయంతో విశ్వసించాను. మీరు తీసుకొచ్చే ధర్మాన్ని, మీ సంప్రదాయాల్ని కూడా విశ్వసించాను. సర్వలోకాల, సమస్త సృష్టిరాశులు స్వామి, సంరక్షకుడైన మీ ప్రభువుని కూడా విశ్వసించాను. మహాత్మా! నా జీవితకాలంలో మిమ్మల్ని దర్శించగలిగితే నేనెంతో అదృష్టవంతుడ్ని. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రళయదినాన అల్లాహ్ కి నా మోక్షం కొరకు సిఫారసు చేయండి. దైవం కొరకు ఆ రోజు నన్ను మర్చిపోకండి. మహానుభావా! మీరు ప్రభవించడానికి ముందే నేను మీకు విధేయున్నయి మీ అనుచర సమాజంలో ప్రప్రథమ సభ్యుడిగా చేరిపోయాను."*
దైవప్రవక్త (సల్లం), లేఖలోని విషయాలు విని *"శభాష్ సోదరా! నా మంచి సోదరా! శభాష్!!"* అంటూ మూడుసార్లు "తుబ్బవుల్ హుమైరీ"ని అభినందించారు. ఆ తరువాత ఆయన అనుచరులు, అభిమానులు వెంటరాగా ముందుకు సాగారు.
*మహాప్రవక్త (సల్లం) మదీనా ప్రవేశం : -*
మహాప్రవక్త (సల్లం) మదీనా చేరారు. అదే రోజున ఆ నగరం పేరు "యస్రిబ్"కు బదులు "మదీనతుర్రసూల్ (ప్రవక్త గారి నగరం)"గా పడిపోయింది. దీన్నే ఇప్పుడు కేవలం "మదీనా"గా మాత్రమే పిలువడం జరుగుతోంది.
ఇది ఉజ్వలమైన చారిత్రాత్మకమైన రోజు.
*మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment