🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 184 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 99*
*(మహాప్రవక్త (సల్లం) మదీనా ప్రవేశం : -)*
*1000 సంవత్సరాల క్రితం జరిగిన యమన్ చక్రవర్తి "తుబ్బవుల్ హుమైరీ" గారి గాధ : - - : అంతిమ దైవప్రవక్త కోసం, 1000 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న "తుబ్బవుల్ హుమైరీ" గారి లేఖ : - 1*
"హజ్రత్ అబూ అయ్యూబ్ (రజి)", దైవప్రవక్త (సల్లం) రాక సంగతి విని సంతోషంతో తబ్బిబ్బుయి పోయారు. వెంటనే ఆయన (రజి) ఇంట్లో ఏదో వస్తువు కోసం గాలించారు. చివరికి ఒక పెట్టే తెరిచారు. దాన్ని తెరచి అందులో నుంచి మరో చిన్న పెట్టె తీసి తెరిచారు. ఆ పెట్టెలో నుంచి ఒక లేఖచుట్ట బయటికి తీశారు. దాన్ని చూడగానే ఆయన (రజి) మెదడులో ఒక్కసారిగా గత చరిత్ర లీలగా మెదిలింది.... (1000 సంవత్సరాల క్రిందటి కథ ↓)
.... యమన్ నుండి బ్రహ్మాండమైన ఓ సైనిక వాహిని నురుగులు కక్కుతూ, పరవళ్ళు తొక్కుతూ ప్రపంచ దండయాత్రకు బయలుదేరింది. సైన్యానికి సారథ్యం వహిస్తున్న యమన్ చక్రవర్తి "తుబ్బవుల్ హుమైరీ", తన సామ్రాజ్యం చుట్టుప్రక్కలున్న అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంటూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాడు.
లక్షా పదమూడు వేల కాల్బలం, లక్షా ముప్పయి మూడువేల వాహనబలం, అపార ఆయుధ సంపత్తి ఉన్న హుమైరీ చక్రవర్తి అంటే, ఆనాటి రాజులకు సింహస్వప్నం. ఎటుపోయినా హుమైరీ చక్రవర్తి దాడికి ఎదురులేదు. అతని విజయ పరంపరకు అంతం లేదు. అతని సైన్యం కాలిడిన ప్రతి ఊరు, వాడా యమన్ రాజ్యంలో అంతర్భాగమయి పోవాల్సిందే.
హుమైరీ ఇలా అనేక ప్రాంతాలను జయిస్తూ మక్కా సమీపానికి చేరుకున్నాడు.
అయితే మక్కా పౌరులు, అతని సైనిక బలం, మందీమార్భలం చూసి ఏమాత్రం భయపడలేదు. అసలతని సైనిక పటాలాన్ని, పటాటోపాన్ని ఖాతరే చేయలేదు. పైగా వారిలో ఒక్కరు కూడా తనికి స్వాగతమివ్వడానికి రాలేదు. మక్కా వాసుల ఈ నిర్లక్ష్య ధోరణి చూసి హుమైరీ ఆగ్రహోదగ్రుడై పోయాడు. అతని మంత్రులతో ఒకతను ఈ నిరక్ష్య వైఖరికి కారణం ఇలా వివరించాడు.
*"ప్రభూ! ఈ అరబ్బులు అనాగరికతను అంటిపెట్టుకొని ఉండటమే తమకు గర్వకారణంగా భావిస్తారు. అదీగాక యావత్తు అరబ్బులకు గొప్ప ఆరాధనా కేంద్రమైన "కాబామందిరం" ఈ నగరంలోనే ఉంది. దానికి, తాము ధర్మకర్తలమన్న అహంకారంతో వారు ఎవరినీ లెక్క చేయరు."*
ఈ సంగతి విని చక్రవర్తి మరింత మండిపడ్డాడు.
*"అదా వీరి తలబిరుసుకు కారణం! అయితే ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసి, పట్టణ వాసుల్ని ఊచకోత కోయండి"* అంటూ హుకుం జారీ చేశాడు హుమైరీ.
కాని ఈ ఉత్తర్వు జారీ చేసిన మరుక్షణమే అతనికి ఒక విధమైన వ్యాధి పట్టుకుంది. చూస్తుండగానే అతని నోరు, ముక్కు, చెవుల్లో నుంచి రక్తం కారడం మొదలయింది. మరో వైపు విపరీతమైన తలనొప్పి కూడా వచ్చింది. దాంతో హుమైరీ తల్లడిల్లి పోసాగాడు.
హఠాత్తుగా వచ్చిన ఈ రోగం చూసి మంత్రులు, సైనికాధికారులు ఆందోళన చెందసాగారు. తక్షణమే రాజవైద్యులు రంగంలోకి దిగి రకరకాల మందులు వాడి చూశారు. కాని, ఏ మందు కూడా పనిచేయలేదు. పాపం చక్రవర్తి రోజురోజుకు కృశించిపోతూ మృత్యు కుహురానికి సమీపంగా చేరుకున్నాడు. అతని దీనావస్థ విని ఒక స్ఫురద్రూపి వచ్చి ఇలా అన్నాడు: ↓
*"నేను మీకు చికిత్స చేస్తాను. కాని ఒక షరతు. నేను అడిగే ప్రతి ప్రశ్నకు ఏ మాత్రం దాపరికం లేకుండా ఉన్నవి ఉన్నట్లు సరైన సమాధానాలు ఇవ్వాలి."*
చక్రవర్తి హుమైరీ ఈ షరతును ఒప్పుకున్నాడు. స్ఫురద్రూపి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వసాగాడు. చివరికి "కాబా" మందిరాన్ని నేలమట్టం చేసి, మక్కా వాసులను ఊచకోత కోయడానికి జారీచేసిన ఉత్తర్వు సంగతి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ ఉత్తర్వు సంగతి వినగానే స్ఫురద్రూపి ఇలా అన్నాడు: ↓
*"మహారాజా! మీ వ్యాధికి అసలు కారణం ఈ ఉత్తరువే. ఈ పవిత్ర ఆలయానికి అసలు యజమాని సృష్టికర్త, విశ్వప్రభువైన "అల్లాహ్". ఆయన స్వయంగా దీన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. అందువల్ల మక్కా నగరాన్ని ధ్వంసం చేయాలన్న ఆలోచనను మీ మనసులో నుంచి తీసివేయండి."*
ఈ మాటలు వినగానే చక్రవర్తి "తుబ్బవుల్ హుమైరీ" తన దురాలోచనకు స్వస్తి చెప్పి, ఉత్తర్వుని ఉపసంహరించుకున్నాడు.
స్ఫురద్రూపి ఈ సలహా ఇచ్చి చక్రవర్తి కొలువు నుంచి బయటికి వెళ్ళాడు. అతనలా వెళ్ళాడో లేదో హుమైరీ రోగం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత కొన్ని గంటల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది.
హుమైరీ చక్రవర్తి సంతోషంతో పొంగిపోయాడు. అతని మనస్సులో ఇప్పుడు "కాబా" మందిరం పట్ల అపారమైన గౌరవభావం ఏర్పడింది. ఆ తరువాత అతను, తన ముఖ్య అనుచరుల్ని తీసుకుని మక్కా నగరంలో ప్రవేశించాడు.
ముందుగా హుమైరీ, అమితమైన భక్తివిశ్వాసాలతో "కాబా" ప్రదక్షిణ చేశాడు. తరువాత మక్కా పౌరులకు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. ఆ విందులో ధనికులు - పేదలు, అధికులు - అధములు అన్న తేడా లేకుండా అందరిని ఆహ్వానించాడు. విందులో మంచినీళ్ళకు బదులు తేనెను ఏర్పాటు చేశాడు.
ఆ తరువాత చక్రవర్తి "కాబా" గర్భగుడిని కప్పడానికి ఖరీదైన పట్టు గిలాఫు తయారు చేయించాడు.
అయితే "కాబా"కు ఇది సముచితమైన గిలాఫు కాదని, ఆరాత్రి కలలో ఓ దివ్య పురుషుడు కన్పించి చెప్పాడు. అప్పుడు చక్రవర్తి దాన్ని మార్చి సుగంధ పరిమళాలతో కూడిన ప్రత్యేక పట్టు గిలాఫు తయారు చేయించాడు.
కాని, అది కూడా సముచితమైనది కాదని కలలో సూచించబడింది.
ఈసారి చక్రవర్తి పట్టు వస్త్రంపై యమన్ శాలువ అంచులతో కూడిన ఏడు పరదాల గిలాఫు తయారుచేయించాడు.
(ఆ తర్వాత,) కలలో ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో దాన్నే "కాబా" గర్భగుడికి కప్పాడు. తరువాత ఆలయంలోని విగ్రహాలన్నిటినీ తొలగించి, గోడలను, నేలను బాగా అలంకరింపజేసి, తలుపులకు తాళం వేసి, తాళపుచెవిని ధర్మకర్తలకు స్వాధీనం చేశాడు.
ఈ పనులన్నీ ముగిశాక తుబ్బవుల్ హుమైరీ మళ్ళీ దండయాత్రకు బయలుదేరాడు. అనేక రాజ్యాలు జయిస్తూ యస్రిబ్ (మదీనా)కు చేరుకున్నాడు.
అక్కడ నగరం వెలుపల యస్రిబ్ వాసులకు, అతని సైన్యానికి మధ్య యుద్ధం మొదలయింది. కాని, మదీనా వాసులు హుమైరీ సైనికుల ధాటికి రంగంలో నిలువలేక పోయారు. వారు నగరంలోకి వెళ్ళిపోయి నగర ద్వారాలు మూసేసుకున్నారు. ఆ తర్వాత ప్రాకారం బురుజులపై ఎక్కి యుద్ధం కొనసాగించారు.
హుమైరీ నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధం చేయసాగాడు. ఇలా అనేక వారాలు గడచిపోయాయి. కాని అంత గొప్ప సైన్యం ఉండి కూడా హుమైరీ మదీనాను జయించలేకపోయాడు. చివరికతను మదీనా ప్రజల స్థితిగతులేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. మదీనా వాసుల్లో ఏదైనా బలహీనత ఉంటే, దాన్ని వాడుకొని మదీనాపై మెరుపు దాడి చేయవచ్చని అతని ఉద్దేశ్యం.
కాని, ఆ ప్రయత్నంలో కూడా హుమైరీ సఫలం కాలేదు. వారాలు, నెలలు గడుస్తున్నా మదీనావాసుల విషయంలో ఒక్క బలహీనత గురించి కూడా ఆరాతీయలేకపోయాడు.
చివరికి ఓ రోజు ఉదయం, తనిఖీ నిమిత్తం సైనిక శిబిరాల మధ్య హుమైరీ నడుస్తుంటే, శిబిరాల ముందు ఖర్జూరపు విత్తనాలు కన్పించాయి. వాటిని చూసి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. తన సైనికుల కోసం తీసుకురాబడిన ఆహారవస్తువులలో ఖర్జూర పండ్ల ఛాయలు కూడా లేవు. మరి సైనిక శిబిరాల ముందు ఈ ఖర్జూరపు విత్తనాలు ఎలా వచ్చిపడ్డాయి!! ఈ విషయాన్ని గురించి చక్రవర్తి సైనికుల్ని నిలదీశాడు.
*↑ ఇందుకు సైనికుల సమాధానం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు In Sha Allah రేపటి భాగములో....; →*
No comments:
Post a Comment