🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 183 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 98*
*మదీనాకు హిజ్రత్ : - 7*
*"ఖుబా"కు అరుదెంచిన దైవప్రవక్త (సల్లం) : -*
సోమవారం, "రబీఉల్ అవ్వల్" 8వ తేదీ దైవదౌత్య శకం 14 - అంటే హిజ్రీ శకం ఒకటి - క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ నాడు మహాప్రవక్త (సల్లం) "ఖుబా" అనే గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ్నుంచి మదీనా మూడు మైళ్ళే ఉంది.
ఆ మహనీయుని (సల్లం) రాక సంగతి తెలిసిన స్త్రీలు, పిల్లలు కూడా సంతోషాతిశయంతో పరవశించి పోతూ ఇండ్లలో నుంచి వీధుల్లోకి వచ్చి చూడసాగారు. దాదాపు అయిదొందల మందితో కూడిని జనవాహిని *"అల్లాహు అక్బర్"* అంటూ దిక్కులు పిక్కుటిల్లేలా నినాదాలు చేస్తూ ఆయన (సల్లం)ని ఊళ్ళోకి తీసుకొచ్చింది. వారిలో ప్రతిఒక్కడూ ఆయన (సల్లం)ని అతిథిగా స్వీకరించడానికి తానంటే తానని ముందుకు రాసాగాడు. చివరికి దైవప్రవక్త (సల్లం)కు అతిథ్యమిచ్చే భాగ్యం "కుల్సూమ్ బిన్ బదమ్"కు లభించింది.
*ఉర్వా బిన్ జుబైర్ (రజి) కథనం ప్రకారం....; ↓*
అందరిని కలసిన తరువాత ఆయన (సల్లం), వారికి కుడి వైపునకు మళ్ళి "బనీ అమ్రూ బిన్ ఔఫ్" తెగ వారు ఉంటున్న చోటికి చేరారు.
అది సోమవారం రోజు, "రబీఉల్ అవ్వల్" నెల, అబూ బక్ర్ (రజి) వచ్చేవారిని ఆహ్వానించడానికి లేచి నిలబడ్డారు. మహాప్రవక్త (సల్లం) మాత్రం మాట్లాడకుండా కూర్చుని ఉన్నారు. అన్సారులు వచ్చీ రావడంతోనే దైవప్రవక్త (సల్లం)ను ఇదివరకు చూసి ఉండలేదు గనుక, హజ్రత్ అబూ బక్ర్ (రజి)కు సలాము చేస్తున్నారు.
ఇలా మహాప్రవక్త (సల్లం)పై ఎండ వచ్చే వరకు అలానే జరుగుతూ ఉంది. ఇది చూసిన అబూ బక్ర్ (రజి), దైవప్రవక్త (సల్లం)పై ఎండ పడకుండా తన దుప్పటితో ఆచ్చాధన పట్టారు. అప్పుడు గాని వచ్చేవారికి వీరే దైవప్రవక్త అని తెలియలేదు.
మహాప్రవక్త (సల్లం) దర్శనార్థం, మదీనా మొత్తమే తరలి రానారంభించింది. ఇది ఓ చారిత్రాత్మకమైన దినం. ఇలాంటి సంఘటనను మదీనావాసులు ఇదివరకెన్నడూ చూసి ఉండలేదు. ఈ రోజు యూదులు కూడా దైవప్రవక్త (సల్లం) రాకకు సంబంధించిన భవిష్యవాణిని తమ కళ్ళారా చూడడం జరిగింది. వారి గ్రంథం "జుకూక్"లో ఉన్న భవిష్యవాణి ప్రకారం, *"అల్లాహ్ దక్షిణం నుండి మరియు ఆయన మహిమ ఫారాన్ కొండల్లో నుండి వచ్చింది"* అని ఉంది.
మహాప్రవక్త (సల్లం) "ఖుబా"లో "కుల్సూమ్ బిన్ బదమ్" - మరో ఉల్లేఖనంలో "సఅద్ బిన్ ఖైస్మా" - ఇంట విడిది చేశారు. మొదటి ఉల్లేఖనమే సరి అయిందని ఆధారాలున్నాయి.
*"ఖుబా"లో మస్జిద్ నిర్మాణం : -*
దైవప్రవక్త (సల్లం) మరునాడు ఒక పెద్ద సమావేశంలో ప్రసంగిస్తూ, *"మస్జిద్ ను నిర్మించే, నిరంతరం ఖుర్ఆన్ పఠించే, రాత్రివేళ (దైవారాధన కోసం) జాగరణ చేసే ప్రతి మనిషికీ (పరలోక) మోక్షం లభిస్తుంది."* అని శుభవార్త తెలియజేశారు.
ఈ శుభవార్త వినగానే అనేకమంది మస్జిద్ నిర్మాణం కోసం ముందుకొచ్చారు. వెంటనే పని కూడా మొదలయ్యింది.కొందరు గడ్డపలుగులతో నెల త్రవ్వుతుంటే, మరికొందరు పారలతో మట్టి తీసి పడేస్తున్నారు. ఇంకొందరు రాళ్ళు మోసుకోస్తున్నారు. ఈ పవిత్రకార్యంలో దైవప్రవక్త (సల్లం) కూడా పాల్గొన్నారు. అనుచరులు (ఆయన (సల్లం)ను) వారించడానికి ప్రయత్నిస్తే ఆయన (సల్లం) చిరునవ్వు నవ్వి తన పనిలో మళ్ళీ లీనమైపోయేవారు.
ఇలా రెండు రోజుల్లోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది. దైవప్రవక్త (సల్లం) అందులో నమాజ్ చేసిన తరువాత అనుచరుల్ని ఉద్దేశించి, *"శుభ్రంగా ఉజూ చేసి ఖుబా మస్జిద్ లో నమాజు చేసేవారికి ఉమ్రా (కాబా దర్శనం) చేసినంత పుణ్యం లభిస్తుంది"* అన్నారు.
ఆ తరువాత ఆయన (సల్లం) మస్జిద్ నుండి బయటకు వచ్చి పరిసరాలు చూడసాగారు. ఆయన (సల్లం) చుట్టూ అనుచరులు గుమికూడి ఉన్నారు.
అపుడు కుల్సూమ్ (రజి) ముందుకొచ్చి, *"దైవప్రవక్తా! ఇక్కడ మాకు మంచినీళ్ళు పెద్ద సమస్యగా ఉంది. దైవాన్ని ప్రార్థించండి."* అన్నారు.
*"అక్కడేదో బావి ఉన్నట్లు కనిపిస్తోంది"* అన్నారు దైవప్రవక్త (సల్లం) ఎదురుగా యాభై అడుగుల దూరంలో ఉన్న ఓ బావి వైపు చూపిస్తూ.
*"అది ఉప్పునీళ్ళ బావి. మీరు దైవాన్ని ప్రార్థిస్తే అవి మంచినీళ్ళుగా మారుతాయేమో చూడండి"* అన్నారు మరొకరు.
*"చూద్దాం పదండి"* అంటూ దైవప్రవక్త (సల్లం) ముందుకు నడిచారు.
బావి దగ్గర దైవప్రవక్త (సల్లం), విశ్వప్రభువును ప్రార్థించి తన లాలాజలం కొంత తీసి బావిలో పడవేశారు.
*"ఇప్పుడు నీళ్ళు తోడి చూడండి"* అన్నారు ఆయన (సల్లం).
జనంలో ఒకతను వెంటనే చేద తెచ్చి నీళ్ళు తోడాడు. తరువాత చేత్తో కొంచెం నీళ్ళు తీసుకుని తాగి *"అమృతం!"* అన్నాడు.
ఆ తరువాత మరికొందరు తాగి *"మధురం మధురం! ఎంత తియ్యగా ఉన్నాయి నీళ్ళు!!"* అన్నారు అమిత సంతోషంతో.
ఈ వార్త ఊళ్ళో అందరికి తెలియగానే వారు ఆనంద పారవశ్యంతో ఊగిపోయారు. దైవప్రవక్త (సల్లం) పట్ల వారి గౌరవాభిమానాలు మరింత అధికమయ్యాయి. ఎవరి నోట విన్నా ప్రవక్త (సల్లం) ప్రస్తావనలే.
*హజ్రత్ అలీ (రజి) "ఖుబా"కి రాక : -*
అటు మక్కాలో "హజ్రత్ అలీ (రజి)" ఎలాగో శత్రువుల బారి నుండి బయటపడి ఎవరి వస్తువులు వారికి అప్పగించి మదీనా దారిపట్టారు.
ఎలాంటి వాహనంలేని దయనీయ స్థితిలో కాలినడకన గుట్టలు మిట్టలు దాటుకుంటూ ప్రయాణం చేసి చివరికి "ఖుబా" గ్రామం చేరుకున్నారు.
అప్పుడే దైవప్రవక్త (స) నమాజు చేసి మస్జిద్ నుండి బయటకు వచ్చారు. బయట అడుగుపెట్టగానే ఎదురుగా అలీ (రజి) కనిపించారు.
అంతే, ఆయన (సల్లం) సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఒక్క ఉదుటున ముందుకొచ్చి అలీ (రజి)ని ప్రగాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన (రజి) నుదుటిని అనేకసార్లు చుంబించారు.
కాని ఆ తర్వాత వాడిపోయిన ముఖం, దుమ్ముకొట్టుకున్న శరీరం, చినిగిపోయిన బట్టలు, పగిలి రక్తసిక్తమైన పాదాలు చూసి ఆయన (సల్లం) కళ్ళు చెమర్చాయి. ఆ దృశ్యం చూసి మిగిలిన వాళ్ళు కూడా కంటతడి పెట్టుకున్నారు. అయితే అలీ (రజి) కళ్ళు మాత్రం ఆనంద కిరణాలు వెదజల్లుతున్నాయి. ప్రవక్త (సల్లం) దర్శనంతో, ఆయన (రజి) ప్రయాణ బడలిక పటాపంచలైపోయింది.
*వేరొక ఉల్లేఖనంలో : -*
దైవప్రవక్త (సల్లం) "ఖుబా"లో మొత్తం నాలుగు రోజులు (అంటే సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం) లేదా పదికంటే ఎక్కువ రోజులు లేదా అక్కడకు చేరి బయలుదేరిన వరకు 24రోజులు బస చేశారు.
ఈ కాలంలోనే "ఖుబా" మస్జిద్ పునాదులు వేసి అందులో నమాజు చేశారు. ఇది దైవదౌత్యానికి సంబంధించిన ప్రప్రథమ మస్జిద్. దీని పునాదులు "తక్వా (దైవభీతి)" పై పెట్టబడ్డాయి. అయిదవ రోజు (లేదా పన్నెండవ రోజు లేదా 26వ రోజు) శుక్రవారం నాడు - ఆయన (సల్లం) దైవాదేశం మేరకు వాహనమేక్కారు. అబూ బక్ర్ (రజి), ఆయన (సల్లం) వెనుక ఉన్నారు. ఆయన బనూ నజ్జార్ కు - ఇది ఆయన (సల్లం) గారి మేనమామకు చెందిన తెగ - కబురు పంపించడం వలన వారంతా ఖడ్గధారులై అక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన (వారి సంరక్షణలో) మదీనాకు బయలుదేరారు. "బనూ సాలిమ్ బిన్ ఔఫ్" ఉండే ప్రదేశానికి చేరినప్పటికి జుమా నమాజు వేళ అయింది. మహాప్రవక్త (సల్లం) ఆ లోయ నడుమ, నేడు మస్జిద్ ఉన్న స్థలంలో నమాజు చేశారు. ఆయన (సల్లం) వెనుక మొత్తం వంద మంది దాకా అప్పుడు ఉన్నారు.
*మహాప్రవక్త (సల్లం) మదీనా ప్రవేశం : -*
1000 సంవత్సరాల క్రితం జరిగిన, రాజు "తుబ్బవుల్ హుమైరీ" గారి గాధను In Sha Allah రేపటి భాగములో తెలుసుకుందాం.
No comments:
Post a Comment