182

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 182            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 97*

                 *మదీనాకు హిజ్రత్ : - 6* 

 *నాలుగవ సంఘటన : -* 

మక్కా అవిశ్వాసులు దైవప్రవక్త (సల్లం) కోసం వెతికి వెతికి వేసారిపోయారు. చివరికి ఆయన (సల్లం)ని పట్టితెచ్చినవారికి వంద ఒంటెల బహుమానం ఇస్తామని ప్రకటించారు. బహుమానం కోసం చాలా మంది ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఖురైష్ నేతలు ఓ రోజు సమావేశమై తీవ్రంగా ఆలోచించసాగారు. అందరి ముఖాలలో నిర్లిప్తత అలుముకుంది. అంతలో వాళ్ళదగ్గరకి ఓ ఆగంతకుడు వచ్చాడు. ఖురైషీయులంతా ఒక్కసారిగా అతని వైపు తలెత్తి చూశారు. 

 *"నేను తీర ప్రాంతం నుంచి వస్తుంటే ముగ్గురు మనుషులు ఎదురయ్యారు. వారు ముహమ్మద్ (సల్లం), ఆయన సహచరులైవుండవచ్చని నా అనుమానం"* అని అన్నాడు ఆ ఆగంతకుడు.

ఆ సమయంలో "సురాకా బిన్ మాలిక్" అనే అతను కూడా ఖురైషీయుల సమావేశంలో కూర్చున్నాడు. అతను చాల దూరదృష్టి కలవాడు. ఆగంతకుడు చెప్పించి నిజమే అయి ఉంటుందని గ్రహించాడు. ఆ విషయాన్ని పైకి వ్యక్త పరచలేదు. పైగా ముహమ్మద్ (సల్లం)ను పట్టుకునే గౌరవం తానే పొందాలని, వంద ఒంటెల బహుమానం తానే కొట్టేయాలని తలచి, ఖురైషీయుల్ని పెడదారి పట్టించడానికి పూనుకున్నాడు సురాకా. 

 *"అబ్బే వాళ్ళు ముహమ్మద్ (సల్లం), ఆయన అనుచరులు కాదండి ఆ మనుషులు నా ముందు నుంచే కదా పోయింది. వాళ్ళను నేను బాగా ఎరుగుదును"* అని అన్నాడు సురాకా.

సురాకా చెప్పిందే నిజమని తోచింది ఖురైషీయులకు. అంచేత ఆగంతకుడు చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకోలేదు.

సురాకా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కాస్సేపు ఖురైషీయులతో ముచ్చటించి, ఆ తర్వాత లేచి ఇంటికెళ్ళాడు. ఇంటికి పోగానే సేవకునికి చెప్పవలసిన విషయాలు చెప్పి, ఆయుధాలతో పాటు ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకున్నాడు. సేవకుడు గుర్రం మీద జీను కట్టి పట్నం వెలుపలికి తీసుకుపోయి యజమాని కోసం ఎదురుచూడసాగాడు. కాస్సేపటికి సురాకా అక్కడికి చేరుకున్నారు.

తాను తీరం వెంబడి ప్రయాణం చేస్తున్నట్లు ఎవరికీ తెలియకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సేవకుడ్ని హెచ్చరించి గుర్రం ఎక్కి బయలుదేరాడు. గుర్రం దుమ్ము లేపుకుంటూ పరుగెత్తసాగింది.

గుర్రం తీరప్రాంతంలో కొంతదూరం కూడా పరుగెత్తలేదు. అంతలో ఒక్క కుదుపు కుదిపేసింది. ఆ కుదుపుకు సురాకా నేలకొరిగేవాడే కాని, కళ్ళెం గట్టిగా పట్టుకుని ఎలాగో గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. తర్వాత కళ్ళెం వదలగానే అది గాలిలో దూసుకుపోయింది. కొంతదూరం పరుగెత్తిన తరువాత మళ్ళీ ఆమాంతం కుదిపేసింది. కానీ సురాకా అధైర్యం చెందలేదు. గుర్రాన్ని నేర్పుగా అదుపులోకి తెచ్చుకుని అదిలించాడు. ఈ సారి ఇంకాస్త బలం పుంజుకుని శరవేగంతో పరుగుతీసింది. దాని వేగం చూస్తుంటే సురాకాకు భయం, తత్తరపాటు కలిగాయి. అయినా పట్టుదలతో ప్రయాణం సాగించాడు.

ప్రవక్త (సల్లం) ప్రయాణం ఒక రాత్రి, ఒక పగలు నిరాటంకంగా సాగింది. శత్రువులెవరూ వెంటాడుతున్న సూచనలేమీ లేకపోవడంతో అందరూ నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు.

మరుసటిరోజు మధ్యాహ్నవేళ. ఎండ తీవ్రంగా ఉంది. ప్రయాణ బడలికతో విశ్రాంతి తీసుకుందామని తలచి అందరూ ఓ చెట్టు క్రింద దిగారు. హజ్రత్ అబూ బక్ర్ (రజి), దైవప్రవక్త (సల్లం) కోసం ఓ చోట శుభ్రపరచి మేక చర్మం పరిచారు. తరువాత వెంట తెచ్చిన అన్నం మూట విప్పి ముందుంచారు. అందరూ కలసి అన్నం తిన్నారు. భోజనం ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లం) కాస్సేపు నిద్రపోవడానికి ఉపక్రమించారు.

సాయంత్రం కావచ్చింది. ఎండ తీక్షణత కూడా తగ్గింది. ప్రవక్త బృందం ప్రయాణం కొనసాగించడానికి సిద్ధమయింది. అంతలో అకస్మాత్తుగా అబూ బక్ర్ (రజి) దృష్టి దక్షిణ దిక్కు వైపుగా మళ్ళింది. ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వేగంగా ఇటువైపే వస్తున్నాడు. దాంతో అబూ బక్ర్ (రజి) గుండెలు దడదడ లాడిపోయాయి.

 *"దైవప్రవక్తా! మనం పట్టుబడిపోయాం. అదిగో అటు చూడండి శత్రువు వస్తున్నాడు."* అన్నారు కంగారుపడుతూ ఆయన.

కాని, దైవప్రవక్త (సల్లం) ముఖంలో ఆందోళన మచ్చుకైనా లేదు. *"అబూ బక్ర్! కంగారుపడకు. అల్లాహ్ మనకు తోడున్నాడు."* అన్నారు ఆయన (సల్లం) ధైర్యం చెబుతూ.

శత్రువు మరికాస్త దగ్గరయ్యాడు. డెక్కల చప్పుడుతో, ధూళి కణాలతో గుర్రం వేగం చాలా భీకరంగా ఉంది. అది మరికాస్త దగ్గరయింది. అంతే, ఒక్క పల్టీ కొట్టింది. ఆ దెబ్బతో గుర్రం ముందుకాళ్ళు కాస్త మోకాళ్ళదాక నెలలో కూరుకుపోయాయి. ఆ ఊపుకు రౌతు కూడా ఇసుకలో బోర్లాపడ్డాడు.

ఇప్పుడు సురాకా ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది. అతనికి కనువిప్పు కలిగింది. ఆలోచిస్తే ఇవన్నీ అపశకునాలే అనిపించాయి. దాంతో అతను, తాను చేయబోయే పని దేవునికి ఇష్టం లేదు కాబోలు అనుకున్నాడు. అంచేత సురాకా అక్కడే ఆగి దైవప్రవక్త (సల్లం)ను, ఆయన సహచరుల్ని కేకవేసి పిలిచాడు.

 *""నేను మాలిక్ బిన్ జాషమ్" కొడుకు "సురాకా"ను కొంచెం ఆగండి, మీతో మాట్లాడాలి. నేను మీకు ఎలాంటి హాని తలపెట్టను. నా మాట నమ్మండి."* అని అన్నాడు.

దైవప్రవక్త (సల్లం) ఈ మాట నిని సురాకా కోసం దైవాన్ని ప్రార్థించారు. దాంతో ఇసుకలో కూరుకుపోయిన గుర్రం బయట పడింది. అతను దైవప్రవక్త (సల్లం) దగ్గరకి వచ్చాడు.

ఆ మహనీయుడి (సల్లం) ముఖవర్చస్సు చూడగానే సురాకా హృదయంలో ఆయన (సల్లం) పట్ల ఎనలేని గౌరావభావం ఏర్పడింది.

 *"దైవప్రవక్తా! ఖురైషీయులు, మిమ్మల్ని పట్టి తెచ్చేవారికి వంద ఒంటెలు బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఆ బహుమానం కోసం అనేకమంది మిమ్మల్ని పట్టుకోవడానికి పట్నం నలుదిక్కులా పరుగెత్తారు. వంద ఒంటెల పేరశ నన్ను కూడా వివశుడ్ని చేసింది. దైవప్రవక్తా! నన్ను క్షమించండి. నేనిప్పుడు మిమ్మల్ని వెంటాడే వాళ్ళను ఆపి వెనక్కు పంపిస్తాను. నాకో శాంతి పత్రం రాసివ్వండి చాలు."* అన్నాడతను వినయంగా నిలబడి.

ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లం)కు దయ కలిగింది. అతను కోరినట్లు అబూ బక్ర్ (రజి) చేత శాంతి పత్రం రాయించి ఇచ్చారు. సురాకా దాన్ని తీసుకుని తిరిగి వెళ్ళిపోవడానికి గుర్రం ఎక్కాడు.

 *"సురాకా! నువ్వు కిస్రా (ఈరాన్ చక్రవర్తి) కంకణం ధరించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో!"* అన్నారు దైవప్రవక్త (సల్లం) సురాకా వైపు చిరునవ్వుతో చూస్తూ.

 *"ఏమిటీ! నేను కిస్రా కంకణం ధరించడమా !!"* సురాకా నోరు తెరచి సంభ్రమాశ్చరాలతో దైవప్రవక్త (సల్లం) వైపు చూడసాగాడు .

 *"ఔను, నువ్వు ఈరాన్ చక్రవర్తి కంకణం ధరిస్తావు"* అన్నారు దైవప్రవక్త (సల్లం) మళ్ళీ.

 *"నేను ధరిస్తానా !!"* సురాకా ఆశ్చర్యం నుండి ఇంకా తేరుకోలేకపోయాడు. 

 *"ఔను నువ్వే , నువ్వు కాకపోతే ఇంకెవరు అనుకుంటున్నావు?"* అన్నారు దైవప్రవక్త (సల్లం) చిరునవ్వు నవ్వుతూ.

 *"దైవప్రవక్తా! నాకు నమ్మకం ఉంది. మీ మాట ఎన్నటికి అసత్యం కాదు. ఇక నేను వెళ్తున్నాను."* అంటూ సురాకా గుర్రం అదిలించి మక్కా వైపు బయలుదేరాడు. ★

 _(★ → ఈ భవిష్యత్ వాణి రెండవ ఖలీఫా "హజ్రత్ ఉమర్ (రజి)" కాలంలో క్రియరూపం దాల్చింది. ఈరాన్ ని జయించాక ఖలీఫా స్వయంగా "కిస్'రా" కంకణం ఆయన చేతికి తొడిగారు.)_ 

 *ఈ సంఘటన గురించే హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఇలా ఉల్లేఖించారు: ↓* 

మేము బయలుదేరినప్పుడు జాతి యావత్తు మమ్మల్ని వెతకడంలో నిమగ్నమై ఉంది. అందులో కేవలం ఒక్క "సూరాకా బిన్ మాలిక్ బిన్ జాషమ్" తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కనుగొనలేకపోయారు. అతను గుర్రమెక్కి వచ్చాడు. నేను అతణ్ణి చూసి, *"దైవప్రవక్తా! అదిగో ఇతను మనల్ని వెంటాడి పట్టుకోడానికి వస్తున్నాడు"* అని అన్నాను.

 *"భయపడకండి, అల్లాహ్ మన వెంటే ఉన్నాడు"* అని ధైర్యం చెప్పారాయన (సల్లం).

ఏది ఏమైనా, సూరాకా మాత్రం వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ప్రజలు మహాప్రవక్త (సల్లం)ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అతనికి కనబడిన ప్రతి చోటల్లా వారిని నిలువరించి, మీరు చేసే పనిని నేను ఇదివరకే చేసివేశాను. ఇక మీ పని పూర్తి అయిపోయింది. వెనక్కు మళ్ళిపొండని వారందరిని ముందుకు పోకుండా అడ్డుకోనారంభించాడు. అంటే ఉదయం మహాప్రవక్త (సల్లం)ను పట్టుకోవాలని ప్రయత్నించినవాడు, చివరికి ఆయన (సల్లం)కు రక్షణగా నిలిచి కాపాడ ప్రయత్నం చేశాడన్నమాట.

 *ఐదవ సంఘటన : -* 

సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దాహంతో నాలుకలు పిడచ కట్టుకొని పోతున్నాయి. కాని దరిదాపుల్లో ఎక్కడా నీటి చుక్కయినా ఉన్నట్లు జాడలేదు. మరికొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఆశలు రేకెత్తిస్తూ దూరాన కొన్ని గుడారాలు కనిపించాయి. వెంటనే దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరులు ఆ గుడారాల వైపు నడిచారు.

బాటసారుల్లో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)"ని చూడగానే గుడారాల దగ్గర్నుంచి ఒక వ్యక్తి వడివడిగా వచ్చి, *"రండి, రండి అబూ బక్ర్! మేమెంతో అదృష్టవంతులం. ఈ రోజు మక్కాకు చెందిన ప్రముఖ వ్యాపారి మాకు అతిథి అవుతున్నాడు."* అన్నాడు.

అబూ బక్ర్ (రజి) అతనికి కృతఙ్ఞతలు చెప్పి మిత్రులతో గుడారాల దగ్గరకు చేరుకున్నారు. ఓ పెద్ద గుడారంలోకి ప్రవేశిస్తూ, *"బురైదా! దాహం వేస్తోంది. ముందు మాకు నీళ్ళు ఇప్పించు!"* అన్నారు ఆయన.

 *"ఏమిటి నీళ్ళా! మేము మీకు కనీసం పాలయినా ఇవ్వలేని దౌర్భాగ్యులమా? ఉండండి, ఇప్పుడే రెండు క్షణాల్లో పాలు తెప్పిస్తాను."* అని అంటూ "బురైదా" పాలు తీసుకురమ్మని ఒక మనిషిని పంపించాడు. 

అతను వెంటనే వెళ్ళి ఓ పాత్రనిండా పాలు తెచ్చాడు. హజ్రత్ అబూ బక్ర్ (రజి) బృందం కడుపు నిండా పాలు తాగి ఆకలి, దాహం తీర్చుకున్నారు. 

బురైదా, దైవప్రవక్త (సల్లం) వైపు మాటిమాటికి చూస్తూ, *"అబూ బక్ర్! ఈయన (సల్లం)గారు ఎవరు? నేనెప్పుడు చూడలేదే!"* అన్నాడు.

 *"ఈయన (సల్లం) నాకు దారి చూపడానికి వచ్చిన మార్గదర్శి. పేరు ముహమ్మద్ (సల్లం)."* అన్నారు అబూ బక్ర్ (రజి) జవాబుగా.

 *"ఎవరూ? మన తాతముత్తాతల మతాన్ని మంటగలిపి, మన దేవతలకు అపచారం తలపెడుతున్న ముహమ్మదా ఈయన !?"* అన్నాడు బురైదా దైవప్రవక్త (సల్లం)ను వింతగా చూస్తూ.

 *"బురైదా! బుద్ధిమంతులు ప్రతి విషయాన్ని ప్రశాంత హృదయంతో జాగ్రత్తగా వింటారు. ఆ తరువాత మంచీచెడుల విచక్షణ చేసి అంతరాత్మ ప్రబోధనం ప్రకారం నడుచుకుంటారు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) తక్షణమే.

 *"సరే ఇంతకూ మీరు చెప్పదలచుకున్నదేమిటో చెప్పండి."* అన్నాడు బురైదా.

 *"ఈ విగ్రహాలు మీరు, మీ తాతముత్తాతలు తయారుచేసుకున్నవే కదా! ఇలా మనుషులు తయారుచేసిన విగ్రహాలు దేవుళ్ళు ఎలా అవుతాయి? సర్వసృష్టికర్త, విశ్వప్రభువు, అగోచర జ్ఞానసంపన్నుడు, జీవన్మరణాలకు మూలకారకుడు అయినవాడే మనకు దేవుడు అవుతాడు. ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి...."* అంటూ వివరించారు దైవప్రవక్త (సల్లం). 

బురైదా ఈ మధుర వాక్కులు విని, *"ఈ రోజు నేను ఎంత మంచి విషయాలు విన్నాను! మిమ్మల్ని గురించి ఇదివరకే విని ఉన్నాను. కాని నేనప్పుడు అంతగా పట్టించుకోలేదు. మీరు నిజంగా దైవప్రవక్త అని నాకిప్పుడు నమ్మకం కలిగింది. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని, ముహమ్మద్ (సల్లం) ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను"* అన్నాడు బురైదా.

బురైదా ముస్లిం అయినందుకు దైవప్రవక్త (సల్లం) సంతోషం వ్యక్తపరిచారు. తమ నాయకుడు ముస్లిం కావడం చూసి. బురైదా అనుచరులు కూడా సద్వచనం పఠించి ముస్లిములయి పోయారు. వారంతా డెబ్బై మంది ఉన్నారు. ఒకేసారి అంతమంది ముస్లిములుగా మారినందుకు హజ్రత్ అబూ బక్ర్ (రజి) కూడా హర్షం వెలిబుచ్చారు.

 *"దైవప్రవక్తా! మేమిక్కడికి వచ్చి రెండు వారాలకు పైగా అయింది. మరో రెండు వారాల తర్వాత ఇక్కడ్నుంచి మరో చోటికి వెళ్ళాలనుకున్నాం. కాని మీరు అనుమతిస్తే ఇప్పుడు మేమంతా మీ వెంట మదీనా రావాలనుకుంటున్నాం"* అన్నారు బురైదా (రజి).

 *"అలాగే రండి"* అన్నారు దైవప్రవక్త (సల్లం), తర్వాత ఆయన కాస్సేపు విశ్రాంతి తీసుకుని లేచి నమాజు చేశారు.

ఈలోగా బురైదా అనుచరులు గుడారాలు పీకి ప్రయాణానికి సిద్ధమయ్యారు. దైవప్రవక్త (సల్లం), మక్కా అనుచరులతో పాటు బురైదా తెగవాళ్ళను కూడా తీసుకొని బయలుదేరారు.

 *↑ ఇదే విషయం, రహ్మతుల్ లిల్ ఆలమీన్ - 1/101 ప్రకారం ↓* 

(దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లు మదీనాకు) ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో "బురైదా అస్లమీ" అనే ఆయన దైవప్రవక్త (సల్లం)ను కలువడం జరిగింది. ఈయన తన జాతికి సర్దారు. ఖురైషులు ప్రకటించిన గొప్ప బహుమతిని పొందాలనే ఆశతో దైవప్రవక్త (సల్లం)ను పట్టుకోడానికి బయలుదేరినవాడు.

కాని, మహాప్రవక్త (సల్లం) ఎదురుబడగానే ఆయన (సల్లం)తో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆయన (సల్లం) వైపునకు మొగ్గిపోయారు. తన జాతికి చెందిన డెబ్బై మందితో సహా "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు.

ఆ తరువాత తన తలపాగాను బరిశెకు కట్టి ఎగరవేశారు. ఆ తెల్లని వస్త్రం గాలిలో రెపరెపలాడుతూ, శాంతి దూత, సంధి ప్రదాత, ప్రపంచంలో న్యాయాన్ని ధర్మాన్ని వ్యాపింపజేసే న్యాయనిర్ణేత బయలుదేరి వస్తున్నాడనే శుభసందేశాన్ని అందించనారంభించింది.

 *ఆరవ సంఘటన : -* 

దారిలో దైవప్రవక్త (సల్లం)ను, "హజ్రత్ జుబైర్ బిన్ అవామ్ (రజి)" కూడా కలిశారు. ఈయన ముస్లిముల ఓ వ్యాపార వర్గానికి చెందినవారు. సిరియా దేశం నుండి వస్తున్నారు. హజ్రత్ జుబైర్ (రజి), దైవప్రవక్త (సల్లం) మరియు అబూ బక్ర్ (రజి) ఇద్దరికీ తెల్లని వస్త్రాలు బహుకరించారు.

 *"ఖుబా"కు అరుదెంచిన దైవప్రవక్త (సల్లం) : -* 

సోమవారం, "రబీఉల్ అవ్వల్" 8వ తేదీ దైవదౌత్య శకం 14 - అంటే హిజ్రీ శకం ఒకటి - క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ నాడు మహాప్రవక్త (సల్లం) "ఖుబా" అనే గ్రామానికి చేరుకున్నారు.

 *మిగిలినది In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment