180

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 180            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 95*

            *మదీనాకు హిజ్రత్ : - 4* 

దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లను సజీవంగా పట్టుకోవాలన్న అవిశ్వాసుల ప్రయత్నం వృధా అయ్యింది. (ఆ తర్వాత జరిగిన సంఘటనలు ↓)

 *మదీనా బాటలో : -* 

దైవప్రవక్త (సల్లం)ను పట్టుకోవాలనే (అవిశ్వాసుల) దుగ్ధాన్ని చల్లారిపోయింది. వెదుకులాట ఆగిపోయింది. మూడు రోజుల విఫలయత్నం నీరుగారిపోయిన తరువాత ఖురైషుల భావోద్రేకాలు చల్లబడిపోయాయి. అప్పుడుగాని మహాప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ బక్ర్ (రజి) గారి వెంట మదీనాకు బయలుదేరలేదు.

"అబ్దుల్లా బిన్ అరీఖత్ లైసీ" అనేవాడు ఎడారి బాటల గురించి బాగా తెలిసిన వ్యక్తి. ముందే ప్రతిఫలం ముట్టజెబుతామనే షరతుపై మదీనాకు చేరవేసే ఒప్పందం కుదుర్చుకొని ఉన్నారు దైవప్రవక్త (సల్లం) మరియు అబూ బక్ర్ (రజి)లు. ఇతను ఇంకా ఖురైష్ (అవిశ్వాసుల) ధర్మంలో ఉన్నవాడే. అయితే చాలా నమ్మకస్తుడు. కాబట్టి అతనికి మదీనాకు ప్రయాణం సాగించేందుకు వాహనాలను కూడా ఇచ్చి ఉంచడం జరిగింది. మూడు రాత్రులు గడచినా తరువాత, అతను రెండు వాహనాలను తీసుకుని "సౌర్" గుహ దగ్గరికి రావాలని చెప్పి ఉంచారు. అతను సోమవారం రాత్రి - అది "రబీఉల్ అవ్వల్" మాసం, హిజ్రీ శకం 1, నెల పొడుపు రాత్రి (సెప్టెంబర్ 16, 622) - ఆ ఒంటెల్ని తీసుకొని గుహ దగ్గరకి వచ్చేశాడు.

ఆ సందర్భంలోనే అబూ బక్ర్ (రజి), దైవప్రవక్త (సల్లం)కు మేలైన ఓ పెంటి ఒంటెను ప్రయానార్థం అందిస్తూ, ఈ రెండు ఒంటెల్లో ఆయన (సల్లం)కు నచ్చినదాన్ని స్వీకరించమని అర్థించారు. మహాప్రవక్త (సల్లం) ఆ ఒంటెను ఉచితంగా తీసుకోకుండా, దాని ధరను అబూ బక్ర్ (రజి)కు చెల్లించడం జరిగింది.

అది మామూలు ఒంటె కాదు. దాని పేరు "ఖస్వా". అది చాలా తెలివి కలది. తనను ముఖ్యమైన దానికి పరిగణిస్తున్నారా లేదా అన్న విషయం తెలివిగల ఏ జంతువుకైనా ఇట్టే తెలిసిపోతుంది.

ఆ ఒంటె రంగు తెలుపు. సాధారణంగా తెలుపు రంగు ఒంటెలు అరుదుగా కనిపిస్తాయి. "ఖస్వా" కంటి రెప్పలు దట్టంగా, నిండుగా ఉంటాయి. తన పొడవాటి మెడను ముందుకు వెనక్కు కదిలిస్తున్నప్పుడు, అది ఎంతో అందంగా, దర్పంగా ఉంటుంది. అది చిన్నగా నడుస్తుంటే, అలలు తీరాన్ని తాకుతున్నట్లుగా ఎంతో లావణ్యంగా, లయాత్మకంతా ఉంటుంది. ఎడారి ఇసుకలో అది జింకలా వేగంగా పరిగెత్తినప్పటికీ, దాని మీద కూర్చున్న అతనికి పరుపు మీద కూర్చున్నట్టే మెత్తగా ఉంటుంది. అందుకే అది ప్రవక్త (సల్లం)కు ఎంతో ఇష్టమైన ఒంటె.

ఇటు "అస్మా (రజి) బిన్తే అబూ బక్ర్ (రజి) (అబూ బక్ర్ (ర) గారి కుమార్తె)" ప్రయాణానికి కావలసిన భోజన సామాగ్రిని అక్కడికి తీసుకొని వచ్చారు. అయితే వాటిని ఒంటెపై వేసి కట్టడానికి త్రాడును మరచి వచ్చారు. బయలుదేరే సమయం రాగానే చద్దిమూటను ఒంటెపై వేసి వ్రేలాడదీయడానికి ఉపక్రమించినప్పుడు తాను త్రాడు మరచి వచ్చాననే విషయాన్ని గుర్తించారు అస్మా (రజి). వెంటనే నడుముకు చుట్టుకునే పట్కావస్త్రం విప్పి, దాన్ని రెండుగా చించి ఓ ముక్కతో చద్దిమూటను ఒంటెపై వేసి వ్రేలాడదీశారు. రెండో ముక్కను తిరిగి తన నడుముకు చుట్టుకున్నారు. ఆ కారణంగా ఆమెకు "జాతున్నితా ఖైన్" అనే బిరుదు లభించింది.

ముహమ్మద్ (సల్లం), అబూ బక్ర్ (రజి)లు మక్కా నుండి బయలుదేరి మూడు రాత్రులు గడిచాయి. చివరికి వారు తమ గమ్యస్థానానికి (మదీనాకు) ప్రయాణం కాగలిగారు.

 *"స్తోత్రం అల్లాహ్ కే! ఎట్టకేలకు మనం మదీనాకు...."* సంతోషంతో ఆనంద భాష్పాలు రాలుతుండగా అబూ బక్ర్ (రజి) బిగ్గరగా అన్నారు.

ఎవరు ఊహించగలరు? చినిగిన బట్టలలో, ఇద్దరు ప్రయాణికులు కొండ గుట్టల్ని దాటుకుంటూ మదీనాకు పోయే రోజును ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని. ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రతి విశ్వాసి తన యుగానికి, సరికొత్త శకానికి, సంవత్సరంలో మొట్టమొదటి దినంగా పరిగణిస్తాడు.

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లు కలసి అక్కడ నుండి బయలుదేరారు. "ఆమిర్ బిన్ ఫహీరా (రజి)" కూడా వెంటే ఉన్నారు. "అబ్దుల్లా బిన్ అరీఖత్" వారిని వెంటబెట్టుకొని ఆ రాత్రే సముద్ర తీరం వెంట వెళ్ళే మార్గాన్ని అనుసరించాడు.

గుహ నుండి బయలుదేరగానే ముందు అతను యమన్ వైపునకు వెళ్ళే దారిని అనుసరించాడు. దక్షిణం వైపు చాలా దూరం వెళ్ళిన తరువాత పశ్చిమం వైపునకు తిరిగి సముద్ర తీర మార్గాన్ని పట్టాడు. ఆ తరువాత సాధారణంగా మనుషులు సంచరించనటువంటి మరో మార్గం వైపు మళ్ళాడు. ఈ మార్గం గురించి చాలా మందికి అవగాహన ఉండేది కాదు. ఈ దారి, ఎర్రసముద్ర తీరానికి అతి చేరువ నుండి పోయే మార్గం. ఒకరిద్దరు తప్ప, ఆ మార్గం పై నడిచేవారెవరూ ఉండరు.

మహాప్రవక్త (సల్లం) ఈ మార్గంపై వెడుతూ ఏయే ప్రదేశాలగుండా అయితే వెళ్ళారో, ఆ ప్రదేశాల గురించి "ఇబ్నె ఇస్'హాక్" తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆయన కథనం ప్రకారం....; ↓

ఆ మార్గదర్శకుడు ఆయన (సల్లం)ను తీసుకొని బయలుదేరి తీరం వెంబడి వెడుతూ "జీరీనె అస్ఫాన్"కు వెళ్ళి దారి మార్చాడు. ఆ తరువాత "జీరినె అమజ్" గుండా వెడుతూ ముందుకు వెళ్ళి "ఖదీద్" అనే చోటును దాటేశాడు. ఆ తరువాత తిరిగి మార్గాన్ని మార్చి ముందుకుపోయి "ఖరారా" చేరాడు. ఆ తరువాత "సనీయతుల్ మర్రా", "లఖఫ్" ఎడారి గుండా వెడుతూ "హిజాజ్" ఎడారి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ నుండి "మజాహ్" మూలమలుపు తిరిగి "జుల్ ఫుజ్'వీన్" మలుపున ఉన్నటువంటి పల్లపు ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. ఆపై "జీకష్ర్" కొండ లోయ నుండి ప్రయాణించి "అబాబీద్", దాని తరువాత "ఫాజా" వైపునకు వెళ్ళాడు. ఆ మీదట "అర్జ్"లో విడిది చేశాడు. అక్కడ నుండి బయలుదేరి "రకూబా"కు కుడివైపున ఉన్న "సనియతుల్ ఆయిర్" లోనికి వెళ్ళిపోయాడు. చివరికి "రయిమ్" లోయలోనికి వెళ్ళి విడిది చేశాడు. ఆ తరువాత "ఖుబా"కు వచ్చి చేరాడు.

 *రండి! ఇక మనం, మార్గంలో జరిగిన (ముఖ్యమైన కొన్ని) సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం.* 

 *మొదటి సంఘటన : -* 

 *సహీ బుఖారీ గ్రంథంలోని "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారి ఉల్లేఖన సారాంశం. ↓* 

మేము (గుహ నుండి బయలుదేరి) రాత్రి, పగలు రెండు ఝాముల వరకు ప్రయాణిస్తూనే ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆ బాటన ఎవరూ నడచినట్లు ఆనవాళ్ళు లేవు. ఆ సమయంలోనే మాకు ఓ పొడుగాటి ఎత్తయిన బండరాయి కనబడింది. దాని క్రింద నీడగా ఉండడం వలన మేము అక్కడనే విడిది చేశాము. నేను నా చేతులతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి నా అంగ వస్త్రాన్ని అక్కడ పరచి దైవప్రవక్త (సల్లం)తో అక్కడ కాసేపు పడుకోమని, చుట్టూ పరికిస్తూ ఉంటానని అభ్యర్థించాను. ఆయన (సల్లం) పడుకోగానే జాగ్రత్త కోసం చుట్టూ తిరిగి, అటూ ఇటూ చూడ్డానికి బయటకు వచ్చాను. చూద్దును కదా ఓ కాపరి తన మేకలను తోలుకుని ఆ బండ వైపే వస్తున్నాడు. అతను ఆ బండ నీడన కూర్చుందామనే వస్తున్నాడు కాబోలు. నేనతనితో, *"ఓ యువకుడా! నీవు ఎవరి తాలూకు మనిషివి?"* అని అడిగాను. అతను మక్కా లేదా మదీనాకు చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు.

 *"నీ మేకలు ఏమైనా పాలు ఇస్తాయా?"* అని అడిగాను.

 *"ఔను"* అని సమాధానమిచ్చాడతాను.

 *"మరి నేను వాటి పాలను పితుక్కోవచ్చునా?"* అనడిగాను.

 *"తప్పకుండా"* అని అంటూ ఓ మేకను పట్టుకొని నా దగ్గరకు తీసుకొచ్చి, *"ఆగండి, దీని పొదుగు నుండి మట్టి, వెంట్రుకలను శుభ్రం చేయండి ముందు"* అన్నాడు.

ఆ తరువాత అతను ఓ చిన్న పాత్రలో పాలను పితికాడు. నా దగ్గర ఓ తోలు పాత్ర ఉంది. దాన్ని మహాప్రవక్త (సల్లం) నీరు త్రాగడానికి, ఉజూ చేయడానికి దగ్గర ఉంచుకుని ఉన్నాను (పాలు అందులో పోశాను).

దైవప్రవక్త (సల్లం) గారి వద్దకు (పాలు తీసుకొని) వచ్చాను. కాని, ఆయన (సల్లం)ను మేల్కొల్పాలంటే మనస్సు ఒప్పుకోవడం లేదు. ఆయన (సల్లం) స్వయంగానే మేల్కొన్న తరువాత, ఆయన (సల్లం) దగ్గరకు వచ్చి ఆ పాలలో కొన్ని నీళ్ళు పోశాను. పాలు కొంత చల్లబడ్డాయి. దైవప్రవక్త (సల్లం)కు త్రాగమని ఆ పాలనిచ్చాను. ఆయన (సల్లం) తాగిన తరువాత నాకు తృప్తి కలిగింది.

 *"ఇంకా బయలుదేరే సమయం రాలేదా?"* అని అడిగారు. ఆ తరువాత మేము అక్కడి నుండి బయలుదేరాము.

 *రెండవ సంఘటన : -* 

ఈ ప్రయాణంలో హజ్రత్ అబూ బక్ర్ (రజి), దైవప్రవక్త (సల్లం)కు వెనుకనే ఉండేవారు. అంటే, స్వారీపై కూర్చున్నపుడు దైవప్రవక్త (సల్లం) వెనుకన కూర్చుని ఉండేవారు. వృద్ధాప్య లక్షణాలు అగపడుతూ ఉండడం వలన అందరూ అబూ బక్ర్ (రజి)నే చూసేవారు. మహాప్రవక్త (సల్లం) ఇంకా యువకునిగానే అగుపడుతున్నారు. గనుక చూసేవారు ఆయన (సల్లం) వైపు అంత నిశితంగా చూసేవారు కాదు.

ఫలితంగా ఎవరైనా మార్గమధ్యంలో కలిసి మాట్లాడితే ముందు అబూ బక్ర్ (రజి)నే పలుకరించేవారు. *"మీ ముందున్న వ్యక్తి ఎవరు?"* అని ఎవరైనా అడిగితే, *"ఈయన (సల్లం), నాకు దారిచూపే వాడు"* అని చెప్పేవారు అబూ బక్ర్ (రజి). అర్థం చేసుకునేవారు, ఈ ప్రయాణంలో మార్గాన్ని చూపేవాడు అని అనుకునేవారు. కాని అబూ బక్ర్ (రజి) దృష్టిలో మాత్రం మార్గం అంటే మేలు వైపునకు మార్గం చూపేవాడు అని భావం.

 *ఈ దారిలో ఎదురైన మరికొన్ని సంఘటనలను In Shaa Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment