🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 179 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 94*
*మదీనా కు హిజ్రత్ : - 3*
*మక్కా నుంచి బయటపడి సౌర్ గుహలో తలదాచుకున్న దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి) : -*
ఖురైషీయులు ఎలాగైనా దైవప్రవక్త (సల్లం)ను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారు అడుగుజాడల్ని గుర్తించగలిగే మనిషి కోసం వెతికారు. చివరికి "కుర్జ్ బిన్ అల్ఖమా" అనే వ్యక్తి దొరికాడు. కుర్జ్, అడుగుజాడల్ని గుర్తించడంలో గొప్ప ప్రవీణుడు.
మరునాడు మధ్యాహ్నం "సౌర్" పర్వతం నరరూప రాక్షసుల అరుపులతో దద్దరిల్ల సాగింది. ఈలలు, అరుపులు, వికటాట్టహాసాలతో కర్రలు, కటారులు తిప్పుకుంటూ ఖురైషీయులు, "కుర్జ్ బిన్ అల్ఖమా" వెంట వచ్చారు.
ఆ సమయంలో దైవప్రవక్త (సల్లం) తనను చెండాటానికి వస్తున్న రాకాసిమూకల పొలికేకలకు ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా దైవధ్యానంలో నిమగ్నులై ఉన్నారు. కాని దుష్టుల అరుపులు దగ్గరయ్యే కొద్దీ "అబూ బక్ర్ (రజి)"లో ఆందోళన అంతకంతకు ఎక్కువ కాసాగింది. తన ప్రియతమ నాయకుడ్ని కాపాడుకునే మార్గం ఏమిటి?
*"అయ్యో! నేను ముహమ్మద్ (సల్లం)ను నా హృదయంలో దాచుకోగలిగితే ఎంత బాగుండు! శత్రువుల కంటబడకుండా ఆయన (సల్లం)ని నా దేహంతో కప్పగలిగితే నేనెంత అదృష్టవంతుడ్ని!!"* అని ఆయన హృదయం విలపించింది.
"కుర్జ్ బిన్ అల్ఖమా" ఎంతో జాగ్రత్తగా దారిలో పాద చిహ్నాలు చూసుకుంటూ కొండ మీదికి ఎక్కాడు. ఖురైషీయులు అతని వెనకాలగా నడుస్తున్నారు. కుర్జ్ కొండ మీదికి పోయి హఠాత్తుగా ఒక చోట ఆగాడు. తరువాత ఎటు పోవాలో అర్థం కాక అయోమయంగా చూడసాగాడు. అతని దేహం నుండి చెమటలు కారుతున్నాయి. చివరికి అతను దిక్కు తోచక దిగాలుపడిపోయి నిలబడ్డాడు. అతని వాలకం చూసి ఖురైషీయులకు ఆశ్చర్యం కలిగింది.
*ఖురైషీయులు : -* ఏమయింది కుర్జ్ ? అకస్మాత్తుగా ఆగిపోయి అలా దిక్కులు చూస్తున్నావేమిటి?
*కుర్జ్ : -* వాళ్ళిద్దరు ఈ రాయి దాకా వచ్చారు. ఆ తరువాత ఎటు పోయారో తెలియడం లేదు.
*ఖురైషీయులు : -* ఇబ్నె అల్ఖమా! ఈ రోజు ఏమయింది నీకు? ఇలా ఇదివకెప్పుడు పొరబడలేదే నీవు!
కొండ నుండి కొద్ది దూరంలో వారికి ఓ పశువుల కాపరి కన్పించాడు. ఖురైషీయులు అతని దగ్గరకు పోయి, *"కొండ మీదికి ఇద్దరు మనుషులు రావడం చూశావా నువ్వు?"* అని అడిగారు. *"నేనెవరినీ చూడలేదు. వారిద్దరూ ఈ గుహలో ఉంటారేమో చూడండి"* అన్నాడు పశువులకాపరి కొండ ఎగువభాగాన కొద్ది దూరంలో ఉన్న గుహ వైపు చూపిస్తూ.
ఖురైషీయులు వెంటనే పైకెక్కి గుహ వైపు వడివడిగా నడవసాగారు. అందరి చేతుల్లో కత్తులు, ఈటెలు, విల్లంభులు ఉన్నాయి. అందరి హృదయాల్లో ఒకే దీక్ష! ఒకే కాంక్ష!! ముహమ్మద్ (సల్లం)ని వధించే అదృష్టం తనకే దక్కాలి. అంచేత గుహ దగ్గరవుతున్న కొద్దీ వారి ఆరాటం, ఆర్భాటాలు ఎక్కువ కాసాగాయి.
వారిలో ఒక యువకుడు అతి వేగంగా గుహ వైపు పరుగెత్తాడు. కాని గుహ ఇంకా కొన్ని గజాల దూరం ఉందేమో, ఠక్కున ఆగిపోయాడు. రెండు క్షణాలు అటూ ఇటూ అయోమయంగా చూసి , నిరుత్సాహంతో వెనక్కి మరిలాడు. వెనకాల వడివడిగా అక్కడికి చేరుకున్న ఖురైషీయులు అతడ్ని చూసి విస్తుబోయారు.
గుహ లోపలున్న "అబూ బక్ర్ (రజి)"కు గుహ బయట కొద్దిదూరంలో ఉన్న శత్రువుల పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఆయన, దైవప్రవక్త (సల్లం)కు ప్రమాదం ముంచుకొస్తుందేమోనని భావించి కంగారు పడసాగారు.
దైవప్రవక్త (సల్లం) ధ్యానం ముగిసింది. ఆయన (సల్లం), అబూ బక్ర్ (రజి) ముఖంలోని ఆందోళనను గమనించి, *"భయపడకు అల్లాహ్ మనకు తోడున్నాడు."* అన్నారు ధైర్యం చెబుతూ.
ఖురైషీయులు ఆ యువకుని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, *"ఏమయింది వెనక్కి తిరిగావు. గుహలోకి తొంగయినా చూడకుండా!"* అని అడిగారు ఆదుర్దాగా.
*"ఏమని చెప్పను? బహుశా అప్పటికి ముహమ్మద్ (సల్లం) పుట్టనైనా పుట్టి ఉండడు. అప్పటి నుంచి గుహ మీద ఓ పెద్ద సాలెగూడు అల్లుకుని ఉంది. గుహ బయట రెండు పావురాళ్ళు కూడా గుడ్లు పెట్టి ఎగురుతున్నాయి. దారిలో ఓ పెద్ద చెట్టు కూడా ఉంది. ఇక అలాంటి గుహలో మనుషులు ఉంటారని ఎలా అనుకోను?"* అన్నాడు ఆ యువకుడు.
ఆ యువకుని మాటలు విని ఖురైష్ నాయకుల ముఖాలు జావగారిపోయాయి. చివరికి అందరూ నిరాశా నిస్పృహలతో చేతులు నులుపుకుంటూ. కాళ్ళీడ్చుకుంటూ ఇళ్లకు తిరుగు ముఖం పట్టారు.
*↑ ఇదే విషయం మరొక ఉల్లేఖనం ప్రకారం ↓*
*దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లను పట్టుకోవాలని సౌర్ గుహ దరిదాపులకు చేరుకున్న అవిశ్వాసులు : -*
దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లు "సౌర్" గుహలో విడిది చేశారు. మహాప్రవక్త (సల్లం) ప్రార్థన చేసుకుంటున్నారు.
ఆ రాతి ప్రదేశం గుండా పరిగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం సమీపానికి చేరింది. కుట్రదారులు గుహకు మరెంతో దూరంలో లేరు. ఆందోళనతో అబూ బక్ర్ (రజి) శ్వాస స్తంభించింది.
*"గుహలోనే.... ఈ గుహలోనే.... అదిగో ఈ గుహలోనే.... ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు"* అంటూ ఒక గొంతు పెద్దగా అరిచింది.
అబూ బక్ర్ (రజి) కన్నీరు పెట్టుకున్నారు. *"అంతా అయిపోయింది. దైవప్రవక్త (సల్లం)ను చంపేస్తారు. ఆయన (సల్లం)తో పాటు నన్ను కూడా."*
*"ఇప్పుడు ఏమిటి దారి? మనం ఇద్దరమే ఉన్నాం."* భయంగా అడిగారు.
ప్రవక్త (సల్లం) మాత్రం చాలా ప్రశాంతంగా జవాబిచ్చారు. *"అబూ బక్ర్! మీరు పొరబడుతున్నారు. ఇక్కడ మనం ముగ్గురం ఉన్నాం. మీరు, నేను, ఆ అల్లాహ్".*
అడుగుల శబ్దం గుహ ముఖ ద్వారానికి చేరింది. అబూ బక్ర్ (రజి) గట్టిగా కళ్ళు మూసుకుని ప్రార్థించసాగారు.
*"హుబల్ దైవం సాక్షి! వాళ్ళు ఈ గుహలో ఉండే ప్రసక్తే లేదు. ఈ గుహ, పూర్తిగా పొదలతో, సాలె గూళ్ళతో నిండిపోయి ఉంది. ముహమ్మద్ (సల్లం) పుట్టినప్పటి నుంచీ ఇక్కడ ఎవరూ లేరు."* అని, అవిశ్వాసులలోని ఒకతను అన్నాడు.
*"అలా అయితే పదండి. ఉత్తర దిక్కుకు పోదాం"* ఇంకొకతను అన్నాడు.
డెక్కల చప్పుడు, మనుషుల శబ్దాలు క్రమేపి తగ్గిపోయాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా అబూ బక్ర్ (రజి) ఇంకా కదలడానికి కూడా భయపడుతున్నారు. మనసులో అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
కొద్దిసేపటి క్రితం ఎవరో పొదలు, సాలె గూళ్ళు అన్న మాటలు అకస్మాత్తుగా ఆయనకు గుర్తుకు వచ్చాయి. నెమ్మదిగా కళ్ళు తెరచి చూశారు. కాని ఆ గుహ, వాళ్ళు చెప్పినట్టు ఏమీ లేదు. గుహ ముఖద్వారానికి ఒక సాలె పురుగు ఒక్క పోగును మాత్రమే అల్లి దాని మీద వ్రేలాడుతూ ఉంది. ఆ పోగు వెండి దారంలా మెరుస్తోంది. దాని మీద నుంచి ఆకులతో నిండిన కొమ్మ ఒకటి కిందకి వేలాడుతూ ఉంది. దాని మధ్యలో ఒక గూడు! బూడిద రంగు పావురం ఒకటి ప్రశాంతంగా ఆ గూటిలో కూర్చుని పాడుతూ ఉంది.
అబూ బక్ర్ (రజి) కళ్ళు నులుముకుని మళ్ళీ చూశారు. సాలె పురుగు వెండి రంగులో ఉన్న పోగులతో తన గూడును నిర్మించుకోవడాన్ని ప్రవక్త (సల్లం) గమనిస్తున్నారు.
*"దైవప్రవక్తా! ఇదంతా ఎలా జరిగింది?"* అబూ బక్ర్ (రజి) ఆశ్చర్యంగా అడిగారు.
ప్రవక్త (సల్లం) ఏ సమాధానమూ ఇవ్వకుండా, పావురాయి కూతను వింటూ, అబూ బక్ర్ (రజి) వైపు తిరిగి చిరునవ్వు నవ్వారు.
ఈ విధంగా దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లను సజీవంగా పట్టుకోవాలన్న అవిశ్వాసుల ప్రయత్నం నీరుగారిపోయింది.
అబూ బక్ర్ (రజి) కూతురు ఎంతో చాకచక్యంగా వరుసగా మూడు రాత్రులు వీళ్ళిద్దరికీ సేవలు అందించింది. ఒంటె మీద ఎడారి గుండా ప్రయాణించి భోజన సదుపాయాలను కొండ గుహలోనికి చేర్చింది. ఒక నమ్మకస్తుడైన అనుచరుడు, ప్రతి ఉదయం ఆమె రాకపోకల ఆనవాళ్ళు చెరిపేయడానికి గుహ వరకు గొర్రెల మందను మేపేవాడు.
వాళ్ళిద్దరు ఆందోళన కల్గించే ఒక వార్త విన్నారు. దాని గురించి అబూ బక్ర్ (రజి) విస్తుపోతూ చెప్పారు. *"ఓ ప్రవక్తా! మక్కా వాళ్ళు, మిమ్మల్ని పట్టుకున్న వాళ్ళకి వంద ఒంటెల బహుమానం ప్రకటించారు."*
కొండ గుహ గోడను అనుకొని ప్రవక్త (సల్లం) కళ్ళు మూసుకుని గత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. *"నన్ను పట్టుకుంటే నూరు ఒంటెలు.... నూరు ఒంటెలు.... అదే సంఖ్య.... అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని.... తాత దుప్పటిలో వెచ్చగా ముడుచుకుని పడుకుని ఉన్నాను. కాబాలో అప్పుడు అర్థరాత్రి సమయం.... తాత తన గతం గురించి చెప్తున్నారు. తన కొడుకు జీవితం కోసం, ఆయన వంద ఒంటెలను బలి ఇచ్చినట్లు చెప్పారు.... వంద ఒంటెలు!!"*
*సౌర్ గుహలో మూడు రోజులు : -*
అవిశ్వాసులు తనను ఇంకా వెంటాడుతూ ఉండవచ్చని దైవప్రవక్త (సల్లం) మూడు రోజుల దాకా "సౌర్" గుహలోనే ఉండవలసి వచ్చింది. ఈ మూడు రోజులు "అబూ బక్ర్ (రజి)" కొడుకు "అబ్దుల్లా (రజి)" పగలంతా నగరంలో తిరిగి, ఖురైషీయులు దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా ఏమేమి కుట్రలు పన్నుతున్నారో తెలుసుకుని రాత్రిపూట వచ్చి సమాచారం అందజేసేవారు.
ఇలా మూడు రోజులు గుహలో గడిపి, అబ్దుల్లా (రజి) సేకరించిన సమాచారాన్ని బట్టి శత్రువులు తమను వెంటాడటం మానేశారని నిర్ధారణ చేసుకున్నారు. అప్పుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" కొడుకుతో...., *"నేను మన ఇంటి దగ్గర రెండు ఒంటెల్ని సిద్ధం చేసి ఉంచాను. నీవు వెంటనే పోయి, ఎవరికీ తెలియకుండా వాటిని తీసుకురా. వచ్చేటప్పుడు "ఇబ్నె అరీఖత్ లైసీ"ను కూడా పిలుచుకురా."* అని చెప్పి పంపించారు.
ఆ సాయంకాలమే అబ్దుల్లా (రజి) గుహ దగ్గరకు తిరిగొచ్చారు. ఆయన వెంట అస్మా (రజి), ఆమిర్ కూడా ఉన్నారు. వారి వెనకాల ఇబ్నె అరీఖత్ ఒంటెలను తోలుకుని వచ్చాడు. ఇబ్నె అరీఖత్ ముస్లిమేతరుడు అయినప్పటికీ "అబూ బక్ర్ (రజి)"కు ఎంతో నమ్మకస్తుడు. అందువల్ల "అబూ బక్ర్ (రజి)" అతనికి కొంత పైకం ముట్టజెప్పి తమను నిర్జన ప్రాంతం గుండా మదీనా తీసికెళ్ళడానికి మార్గదర్శిగా కుదుర్చుకున్నారు.
ఇక ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)లు ఇద్దరూ "సౌర్" గుహ నుంచి మదీనా కు పయనమయ్యారు.
*In Shaa Allah రేపటి భాగములో మరింత వివరణ....;*
No comments:
Post a Comment