178

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 178            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 93*

                  *మదీనాకు హిజ్రత్ : - 2* 

 *దైవప్రవక్త (సల్లం), అబూ బక్ర్ (రజి)ను వెంటబెట్టుకొని మక్కాను విడిచిపెట్టిన తర్వాత జరిగిన సంఘటనలు : -* 

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) శత్రువుల కళ్ళు గప్పి నగరం నుంచి బయటపడ్డారు. కొంత దూరం నడచిన తర్వాత విడనాడని బంధమేదో పెనవేసుకోగా అప్రయత్నంగా నిలబడి వెనక్కి తిరిగి చూశారు. ఆకాశదీపాల క్రింద, తన ప్రియనగరం ఎంతో శోభాయమానంగా కనిపించింది. ఒక్కసారిగా గతస్మృతులు గుర్తుకువచ్చాయి.

తాను (సల్లం) ఈ నగరంలో పుట్టి పెరిగారు. ఇక్కడే ఓ ఇంట్లో వివాహం చేసుకున్నారు. ఈ నగరంలోనే తనకు "వహీ"భాగ్యం లభించింది. ఈ నగరం నుంచే తాను (సల్లం) దివ్యలోకాలకెళ్ళి దైవసాన్నిధ్యం పొందారు. ఈ పవిత్ర క్షేత్రమే తన ధార్మికోద్యమానికి ప్రథమ వేదిక అయ్యింది. ఇలాంటి నగరానికి ఈ రోజు తాను మార్గాంతరంలేక వీడ్కొలు చెప్పవలసివస్తోంది.

ఈ ఆలోచనలతో దైవప్రవక్త (సల్లం) అవ్యక్తమైన బాధతో నిట్టూర్చారు. మనసు కకావికలమైపోయింది. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. హృదయవీణ మూగగా విలపించింది.

 *"మక్కా నగరమా! ప్రపంచ నగరాలన్నిటిలో నీవే అల్లాహ్ కి అత్యంత ప్రియమైన దానవు. నాకు కూడా నీవే నగరాలన్నిటి కంటే ఎక్కువ ప్రియమైన దానవు. బహుదైవారాధకులు బహిష్కరించకపోతే నేను నిన్ను ఎన్నటికి వీడిపోయేవాడ్ని కాను."* 

స్వస్థలం ఎడబాటుతో పొరలివచ్చిన ఆవేదనను బలవంతంగా దిగమింగి కర్తవ్యన్మోఖులయ్యారు దైవప్రవక్త (సల్లం).

మహాప్రవక్త (సల్లం) దైవదౌత్య శకం 14, "సఫర్" మాసం 27వ తేది (క్రీ.శ.12 మరియు 13 సెప్టెంబర్ 622) మధ్యరాత్రి ఇంటి నుండి బయలుదేరుతూ, తన ధన ప్రాణాల విషయంలో అందరికంటే నమకస్తుడైన మిత్రుడు "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారి ఇంటికి వచ్చారు.

అక్కడ నుండి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఓ కిటికీ నుండి బయటపడి, తెల్లారకమునుపే మక్కా దరిదాపుల్లో నుండి బయటపడేందుకు బయలుదేరారు.

ఇటు, ఖురైషులు తమ పూర్తి శక్తియుక్తులను ఉపయోగించి ఆయన (సల్లం)ను వెదకడానికి ప్రయత్నిస్తారన్న సంగతి మహాప్రవక్త (సల్లం)కు బాగా తెలుసు. వారు ఏ మార్గంపైనైతే బయలుదేరబోతారో అది మదీనా మార్గమై అయి ఉంటుంది. అది మక్కాకు ఉత్తరం వైపునకు పోయే మార్గం. ఇది తెలిసిన మహాప్రవక్త (సల్లం) దానికి పూర్తిగా భిన్నమైన దిశ అంటే "యమన్"కు పోయే దక్షిణ దిశను ఎన్నుకుని దాదాపు అయిదు మైళ్ళు ప్రయాణించి "సౌర్" అనే పర్వత సానువుల్లోకి చేరుకున్నారు.

ఇది చాలా ఎత్తయిన కొండ. ఎక్కడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. మార్గంలో రాళ్ళు కూడా అధికంగా ఉండడం వలన దైవప్రవక్త (సల్లం) కాళ్ళకు గాయాలు కూడా అయ్యాయి. కాలి గుర్తులు పడకుండా ముని వ్రేళ్ళపై నడిచారని కూడా చెప్పుకోవడం జరుగుతోంది. అందుకనే ఆయన (సల్లం) కాళ్ళకు గాయాలై ఉండవచ్చు.

మొత్తానికి, ఏది ఏమైనా, "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" గారి వెంట ఆ కొండ దాపుకు చేరుకున్నారు. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఆయన (సల్లం)ను ఎత్తుకొని పరుగిడి కొండ శిఖరంపై ఉన్న ఓ గుహ దగ్గరకు చేరుకున్నారు. చరిత్రలో ఈ గుహ "గారె సౌర్ (సౌర్ గుహ)"గా పిలువబడుతోంది.

 *గుహ లోపల : -* 

గుహ దగ్గరకు వెళ్ళిన తరువాత "హజ్రత్ అబూ బక్ర్ (రజి)", దైవప్రవక్త (సల్లం)తో...., *"దైవప్రవక్తా! తమరు ఇప్పుడే ఈ గుహలోనికి ప్రవేశించకండి. ముందు నేను వెళ్ళి చూసి వస్తాను. ప్రమాదకరమైన విషయం ఏదైనా ఉంటే ముందు దాన్ని నేనే భరిస్తాను."* అంటూ గుహలోనికి ప్రవేశించారు. అక్కడున్న రాళ్ళను, ముళ్ళను తొలగించి ఆ గుహను శుభ్రపరిచారు.

ఆ గుహలో ఓ ప్రక్క రెండు కన్నాలు కనబడ్డాయి. వాటిని తన లుంగి చించి మూసివేశారు. అయినా మరో రెండు కన్నాలు మిగిలే ఉన్నాయి. "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఆ రెండు కన్నాలను తన కాలి బొటన వ్రేళ్ళతో మూసేసి మహాప్రవక్త (సల్లం)ను లోనికి పిలిచారు. లోనికి వెళ్ళిన ప్రవక్త శ్రీ (సల్లం), అబూ బక్ర్ (రజి) గారి ఒడిలో తన శిరస్సును పెట్టి పడుకున్నారు. కాసేపటికి ఆయన (సల్లం)కు నిద్ర పట్టింది.

కన్నాలను తన కాలి బ్రోటన వ్రేళ్ళతో మూసిన అబూ బక్ర్ (రజి) గారి కాలిని ఏదో విష జంతువు కరిచింది. దైవప్రవక్త (సల్లం) ఎక్కడ మేల్కొంటారో అనే భయంతో ఆయన కదలనైనా కదలలేదు. అయితే, బాధ వల్ల ఆయన కళ్ళ వెంట అశ్రువులు టపటపమంటూ మహాప్రవక్త (సల్లం) చెక్కిళ్ళపై రాలాయి. (ఇలా ఆయన (సల్లం) మేల్కొన్నారు)

 *"నీకేమైంది అబూ బక్ర్?"* అని అడిగారు మహాప్రవక్త (సల్లం).

 *"నా తల్లితండ్రులు మీ కోసం అర్పితం! ఇదిగో ఈ కన్నం మూసేయడానికి నా కాలి బ్రోటన వ్రేలిని అడ్డం పెడ్తే, ఏదో నన్ను కాటేసింది."* అని అన్నారు బాధ పడుతూ.

 *"బాధపడకు, ముందు అక్కడనుంచి కాలు తీసెయ్యి."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

అబూ బక్ర్ (రజి) కన్నం పైనుంచి కాలు తీసి దగ్గరకు లాక్కున్నారు. వెంటనే కన్నంలో నుంచి భయంకరమైన ఓ త్రాచుపాము బయటకి వచ్చి పడగ విప్పింది.

 *"సర్పమా! నువ్వు నా ఆప్త మిత్రుడ్ని కాటేసి నా మనస్సు నొప్పించావే!"* అన్నారు దైవప్రవక్త (సల్లం). ఈ మాట వినగానే త్రాచుపాము తలవంచి అక్కడనుంచి చరచరా వెళ్ళిపోయింది.

దైవప్రవక్త (సల్లం) తన ఉమ్మిని, విషజంతువు కుట్టిన చోట పెట్టారు. వెంటనే అబూ బక్ర్ (రజి) గారి బాధ మటుమాయమై పోయింది. తరువాత దైవప్రవక్త (సల్లం) నడుంవాల్చి పడుకున్నారు.

కాస్సేపటికి ఓ సాలెపురుగు వచ్చి గుహముఖంపై గూడు అల్లింది. ఆ తర్వాత ఎటు నుంచో రెండు పావురాళ్ళు వచ్చి గుహద్వారం ముందు కిచకిచమంటూ ఎగరసాగాయి.

ఈ గుహలో వీరిద్దరూ కలసి మూడు రాత్రులు దాగి గడిపారు. అంటే శుక్రవారం, శనివారం మరియు ఆదివారం రాత్రులు అన్నమాట. ఈ మధ్య కాలంలో "అబూ బక్ర్ (రజి)" గారి తనయుడు "అబ్దుల్లా" కూడా వచ్చి వీరితోపాటే రేయి గడిపేవారు.

 *"హజ్రత్ ఆయిషా (రజి)" గారి కథనం ప్రకారం....;* 

అబ్దుల్లా మంచి తెలివిగలవాడు, విషయాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం కలవాడు. తెల్లారకముందే చీకట్లో వారిద్దరిని అక్కడ విడిచి, ఉదయం తాను మక్కా ప్రజలతో కలసిపోయేవారు. అంటే ఆయన రాత్రి మక్కాలో ఉన్నట్లుగానే వారికి నమ్మకం గలిగేటట్లు మెలిగేవారు. మహాప్రవక్త (సల్లం) మరియు "అబూ బక్ర్ (రజి)" గురించి మక్కవాసులు చేసే కుతంత్రాలకు సంబంధించిన ఏదైనా మాట వింటే దాన్ని గుర్తుపెట్టుకొని బాగా చీకటి పడగానే గుహ దగ్గరకు వెళ్ళిపోయేవాడు.

ఇటు "అబూ బక్ర్ (రజి)" గారి బానిస "ఫహీరా" మేకలు కాస్తూ రాత్రి ఓ ఝాము పొద్దుపోయిన తరువాత ఆ మేకలతో గుహ దగ్గరకి వెళ్ళేవారు. ఇలా వీరిద్దరూ బాగా కడుపునిండా పాలు త్రాగేవారు. ఉదయం కాగానే "ఫహీరా" మేకలు తోలుకొని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయేవారు. మూడు రాత్రులు కూడా ఆయన ఇలాగే చేశారు. (అదేకాదు) "హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబీ బక్ర్ (రజి)" మక్కాకు వెళ్ళిపోయిన తరువాత, ఆయన అడుగుజాడలు కనబడకుండా వాటిపై నుండి తన మేకలను తోలుకుని వెళ్ళడం కూడా జరిగేది.

 *ఖురైష్ విఫలయత్నం : -* 

హత్య చేయడానికి ఖురైషులు ఎన్నుకున్న ఆ రాత్రి గడచిపోయింది. తెల్లవారిన తరువాత దైవప్రవక్త (సల్లం) చేయిదాటిపోయారన్న విషయం వారికి పూర్తిగా నమ్మకంగా అర్థమైంది. ఇక వారి క్రోధానికి అంతేలేదు. ముందు "హజ్రత్ అలీ (రజి)" పై ఆ కోపాన్ని తీర్చుకున్నారు. ఆయన్ను ఈడ్చుకుంటూ కాబా గృహం వద్దకు తీసుకువచ్చారు. బహుశా ఆ ఇద్దరి జాడ ఏమైనా తెలుస్తుందేమో అన్న ఉద్దేశ్యంతో ఆయన్ను కొంతకాలం వరకు నిర్భంధంలో ఉంచారు.

కాని, "హజ్రత్ అలీ (రజి)" ద్వారా ఏ విషయం బయటపడకపోవడంతో నేరుగా "అబూ బక్ర్ (రజి)" గారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. "హజ్రత్ అస్మా (రజి) బిన్తె అబూబక్ర్ (రజి)" (అబూ బక్ర్ (రజి) గారి కుమార్తె) బయటకు వచ్చారు.

 *"మీ నాన్న ఎక్కడ?"* అని అడిగారు వారు.

 *"ఏమో! నాకేం తెలుసు మా నాన్నగారెక్కడున్నారో?"* అని బదులిచ్చారమె.

ఇది విన్న "అబూ జహల్" కోపం పట్టలేక ఆమె చెంపపై పెద్దగా చరిచాడు. ఆ దెబ్బకు ఆమె చెవి పోగు ఎగిరి క్రింద పడిపోయింది.

ఖురైషులు ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ ఇద్దరిని పట్టుకోడానికి సాధ్యమైనన్ని శక్తియుక్తుల్ని, వనరుల్ని ప్రయోగించాలని తీర్మానించుకున్నారు. మక్కా నుండి బయటకు పోయే మార్గాలన్నిటిపై - ఆ మార్గాలు ఎటు పోయేవి అయినా సరే - గట్టి నిఘా ఉంచడం జరిగింది. అలాగే ఓ ప్రకటన చేస్తూ, *"ఎవరైనా సరే, ముహమ్మద్ (సల్లం) మరియు అబూ బక్ర్ (రజి)ను సజీవంగా లేదా నిర్జీవంగా బంధించి తెస్తే ఆ ఇద్దరిలో ఒక్కొక్కరికి వంద ఒంటెలను బహుకరిస్తాం."* అని చాటింపు వేయించారు. 

ఈ ప్రకటన ఫలితంగా వాహనాలపై, కాలినడకనా పోయి వెదికేవారు, అడుగుజాడలు చూసి జాడ తెలుసుకునే అడుగుజాడల నిపుణులు వెదుకులాటనారంభించారు. కొండల్లో, లోయల్లో, పల్లపు ప్రదేశాల్లో, మెట్ట ప్రాంతాలన్నింటిలోనూ చెల్లాచెదురై ప్రవక్త (సల్లం)ను వెదకనారంభించారు. కాని ఫలితం దక్కలేదు.

వెదుకుతూ వెళ్ళేవారు "సౌర్ గుహ" ముఖద్వారం వద్దకు కూడా చేరుకున్నారు. కాని "అల్లాహ్" అభీష్టం మరో విధంగా ఉంది. "సహీ బుఖారి" గ్రంథంలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" చెప్పినట్లుగా ఓ ఉల్లేఖనం ఉంది. దీన్ని "హజ్రత్ అనస్ (రజి)" ఉల్లేఖించారు. ఆ ఉల్లేఖనంలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఇలా చెప్పారు....;

నేను దైవప్రవక్త (సల్లం) గారి వెంట గుహలో ఉన్నాను. తల పైకెత్తి చూద్దును గదా అక్కడ వెదుకులాడే మనుషుల పాదాలు నాకు కనిపిస్తున్నాయి. నేను ప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! ఒకవేళ వీరు ఏ ఒక్కరైనా తమ చూపుల్ని క్రిందికి వాల్చి చూస్తే? ఇంకేముంది! మనం కనబడతాం."* అన్నాను. దానికి ఆయన (సల్లం), *"అబూ బక్ర్ మాట్లాడకు. (మనం) ఇద్దరం, మా ఇద్దరికి తోడు మూడోవాడు అల్లాహ్"* అని అన్నారు.

మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి.

 *"అబూ బక్ర్ (రజి)! అల్లాహ్ మూడవవానిగా తోడుంటే ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి?"* 

యదార్థం ఏమిటంటే, ఇది ఓ మహత్యం. అల్లాహ్ తన ప్రవక్త (సల్లం)కు చేసిన సహాయమది. కాబట్టి వెదికేవారికి, దైవప్రవక్త (సల్లం)కు మధ్య కొన్ని అడుగులకంటే ఎక్కువ దూరం లేరు. వారు అక్కడి నుండే వెనక్కి మరలిపోయారు.

 *↑ ఈ విషయంలోని మరింత వివరణను In Shaa Allah రేపటి భాగములో....; →*

No comments:

Post a Comment