🕌🕌🕌 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕌🕌🕌
🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు 🛐🛐
🤚🏻✋🏻 అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను 🤚🏻✋🏻
~~~~~
🕋🕋🕋 ఇస్లాం చరిత్ర - 177 🕋🕋🕋
■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■
*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 92*
*మదీనాకు హిజ్రత్ : - 1*
*హిజ్రత్ చేసి మక్కాను వీడిన దైవప్రవక్త (సల్లం)*
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) హత్యకు తీర్మానం ఆమోదించబడినప్పుడు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)", దైవవాణితో ఆయన (సల్లం) సన్నిధికి వచ్చారు. ఖురైష్ పన్నిన కుట్రను గురించి ఆయన (సల్లం)కు తెలుపుతూ, *"అల్లాహ్ మిమ్మల్ని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళడానికి అనుమతించాడు."* అని సూచిస్తూ, హిజ్రత్ చేసి వెళ్లవలసిన ఆ తేదీని కూడా నిర్ణయించి చెప్పారు. ఆ రాత్రి ఆయన (సల్లం) రోజూ పడుకునే చోట పడుకోవద్దని కూడా చెప్పడం జరిగింది.
ఈ సూచన అందగానే మహాప్రవక్త (సల్లం), ఆ రోజే మిట్టమధ్యాహ్న సమయంలో "అబూ బక్ర్ (రజి)" ఇంటికి వెళ్ళి, హిజ్రత్ చేయడానికి సంబంధించిన కార్యక్రమమంతా సిద్ధం చేసి ఉంచమని వివరించారు. మహాప్రవక్త (సల్లం), "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఇంటికి వచ్చిన విషయాన్ని "హజ్రత్ ఆయిషా (రజి)" ఇలా ఉల్లేఖిస్తున్నారు....; ↓
"ఆ రోజు మధ్యాహ్నం మేము "అబూ బక్ర్ (రజి)" గారి ఇంట్లో కూర్చోని ఉన్నాం. అంతలో ఎవరో వచ్చి "అబూ బక్ర్ (రజి)" నుద్దేశించి, *"మహాప్రవక్త (సల్లం) గారు తలపై గుడ్డ కప్పుకుని వస్తున్నారు."* అని చెప్పారు.
మిట్టమధ్యాహ్న సమయంలో ఆయన (సల్లం) ఎప్పుడూ రాలేదు. "అబూ బక్ర్ (రజి)" లేచి బయటకు వెళ్ళారు. *"మహాప్రవక్తా! తమరెప్పుడు ఈ సమయంలో రాలేదే!"* అని అడిగారు. మహాప్రవక్త (సల్లం) లోనికి రావటానికి అనుమతి కోరారు. అనుమతి లభించగానే ఆయన (సల్లం) ఇంట్లోకి ప్రవేశించి, *"అబూ బక్ర్! ఇక్కడ ఉన్నవారిని ప్రక్కకు పొమ్మని చెప్పండి."* అని అన్నారు. దానికి అబూ బక్ర్ (రజి), *"దైవప్రవక్తా! ఇక్కడ మీ సతీమణి ఆయిషా (రజి) తప్ప ఇంకెవరూ లేరు. చెప్పండి."* అని బదులు పలికారు.
*"నాకు హిజ్రత్ చేసి వెళ్ళే అనుమతి లభించింది."* అన్నారు మహాప్రవక్త (సల్లం).
*"మరి తమరి వెంట....(నేనుంటానా?)"* అని అడిగారు.
*"ఔను"* అన్నారు దైవప్రవక్త (సల్లం).
*"మహాభాగ్యం! నేను ముందుగానే, వలసపోవడానికి కావలసిన సామాగ్రి సిద్ధం చేసి పెట్టాను. రెండు ఒంటెల్ని కూడా ఏర్పాటు చేశాను. ప్రయాణసౌలభ్యం కోసం "అబ్దుల్లా బిన్ అర్తఖ్"తో కూడా మాట్లాడాను."* త్వరత్వరగా అన్నారు "అబూ బక్ర్ (రజి)" ఆనందంతో.
*"ఒంటెలు ఇప్పుడే అవసరం లేదు. శత్రువులు మనల్ని వెన్నంటి ఉన్నారు. అందువల్ల, ముందుగా మనం దక్షిణ దిశగా బయలుదేరి "సౌర్" గుహలో తలదాచుకోవాలి."* అన్నారు దైవప్రవక్త (సల్లం) విషయాన్ని విశదీకరిస్తూ.
ఆ తరువాత హిజ్రత్ కార్యక్రమం నిర్ణయించి తన ఇంటికి వెళ్ళిపోయారాయన (సల్లం). ఆ రాత్రి ఎప్పుడొస్తుందా అని నిరీక్షించసాగారు.
ఇటు మక్కా ముష్రిక్ నాయకులు, పార్లమెంటు దారున్నద్వాలో ఉదయం ఏకగ్రీవంగా (ముహమ్మద్ (సల్లం)ని హత్య చేయాలని) ఆమోదించిన తీర్మానాన్ని అమలు చేయడానికి రోజంతా కసరత్తు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. దీని కోసం వారు పదకొండు మంది సర్దారుల్ని ఎన్నుకోవడం జరిగింది. వారి పేర్లు ఇవి:
1. అబూ జహల్ బిన్ హష్షామ్
2. హకమ్ బిన్ ఆస్
3. ఉక్బా బిన్ అబీ ముయీత్
4. నజ్ర్ బిన్ హారిస్
5. ఉమయ్యా బిన్ ఖల్ఫ్
6. జమ్ఆ బినుల్ అస్వద్
7. తుఅయిమా బిన్ అద్దీ
8. అబూ లహబ్
9. ఉబై బిన్ ఖల్ఫ్
10. నుబయా బినుల్ హుజ్జాజ్
11. అతని సోదరుడు మునబ్బా బినుల్ హుజ్జాజ్
*దైవప్రవక్త (సల్లం)ను హత్య చేసేందుకు, ఆయన (సల్లం) ఇంటిని చుట్టుముట్టిన ముష్కర మూక*
ఖురైషీయులు దైవప్రవక్త (సల్లం)ను అంతం చేయడానికి ఒక పథకం తయారు చేశారు. తేదీ కూడా నిర్ణయమైపోయింది. నిర్ణయించిన ఆ కాళరాత్రి రానే వచ్చింది.
నలువైపుల నుంచి చీకటి తెరలు అలుముకున్నాయి. నింగిలోని నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ నెల వైపు కళ్ళు చించుకుని చూస్తున్నాయి. గాడాంధకారంలో మక్కా నగరం మౌనముద్ర దాల్చింది. కారుణ్యమూర్తి (సల్లం) ఇంటి చుట్టూ శత్రువులు ఈటెలు, బాకులు తీసుకుని మాటుకాసి కూర్చున్నారు.
స్త్రీలుండే ఇండ్లలో దౌర్జన్యంగా జొరబడడం బహుదైవారాధకులు కూడా తలవంపుగా భావించేవారు. అందువల్ల శత్రువులు బయటనే మాటుకాసి ఉంటూ, ముహమ్మద్ (సల్లం) ఎప్పుడు బయటకి వస్తే అప్పుడు మూకుమ్మడిగా మీదపడి ఆయన (సల్లం)ని ముక్కలు ముక్కలుగా నరికివేద్దామని కాచుకుని ఉన్నారు.
బహుదైవారాధకులకు, తమ కుట్ర ఫలిస్తుందని పూర్తి నమ్మకంగా ఉంది. ఈ విశ్వాసంతో "అబూ జహల్" ఎంతో గర్వపడుతూ, ఎగతాళిగా తన చుట్టూ ఉన్న వారిని ఉద్దేశించి ఇలా చెప్పనారంభించాడు.
*"మీరంతా అతని ధర్మంలో చేరి అతనికి విధేయత చూపితే, అరేబియా మరియు అరబ్బేతర రాజ్యాలకు రాజులైపోతారంటున్నాడు ముహమ్మద్ (సల్లం). చనిపోయిన తరువాత తిరిగి లేపబడినప్పుడు జోర్డాన్ ఉద్యాన వనాల్లాంటి ఉద్యానవనాలు లభిస్తాయట మీకు. మీరే అలా చేయకపోతే ఆయన (సల్లం) తరఫు నుండి జరిగే యుద్ధంలో మీరంతా హతులైపోతారట. మరణించిన తరువాత తిరిగి లేపబడతారట. మీ కోసం కాల్చిపారేసే నరకాగ్ని శిక్ష కూడా ఉందట."*
మొత్తానికి కుట్ర అమలుకు నడిరేయి తరువాతి ఝాము ఖరారు అయింది. వీరంతా మేల్కొని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాని "అల్లాహ్" తన కార్యాన్ని నెరవేర్చే శక్తిగలవాడు. భూమ్యాకాశాల పాలన ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తలచిందే చేస్తాడు. ఆయన రక్షించదలచుకున్నవాడికి వీసమెత్తు నష్టం కూడా జరుగదు. ఆయన పట్టు నుండి ఇంకెవ్వడు తప్పించుకోనూ లేడు. కాబటి "అల్లాహ్" ఈ సందర్భంలో తను వేసిన ఎత్తును గురించి దైవప్రవక్త (సల్లం)ను సంబోధిస్తూ "ఖుర్ఆన్"లో ఇలా సెలవిస్తున్నాడు.
*"(ఓ ప్రవక్తా!) సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరఫున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్ పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేని మేటి." (ఖుర్ఆన్ 8:30).*
*మహాప్రవక్త (సల్లం) తమ ఇంటిని వదిలేయడం : -*
ఎట్టకేలకు ఖురైషులు తమ పథకాన్ని అమలుచేసేందుకు చేసిన ప్రయత్నం అంతా బూడిదలో బోసిన పన్నీరు చందంగా తయారైంది. వారు తమ కార్యంలో అపజయాన్నే ఎదుర్కోవలసివచ్చింది.
ఇంటి బయట, తనను హత్య చేసేందుకు ఖురైషీయులు పొంచి ఉన్నారు. ఈ సున్నితమైన ఘడియలో దైవప్రవక్త (సల్లం) వెంట "హజ్రత్ అలీ (రజి)" కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లం), "హజ్రత్ అలీ (రజి)"ను లేపి, "అన్ని విషయాలు వివరంగా చెబుతూ ఆయన (సల్లం) ఇలా అన్నారు...., *"అలీ! ఇదీ విషయం. జాగ్రత్తగా మసలుకోవాలి. తెల్లవారగానే మన ఇంట్లో భద్రపరచిన వస్తువులన్నీ ఎవరివి వాళ్ళకు ఇచ్చెయ్యి. ఆ తరువాత బయలుదేరి మదీనా వచ్చెయ్యి."*
ఏమిటా వస్తువులు? ఇతర ప్రజలతో పాటు బద్ధవిరోధులు సైతం తన వద్ద దాచుకున్న ధన కనక వస్తువులు. ముహమ్మద్ (సల్లం)ను దైవప్రవక్తగా అంగీకరించకపోయినా ఆయన (సల్లం) విశ్వనీయుడు, నిజాయితీపరుడు, సత్యసంథుడు అని శత్రువులు కూడా నమ్ముతారు. అంచేత వారు తమ విలువైన వస్తువుల్ని దైవప్రవక్త (సల్లం) దగ్గర భద్రంగా దాచిపెట్టి, గుండెల మీద చేయివేసుకుని మరీ తృప్తి చెందుతారు. ఇలా దాచబడిన వస్తువులు అనేకం ఉండటం వల్ల ఆయన (సల్లం), అలీ (రజి)ని తన వెంట తీసుకొనిపోకుండా, ఎవరి వస్తువులు వారికి అప్పగించేవరకు మక్కాలోనే ఉండమని చెబుతున్నారు.
ఎంత ఔదార్యం! ఒకవైపు రక్తపిపాసులైన గర్భశత్రువులు ఈటెలు, బాకులతో ఇంటిని దిగ్భందం చేసి, ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు చీల్చి చెండాడుదామని మాటువేసి కూర్చున్నారు. మరోవైపు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) కనబరస్తున్న ఈ నిజాయితీ!
ఆయన (సల్లం) దగ్గర లక్షల విలువగల వస్తువులున్నాయి. అవి ఎవరివో కాదు. సాక్ష్యాత్తు తన ప్రాణం తోడటానికి కాపుకాస్తున్న శత్రువులవి. కావాలనుకుంటే ఆయన (సల్లం) వీటన్నిటినీ వెంట తీసుకుపోవచ్చు. అప్పుడాయాన్ని అడిగేవారెవరూ ఉండరు. ఇప్పటి క్లిష్టపరిస్థితుల్లో ధనం కూడా చాలా అవసరమే. కాని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) అందులో చిల్లిగవ్వ కూడా ముట్టటానికి ఇష్టపడలేదు. పైగా వాటిని తిరిగిచ్చేయటానికి "అలీ (రజి)"ని నియమించి మరీ వెళ్తున్నారు. "అలీ (రజి)"ని వదలి వెళ్తున్నది, ప్రతీకార దాహంతో పెట పెటలాడుతూ, అంతులేని ద్వేషాగ్నిలో పడి కుతకుతలాడే క్రూరమృగాల మధ్య!!
భద్రపరచిన వస్తువులు ప్రజలకు అప్పగించడానికి "హజ్రత్ అలీ (రజి)" సంతోషంగా అంగీకరించారు. చివరిసారిగా దైవప్రవక్త (సల్లం), అలీ (రజి)ని ఆలింగనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం), తన ఇంటిని వదిలే సందర్భంలో "హజ్రత్ అలీ (రజి)"ని ఉద్దేశించి ఇలా అన్నారు.
*"(అలీ!) అల్లాహ్ నే నీకు రక్ష. ఆయన తలచుకుంటే వారు నిన్నేమి చేయలేరు. మనం మళ్ళీ మదీనాలో కలుసుకుందాం. నీవు వెళ్ళి నా ప్రక్కపై పడుకో. నా ఈ ఆకు పచ్చటి హజ్రమీ దుప్పటిని కప్పుకుని నిదురపో. నీకు వారి వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లబోదు."* అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) ఎప్పుడు ఈ దుప్పటినే కప్పుకుని పడుకోవడం పరిపాటి.
ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. బహుదైవారాధకుల మధ్య నుండి వెడుతూ ఓ పిడికెడు సన్నటి రాళ్ళు గల మట్టిని వారి తలలపై చల్లారు. అల్లాహ్, వారి చూపుల్ని ఆయన (సల్లం)ను చూడకుండా చేశాడు. ఆ సమయంలో మహాప్రవక్త (సల్లం), ఈ "ఖుర్ఆన్" ఆయత్ ను పఠిస్తూ బయటకు వచ్చేశారు.
*"వజఅల్'నా మిమ్ బైని అయిదీహిం సద్దవ్ఁ వమిన్ ఖల్ఫిహిమ్ సద్దన్ ఫ అగ్'షైనా హు ఫహుం లాయుబ్సిరూన్." (ఖుర్ఆన్ 36:9).*
*అర్థం : - మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు.*
ఆ సమయంలో ఆ ముష్రిక్కుల తలపై ఆ మట్టి పడకుండా ఎవ్వడూ మిగలలేదు. ఆ తరువాత ప్రవక్త శ్రీ (సల్లం), "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" ఇంటికి వెళ్ళి పోయారు.
ఆ తరువాత "అబూ బక్ర్ (రజి)" ఇంటి కిటికీలో నుండి బయటపడి ఆ ఇద్దరు యమన్ వైపు బయలుదేరారు. ఆ రాత్రికి రాత్రే మక్కాకు కొన్ని మైళ్ళ దూరాన ఉన్న "సౌర్" అనే కొండ గుహ ఒకదానిలోనికి వచ్చి చేరారు. (← ఇందులోని వివరాలు ముందు రాబోతున్నాయి.)
ఇటు, దైవప్రవక్త (సల్లం) ఇంటిని చుట్టుముట్టిన బహుదైవారాధకుల మూక, దైవప్రవక్త (సల్లం) బయటకు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంది.
అంతలోనే ఓ వ్యక్తి ఆ బహుదైవారాధకుల వద్దకు వచ్చి, *"మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారిక్కడ?"* అని అడిగాడు. *"ముహమ్మద్ (సల్లం) కోసం కాచుకుని కూర్చున్నాము."* అని బదులిచ్చారు బహుదైవారాధకులు.
అది విన్న అతడు, *"మీరు మీ ప్రయత్నంలో విఫలమైపోయారు. దైవసాక్షి! ముహమ్మద్ (సల్లం) ఇందాకనే కదా మీ ముందు నుండే మీ తలలపై మట్టి పోస్తూ వెళ్ళిపోయింది."* అని అన్నాడు.
*"మేము ఆయన (సల్లం)ను చూడలేదే!"* అని అంటూ తమ తలలపై పడివున్న మట్టికి దులుపుకున్నారు.
అయినా తలుపు సందులో నుండి తొంగి చూడగా అక్కడ "హజ్రత్ అలీ (రజి)" నిద్రపోతూ కనిపించారు. ఆయన (రజి)ను చూడగానే, *"అదిగో ముహమ్మద్ (సల్లం)! నిద్రపోతున్నాడు."* అని అనుకోనారంభించారు బహుదైవారాధకులు.
"హజ్రత్ అలీ (రజి)" ఒంటిపై ప్రవక్త (సల్లం) దుప్పటి వారికి కనబడింది. అందుకని వారు తెల్లవారిందాక అక్కడనే తిష్టవేసుకుని కూర్చున్నారు.
గంటలు దొర్లిపోతున్నాయి. శత్రువుల కళ్ళు మూతలు పడుతున్నాయి. అలా మగతలోనే పూర్తిగా తెల్లవారిపోయింది. ఇంట్లో అయిన అలికిడి విని బహుదైవారాధకులు ఉలిక్కిపడి లేచారు. మరుక్షణం అందరూ కత్తులు సిద్ధం చేసుకొని రక్తదాహంతో తహతహలాడుతూ లేచారు.
ఇక ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేనట్లు తలుపు కన్నంలో నుంచి తొంగి చూశారు. అంతే! లోపలి దృశ్యం చూసి అంతా కొయ్యబారి పోయారు.
దైవప్రవక్త (సల్లం) పడక మీద దుప్పటి తొలగించుకుంటూ "హజ్రత్ అలీ (రజి)" ప్రక్క మీది నుండి లేవగానే ముష్రిక్ లకు ఏం చేయాలో తోచలేదు. వారంతా నిర్ఘాంతపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు.
బహుదైవారాధకులు, అలీ (రజి)ని...., *"ముహమ్మద్ (సల్లం) ఎక్కడ?"* అని నిలదీసి అడిగారు. సమాధానంగా, *"నాకేమి తెలియదు"* అని అన్నారు "హజ్రత్ అలీ (రజి)".
దాంతో అవిశ్వాసులు రెచ్చిపోయి "హజ్రత్ అలీ (రజి)"ని బరబర బయటకి ఈడ్చుకుపోయారు. ముహమ్మద్ (సల్లం) ఎక్కడి పోయాడో చెప్పమంటూ ఆయన్ని అమానుషంగా కొట్టసాగారు. కాని, ఎంత కొట్టినా "హజ్రత్ అలీ (రజి)" తనకేమీ తెలియదనే చెప్పారు.
దాంతో అవిశ్వాసులు బుసలుకొడ్తూ "అలీ (రజి)"ని "కాబా"లో నిర్బంధించి హింసించడం మొదలుపెట్టారు. ఆఖరికి కొందరు బంధువుల జోక్యం వల్ల "అలీ (రజి)" ప్రాణం దక్కింది.
*ఈ విధంగా మహాప్రవక్త (సల్లం)ను హత్య చేయాలన్న అవిశ్వాసుల కుట్ర పూర్తిగా భగ్నమయ్యింది.*
*ఇలా మహనీయ ముహమ్మద్ (సల్లం) గారి హిజ్రత్ ప్రస్థానం మొదలయ్యింది.*
*"హజ్రత్ అబూ బక్ర్ (రజి)"ని వెంటబెట్టుకొని మక్కాను విడిచిన దైవప్రవక్త (సల్లం), ఆ తరువాత ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? అన్న విషయాలలోని వివరణను In Shaa Allah రేపటి భాగములో....;*
No comments:
Post a Comment