173

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 173            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 88*

                       *ద్వితీయ బైతె అఖబా* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

 *"మేము మా ఆస్తిపాస్తుల వినాశనాన్ని, మా గౌరవనీయుల మరణాన్ని సయితం లెక్కజేయం. ఓ ప్రవక్తా! మా ఈ ప్రమాణానికి మేము కట్టుబడి ఉంటే దానికి బదులుగా మాకు లభించేది ఏది?"* అని అడిగారు ఏకకంఠంతో.

 *"మీకు దీనికి ప్రతిగా స్వర్గం లభిస్తుంది."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

 *"అయితే చేయి చాచండి."* అనగా మహాప్రవక్త (సల్లం) తన చేతిని ముందుకు చాచారు. వారంతా ఆ చేతిపై చేయివేసి ప్రమాణం చేశారు.

ఒక్కక్కరే వచ్చి దైవప్రవక్త (సల్లం) చేతిలో చేయి వేసి ప్రమాణం చేశారు.

 *ఈ విధంగా మహోన్నత దైవకార్యానికి అంకురార్పణ జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) పరమానందభరితులై "అల్లాహ్" కి కృతజ్ఞతలు అర్పించారు.* 

 *హజ్రత్ జాబిర్ (రజి) గారి ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

మేము బైత్ చేయడానికి లేవబోగా, ఈ డెబ్భై మందిలో పిన్న వయస్కుడు అయిన "హజ్రత్ అసద్ (రజి) బిన్ జురారా" లేచి దైవప్రవక్త (సల్లం) గారి చేయి పట్టుకుని, *"ఓ యస్రిబ్ వాసులారా! కొంచెం ఆగండి. మేము ఈయన సన్నిధికి ఎంతో దూరం నుంచి, ఈయన దైవప్రవక్త అనే విశ్వాసంతో వచ్చాము. ఈ రోజు ఈయన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడమంటే మొత్తం అరేబియా దేశంతో శతృత్వం కొని తెచ్చుకోవడం. మీ సర్దారుల మరణాన్ని ఖడ్గాల వ్రేటులను భరించడమే అవుతుంది. కాబట్టి ఇదంతా మీరు భరించగలిగితేనే ఈయన్ను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళండి. మీ ప్రతిఫలం "అల్లాహ్" దగ్గర పదిలంగా ఉంది. మీకే గనక మీ ప్రాణాలు తీపి అయితే ఈయన్ను ఇక్కడే వదలి పెట్టండి. "అల్లాహ్" సమక్షంలో ఇదే సాకు పని చేయగలదు."* (అని అన్నాడు)

 *ప్రమాణం పూర్తి అయింది : -* 

బైత్ (ప్రమాణం)కు సంబంధించిన షరతులన్నీ ఇదివరకే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ప్రమాణానికి సంబంధించిన సూక్ష్మతను కూడా గ్రహించడం జరిగింది. ఇప్పుడు దానికి మరింత బలం చేకూరిన తరువాత అందరూ కలిసి "హజ్రత్ అసద్ (రజి) బిన్ జురారా"తో, *"ఇక మీ చేతిని ప్రక్కకు తీయండి. దైవసాక్షి! మేము ఈ ప్రమాణంను ఏ మాత్రం వదలలేము, దాన్ని త్రెంచనూ లేము"* అని అన్నారు.

వీరు ఇచ్చిన సమాధానం, "హజ్రత్ అసద్ (రజి) బిన్ జురారా"ను తృప్తిపరిచింది. తన జాతి ఈ మార్గంలో ప్రాణాలను అర్పించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది అనే విషయం ఆయనకు తెలిసిపోయింది - నిజం చెప్పాలంటే, "హజ్రత్ అసద్ (రజి) బిన్ జురారా", "హజ్రత్ ముస్అబ్ (రజి) బిన్ ఉమైర్" తో కలిసి మదీనాలో "ఇస్లాం" ధర్మవ్యాప్తికి సాధ్యమైనంత కృషి చేసినవారు. ఈ ప్రమాణం చేసేవారికి ఆయన ఓ విధంగా ధార్మిక నాయకుడు కూడాను - అందుకనే అందరికంటే ముందు ఆయనే దైవప్రవక్త (సల్లం) చేయి మీద చేయివేసి ప్రమాణం చేశారు.

ఇబ్నె ఇస్'హాక్, "బనూ నజ్జార్" కథనాన్ని ఉటంకిస్తూ, *"దైవప్రవక్త (సల్లం)తో చేయి కలిపిన మొట్టమొదటి వ్యక్తి "హజ్రత్ అబూ అమామా అసద్ (రజి) బిన్ జురారా"యే. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు."* అని అంటారు.

"హజ్రత్ జాబిర్ (రజి)"గారి ఉల్లేఖనంలో, *"మేము ఒకరి తరువాత ఒకరం లేచి మహాప్రవక్త (సల్లం)తో ప్రమాణం చేశాము. దానికి బదులుగా ఆయన (సల్లం) మాకు స్వర్గం శుభవార్తను అందించారు."* 

ఇక మిగిలిపోయినవారు ఇద్దరు మహిళలు. వారితో మహాప్రవక్త (సల్లం) కేవలం నోటి పలుకుల ద్వారానే ప్రమాణం చేశారు. ఆయన (సల్లం) ఇప్పుడు ఏ (పరాయి) స్త్రీ చేయి తాకలేదు.

 *పన్నెండు మంది సందేశ ప్రచారకుల ఎన్నిక : -* 

ప్రమాణం పూర్తి అయింది. ఆ తరువాత వారి ముందు దైవప్రవక్త (సల్లం) ఓ ప్రతిపాదనను ఉంచారు. దాని ప్రకారం వారందరూ కలిసి ఓ పన్నెండు మంది భాధ్యుల్ని ఎన్నుకోవాలని, వారు ఇక నుండి తమ జాతి తరఫున పూర్తి బాధ్యతను వహిస్తూ ప్రమాణ షరతుల్ని అమలుచేయాలని సెలవిచ్చారు. మహాప్రవక్త (సల్లం) చేసిన ఈ ప్రతిపాదనకు, వారు ఆ పన్నెండుగురిని వెంటనే ఎన్నుకున్నారు. వారిలో తొమ్మిది మంది "ఖజ్రజ్" తెగకు చెందినవారుకాగా ముగ్గురు "అవస్" తెగకు చెందినవారు.

 *ఖజ్రజ్ తెగ బాధ్యులు : -* 

1. అసద్ బిన్ జురారా బిన్ అదస్

2. సఅద్ బిన్ రబీ బిన్ అమ్రూ

3. అబ్దుల్లా బిన్ రవాహా బిన్ సఅలబా

4. రాఫె బిన్ మాలిక్ బిన్ అజ్లాన్

5. బరాఅ బిన్ మారూర్ బిన్ సఖర్

6. అబ్దుల్లా బిన్ అమ్రూ బిన్ హిరామ్

7. ఉబాదా బిన్ సామిత్ బిన్ ఖైస్

8. సఅద్ బిన్ ఉబాదా బిన్ దలీమ్

9. మున్జిర్ బిన్ అమ్రూ బిన్ ఖైస్

 *అవస్ తెగ బాధ్యులు : -* 

1. ఉసైద్ బిన్ హుజైర్ బిన్ సమాక్

2. సఅద్ బిన్ ఖైసమా బిన్ హారిస్

3. రిఫాఅ బిన్ అబ్దుల్ మున్జిర్ బిన్ జుబైర్

ఈ పన్నెండుగురు బాధ్యులను ఎన్నుకున్న తరువాత, మహాప్రవక్త (సల్లం) ఆ నాయకులు మరియు బాధ్యులకు తానే నాయకుడైనందున, వారితో మరో ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం వారినుద్దేశించి ఆయన (సల్లం), *"మీరు మీ జాతి మొత్తానికి చెందిన వ్యవహారాలను నడుపవలసి ఉంది. "హజ్రత్ ఈసా (అలైహి) హవారీలు ఆయన తరఫున బాధ్యులుగా ఉన్నారు. నేనూ నా జాతి ముస్లిముల తరఫున బాధ్యుణ్ణి."* అని అన్నారు. దానికి వారంతా *"ఔను"* అని సమాధానమిచ్చారు.

*షైతాన్ ఈ ఒప్పందాన్ని బహిర్గతం చేయడం : -* 

ఒప్పందం జరిగి అందరూ ఇక వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగానే ఓ షైతాన్ కు ఈ విషయం తెలిసిపోయింది. ఇది ఒప్పందం జరిగిన తరువాత చివరి ఘడియల్లో తెలిసిన విషయం. కాబట్టి షైతాన్ కు ఈ వార్త ఖురైష్ కు అందించడానికి, వారంతా మూకమ్మడిగా ముస్లిములపై విరుచుకుపడడానికి వీలుచిక్కలేదు. అందుకని ఆ షైతాన్, ఆ కొండ లోయలోని ఓ ఎత్తయిన ప్రదేశాన నిలబడి పెద్ద పెట్టుగా అరిచాడు. ఆ అరుపును బహుశా ఇప్పటి వరకు ఎవరూ వినలేదేమో. అతను పెద్దగా అరుస్తూ, *"ఓ గుడారవాసుల్లారా చూడండి! ఈ సమయంలో ధర్మభ్రష్టులంతా ముహమ్మద్ (సల్లం)తో సమావేశమై ఉన్నారు. మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారహో!"* అని అందరిని సావధానపరిచాడు.

● _(↑ ఇదే విషయం వేరొక ఉల్లేఖనంలో ↓)_ 

 *"ఖురైషీయులారా! ఇక్కడ అవస్, ఖజ్రజ్ తెగవాళ్ళు మీకు వ్యతిరేకంగా యుద్ధ వ్యూహాలు పన్నుతున్నారు. రండి! వీరంతా ప్రాణాలైనా త్యజించి పోరాడుతామని ముహమ్మద్ (సల్లం) ముందు ఎలా ప్రమాణాలు చేస్తున్నారో చూడండి."* ●

ఇది విన్న మహాప్రవక్త (సల్లం), *"ఇతను ఈ కొండ లోయకు చెందిన షైతాను. ఓ దైవ శత్రువా! విను, ఇక నేను నీ పని పట్టడానికి త్వరలోనే సిద్ధపడబోతున్నాను."* అంటూ ముస్లిములకు వారి వారి గుడారాల్లోనికి వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చారు.

 *ఖురైష్ పై దాడికి అన్సారుల సంసిద్ధత : -* 

ఈ షైతాన్ అరపుల్ని విన్న "హజ్రత్ అబ్బాస్ (రజి) బిన్ ఉబాదా బిన్ నజ్లా"...., *"దైవప్రవక్తా! తమరికి సత్యమిచ్చి ప్రభవింపజేసిన ఆ దైవం సాక్షి! తమరు తలిస్తే రేపే "మినా" వాసులపై మా ఖడ్గాలను ఝలిపించగలం"* అని అన్నారు.

 *"లేదు! మనకు ఇంకా ఆ ఆదేశం లభించలేదు. మీరు మీ గుడారాలకు వెంటనే వెళ్ళిపొండి"* అని సెలవిచ్చారు దైవప్రవక్త (సల్లం).

ఆ తరువాత అందరూ ఎవరికీ తెలియకుండా వెళ్ళి గుడారాల్లో నిద్రపోయారు. చివరికి తెల్లారిపోయింది.

 *యస్రిబ్ స్థితిమంతుల ఎదుట ఖురైష్ నిరసన : -* 

ఈ వార్త ఖురైష్ చెవుల్లో పడిపోయింది. వారు మనస్తాపానికి గురిఅయి తల్లడిల్లనారంభించారు. ఇలాంటి ప్రమాణం వల్ల బయల్పడే పరిణామాలు వారి ధన ప్రాణాలను సైతం హరించగలవు అని వారికి బాగా తెలియడమే దానికి కారణం, తెల్లవారగానే వారి నాయకులు, పెద్దలు అందరూ కలసి ఓ పెద్ద బృందంగా ఏర్పడి ఈ ప్రమాణానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడానికిగాను యస్రిబ్ (మదీనా వాసుల) గుడారాల వైపునకు బయలుదేరారు. అక్కడకు వెళ్ళి వారు ఇలా నిరసన మొదలెట్టారు.

 *"ఖజ్రజ్ ప్రజలారా! మీరు మా ఈ మనిషి ముహమ్మద్ (సల్లం)ను మా నడుమ నుంచి తప్పించి వెంట తీసుకువెళ్ళడానికి వచ్చారన్న విషయం మాకు తెలిసింది. మాతో యుద్ధం చేయడానికి ఇతని చేతి మీదుగా ప్రమాణం కూడా చేశారు. అరబ్బులలోని ఏ తెగతోనైనా మేము యుద్ధం చేయడానికి వెనుకాడం. కాని మీతో యుద్ధం చేయడం అంటే మాకు అంత ఇష్టంగా లేదు."* అని అన్నారు.

ఖజ్రజ్ కు చెందిన బహుదైవారాధకులకు ఈ ప్రమాణం విషయం బొత్తిగా తెలియదు. ఎందుకంటే ఈ ప్రమాణం రహస్యంగా, రాత్రికిరాత్రే చీకటిలో జరిగిన ప్రమాణం కాబట్టి ఈ బహుదైవారాధకులు "అల్లాహ్"పై ఒట్టువేసుకుంటూ అలాంటిది ఏదీ జరగలేదని, వారికి ఈ విషయం బొత్తిగా తెలియదని నమ్మబలికారు.

చివరికి ఈ ఖురైష్ ప్రతినిధి బృందం "అబ్దుల్లా బిన్ ఉబై ఇబ్నె సలూల్" దగ్గరికి వెళ్ళింది. అతనూ, *"ఇది పూర్తిగా అబద్దం. అలా జరగనేలేదు. అసలు జరగడానికి కూడా వీల్లేదు. నా జాతి నన్ను కాదని అలా చేయనేచేయదు. నేను యస్రిబ్ (మదీనా)లో ఉన్నా, నన్ను సంప్రదించకుండా నా జాతి అలా చేయజాలదు."* అని చెప్పాడు.

ఇక ముస్లిముల విషయానికి వస్తే, వారు ఒకరిని ఒకరు దొంగ చూపులతో చూసుకుంటూ ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయారు. వారిలో ఏ ఒక్కడు కూడా అవును అని అనలేదు. చివరికి ఖురైష్ నాయకులు, ఈ యస్రిబ్ బహుదైవారాధకులు చెప్పేది సరైనది అని నమ్మి తిరిగి వెళ్ళిపోయారు.

 *నిజం తెలిసిన తరువాత ప్రమాణం చేసిన వారిని వెన్నాడడం : -*

ఈ వార్త అసత్యం అనే ధోరణితోనే మక్కాకు చెందిన వారు వెనక్కు మళ్ళిపోయారు. కాని ఈ విషయంలో వారు నిజాన్ని తెలుసుకొనే ప్రయత్నం మానలేదు. చివరికి ఈ వార్త నిజమే అన్న విషయం వారికి తెలిసిపోయింది. ప్రమాణం జరిగిందని వారికి నమ్మకంగా తెలిసిపోయింది. అయితే ఈ వార్త తెలిసిందెప్పుడు? "హజ్" యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయిన తరువాత. అందుకని వారు గుర్రపు రౌతుల్ని వేగంగా యస్రిబ్ వారికి పట్టుకోవడానికి పరుగెత్తించారు. అప్పటికే ఆ అవకాశం చేజారిపోయింది. అయితే వారు "సఅద్ బిన్ ఉబాదా" మరియు "మున్జిర్ బిన్ అమ్రూ"లను కనుగొనగలిగారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని "మున్జిర్", వారి బారినపడకుండా వేగంగా పారిపోయి తప్పించుకున్నారు. "సఅద్ బిన్ ఉబాదా" మాత్రం పట్టుబడ్డారు. ఆయన చేతుల్ని వెనక్కు విరిచి ఒంటె అంబారీకి వేసికట్టి చితకబాదుతూ, తల వెంట్రుకల్ని పీకుతూ మక్కాకు తీసుకువచ్చారు. కాని అక్కడ "ముత్'యిమ్ బిన్ అద్దీ", "హారీస్ బిన్ హరబ్ బిన్ ఉమయ్యా"లు కలసి వారిని విడిపించారు. ఎందుకంటే వారిరువురి వ్యాపార బిడారాలు "సఅద్ (రజి)" గారి సంరక్షణలో మదీనా నుండి బయటకు వెళ్ళేవి.

ఇటు అన్సార్ (ముస్లిములు), మక్కాపై దాడిచేసి వారిని రక్షించుకురావాలనే మంతనాలు చేస్తుండగా, వారిద్దరు అగుపడగా ఆ ప్రయత్నాన్ని మానుకోవడం జరిగింది. అందరూ కలసి క్షేమంగా మదీనా చేరారు.

 *↑  ↑ ↑  ↑ ↑ ↑  ↑ ↑ ↑ ↑* 

 *ఇది అఖబాకు చెందిన రెండవ బైత్ (ప్రమాణం). దీన్ని "బైతె అఖబయె కుబ్రా" అని కూడా పిలుస్తారు.* పరస్పర అవగాహన, పరస్పర ప్రేమ, చెల్లాచెదురైవున్న ముస్లిముల నడుమ పరస్పర సహాయ సహకారాలు, పరస్పర నమ్మకం, ప్రాణాలొడ్డి ఒకరినొకరు కాపాడుకునే భావన మరియు శౌర్యప్రతాపాల వాతావరణంలో జరిగిన బైత్ (ప్రమాణం) ఇది. కాబట్టి యస్రిబ్ ముస్లిముల హృదయాల్లో మక్కాలో కష్టాలు అనుభవిస్తున్న తమ బలహీన ముస్లిముల ఎడల ప్రేమ జనించడం సహజం. వారి సోదరులను ఆదుకోవాలనే తపన, వారిపై అత్యాచారాలు సాగించే ముష్కరుల ఎడల విద్వేషం పెల్లుబుకుతున్నాయి వారిలో. వారి హృదయాలు తాము ఇదివరకు చూడనటువంటి ధార్మిక సోదరుల ఎడల ప్రేమతో నిండిపోయాయి.

ఈ భావోద్రేకాలు తాత్కాలికమైన భావోద్రేకాలు కావు, కాలక్రమేణ మటుమాయమైపోవడానికి. వీటికి మూలం "అల్లాహ్"పై వారి నమ్మకం, ప్రవక్త ఎడల వారి గౌరవం మరియు దైవగ్రంథం ఎడల వారి అచంచల విశ్వాసాలు. అంటే జులుము, హింస, అత్యాచారాలు జరిపే అతి పెద్ద శక్తి ముందు కూడా తలవంచడానికి సిద్ధంగా లేని విశ్వాసమది.

 *హిజ్రత్ కు ఉపక్రమించిన ప్రథమ బృందాలు In Sha Allah రేపటి భాగములో....;*

No comments:

Post a Comment