171

🕌🕌🕌       బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్        🕌🕌🕌

🛐🛐   అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు   🛐🛐
🤚🏻✋🏻     అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను      🤚🏻✋🏻

 ~~~~~ 

🕋🕋🕋             ఇస్లాం చరిత్ర - 171            🕋🕋🕋
 ■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■

*ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 86* 

                        *ప్రథమ బైతె అఖబా* 

దైవదౌత్య శకం 11వ సంవత్సరం "హజ్" కాలంలో యస్రిబ్ (మదీనా)కు చెందిన ఆరుగురు "ఇస్లాం" స్వీకరించిన విషయం మనం ఇదివరకే చదివాము (భాగము 164లో). అదేకాక, వీరు దైవప్రవక్త (సల్లం)తో, తమ జాతిలోనికి వెళ్ళి ఆయన (సల్లం) గారి దైవదౌత్య గురించి ప్రచారం చేస్తామని మాట ఇచ్చారన్న విషయం మనకు తెలిసిందే.

ఫలితంగా మరుసటి సంవత్సరం "హజ్" కాలంలో (అంటే జిల్'హజ్జా దైవదౌత్య శకం 12వ సంవత్సరం, క్రీ.శ. జులై నెల 621వ సంవత్సరం) 12 గురు వచ్చి మహాప్రవక్త (సల్లం)ను కలిశారు. వారిలో "హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా బిన్ రిమాబ్" తప్ప తక్కిన అయిదుగురు గత సంవత్సరం వచ్చినవారే. వారు కాకుండా మిగతా ఏడుగురు క్రొత్తవారు. వారి పేర్లు ఇవి....; ↓

1. ముఆజ్ బిన్ హారిస్ ఇబ్నె అఫ్రా - బనూ నజ్జార్ కుటుంబం

2. జక్వాన్ బిన్ అబ్దుల్ ఖైస్ - బనీ జురైఖ్ కుటుంబం

3. ఉబాదా బిన్ సామత్ - బనీ గనమ్ కుటుంబం

4. యజీద్ బిన్ సాలిబా - బనీ గనమ్ మిత్రపక్షం

5. అబ్బాస్ బిన్ ఉబాదా బిన్ నజ్లా - బనీ సాలిమ్ కుటుంబం

6. అబుల్ హైసిమ్ బిన్ తయ్యహాన్ - బనీ అబ్దుల్ అష్వల్ కుటుంబం

7. అవీమ్ బిన్ సాయిదా - బనీ అమ్రూ బిన్ ఔఫ్ కుటుంబం. 

వీరిలో చివరి ఇద్దరు "అవస్" తెగకు చెందిన వారు. తక్కిన వారంతా "ఖజ్రజ్" తెగవారే. వీరంతా కలసి దైవప్రవక్త (సల్లం)ను "మినా"లో ఉన్న "అఖబా" వద్ద కలిశారు. ఆయన (సల్లం) చేతిపై కొన్ని విషయాలను గురించి ప్రమాణం చేశారు. హుదైబియా ఒప్పందం తరువాత మక్కా విజయం సందర్భంగా మహిళలతో ప్రమాణం చేసిన విషయాలే అవి. 

"అఖబా" ప్రమాణానికి సంబంధించిన వివరాలు "సహీ బుఖారీ" గ్రంథంలో "హజ్రత్ ఉబాదా బిన్ సామత్ (రజి)" ఈ క్రింద ఉల్లేఖించినట్లుగా ఉన్నాయి....; ↓

 *"రండి, ఈ మాటలపై నాతో ప్రమాణం చెయ్యండి! "అల్లాహ్"తో పాటు మరెవ్వరిని సహవర్తులుగా నిలబెట్టము అని, దొంగతనం జోలికి పోము అని, వ్యభిచారం చెయ్యము అని, మీ సంతానాన్ని హత్య చెయ్యము, అపవాదులు వేయమూ అని, సదాచార సంబంధమైన నా ఏ ఆదేశాన్నీ ధిక్కరించబోమని ప్రతిజ్ఞ చెయ్యండి. ఎవరయితే ఈ మాటలను శిరసావహిస్తాడో "అల్లాహ్" అతనికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరెవరయితే ఇందులో దేనికి పాల్పడినా అతనికి "అల్లాహ్" ఈ ప్రపంచంలో శిక్షిస్తే అది అతనికి పరిహారమవుతుంది. "అల్లాహ్" అతను చేసిన దుష్కర్మను బహిర్గతం చేయకపోతే అది ఆయన ఇష్టం. అతణ్ణి ఆయన అనుకుంటే క్షమించగలడు లేకపోతే శిక్షించనూగలడు."* అని అనగా, మేమంతా ఆయన చేతిపై ప్రమాణం (బైత్) చేశాము.

 *దీనినే "అఖబా శపథం - 1" అంటారు.* 

 *మదీనాకు ఇస్లాం దౌత్య ప్రతినిధి : -* 

బైత్ పూర్తి అయింది. "హజ్" ఆరాధన కూడా పరిసమాప్తమైంది. మహాప్రవక్త (సల్లం) వారి వెంట యస్రిబ్ (మదీనా)కు, అక్కడి ముస్లిములకు ఇస్లామీయ బోధనలు గరపడానికి, ధర్మౌన్నత్యాన్ని చాటి చెప్పడానికి మరియు అప్పటి వరకు బహుదైవారాధనలోనే కొట్టుమిట్టాడుతున్న వారిలో "ఇస్లాం" ప్రచారం చేయడానికిగాను ఒక దౌత్య ప్రతినిధిని పంపించారు. ఆ దౌత్యం కోసం ప్రప్రథమంగా "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించిన వ్యక్తుల్లో ఓ యువకుడు "ముస్అబ్ బిన్ ఉమైర్ అబ్దరీ (రజి)"ను ఎన్నుకోవడం జరిగింది.

 *కార్యంలో ఘన విజయం : -* 

"హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)" మదీనా చేరి "హజ్రత్ అసద్ బిన్ జురారా" ఇంట్లో బస చేశారు. వారిద్దరు కలసి యస్రిబ్ ప్రజల్లో ఉత్సాహంగా "ఇస్లాం" ధర్మాన్ని ప్రచారం చేశారు. ఆయనకు "ముక్రీ" అనే బిరుదునిచ్చారు మదీనా ప్రజలు. _("ముక్రీ" అంటే చదువు చెప్పేవాడని అర్థం. ఆ కాలంలో ఉపాధ్యాయుణ్ణి "ముక్రీ" అని పిలిచేవారు)._ 

ధర్మప్రచార విజయానికి సంబంధించిన ఓ సంఘటనను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం.

ఓ రోజు "హజ్రత్ అసద్ బిన్ జురారా (రజి)"ను వెంటబెట్టుకొని "ముస్అబ్ (రజి)", "బనీ అష్హల్" మరియు "బనీ జఫర్" ఉండే వాడకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఓ తోటలో "మర్క్" అనే పేరుగల బావి వద్ద ఇద్దరూ కలసి కూర్చున్నారు. వారి చుట్టూ కొందరు ముస్లిములు కూడా కూర్చుని ఉన్నారు.

ఈ "ఇస్లాం ధర్మ ప్రచారం" గురించి, "బనీ అష్హల్"కు చెందిన "సఅద్ బిన్ ముఆజ్ (రజి)", "హజ్రత్ ఉసైద్ (రజి) బిన్ హుజెర్" అనే ఇద్దరు సర్దారులకు తెలిసింది. (ఈ సర్దారులు అప్పటికి ఇంకా "ఇస్లాం" స్వీకరించకుండా బహుదైవారాధకులుగానే ఉన్నారు.)

అపుడు "సఅద్ (రజి)", "ఉసైద్ (రజి)"తో....; *"మన బలహీనులైన వాళ్ళను మాటలతో మోసం చేస్తున్న ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి గద్దించు, మన వాడకు రావద్దని వారించు, అసద్! నీవు నా పిన్నమ్మ కుమారుడనే నమ్మకంతో అక్కడికి పంపిస్తున్నాను సుమా! లేకపోతే నేను వెళ్ళి వారిని గద్దించి తరిమేసేవాణ్ణి."* అని చెప్పి పంపించాడు.

ఉసైద్ (రజి) తన బరిశెను చేతపట్టుకుని ఆ ఇద్దరి వద్దకు వెళ్ళారు. హజ్రత్ అసద్ (రజి) దూరం నుండే ఉసైద్ (రజి)ను చూసి, ముస్అబ్ (రజి)తో....; ↓

 *అసద్ (రజి) : -* ముస్అబ్! మీ వద్దకు అతని జాతికే సర్దారు అయిన ఒక వ్యక్తి వస్తున్నాడు. అతని ముందు "అల్లాహ్" సందేశాన్ని దాచకుండా ఉంచెయ్యండి.

 *ముస్అబ్ (రజి) : -* అతను వచ్చి కూర్చోనీయండి! మాట్లాడతాను.

"ఉసైద్ (రజి)" అక్కడికి వచ్చి వారిద్దరి ముందు నిలబడి దురుసుగా మాట్లాడనారంభించారు.

 *ఉసైద్ (రజి) : -* మీరు మా వాడకు ఎందుకు వచ్చినట్లు? మా బలహీనులను మోసపుచ్చడానికా? గుర్తుంచుకోండి! మీ ప్రాణాలు మీకు తీపి అయితే వీరికి దూరంగా ఉండండి. (అని గద్దించారు)

 *ముస్అబ్ (రజి) : -* మీరు కాసేపు ఎందుకు కూర్చోరు? మేము చెప్పేదేమిటో వినరా? మీకు నచ్చితేనే మా మాటను స్వీకరించండి. నచ్చదా! వదిలేద్దురుగాని.

 *ఉసైద్ (రజి) : -* మాటలు మాత్రం న్యాయంగానే చెబుతున్నారు.

అంటూ తన బరిశెను భూమిలో దిగగొట్టి కూర్చుండిపోయారు.

అప్పుడు "ముస్అబ్ (రజి)", "ఇస్లాం" ధర్మం గురించి ప్రారంభిస్తూ మొదట "ఖుర్ఆన్" పారాయణం చేశారు. "ఖుర్ఆన్" పారాయణం వింటున్న "ఉసైద్ (రజి)" ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఆయన (రజి) ముఖంపై వారిద్దరూ "ఇస్లాం" ఛాయలను కనుగొన్నారు.

ఉసైద్ (రజి) నోరు తెరుస్తూ....;

 *ఉసైద్ (రజి) : -* ఇవి ఎంతో మహత్తరమైన వచనాలు. మీరు ఎవరినైనా ఈ ధర్మంలోనికి చేర్చే ముందు ఏం చేస్తారు?

 *"మీరు లేచి స్నానం చేయండి. మీ వస్త్రాలను శుభ్రపర్చుకోండి. ఆ తరువాత సత్యాన్ని ప్రకటించే వాక్కులు పలికి రెండు రకాతుల నమాజు చేయండి చాలు"* అనగా, ఉసైద్ (రజి) లేచి స్నానం చేశారు. వస్త్రాలను శుభ్ర పరచుకున్నారు. ఆ తరువాత "షహాదత్" కలిమాను పఠించి రెండు రకాతుల నమాజు చేశారు. ఆ తరువాత....,

 *ఉసైద్ (రజి) : -* నా వెనుక మరో వ్యక్తి ఉన్నాడు. అతను గనక మీ మార్గాన్ని అనుసరిస్తే అతని జాతిలోని ఏ వ్యక్తీ కాదనడు. నేను ఆయన్ను మీ దగ్గరకు పంపిస్తాను.

ఉసైద్ (రజి), ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయారు. (ఆ వ్యక్తి "హజ్రత్ సఅద్ (రజి) బిన్ ముఆజ్").

"హజ్రత్ ఉసైద్ (రజి)" తన బరిశెను చేతపట్టుకొని "హజ్రత్ సఅద్ (రజి)" వద్దకు వెళ్ళారు. ఆయన తన జాతి ప్రజలతో సమావేశమై ఉన్నారక్కడ. 

హజ్రత్ ఉసైద్ (రజి)ను చూసి, *"దైవసాక్షి! ఇతని ముఖం, మీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఉన్న ముఖంలా లేదు."* అని అక్కడ సమావేశమైన ప్రజలు అనుకోసాగారు.

"హజ్రత్ ఉసైద్ (రజి)" ఆ సమావేశం ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు, "సఅద్ (రజి)" ఇలా అడిగారు....; ↓

 *సఅద్ (రజి) : -* ఉసైద్! నీవు ఏమి చేసి వచ్చావు?

 *ఉసైద్ (రజి) : -* వారిద్దరితో మాట్లాడినప్పుడు ఆక్షేపించదగిన పలుకులేవీ నేను వినలేదు. నేనైతే వారిని అలా చెయ్యొద్దని మందలించి వచ్చాను. వారు మాత్రం నా మాటను ఖాతరు చేస్తూ, నేను చెప్పిందే చేస్తామని ఒప్పుకున్నారు.
         ఆఁ! ఇంకొక విషయం, "బనీ హారిసా" వారు "అసద్ బిన్ జురారా (రజి)"ను హతమార్చడానికి బయలుదేరారని విన్నాను. అతను మీ పిన్నమ్మ కుమారుడు అన్న విషయమూ వారికి తెలుసు. కాబట్టి మీతో చేసిన ఒప్పందాన్ని త్రుంచి వేయాలని వారనుకుంటున్నారు.

ఇది విన్నంతనే "సఅద్ (రజి)" క్రోధం తార స్థాయికి చేరింది. తన బరిశెను చేతపట్టుకొని ఆ ఇద్దరి దగ్గరకు పరుగున వెళ్ళారు. ఈ ఇద్దరు తీరిగ్గా అక్కడే కూర్చుని ఇదంతా గమనిస్తున్నారు. తమ మాటల్ని వినేందుకు గాను "ఉసైద్ (రజి)", "సఅద్ (రజి)"ను పంపిస్తున్నాడన్నది కూడా వారికి అర్థం అయిపోయింది.

"సఅద్ (రజి)" ఆ ఇద్దరి దగ్గరకు వెళ్ళి నిలబడి నోటికి వచ్చినట్లు తిట్టారు. ఆ తరువాత "అసద్ బిన్ జురారా (రజి)"ను ఉద్దేశించి....,

 *సఅద్ (రజి) : -* దైవసాక్షి! ఓ అబూ ఉమామా! నాకు, నీకు నడుమ బంధుత్వ సంబంధమే లేకపోతే, నీవు మా వాడలోనికి వచ్చి ఇలా ప్రవర్తించే అనుమతే ఉండకపోయేది. (అని గద్దించారు)

ఇటు "అసద్ (రజి)", "ముస్అబ్ (రజి)"తో ముందే చెప్పి ఉన్నారు, *"మీ దగ్గరకి ఓ సర్దారు వస్తున్నాడని, అతని వెనకాల పూర్తి జాతే ఉంది. ఇతను గనక మీ మాటను స్వీకరిస్తే వారిలో ఒక్కడు కూడా బయటకు వెళ్ళేవాడు లేడు."* అన్నదే ఆ విషయం.

అపుడు "హజ్రత్ ముస్అబ్ (రజి)", "సఅద్ (రజి)"తో....; ↓

 *ముస్అబ్ (రజి) : -* మీరెందుకు కాసేపు కూర్చోరు. మేము చెప్పే మాటల్లో ఏదైనా మీకు నచ్చితే స్వీకరించండి. నచ్చకపోతే మానుకోవచ్చు కదా? మీకు నచ్చకపోతే మేము ఆ మాటనే ఎత్తము.

 *సఅద్ (రజి) : -* ఔను, మీరు చెప్పేది కూడా న్యాయమైన మాటే, కానీయండి.

అని అంటూ తన బరిశెను భూమిలో గ్రుచ్చి కూర్చుండిపోయారు వారికి ఎదురుగా.

"హజ్రత్ ముస్అబ్ (రజి)" ముందు "ఇస్లాం" బోధనల్ని ఉంచి, "దివ్యఖుర్ఆన్" పారాయణాన్ని ప్రారంభించారు. "సఅద్ (రజి)" నోరు తెరువక పూర్వమే ఆయన ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఆయన ముఖం విచ్చుకునే తీరు చూస్తూనే ఆయన "ఇస్లాం" ఒడిలో ఒరిగిపోయారనే విషయం వారిద్దరు అప్పటికే గమనించారు. ఆ తరువాత ఆయన నోరు తెరచి....;

 *సఅద్ (రజి) : -* మీరు ఇస్లాం ధర్మం స్వీకరించేటప్పుడు ఏం చేస్తారు?

 *"మీరు ముందు స్నానం చెయ్యండి. మీ వస్త్రాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ తరువాత "షహాదత్" కలిమాను పఠించి రెండు రకాతుల నమాజు చేయండి చాలు"* అన్నారు.

"హజ్రత్ సఅద్ (రజి)" అలానే చేశారు.

ఆ తరువాత, తన బరిశెను చేతబట్టుకొని తన జాతి కూర్చుని ఉన్న స్థానానికి వచ్చారు. చూడగానే అక్కడి వారు, *"దైవసాక్షి! వెళ్ళేటప్పుడు ఉన్న ముఖంలా లేదే ఈయన ముఖం!"* అని అనుకోసాగారు. "హజ్రత్ సఅద్ (రజి)" వారి వద్దకు వచ్చి నిలబడి....;

 *సఅద్ (రజి) : -* ఓ బనూ అష్హల్! మీ నడుమ నా హోదా ఏమిటో మీకు తెలుసా?

 *"తెలియకేమి? మీరు మా సర్దారు."* అని అన్నారు "బనూ అష్హల్" జాతివారు.

 *సఅద్ (రజి) : -* అయితే వినండి! మీ పురుషులు, మీ స్త్రీలు అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను విశ్వసించనంతమట్టుకు మీతో మాట్లాడ్డం నాకు హరాం (నిషిద్ధం).

ఆయన పలికిన ఈ మాటల ప్రభావం అందరిపైనా పడింది. సాయంత్రం అయ్యేకల్లా "ఉసైరమ్" అనే ఒకే వ్యక్తి తప్ప ఆ తెగలోని స్త్రీ పురుషులంతా "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించారు.

ఉసైరమ్, ఇస్లాం ధర్మ స్వీకారం ఉహద్ యుద్ధం వరకు జరుగలేదు. ఉహద్ యుద్ధం రోజున్నే ఆయన "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించి యుద్ధంలో పోరాడుతూ అమరగతినొందారు. ఆయన ఇంకా అల్లాహ్ సమక్షంలో ఒక్క సజ్దా కూడా చేయలేదు అప్పటికి. దైవప్రవక్త (సల్లం), ఈయన విషయంలో సెలవిచ్చిన మాటలు ఇవి:

 *"ఈయన ఆచరణ ఎంతో తక్కువే అయినా పొందిన ప్రతిఫలం మాత్రం అధికం."* 

"హజ్రత్ ముస్అబ్ (రజి)", "హజ్రత్ అసద్ (రజి) బిన్ జురారా" ఇంట ఉంటూనే "ఇస్లాం" ధర్మప్రచారం చేస్తున్నారు. చివరకు, స్త్రీ పురుషులు కొందరైనా ముస్లిములుగా మారకుండా ఉన్న ఏ ఇల్లూ మిగల్లేదు. కేవలం మిగిలిపోయింది "ఉమయ్యా బిన్ జైద్" మరియు "ఖత్మా బిన్ వాయిల్" ఇళ్ళు మాత్రమే. ప్రఖ్యాత కవి "ఖైస్ బిన్ అస్లత్" వారికి చెందిన వ్యక్తే. వీరు ఆయన మాటలనే నమ్మేవారు. వీరిని ఈ కవి "అహ్'జాబ్" యుద్ధం (కందకం యుద్ధం, హిజ్రీ శకం 5) వరకు "ఇస్లాం" ధర్మం స్వీకరించకుండా ఆపాడు.

మొత్తానికి వచ్చే సంవత్సరం "హజ్" కాలం, (దైవదౌత్యపు 13వ సంవత్సరం) రాకముందే "హజ్రత్ ముస్అబ్ బిన్ ఉమైర్ (రజి)" విజయ శుభవార్తలతో దైవప్రవక్త (సల్లం) సన్నిధికి మక్కాకు వచ్చారు. యస్రిబ్ తెగల పరిస్థితులు, వారి యుద్ధ కౌశలం, రక్షణ పాటవం మరియు వారిలోని సదాచార సంపన్నతకు సంబంధించిన వివరాలు విడమర్చి చెప్పారు.

 *In Shaa Allah రేపటి భాగములో "ద్వితీయ బైతె అఖబా" గురించి....;*

No comments:

Post a Comment