167

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 167* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 82* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

            *ఇస్రా మరియు మేరాజ్ : - 3* 

"హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" మాటలు విన్న తరువాత దైవప్రవక్త (సల్లం)కు ధైర్యం వచ్చి ముందుకుసాగారు. రఫ్ రఫ్ అనే మాధ్యమం ద్వారా కాంతిని మించిన వేగంతో పురోగమించారు. కాస్సేపటికి అటునుంచి *"అస్సలాము అలైకుం; ముహమ్మద్! నేనే విశ్వప్రభువును"* అనే గంభీరమైన వాణి వినిపించింది. 

దైవప్రవక్త (సల్లం) మనస్సు పరమానందంతో పరవశించిపోయింది. *"నా దైవం, నా ప్రభువు నాతో సంభాషిస్తున్నాడు. నా ప్రభువు సాన్నిధ్యం నేడు నాకు ప్రాప్తమవుతోంది. మహాప్రసాదం, ఓహ్, నేనెంత అదృష్టవంతుడ్ని!"* అనిర్వచనీయమయిన అనుభూతితో ఆయన (సల్లం) అప్రయత్నంగా సాష్టాంగప్రణామం చేశారు. అదే స్థితిలో విశ్వప్రభువును తనివితీరా స్తుతించారు.

 *"ముహమ్మద్! మా కోసం ఏం కానుక తెచ్చావు?"* అటునుంచి మరోసారి గంభీరమైన వాణి వినిపించింది.

 *"ప్రభూ! ఈ వినమ్రుడు తన వైపు నుండి, తన అనుచర సముదాయం వైపు నుండి సమస్త విధాల శారీరక, ఆర్థిక ఆరాధనలు విశ్వప్రభువుకు సమర్పించుకుంటున్నాడు."* అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం). 

 *"మేము వాటిని స్వీకరిస్తున్నాం. ఇక నీకేం కావాలో కోరుకో"* (అంటూ) దైవవాణి.

 *"ప్రభూ! నీ అపార అనుగ్రహంతో నా ఉమ్మత్ (అనుచర సముదాయం)లోని పాపుల్ని క్షమించు. నీవే అందరికంటే గొప్ప క్షమాశీలివి, అనుగ్రహమూర్తివి."* అంటూ దైవప్రవక్త (సల్లం) రెండు చేతులు జోడించారు అత్యంత వినయంగా. 

 *"నీ అనుచరసముదాయంలో చిత్తశుద్ధితో సద్వచనం (కలిమెతయ్యిబా) స్వీకరించిన వారందర్నీ మేము క్షమిస్తాము. అంతేకాదు, అంతిమదినాన నీ అనుచర సముదాయంలోని అనేకమంది దాసుల విషయంలో కూడా నీ సిఫారసు అంగీకరిస్తాము. బహుదైవారాధనా (షిర్క్) పాపం తప్ప నేను తలచుకుంటే ఇతర పాపాలన్నీ క్షమిస్తాను.* 

 *ఎవరైనా ఒక పుణ్యకార్యం చేయడానికి సంకల్పించుకుంటే, అతని కర్మల చిట్టాలో ఒక పుణ్యం రాయబడుతుంది. అతనా పుణ్యకార్యం క్రియాత్మకంగా చేస్తే పది పుణ్యాలు రాయబడతాయి. దీనికి భిన్నంగా ఎవరైనా ఒక పాపకార్యం చేయ సంకల్పిస్తే, అది అతని కర్మల చిట్టాలో రాయడం జరగదు. ఆ పాపకార్యాన్ని క్రియాత్మకంగా చేస్తే దానికి ఒక పాపం మాత్రమే అతని కర్మల చిట్టాలో రాయబడుతుంది.* 

 *పోతే మరో విషయం విను. ప్రపంచ జీవితంలో, మరణానంతర జీవితంలో కూడా సౌఫల్యం పొందటానికి మేము నీకు, నీ అనుచర సముదాయానికి ఒక అపూర్వ కానుక ప్రసాదిస్తున్నాం. భూమ్యాకాశాలను సృష్టించినప్పుడే నీకు, నీ అనుచర సముదాయానికి రోజుకు యాభైసార్లు నమాజు చేయాలని విధిగా చేశాము. కనుక వెళ్ళి నీవు కూడా చేయి; నీ ఉమ్మత్ చేత కూడా చేయించు."* అన్నాడు విశ్వప్రభువు.

దైవప్రవక్త (సల్లం) మరోసారి దైవాన్ని స్తుతించి, సెలవు తీసుకుని వెనక్కి మరిలారు. ఆరవ ఆకాశంలోకి వచ్చేటప్పటికి "ప్రవక్త మూసా (అలైహి)" తారసపడి ఇలా అడిగారు. ↓

 *మూసా (అలైహి) : -* సోదరా! చెప్పు, విశ్వప్రభువు నుండి ఏమేమి ఆజ్ఞలు లభించాయి?

 *ముహమ్మద్ (సల్లం) : -* రోజుకు యాభై సార్లు నమాజు చేయాలని ఆజ్ఞ అయింది.

 *మూసా (అలైహి) : -* యాభై సార్లే! రోజుకు యాభైసార్లు నమాజ్ చేయడం సాధ్యమేనా? ఇస్రాయీల్ సంతతి వారు రోజుకు రెండుసార్లు కూడా చేయలేకపోయారు. నీ అనుచర సముదాయం యాభై సార్లు ఎలా చేస్తుంది? వెనక్కి వెళ్ళి కొన్ని పర్యాయాలు తగ్గించమని దైవాన్ని అడుగు. (అని అన్నారు తనకున్న అనుభవాన్ని తలచుకుంటూ)

అంతిమ దైవప్రవక్త (సల్లం) మళ్ళీ విశ్వప్రభువు దగ్గరకు పోయారు. ఆయన ముందు సాష్టాంగపడి కొన్ని నమాజులు తగ్గించమని వేడుకున్నారు. "అల్లాహ్" సగం నమాజులు (అంటే ఇరవై అయిదు పర్యాయాలకు) తగ్గించాడు.

మహనీయ ముహమ్మద్ (సల్లం) సంతోషంతో "మూసా (అలైహి)" దగ్గరకు వచ్చి చెప్పారు. కాని "హజ్రత్ మూసా (అలైహి)" ఈ సంగతి విని సంతోషించలేదు. *"నీ అనుచరులు అన్ని నమాజులు కూడా చేయలేరు. మళ్ళీ పోయి ఇంకా తగ్గించమని అడుగు"* అన్నారు ఆయన.

అంతిమ దైవప్రవక్త (సల్లం) మళ్ళీపోయి అడిగితే, "అల్లాహ్" మరికొన్ని నమాజులు తగ్గించాడు. అయితే "మూసా (అలైహి)" తృప్తిచెందక, *"మళ్ళీ పోయిరా. నీ అనుచరులు నమాజ్ అన్ని సార్లు కూడా చేయలేరు"* అన్నారు.

ఆయన చెప్పినట్లు మహనీయ ముహమ్మద్ (సల్లం) మరోసారి వెళ్ళి తగ్గించమని విశ్వప్రభువుని అడిగారు. విశ్వప్రభువు ఈసారి మరికొన్ని నమాజులు తగ్గించి, ఐదు (వేళల) నమాజులు మాత్రమే ఖాయపరచి ఇలా అన్నాడు. ↓

 *"నీకు, నీ అనుచర సముదాయానికి ఈ ఐదు నమాజులు విధిగా చేశాము. "ఎవరైనా ఒక సత్కార్యం చేస్తే దానికి పదిరెట్ల పుణ్యం అతనికి ప్రసాదిస్తాము" అనే "ఖుర్ఆన్" ఆదేశం ప్రకారం, ఈ ఐదు నమాజుల పుణ్యం యాభై నమాజుల పుణ్యంతో సమానం. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు."* 

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఈ ఐదు నమాజుల ఆదేశంతో తిరిగొచ్చారు. కాని "మూసా (అలైహి)" మాత్రం, *"అన్ని నమాజులు కూడా నీ ఉమ్మత్ ప్రజలు చేయలేరు. ఇంకొకసారి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గించమని అడిగిరా"* అని చెప్పారు. దానికి ముహమ్మద్ ప్రవక్త (సల్లం), *"ఇక నావల్ల కాదు. విశ్వప్రభువును మాటిమాటికి అడగాలంటే నాకు సిగ్గేస్తుంది"* అన్నారు.

*●వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

ఆ తరువాత ఏడవ ఆకాశంపైకి ఆయన (సల్లం)ను చేర్చడం జరిగింది. మహాప్రవక్త (సల్లం), "అల్లాహ్"కు రెండు ధనువులు లేదా అంతకంటే తక్కువే దూరంలో ఉన్నారని గమనించారు. ఆ తరువాత "అల్లాహ్" తన దాసునిపై దివ్యావిష్కృతిని అవతరింపజేశాడు. ఆ దివ్యావిష్కృతిలో రోజుకు యాభై పూటల నమాజును విధిగా చేయడం జరిగింది.

ఆ తరువాత ఆయన (సల్లం) వెనక్కు మరలి "హజ్రత్ మూసా (అలైహి)" దగ్గరకు వచ్చారు.

 *"అల్లాహ్ మీకు ఇచ్చిన ఆదేశం ఏమిటి?"* అని మూసా (అలైహి), దైవప్రవక్త (సల్లం)ను అడిగారు. *"యాభై పూటల నమాజు"* అని బదులిచ్చారు దైవప్రవక్త (సల్లం). *"మీ సమాజానికి అంతశక్తి లేదు. మీ దైవం వద్దకు తిరిగి వెళ్ళి, మీ సమాజం కోసం ఇంకొన్ని నమాజుల్ని తగ్గించమని ప్రార్థించండి."* అని చెప్పారు

మహాప్రవక్త (సల్లం), "జిబ్రీల్ (అలైహి)" వైపు ఆయన సలహా పొందే దృష్టితో చూశారు. ఆ తర్వాత "జిబ్రీల్ (అలైహి)", ఆయన (అలైహి)ను "అల్లాహ్" సన్నిధికి గొనిపోయారు.

"అల్లాహ్" తన స్థానంలోనే ఉన్నాడు - కొన్ని ఉల్లేఖనాల్లో "సహీ బుఖారి" పదం ఇలాగే ఉంది - అల్లాహ్ నమాజుల్ని తగ్గించాడు.

తరువాత దైవప్రవక్త (సల్లం) క్రిందికి తీసుకొని రాబడ్డారు. "మూసా (అలైహి)"ను సమీపించినప్పుడు, *"వెళ్ళి మరికొన్ని నమాజులు తగ్గించమని దైవాన్ని వేడుకొండి."* అని చెప్పారు. ఇలా "మూసా (అలైహి)" మరియు "అల్లాహ్" నడుమ దైవప్రవక్త (సల్లం) గారి రాకపోకలు కొనసాగాయి. చివరకు ఐదుపూటల నమాజు విధిగా మిగిలిపోయాయి.

మూసా (అలైహి), *"అవి కూడా ఎక్కువే ఇంకా తగ్గించుకురండి."*  అని సలహా ఇచ్చారు. కాని మహాప్రవక్త (సల్లం), *"నాకు ఇక అక్కడికి వెళ్ళి తగ్గించమని అడగడానికి సిగ్గేస్తోంది. నేను ఈ ఐదుపూటల నమాజులకు సంతుష్ఠుణ్ణే. ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నాను."* అని ముందుకు కదిలారు.

కొంతదూరం వెళ్ళగా, *"నేను ఈ విధిని (నా దాసులపై) విధిగా చేశాను. నా దాసులకు వెసులుబాటును కలిగించాను."* అనే ఆకాశవాణి వినపడింది.●

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), దివ్యసోపానం దిగి "జిబ్రీల్ (అలైహి)" వెంట "బైతుల్ మఖ్దిస్" మస్జిద్ కు తిరిగొచ్చారు. అక్కడ మరోసారి నమాజు చేశారు. తరువాత "బుర్రాక్" మీద మక్కా తిరిగొచ్చి, "ఉమ్మెహాని" ఇంటికి చేరుకున్నారు.

*వివాదంలో పడేసిన వింత ప్రయాణం : -* 

ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో వింతలు, విశేషాలు చూసి వచ్చినా మక్కాలో ఇంకా తెల్లవారలేదు. ప్రజలు నిద్రపోతూనే ఉన్నారు. కనీసం తూర్పు దిక్కున ఉషోదయ సూచనలు కూడా కానరావడం లేదు. దైవప్రవక్త (సల్లం) ఇంట్లోకెళ్ళి మాములుగానే పడుకుని నిద్రకు ఉపక్రమించారు.

మరో జామురాత్రి గడిచింది. పురజనులు ఇంకా మేల్కొనలేదు. దైవప్రవక్త (సల్లం) "ఫజర్" నమాజు కోసం లేచారు. చెల్లెలు "ఉమ్మెహాని (రజి)" కూడా మేల్కొన్నారు. ఇద్దరూ "ఉజూ" చేసి నమాజ్ చేశారు. తరువాత దైవప్రవక్త (సల్లం) ఎన్నడూ లేనంత ఆనందోత్సాహాలతో "ఉమ్మెహాని (రజి)" వైపు తిరిగి చిరునవ్వుతో చూశారు.

 *ముహమ్మద్ (సల్లం) : -* ఉమ్మెహాని! నేను "ఇషా" నమాజ్ ఇక్కడే చేశాను, నువ్వు చూశావు కదా?

 *ఉమ్మెహాని (రజి) : -* ఔనూ, "ఇషా" నమాజ్ ఇక్కడే చేసావు.... అయితే ఏవిటి? (ఉమ్మెహాని ప్రశ్నార్థకంగా చూశారు)

 *ముహమ్మద్ (సల్లం) : -* ఆ తరువాత ఏమయిందో తెలుసా? నేను ఇక్కడ్నుంచి సరాసరి "బైతిల్ మఖ్దిస్"కు పోయాను. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడకు వచ్చి నీతో పాటు "ఫజర్" నమాజ్ చేశాను.

 *ఉమ్మెహాని (రజి) : -* ఏవిటేమిటి....? నువ్వు "బైతిల్ మఖ్దిస్"కు పోయి రెండు రకాతులు నమాజ్ చేసి, అంతలోనే ఇక్కడకు వచ్చావా? అదెలా సాధ్యం? కాస్త వివరంగా చెప్పన్నయ్యా!

 *ముహమ్మద్ (సల్లం) : -* నేను "ఇషా" నమాజ్ తర్వాత మాములుగానే పడుకున్నాను. ఆ తర్వాత కాస్సేపటికి ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది. లేచి చూద్దును కదా! "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" మన ఇంటికప్పు చీల్చి కిందకి దిగాసాగారు. నేను ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తుండిపోయా. ఈ విధంగా ఆయన ఇంటికప్పు చీల్చుకుని రావడం ఇదే మొదటిసారి. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు. ఎప్పుడొచ్చినా ముందునుంచే వచ్చేవారు. సరే, నేను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆయన నా దగ్గరకు వచ్చి, చేయి పట్టుకుని నన్ను కాబా మస్జిద్ లోని హతీమ్ దగ్గరకు తీసుకెళ్ళారు. అక్కడ నన్ను పడుకోబెట్టి నా రొమ్ము చీల్చారు. తర్వాత ఓ స్వర్ణపాత్ర తెచ్చారు. అందులో వివేకం, విశ్వాసం అనే దివ్యపదార్థాలు ఉన్నాయి. వాటిని నా గుండెలో కుమ్మరించి తిరిగి యధాతథంగా గుండెను కుట్టేశారు.
            అంతలో, ఎంతో తెల్లగా మెరిసే ఓ విచిత్ర జంతువు నా దగ్గరకు వచ్చి నిలబడింది. "జిబ్రీల్ (అలైహి)" దాని కళ్ళెం పట్టుకున్నారు. తర్వాత మేమిద్దరం దాని మీదెక్కాము. తక్షణమే అది ఆకాశంలోకి ఎగిరింది. మెరుపులా మెరిసి తృటిలో "బైతుల్ మఖ్దిస్"కు చేరుకుంది. మేమక్కడ దిగాము. నేను "అఖ్సా" మస్జిద్ లో నమాజ్ చేశాను. నా వెనుక యావన్మంది దైవప్రవక్త లు కూడా నమాజ్ చేశారు."

గగన పర్యటన గురించి దైవప్రవక్త (సల్లం) చెబుతుంటే, "ఉమ్మెహాని (రజి)" కళ్ళు పెద్దవి చేసుకొని ఎంతో ఆసక్తిగా వినసాగారు. విషయం పూర్తిగా వినగానే ఆమె హృదయంలో దైవప్రవక్త (సల్లం) పట్ల గౌరవౌన్నత్యాలు ప్రగాఢంగా చోటుచేసుకున్నాయి. కాని అంతలోనే ఈ విషయం తెలిస్తే ప్రజలు ఆయన (సల్లం)కు కీడు తలపెడ్తారేమో అనే భయం కూడా కలిగింది.

 *↑ ఇదే విషయం వేరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓*

"ఉమ్మెహాని", ప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు వరుసకు చెల్లెలు అవుతారు. ప్రవక్త (సల్లం)కు పెదనాన్న అయిన "అబూ తాలిబ్" కుమార్తె ఆమె. ప్రవక్త (సల్లం) బోధనలను తూ.చా తప్పక పాటించే ముస్లిం.

ఒక రాత్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఆమె ఇంట బస చేశారు. (ఆ రాత్రే "ఇస్రా" సంఘటన జరిగింది) మరుసటి రోజు ఉదయం తన ప్రార్థనలు ముగించుకున్న తర్వాత దైవప్రవక్త (సల్లం) ఆమెను పిలిచారు. ఆ రాత్రి జరిగిన అసాధారణ సంఘటన గురించి ఆమెకు వినిపించారు.

 *ముహమ్మద్ (సల్లం) : -* ఉమ్మెహాని! రాత్రి నేను నీతో పాటు "ఇషా" నమాజు చేశాను. కాని ఆ తర్వాత నేను జెరుసలేమ్ వెళ్ళాను. అక్కడ ప్రార్థనలు చేశాను. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు "ఫజర్" నమాజు చేయటానికి వెనుతిరిగి వచ్చాను. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి నా అనుభవాన్ని అందరికీ చెబుతాను. ఎందుకంటే "అల్లాహ్" శక్తిసామర్థ్యాల గురించి, ఆయన నాపై కురిపించిన అనుగ్రహం గురించి అందరికీ చెప్పడం నా భాద్యత.

"ఉమ్మెహాని" ధృడమైన విశ్వాసం కలిగిన మహిళ. ప్రవక్త (సల్లం) మాటలను ఆమె కొంచెం కూడా అనుమానించలేదు. కాని, ప్రజల మనస్తత్వం కూడా ఆమెకు బాగా తెలుసు. ప్రవక్త (సల్లం) బయటకు వెళ్ళి ప్రజలకు ఈ విషయం తెలిపితే వాళ్ళు ఆయన (సల్లం)ని పరిహసిస్తారని ఆమె భయపడ్డారు. అందువల్ల ఆమె ప్రవక్త (సల్లం)తో, *"అన్నయ్యా! నిన్ను కాదంటున్న వాళ్ళ వద్దకు, నీ సందేశాన్ని తిరస్కరిస్తున్న వాళ్ళ వద్దకు వెళ్ళవద్దు. ఇప్పుడు నీవు నాకు చెప్పిన విషయం వారికి చెబితే వాళ్ళు ఎగతాళి చేయవచ్చు. అబద్దాలు చెబుతున్నావని ఆరోపించవచ్చు."* అని అన్నారు.

ఆమె చెప్పిన మాటల్లో నిజం ఉందని ప్రవక్త (సల్లం) కూడా గ్రహించారు. కాని తనకు "అల్లాహ్" చూపించిన అద్భుతమైన అనుభవం గురించి ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచరాదనుకున్నారు. ఆయన (సల్లం), "అల్లాహ్" తరఫున పూర్తి మానవాళి కొరకు పంపబడిన ప్రవక్త. అందువల్ల "ఇస్రా" వంటి అద్భుతమైన అనుభవం గురించి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ ఆలోచనలతో ఆయన (సల్లం), "ఉమ్మెహాని" ఇంటి నుంచి బయటకు వచ్చి తిన్నగా కాబా గృహానికి వెళ్ళారు.

 *దైవప్రవక్త (సల్లం), "కాబా" గృహం వద్దకు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలను In Shaa Allah రేపటి భాగములో తెలుసుకుందాం.* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment