🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 165* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 80* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ఇస్రా మరియు మేరాజ్ : - 1*
దైవప్రవక్త (సల్లం)గారి సందేశ ప్రచారం, ఇటు విజయం మరియు అటు ముస్లిములపై జరుగుతున్న హింసా దౌర్జన్యాల నడుమ నలుగుతూనే ఉంది. సుదూర తీరాల్లో దిగ్మండలంపై ఆశాకిరణాల మసక వెలుగు కానరావడం మొదలైంది. ఈ సమయంలోనే "ఇస్రా మరియు మేరాజ్" సంఘటన సంభవించింది. ఈ "మేరాజ్" సంఘటన ఎప్పుడు జరిగింది? అనే విషయంలో సీరత్ చరిత్రకారుల కథనాలు కొంత భిన్నంగా ఉన్నాయి.
1. దైవప్రవక్త (సల్లం)కు దైవదౌత్యం ఒసగబడిన సంవత్సరమే ఈ మేరాజ్ సంభవించింది. (ఇది తిబ్రీ కథనం)
2. దైవదౌత్యపు అయిదు సంవత్సరాల తరువాత మేరాజ్ సంభవించింది. (ఈ కథనాన్ని ఇమామె నూవీ, ఇమామె ఖుర్తిబీ ఇద్దరు కలసి సరైనదిగా నిర్ణయించారు)
3. దైవదౌత్యం లభించిన పదవ సంవత్సరం రజబ్ 27న సంభవించింది. (ఇది అల్లామా మన్సూర్ పూరి అభిప్రాయం)
4. హిజ్రత్ కంటే పదహారు మాసాల ముందు అంటే దైవదౌత్యపు పన్నెండో సంవత్సరం రమజాన్ నెలలో.
5. హిజ్రత్ కు పదునాలుగు నెలలకు ముందు అంటే దైవదౌత్యం లభించిన పదమూడో సంవత్సరం ముహర్రం నెలలో.
6. హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు. అంటే దైవదౌత్యపు పదమూడవ సంవత్సరం రబీ ఉల్ అవ్వల్ మాసంలో.
వీటిలో మొదటి మూడు కథనాలు సరి అయినవి కావు అనేదానికి ఆధారాలున్నాయి. వాటి ప్రకారం, "హజ్రత్ ఖదీజా (రజి)" గారి మరణం అయిదు పూటల నమాజు విధి కావడానికి ముందు సంభవించింది. ఈ అయిదు పూటల నమాజు విధి అయినది మేరాజ్ రాత్రి జరిగిన సంఘటన తరువాతే.
అంటే, "హజ్రత్ ఖదీజా (రజి)" మేరాజ్ కంటే ముందే పరమపదించారు. దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్ నెలలో. కాబట్టి మేరాజ్ సంభవించినది ఆమె మరణించిన తరువాతే, ముందు కాదు. ఇక మిగిలిన మూడు కథనాలు. వాటిని ఏది సరిఅయినదో, ఏది కాదో చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే అస్రా సూరా (బనీ ఇస్రాయిల్ అధ్యాయం)లో చెప్పబడిన సందర్భాలను బట్టి చూస్తే, ఈ సంఘటన మక్కా జీవితపు చివరి కాలానికి సంబంధించినదని చెప్పవచ్చు.
_(↑ ఇందులోని వివరణ ↓)_
ఓరోజు.... అర్థరాత్రి సమయం. మక్కా పట్టణం గాఢ నిద్రలో జోగుతోంది. ఉమ్మెహాని ఇంట్లో నిద్రపోతున్న దైవప్రవక్త (సల్లం) ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచారు. చూస్తే "జిబ్రీల్ (అలైహి)" ఇంటికప్పు చీల్చుకొని లోపలికి దిగి వస్తున్నారు. ఆ దృశ్యం చూసి దైవప్రవక్త (సల్లం) క్షణంపాటు నివ్వెరపోయారు.
ఆయన (సల్లం) ఆశ్చర్యం నుంచి తేరుకున్నారో లేదో "జిబ్రీల్ (అలైహి)" వచ్చి చేయి పట్టుకుని కాబాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయన, దైవప్రవక్త (సల్లం) రొమ్మును చీల్చి హృదయాన్ని బయటికి తీశారు. దాన్ని "జమ్ జమ్" జలంతో శుభ్రంగా కడిగారు. తరువాత దాన్ని విశ్వాసం, ఔదార్యం, వివేచనలతో నింపి యధాస్థానంలో పెట్టేశారు.
ఆ తర్వాత చూస్తే అక్కడ దివి నుండి దిగిన "బుర్రాక్" అనే విచిత్ర శ్వేతజంతువు ఒకటి ధగ ధగ మెరిసిపోతూ నిలబడి ఉంది.
"హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" బుర్రాక్ వైపు చూపిస్తూ...., *"ముహమ్మద్ (సల్లం) ! చూశారా ఈ విచిత్ర వాహనాన్ని? దీన్ని మీ కోసమే విశ్వప్రభువు పంపాడు, ఎక్కండి"* అని చెప్పారు.
దైవప్రవక్త (సల్లం) సంతోషంతో "బుర్రాక్" ఎక్కారు. "జిబ్రీల్ (అలైహి)" దాన్ని అదిలించారు. అది ఒక్కసారిగా పైకి లేచి ఆకాశ మార్గాన మెరుపులా దూసుకుపోయింది.
అలా పోతుంటే ఖర్జూర చెట్లతో నిండిన ఒక పట్టణం వచ్చింది. "జిబ్రీల్ (అలైహి)" దాని వైపు చూపిస్తూ, *"ఇది మదీనా. మీరు మక్కా నుండి ఇక్కడికే వలస వస్తారు"* అన్నారు. తర్వాత ఇద్దరూ అక్కడ దిగి నమాజ్ చేశారు. నమాజ్ కాగానే ఇద్దరు "బుర్రాక్" ఎక్కి మళ్ళీ బయలుదేరారు.
అలా ప్రయాణం చేస్తుంటే ఒక చోట ఎవరో ఓ అపరిచిత వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను పేరు పెట్టి పిలుస్తూ, *"ఇటు రా"* అన్నాడు. కాని, దైవప్రవక్త (సల్లం) అటు వైపు దృష్టి సారించలేదు. అప్పుడు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" మాట్లాడుతూ *"ఇతను యూద మతభోదకుడు. మిమ్మల్ని యూద మతం వైపు పిలుస్తున్నాడు"* అని తెలిపారు.
మరి కాస్త ముందుకు సాగిన తరువాత మరో మనిషి తారసపడి దైవప్రవక్త (సల్లం)ను పిలిచాడు. దైవప్రవక్త (సల్లం) అతని వైపు కూడా తిరిగి చూడలేదు. హజ్రత్ జిబ్రీల్ (అలైహి), *"ఇతను క్రైస్తవ బోధకుడు, మిమ్మల్ని క్రైస్తవమతం వైపు ఆహ్వానిస్తున్నాడు."* అని తెలిపారు.
మరికొంచెం దూరం పోయాక బాగా అలంకరించుకున్న ఒక అందమైన స్త్రీ తారసపడి దైవప్రవక్త (సల్లం)ను పిలిచింది. కాని ఆయన (సల్లం), ఆ స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పుడు జిబ్రీల్ (అలైహి), *"ఈ స్త్రీ ఇహలోక ప్రతిరూపం"* అని తెలిపారు.
మరికాస్త దూరం పోగానే ఒక పండు ముసలమ్మ కనిపించింది. జిబ్రీల్ (అలైహి) ఆమె వైపు చూపిస్తూ, *"ప్రపంచం వయస్సు ఈ ముదుసలి వయస్సుతో పోల్చుకోండి"* అని చెప్పారు.
ఇంకొంచెం దూరం పోయిన తరువాత మరొక మనిషి కనిపించి దైవప్రవక్త (సల్లం)ను తన వైపు రమ్మని పిలిచాడు. కాని దైవప్రవక్త (సల్లం) అతని వైపు చూడకుండా ముఖం తిప్పుకుని ముందుకు సాగారు. హజ్రత్ జిబ్రీల్ (అలైహి) అతడ్ని గురించి చెబుతూ, *"ఇతను షైతాన్. మిమ్మల్ని సన్మార్గం నుండి తప్పించగోరుతున్నాడు"* అని చెప్పారు.
కాస్సేపటికి "బుర్రాక్" సీనాయి కొండల మీదుగా పోతుంటే జిబ్రీల్ (అలైహి) అటువైపు చూపిస్తూ *"అల్లాహ్ ఇక్కడే, తూర్ కొండమీద ప్రవక్త మూసా (అలైహి)తో ప్రత్యక్ష సంభాషణ జరిపాడు"* అని తెలియజేశారు.
మరికొంత దూరం పోయాక బైతిల్లహమ్ (బెత్లహేమ్) వచ్చింది. హజ్రత్ జిబ్రీల్ (అలైహి) దాని వైపు చూపిస్తూ, *"ప్రవక్త ఈసా (అలైహి) ఈ ప్రదేశంలోనే జన్మించారు"* అని చెప్పారు.
*ప్రవక్తలకే నాయకత్వం వహించిన మహాప్రవక్త : -*
ఆ తరువాత "బుర్రాక్" (జెరూసలేంలోని) "బైతుల్ ముఖ్దిస్" మస్జిద్ కు చేరుకుంది. దైవదూత జిబ్రీల్ (అలైహి)తో పాటు దైవప్రవక్త (సల్లం) అక్కడ అఖ్సా మస్జిద్ ముందు దిగారు. అప్పటికే అక్కడికొచ్చి నిరీక్షిస్తూ లక్షా ఇరవై నాలుగువేల మంది దైవప్రవక్తలు ఆయన (సల్లం)కు స్వాగతం పలికారు. "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" వాళ్ళను ఆయన (సల్లం)కు పరిచయం చేశారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) సంతోషంతో సోదర ప్రవక్తలను ఆలింగనం చేసుకున్నారు.
"హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" వేదిక ఎక్కి "అజాన్" ఇచ్చారు. "అజాన్" ఆకాశంలో ప్రతిధ్వనించింది. గగనద్వారాలు తెరచుకున్నాయి. అక్కడనుంచి భూమండలంలోని అఖ్సా మస్జిద్ కు కోట్లాది మంది దైవదూతలు దిగిరాసాగారు. చూస్తుండగానే సువిశాలమైన మస్జిదు దైవప్రవక్తలతో మరియు దైవదూతలతో కిక్కిరిసిపోయింది. అది చాలక ఆ మస్జిద్ నుంచి నింగి వరకు హరివిల్లులా మెరిసిపోతూ అసంఖ్యాక దైవదూతలు బారులు తీరి నిలబడ్డారు.
"హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" నమాజ్ ప్రారంభం కోసం "ఇఖామత్" చెప్పారు. అందరూ పంక్తులు సరిచేసుకున్నారు. ఇమామ్ స్థానం ఖాళీగా ఉంది. గొప్ప గొప్ప ప్రవక్తలు పాల్గొన్న ఆ ప్రార్థనాబృందానికి నాయకత్వం వహించడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. అంతలో "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" పంక్తులు చీల్చుకుంటూ, ఎక్కడో మధ్య వరుసలో నిలబడి ఉన్న అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) దగ్గరకు పోయారు.
*"ముహమ్మద్ (సల్లం)! ఇంకా మీరు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు? ఈ శుభతరుణంలో దైవప్రవక్తలు, దైవదూతలతో కూడిన ఈ ప్రార్థనా బృందానికి నేతృత్వం వహించేందుకు మీకంటే గొప్ప నాయకుడు ఎవరున్నారు? పదండి, నమాజ్ చేయిద్దురు గాని"* అన్నారు ఆయన, దైవప్రవక్త (సల్లం) చేయి పట్టుకొని.
ఎంత అదృష్టం! మహామహా మహులున్న ఈ ప్రార్థనా బృందానికి నాయకత్వం వహించే భాగ్యం అంతిమ దైవప్రవక్త (సల్లం)కు లభించడం నిజానికి యావత్తు దైవప్రవక్తలు, దైవదూతలపై ఆయన ఔన్నత్యం చాటుతుంది.
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇమామత్ స్థానంలో నిలబడి నమాజ్ చేయించారు. ఆ తరువాత ఆయన (సల్లం) ఇలా ప్రసంగించారు.
*"నన్ను విశ్వకారుణ్యమూర్తిగా ప్రభవింపజేసి సమస్త మానవాళికి మార్గదర్శిగా పంపిన సర్వేశ్వరునికే సకలస్తోత్రాలు. ఆయన నాపై ధర్మాధర్మాలను విచక్షణచేసి రుజుమార్గం చూపే "ఖుర్ఆన్" అవతరింపజేశాడు. నన్ను అంతిమ దైవప్రవక్తగా చేసి, నా అనుచర సముదాయానికి ఇతర ప్రవక్తల అనుచర సముదాయలపై ఆధిక్యత ప్రసాదించాడు."*
ఉపన్యాసం ముగిసిన తర్వాత అంతిమ దైవప్రవక్త (సల్లం) ముందు మూడు గిన్నెలు ఉంచబడ్డాయి. ఒక గిన్నెలో నీరు, మరొక గిన్నెలో పాలు, వేరొక గిన్నెలో సారా ఉన్నాయి. దైవప్రవక్త (సల్లం) ఆ మూడింటిలో పాలగిన్నె మాత్రమే తీసుకొని పాలు తాగారు.అది చూసి జిబ్రీల్ (అలైహి) ఆయన (సల్లం)ను అభినందిస్తూ *"శుభం! మీరు ప్రకృతి మార్గాన్ని ఎన్నుకున్నారు"* అని అన్నారు.
*తరువాత జరిగినది In Shaa Allah రేపటి భాగములో....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment