🌿 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🌿
🍂 🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌 🍂
🍃 🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌 🍃
✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦
🌾🔅 🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 164* 🕋🛐 🔅🌾
🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 79* 🇸🇦🇸🇦🇸🇦
───────────┄┅━═══✦═══━┅┄───────────
*ప్రముఖ వ్యక్తుల్లో "ఇస్లాం" ధర్మప్రచారం*
*4. తుఫైల్ బిన్ ఉమర్ దౌసీ : -*
ఈ బుద్ధిమంతుడు కవి, ఆలోచనాపరుడు. దౌస్ తెగకు సర్దారు. ఈయన తెగకు, యమన్ చుట్టుప్రక్కల ఓ ప్రదేశంలో ప్రాబల్యం ఉండేది. దైవదౌత్యపు 11వ సంవత్సరంలో మక్కాకు వచ్చారు. ఇంకా మక్కాను చేరారో లేదో మక్కావాసులు ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. ఎంతో గౌరవమర్యాదలు చూపారు. ఆ తరువాత (మక్కా వాసులు) ఆయనతో, *"తుఫైల్! మీరు మా నగరానికి వచ్చారు. మాకు సంబంధించిన ఈ వ్యక్తి (ముహమ్మద్ (సల్లం)) ఉన్నాడు చూశారు, మమ్మల్ని ఎంతో ఇరుకున పడేశాడు. మమ్మల్ని ఒక త్రాటిపై నిలువకుండా చెల్లాచెదరు చేస్తున్నాడు. ఇతను మాట్లాడే మాట ఇంద్రజాలంలా పని చేస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య, సోదరుడూ సోదరునీ నడుమ, భార్యాభర్తల నడుమ చిచ్చుపెట్టి వేరుచేస్తోంది. మేము చిక్కుకున్న బాధల్లో మీరూ, మీ జాతి చిక్కుకోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు ఆ వ్యక్తితో మాట్లాడవద్దు. అతను చెప్పేది ఏదీ వినకూడదు."* అని అన్నారు.
"హజ్రత్ తుఫైల్ (రజి)" గారే స్వయంగా ఆ సంఘటన గురించి ఇలా వివరించారు.
"వీరు అలా బలవంతపెడుతుంటే, నేను దైవప్రవక్త (సల్లం) చెప్పింది ఏదీ వినేదే లేదు అని నిశ్చయించుకున్నాను. ఆయన (సల్లం)తో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ సంకల్పంతోనే నేను "మస్జిదె హరాం" లోనికి ప్రవేశించినప్పుడు ఆయన (సల్లం) పలుకులేవీ నా చెవుల్లో పడకూడదు అనే ఉద్దేశ్యంతోనే చెవుల్లో దూది పెట్టి దోపుకు వచ్చాను. అయితే అల్లాహ్, ఆయన (సల్లం) మాటలను కొన్ని వినాలని రాసి పెట్టాడేమో, ఆయన (సల్లం) నోట బహు చక్కటి వాక్కులు విన్నాను. ఆ తరువాత నా మనస్సులో ఇలా తలపోశాను: *"నా తల్లి నా గురించి రోదించుగాక (నేను నాశనమైపోను అని అర్థం)! నేను ఓ ఆలోచనాపరుడైన కవిని కదా! చెడ్డది ఏదో నాకు తెలియకుండా ఉంటుందా? మరి నేను ఈ వ్యక్తి మాటలను ఎందుకు వినకూడదు? మంచి మాటలయితే స్వీకరిస్తాను. చెడ్డవి అయితే విసర్జిస్తాను."* అని అనుకొని ఆగిపోయాను.
మహాప్రవక్త (సల్లం) ఇంటికి మరలి వెళ్ళిపోయేటప్పుడు నేను ఆయన (సల్లం)ను అనుసరించాను. ఆయన (సల్లం) ఇంట ప్రవేశించగానే నేను లోనికి వెళ్ళిపోయాను. ఆ తరువాత నేను వచ్చిన కారణం, ప్రజలు నన్ను భయపెట్టిన వైనం, ఆ తరువాత చెవుల్లో దూది కుక్కుకున్నది, అయినప్పటికీ కొన్ని మాటలు చేవుల్లోబడిన తీరు వగైరాలు వివరంగా ఆయన (సల్లం)కు చెప్పి అసలు విషయం ఏమిటో సెలవియ్యమని మనవి చేశాను.
మహాప్రవక్త (సల్లం) నాకు "ఇస్లాం" ధర్మాన్ని భోధించారు. "దివ్యఖుర్ఆన్"ను పఠించి వినిపించారు.
దైవాన్ని సాక్షిగా పెట్టి చెబుతున్నాను! అంతకంటే మేలైనది, న్యాయవంతమైన వాక్కు నేను అది వరకు ఎప్పుడూ విని ఉండలేదు. కాబట్టి వెంటనే "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించి సత్యానికి సాక్ష్యంగా నిలిచాను.
ఆ తరువాత, *"ప్రవక్తా! నా జాతి నా మాట వింటుంది. వారి వద్దకు వెళ్ళి వారిని "ఇస్లాం" వైపునకు ఆహ్వానిస్తాను. కాబట్టి "అల్లాహ్" నాకు ఏదో ఒక సూచనను ప్రసాదించమని "అల్లాహ్"ను ప్రార్థించండి."* అని విన్నవించుకోగా, ఆయన (సల్లం) నా గురించి ప్రార్థించడం జరిగింది."
"హజ్రత్ తుఫైల్ (రజి)"కు "అల్లాహ్" ఒసగిన సూచన ఏమిటీ అంటే, ఆయన తన జాతి వద్దకు వెళ్ళినప్పుడు "అల్లాహ్" ఆయన ముఖంపై జ్యోతిలాంటి ఓ కాంతిని పులమడం. అది చూసిన ఆయన, *"ఓ అల్లాహ్ ఈ వెలుగును నా ముఖానికి కాకుండా మరెక్కడైనా ఉండేటట్లు చెయ్యి. ప్రజలు నా ముఖాన్ని చూసి దాన్ని చెరిపేయగలరు."* అని ప్రార్థించగా ఆ వెలుగు ఆయన లాఠీలోనికి వచ్చి చేరింది.
ఆ తరువాత ఆయన తన తండ్రి మరియు భార్య వద్దకు వెళ్ళి "ఇస్లాం" బోధించారు. వారిద్దరూ "ఇస్లాం" స్వీకరించడం జరిగింది. కాని ఆయన జాతి మాత్రం "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించటంలో జాప్యం చేసింది. అయినా "హజ్రత్ తుఫైల్ (రజి)" ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి "ఎహ్'జాబ్" పోరాటం తరువాత ఆయన హిజ్రత్ చేసినప్పుడు ఆయన వెంట 70 లేదా 80 కుటుంబాలు ఉన్నాయి. "హజ్రత్ తుఫైల్ (రజి)", "ఇస్లాం" కోసం గొప్పగా పాటుబడ్డారు. "యమామా" పోరాటంలో అమరగతి పొందారు.
*5. జిమాద్ అజ్'దీ : -*
ఈయన యమన్ కు చెందిన వారు. "అజ్'ద్" షన్వా తెగకు చెందిన వ్యక్తి. భూత వైద్యం, దెయ్యాలను పారద్రోలడం ఆయన వృత్తి. మక్కా నగరానికి వచ్చినప్పుడు అక్కడ బుద్ధిహీనులు, దైవప్రవక్త (సల్లం) ఉన్మాది అని ఆయనకు నూరిపోశారు. ఇది విన్న జిమాద్, *"నేనెందుకు ముహమ్మద్ (సల్లం)ను కలువకూడదు. బహుశా "అల్లాహ్", నా చేతిలోనే ఆయన (సల్లం)కు స్వస్థత ఉంచాడేమో, భూతవైద్యం చేసి ఆయన (సల్లం)పై ఉన్న దెయ్యాల్ని ఎందుకు పారద్రోలకూడదు?"* అనే తలంపుతో దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వచ్చారు.
ఆయన (సల్లం)ను కలిసి, *"ఓ ముహమ్మద్ (సల్లం)! నేను దెయ్యాలను వదలగొట్టడానికి భూత వైద్యం చేసేవాణ్ణి. నీకు కూడా దాని అవసరం ఉందేమో చెప్పు."* అని అడిగారు.
జవాబుగా మహాప్రవక్త (సల్లం) ఇలా సెలవిచ్చారు. ↓
*యదార్థంగా స్తోత్రాలన్నీ "అల్లాహ్"కే. మేము ఆయన్నే స్తుతిస్తున్నాము. ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాం. "అల్లాహ్", ఎవరికయితే మార్గం చూపుతాడో అతణ్ణి మరెవ్వరూ మార్గభ్రష్టునిగా చేయలేరు. "అల్లాహ్", ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి మరెవ్వరూ మార్గం చూపలేరు. "అల్లాహ్" తప్ప మరెవరూ ఆరాధనకు అర్హుడు కాడనీ, అతను ఒక్కడేనని, ఆయనకు మరెవ్వరూ సహవర్తులు లేరనీ నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా, ముహమ్మద్ (సల్లం) ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను."* (ఆ తరువాత)....
ఇది ఆలకిస్తున్న జిమాద్, *"ఏమిటీ ఈ వాక్కుల్ని మరోసారి వల్లించండి."* అని అడిగాడు. అలా పై వాక్యాలను మూడుమార్లు విన్న తరువాత జిమాద్, *"నేను కాహీన్ లు, ఇంద్రజాలికులు, కవుల మాటల్ని విని ఉన్నవాణ్ణి. కాని మీరు పలికిన ఈ మాటల్ని నేనెక్కడా వినలేదు. ఇవి సముద్రపు లోతుల్లో నుండి వచ్చిన పలుకుల్లా ఉన్నాయి. ఏదీ మీ చెయ్యి చూపండి. మీ చేతి మీద చేయి వేసి బైత్ (ప్రమాణం) చేస్తాను."* అని అనగా మహాప్రవక్త (సల్లం) తన చేతిని ముందుకు చాచారు. ఆ చేతిపై చేయివేసి ఆయన "ఇస్లాం" ధర్మస్వీకార ప్రమాణం చేశారు.
*యస్రిబ్ (మదీనా)కు చెందిన ఆరుగురు అదృష్టవంతులు*
దైవదౌత్య శకం 11వ సంవత్సరం హజ్ కాలం (క్రీ.శ.620, జులై మాసం)లో "ఇస్లాం" సందేశ ప్రచారానికి కొందరు చేయూతనిచ్చిన అదృష్టవంతులు లభించారు. వారి చేయూత వలన ముస్లిములు వారి అండన చేరి, సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న బాధల నుండి విముక్తులయ్యారు.
మక్కా వాసులు, దైవప్రవక్త (సల్లం)ను తిరస్కరించడంలో, ప్రజల్ని దైవమార్గం నుండి అడ్డుకోవడంలో చేస్తున్న కృషి అలా సాగుతూనే ఉంది. మహాప్రవక్త (సల్లం) రాత్రి చీకట్లలో ముష్రిక్ లు అడ్డుతగలకుండా ఉండేందుకు వివిధ తెగల వద్దకు వెళ్ళి దైవధర్మాన్ని భోదించడమూ జరిగేది.
ఈ యుక్తిని అవలంబిస్తూ మహాప్రవక్త (సల్లం) "ఓ రాత్రి "హజ్రత్ అబూ బక్ర్ (రజి)"ను, "హజ్రత్ అలీ (రజి)"ను వెంటబెట్టుకొని బయలుదేరారు. "బనూ జుహల్" మరియు "బనూ షైబాన్ బిన్ సాలిబా" విడిది చేసి ఉన్న గుడారాలకు వెళ్ళి వారితో "ఇస్లాం" ధర్మం గురించి చర్చించడం జరిగింది. వారు ఇచ్చిన సమాధానమైతే తృప్తికరమైనదే కాని "ఇస్లాం" ధర్మ స్వీకారం విషయంలో ఖచ్చితంగా ఏ నిర్ణయమూ గైకొనలేదు. ఈ సందర్భంలో "హజ్రత్ అబూ బక్ర్ (రజి)" మరియు "బనూ జుహల్"కు చెందిన ఓ వ్యక్తి నడుమ వంశావళి గురించి ఉత్సాహభరితమైన చర్చ కూడా జరిగింది. ఆ ఇద్దరు వంశావళి చెప్పడంలో మంచి నిపుణులు.
ఆ తరువాత మహాప్రవక్త (సల్లం), "మినా" కొండ లోయ నుండి వెడుతూ, కొందరు వ్యక్తులు పరస్పరం మాట్లాడుకోగా విన్నారు. నేరుగా వారి వద్దకు వెళ్ళారు దైవప్రవక్త (సల్లం), వీరు మొత్తం ఆరుగురు యువకులు. వీరంతా యస్రిబ్ కు చెందిన తెగ "బనూ ఖజ్రజ్"కు సంబంధించినవారే. వారి పేర్లు ఇవి :
1. అస్అద్ బిన్ జురారాహ్ (బనీ నజ్జార్ కుటుంబం)
2. ఔన్ బిన్ హారిస్ బిన్ రిఫాఅ (ఇబ్నె అఫ్రా) (బనీ నజ్జార్ కుటుంబం)
3. రాఫె బిన్ మాలిక్ బిన్ అజ్లాన్ (బనీ జురైఖ్ కుటుంబం)
4. ఖుత్బా బిన్ ఆమిర్ బిన్ నాబీ (బనీ హిరామ్ బిన్ కఅబ్)
5. ఖుత్బా బిన్ ఆమిర్ బిన్ హదీదా (బనీ సల్మా)
6. హారీస్ బిన్ అబ్దుల్లా బిన్ రిమాబ్ (బనీ ఉబైద్ బిన్ గనమ్)
యస్రిబ్ (మదీనా) వారి అదృష్టం ఏమిటంటే, వారు మదీనాకు చెందిన తమ మిత్రపక్షమైన యూదుల నోట, *"ఈ కాలంలోనే ఓ ప్రవక్త ప్రభవించబోతున్నాడని, అతను త్వరలోనే ప్రత్యక్షం కాబోతున్నాడని, మేము ఆయన (సల్లం)కు విధేయులమై, ఆయన (సల్లం) నాయకత్వంలో మిమ్మల్ని సంహరిస్తాము."* అనే విషయాన్ని విని ఉండడం.
మహాప్రవక్త (సల్లం) వారి వద్దకు వెళ్ళి, *"మీరెవరూ?"* అని అడిగారు.
*"మేము "బనూ ఖజ్రజ్" తెగకు చెందినవారం"* అని బదులిచ్చారు వారు.
*"అంటే యూదుల మిత్రపక్షమా?"* అని ప్రశ్నించారు.
*"అవును"* అని వారు చెప్పగా,
*"మనమెందుకు కూర్చొని మాట్లాడుకోకూడదు?"* అని అడిగారు దైవప్రవక్త (సల్లం).
వారు కూర్చోగా, వారి ముందు మహాప్రవక్త (సల్లం) "ఇస్లాం" ధర్మం యదార్థతను గురించి వివరిస్తూ "అల్లాహ్" మార్గం వైపునకు వారిని ఆహ్వానించారు. "దివ్యఖుర్ఆన్" పారాయణం చేసి వినిపించారు.
వారు పరస్పరం మాట్లాడుకుంటూ...., *"చూశారా! ఏ ప్రవక్త గురించి అయితే చెబుతూ యూదులు మనల్ని బెదిరిస్తున్నారో ఈయన (సల్లం) ఆ ప్రవక్తే అయి ఉండవచ్చు. కాబట్టి యూదులు మమ్మల్ని మించిపోకుండా చూద్దాం."* అంటూ లేచి వెంటనే ఆయన (సల్లం) పిలుపును అందుకొని "ఇస్లాం" స్వీకరించారు ఆ ఆరుగురు యువకులు.
వీరు యస్రిబ్ కు చెందిన బుద్ధీవివేచనలుగల యువకులు. ఇటీవలే జరిగిన యుద్ధం వారిని బాగా కృంగదీసి ఉంది. వాతావరణాన్ని ఇంకా చీకటి మయంగానే ఉంచింది. అందుకని వారు, ప్రవక్త (సల్లం) గారి పిలుపు ఆ యుద్ధాన్ని రూపుమాపడానికి దోహదపడగలదని తలిచారు. కాబట్టి వారు పరస్పరం ఇలా అనుకోనారంభించారు.
*"మనం మన జాతి వద్దకు వెళ్ళి, దాన్ని ఈ ధర్మం వైపునకు పిలుద్దాం. మన జాతిలో ఉన్న పరస్పర వైరం లాంటిది మరే జాతిలోనూ కానరాదు. బహుశా అల్లాహ్, ప్రవక్త (సల్లం) ద్వారా వారందరినీ సంఘటితం చెయ్యవచ్చు. మనం అక్కడికి వెళ్ళి ఆయన (సల్లం) కార్యం వైపునకు వారిని ఆహ్వానిద్దాం. మనం ఈ రోజు స్వీకరించిన ధర్మాన్ని వారి ముందుంచుదాం. అల్లాహ్ తలిస్తే ఈయన (సల్లం) మనందరిని ఒకే చోట కూడేటట్లు చేయగలడు. ఆ తరువాత మనకు ఈయన (సల్లం) కంటే గౌరవనీయుడైన వ్యక్తి ఇంకొకడు లభించడు."*
ఆ తరువాత వీరు తమ వెంట "ఇస్లాం" సందేశాన్ని మదీనాకు తీసుకువెళ్ళారు. అక్కడ ఇంటింటా మహాప్రవక్త (సల్లం)గారి చర్చే చోటుచేసుకుంది.
_(ఈ విధంగా "ఇస్లాం", మదీనాలోకి ప్రవేశించింది)_
*In Shaa Allah రేపటి భాగములో.... "ఇస్లాం"లో ముఖ్య ఘట్టమైన "ఇస్రా మరియు మేరాజ్" గురించి....;*
✍🏻✍🏻 *®@£€€q* *+97433572282* ✍🏻✍🏻
*(rafeeq)*
✍🏻✍🏻 *Salman* *+919700067779* ✍🏻✍🏻
*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*
💎💎 *మా సలాం* 💎💎
─┄┅━═══✦═══━┅┄─
No comments:
Post a Comment