158

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 158* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 73* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

                  *తృతీయ దశ* 

   *మక్కాకు వెలుపల ఇస్లాం సందేశ ప్రచారం* 

 *"తాయెఫ్"కు దైవప్రవక్త (సల్లం) గారి ప్రయాణం : -* 

దైవదౌత్య శకం 10, షవ్వాల్ నెలలో (క్రీ.శ.619 మే చివరి రోజులు లేదా జూన్ ప్రారంభ దినాలు) దైవప్రవక్త (సల్లం) "తాయెఫ్"కు ప్రయాణమై వెళ్ళారు. "తాయెఫ్" మక్కాకు అరవై మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం. ఆహ్లాదకరమైన వాతావరణం, నయనానందకరమైన పండ్లతోటలతో నిత్య శోభాయమానంగా అలరారుతూ ఉంటుంది. ప్రఖ్యాత దేవతా విగ్రహం "లాత్" తాయెఫ్ లోనే ఉంది. అరేబియా ప్రజలకు "కాబా" తరువాత ఇదే గొప్ప దేవాలయం. ఇక్కడ "సఖీఫ్" తెగవారు ఈ ఆలయానికి ధర్మకర్తలు. పట్టణ పెద్దలు కూడా ఆ తెగవాళ్ళే.

మహాప్రవక్త (సల్లం) అక్కడికి కాలినడకనే వెళ్ళారు. ఆయన (సల్లం) వెంట, ఆయనచే స్వాతంత్య్రం పొందిన బానిస "హజ్రత్ జైద్ (రజి) బిన్ హారిసా" కూడా ఉన్నారు.

దారిలో ఆయన (సల్లం), "బనీ బకర్" తెగవాళ్ళకు దైవసందేశం అందజేసి "ఇస్లాం" స్వీకరించమని చెప్పారు. కాని వాళ్ళు అందుకు నిరాకరించడంతో "ఖహ్'తాన్" తెగవాళ్ళ దగ్గరకు పోయి ధర్మబోధ చేశారు. వాళ్ళు కూడా ఖురైషీయులవంటి కఠినాత్ములే అని తేలిపోయింది.

(ఈ విధంగా మార్గమధ్యంలో ఏ తెగవారు కలిసినా వారికి "ఇస్లాం" ధర్మం వైపునకు రమ్మని ఆహ్వానిస్తూ వెళ్ళారు. అయితే, ఏ ఒక్కరూ ఆయన (సల్లం) పిలుపును ఆలకించలేదు.) ఇక అక్కడ్నుంచి సరాసరి "తాయెఫ్"కు చేరుకున్నారు.

"తాయెఫ్"కు చేరిన తరువాత "సఖీఫ్" తెగకు చెందిన ముగ్గురు సర్దారుల వద్దకు వెళ్ళారు. వీరు ముగ్గురూ పరస్పరం అన్నదమ్ములే. వారి పేర్లు "అబ్దె యాలైల్", "మస్ఊద్" మరియు "హాబీబ్"లు. వారి తండ్రి పేరు "అమ్రూ బిన్ ఉమైర్ సఖఫీ".

మహాప్రవక్త (సల్లం) వారి వద్దకు వెళ్ళి కూర్చుని "అల్లాహ్"కు విధేయులైపొమ్మని, "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించమని వారికి పిలుపునిచ్చారు. కాని, ఈ ముగ్గురు మహా గర్విష్ఠులు. దైవప్రవక్త (సల్లం)తో చాలా దురుసుగా మాట్లాడారు. 

వారిలో ఒకడు, *"అల్లాహ్ నిన్ను దైవప్రవక్తగా చేస్తే కాబా గృహం పరదాను చించెయ్యనా?"★* అన్నాడు. మరొకడు అందుకుని, *"అల్లాహ్ కు నీవు తప్ప మరెవ్వడూ దొరకలేదా?"* అని అన్నాడు. మూడోవాడు, *"నీతో నేను అసలే మాట్లాడను. నీవే నిజంగా అల్లాహ్ ప్రవక్తవైతే నీ మాటను రద్దు చేయడం నాకు బహుప్రమాదకరమైన విషయమవుతుంది. నీవే అల్లాహ్ పై అపవాదు వేస్తున్నట్లయితే నీతో మాట్లాడే అవసరం ఏమిటి?"* అని పలికాడు.

 _(★ → ఇది అరబీ భాషలోని సామెత. అంటే, నిన్ను అల్లాహ్ ప్రవక్తగా చేస్తే నేను నాశనమైపోయానా? అని. ఇది, నీవు ప్రవక్తవు కావడం అసంభవం. ఎలాగైతే కాబా గృహ పరదాను చించివేయడం ఎంత అసంభవమో ఇదీ అంతే అసంభవం అని నమ్మకంగా చెప్పడం అన్నమాట.)_ 

కొండంత ఆశతో వచ్చిన కారుణ్యమూర్తి (సల్లం)కి నిరాశే ఎదురైంది. అహంకారంతో కూడిన వీరి దుష్ప్రలాపాలు, ఆయన (సల్లం) హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి.

ఈ సమాధానాలు విన్న మహాప్రవక్త (సల్లం), అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ, *"మీరు అవలంబించిన ఈ తీరును బయటకు పొక్కనివ్వకండి"* అని చెప్పి వెళ్ళిపోయారు.

మహాప్రవక్త (సల్లం) "తాయెఫ్"లో పది రోజులు గడిపారు. ఈ పది రోజులూ, పట్టణానికి చెందిన ఒక్కొక్క సర్దారు వద్దకు వెళ్లి మాట్లాడారు. అందరి నోట వెలువడ్డ సమాధానం ఒక్కటే. *"నీవు ఈ నగరం నుండి వెళ్లిపో"* అన్నదే ఆ సమాధానం. అదే కాదు, ఆయన (సల్లం)పై అల్లరిమూకల్ని కూడా ఉసిగొలిపారు. ఆయన (సల్లం) నగరం నుండి బయలుదేరినతోడనే ఈ ముష్కరులు ఆయన (సల్లం)ను దుర్భాషలాడుతూ, చప్పట్లు చరుస్తూ, గోల చేస్తూ ఆయన (సల్లం) వెంట పడ్డారు. క్షణాల్లో ఓ పెద్ద గుంపు తయారయింది. ఈ గుంపు ఆయన (సల్లం) వెళ్లే మార్గానికి ఇరువైపులా వరుసకట్టి నిలబడింది. తిట్లు, దుర్భాషలకు తోడు ఆయన (సల్లం)పై రాళ్ళు కూడా విసరనారంభించింది. రాళ్ళు విసరడం వల్ల అయిన గాయాల కారణంగా కారే రక్తం, ఆయన (సల్లం) పాదరక్షల్లోనికి చేరి గడకట్టనారంభించింది.

ఇటు ఆయన (సల్లం) వెంట ఉన్న "జైద్ (రజి) బిన్ హారిసా" ఢాలుగా నిలబడి ఆ రాళ్ళు తగలకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాళ్ళ దెబ్బలకు ఆయన (రజి) తలపై గాయాలు అయ్యాయి. అల్లరిమూక, ఈ విధంగా ప్రవక్త (సల్లం)ను హింసిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన, రబీయా కుమారులైన "ఉత్బా" మరియు "షైబా" తోటలోనికి వెళ్లి తలదాచుకోవలసి వచ్చింది. ఇది "తాయెఫ్"కు మూడు మైళ్ళ దూరాన ఉన్న తోట.

మహాప్రవక్త (సల్లం) అక్కడ తలదాచుకోవడం గమనించిన అల్లరిమూక, వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆయన (సల్లం) ఓ గోడకు ఆనుకొని ఓ ద్రాక్ష తీగ నీడలో కూర్చుండి సేద తీర్చుకుంటున్నారు. కొంత స్థిమితపడ్డాక దైవాన్ని ప్రార్థించారు. ఆ దుఆ *"దుఆయే ముస్తజ్ ఇఫీన్"* పేరున ప్రాచుర్యం పొందింది. ఆ "దుఆ"లోని ఒక్కో పదాన్ని తరచి చూస్తే, "తాయెఫ్"లో ఆయన (సల్లం)పై జరిగిన దౌర్జన్యం, ఏ ఒక్కడూ విశ్వసించకపోవడం వల్ల ఆయన (సల్లం)కు కలిగిన మనస్తాపం, ఆయన (సల్లం) అనుభవించిన బాధ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆ "దుఆ" ఇది. ↓

 *"ఓ ప్రభూ! నేను నీ ముందు నా చేతకానితనాన్ని, నా బలహీనతను, ప్రజలు నా ఎడల ప్రవర్తించిన అగౌరవాన్ని గురించి విన్నవించుకుంటున్నాను. ఓ కరుణామయా! నీవు బలహీనుల పోషకుడవు. నా పోషకుడవూ నీవే. నీవు నన్ను ఎవరికి అప్పజెబుతున్నావు? నా ఎడల దురుసుగా ప్రవర్తించేవారికా? నా వ్యవహారాన్ని తన చేతిలోకి తీసుకొని నాపై అధికారాన్ని చెలాయించే నా శత్రువుకా? ఒకవేళ నాపై నీకు కోపం లేకపోతే, అంతే చాలు. కాని, నీ శాంతం మాత్రం నాకోసం ఎంతో విశాలమైనది. నీవు నాపై నీ శిక్షను, నీ క్రోధాన్ని అవతరింపజేయడానికి ముందే, ఇహపరలోకాల సాఫల్యం లభించే, చీకట్లను వెలుగుగా విరజిమ్మే నీ ముఖజ్యోతిని శరణు వేడుకుంటున్నాను. నీవు ప్రసన్నుడిని అయినంత వరకు నీ సంతుష్టినే కోరుకుంటున్నాను. నీవు తప్ప మరే శక్తిగాని, బలంగాని ఎవరికీ లేదు."* 

దైవప్రవక్త (సల్లం), ఈ విధంగా "అల్లాహ్"ను వేడుకున్నారు. (విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లం) వేడుకలును ఆలకించి,) అల్లాహ్ దయాసాగరం పొంగిపొరలింది. "తాయిఫ్" పట్టణానికి ఇరువైపులా రెండు కొండలు ఉన్నాయి. ఆ కొండల పర్యవేక్షకుడైన దైవదూత వెంటనే దైవప్రవక్త (సల్లం) ముందు ప్రత్యక్షమయ్యాడు.

 *"ముహమ్మద్ (సల్లం)! అల్లాహ్ మీ ప్రార్థన ఆలకించాడు. మీ కోసం ఆయన నన్ను పంపాడు. మీరు ఆజ్ఞాపిస్తే "తాయెఫ్" పట్టణానికి ఇరువైపులున్న రెండు కొండల్ని కలిపేసి పట్టణాన్ని నుగ్గునుగ్గు చేస్తాను. పట్టణం వాసులు తృటిలో సర్వనాశనమవుతారు."* అన్నాడు ఆయన.

 *ముహమ్మద్ (సల్లం) : -* వద్దు వద్దు. ఆ పని చేయకండి. ఈనాడు వీళ్ళు "ఇస్లాం" స్వీకరించకపోతే, రేపు వీరి సంతానమయినా స్వీకరించవచ్చని నాకు ఆశ ఉంది. వారి భావి సంతతి ముస్లిములయిపోవచ్చు. అంచేత వీళ్ళను అంతమొందించడం నాకు ఇష్టం లేదు.

ఈ మాట విన్న తరువాత దైవదూత సెలవు తీసుకొని అంతర్ధానమయ్యాడు.

 *మరొక ఉల్లేఖనంలో....; ↓* 

(దైవప్రవక్త (సల్లం) అల్లాహ్ తో "దుఆ" చేసిన వెంటనే,)విశ్వప్రభువు అయిన "అల్లాహ్" ఆదేశం మేరకు "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)", ఆయన (సల్లం) వద్దకు అరుదెంచారు. "జిబ్రీల్ (అలైహి)" వెంట పర్వతాల దైవదూత కూడా ఉన్నాడు. అతను వచ్చింది, దైవప్రవక్త (సల్లం) సెలవిస్తే "తాయెఫ్" పట్టణ ప్రజల్ని, రెండు కొండల నడుమ నుంచి పిండి చేయగలను అని విన్నవించుకోవడానికే.

 *ఈ సంఘటన వివరాలు "సహీ బుఖారీ"లో "హజ్రత్ ఆయిషా (రజి)" ఇలా ఉల్లేఖిస్తున్నారు. ↓* 

●ఆమె (రజి) ఓ రోజు దైవప్రవక్త (సల్లం)తో, *"ఉహాద్ యుద్ధం జరిగిన రోజు కంటే కఠినమైన రోజు ఏదైనా మీరు చూశారా?"* అని అడగగా, మహాప్రవక్త (సల్లం), *"అవును! నీ జాతి కారణంగా నేను అనుభవించిన కష్టాల్లోకెల్లా అతి కష్టమైన పరిస్థితి ఒకటుంది. అది నేను "అబ్దె యాలైల్ బిన్ అబ్దె కలాల్" కుమారుని వద్దకు వెళ్ళి దైవసందేశాన్ని ఇచ్చాను. కాని అతను నా మాటను విననప్పుడు మనస్తాపంతో బయలుదేరాను. "ఖర్నె సఆలిబ్"కు చేరిన తరువాతే నాకు కొంత ఊరట కలిగింది. అక్కడ నేను తల పైకెత్తి చూద్దును కదా నల్లటి మబ్బుతునక ఒకటి నాకు నీడనిస్తోంది. నేను నిశింతగా చూస్తే, అందు(లో) "హజ్రత్ జిబ్రీల్ (అలైహి)" ఉన్నారు.* 

 *ఆయన నన్ను పిలిచి, _"మీ జాతి మీకు ఇచ్చిన సమాధానాన్ని దైవం విన్నాడు. ఆయన ఇప్పుడు మీ వద్దకు పర్వతాల దూతను పంపించాడు. మీరు ఏ ఆదేశమిస్తే, దానిని అతను పాలిస్తాడు."_ అన్నారు. ఆ తర్వాత పర్వతాల దైవదూత, నన్ను పిలిచి "సలాం" చేసిన తరువాత, _"ఓ ముహమ్మద్ (సల్లం)! విషయం అదే. ఇప్పుడు ఏది కోరినా సరే.... వీరిని ఈ రెండు కొండల నడుమ వేసి నుజ్జునుజ్జు చేయమంటే అలాగే చేస్తాను."_ అని అన్నాడు. దానికి నేను, _"లేదు! ఈ జాతి నుండి కేవలం "అల్లాహ్"నే ఆరాధించే సంతతి ఉనికిలోనికి వస్తుంది. అది మరెవ్వరిని "అల్లాహ్"కు సాటిగా నిలబెట్టదు."_ "* అని అన్నాను.●

దైవప్రవక్త (సల్లం) ఈ ఇచ్చిన సమాధానంలో లోతైన నైతిక విలువలను గమనించవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఆయన (సల్లం)కు సప్తాకాశాల పైనుండి వచ్చే దైవిక సహాయం కారణంగా స్థిమితం చేకూరినట్లయింది. బాధపరితప్త హృదయానికి సాంత్వన చేకూరినట్లయింది.

ఇటు రబీయా కుమారులకు, దైవప్రవక్త (సల్లం)ను "తాయెఫ్" వాసులు రాళ్ళురువ్విన దృశ్యం చూశారు. శరీరమంతా రక్తసిక్తమయి నిస్సహాయంగా కూలబడిన దైవప్రవక్త (సల్లం)ను ఆ పరిస్థితిలో చూడగానే జాలి కలిగింది. తమ క్రైస్తవ బానిస "అద్దాస్"ను పిలిచి, *"అద్దాస్! తోటలో ద్రాక్షపండ్ల గుత్తి తెంచు. దాన్ని పళ్ళెంలో పెట్టి, అదిగో అక్కడ కూర్చున్న మనిషికిచ్చి తినమని చెప్పు."* అన్నారు.

యజమానులు ఆదేశం ప్రకారం, అద్దాస్ ద్రాక్షపండ్లు కోసి, పళ్ళెంలో పెట్టుకొని, దైవప్రవక్త (సల్లం) దగ్గరికెళ్ళి, *"ఇవి తినండి"* అన్నాడు.

ద్రాక్షపండ్ల గుత్తి, ఆయన (సల్లం) ముందుకు రాగానే దానిని తీసుకోవడానికి మహాప్రవక్త (సల్లం) *"బిస్మిల్లాహ్"* అంటూ చేయిని ముందుకు చాచి అందుకుని నోటబెట్టుకున్నారు. ఇది గమనించిన "అద్దాస్", దైవప్రవక్త (సల్లం)తో ఇలా అన్నాడు....; ↓

 *అద్దాస్ : -* అయ్యా! మీరేమిటో కొత్త మాట అన్నారు. ఈ ప్రాంతం వారు ఈ వాక్యాన్ని పలకరే!

 *ముహమ్మద్ (సల్లం) : -* నీవెక్కడివాడివి? నీ ధర్మం ఏది?

 *అద్దాస్ : -* నేను క్రైస్తవ మతావలంబీకుణ్ణి, "నైనవా" నివాసిని.

 *ముహమ్మద్ (సల్లం) : -* ఓహో! నీవు సత్పురుషుడు అయిన "యూనుస్ బిన్ మత్తీ"కి చెందిన బస్తీ వాడివా?

 *అద్దాస్ : -* అవును! "యూనుస్ బిన్ మత్తీ" మీకెలా తెలుసు?

 *ముహమ్మద్ (సల్లం) : -* ఆయన నా సోదరుడు. ఆయన దైవప్రవక్త. నేనూ దైవప్రవక్తనే

ఇది విన్న అద్దాస్, ఆయన (సల్లం)పై వంగిపోయాడు. ఆయన (సల్లం) తలను, కాళ్ళు, చేతుల్ని ముద్దాడనారంభించాడు.

ఇది గమనిస్తున్న రబీయా కుమారులు ఇద్దరూ, *"ఓహో! ఇప్పుడు ఈ వ్యక్తి మన బానిసను సయితం చెడగొట్టేశాడు."* అని అనుకోసాగారు. అద్దాస్, వారి వద్దకు తిరిగి రాగానే, *"ఏమిటయ్యా నీవు అక్కడ ప్రవర్తించిన తీరు"* అని అడిగారు.

 *అద్దాస్ : -* నా యజమానులరా! ఈ భూమండలంపై ఆయన (సల్లం) కంటే మేలైన మనిషి మరొకరుండబోడు. ఆయన (సల్లం) నాతో చెప్పిన మాటలు ఒక ప్రవక్తకు తప్ప మరెవ్వరికీ తెలియనివి.

ఇందుకు ఆ యజమానులు, *"చూడు అద్దాస్! ఈ వ్యక్తి నీ ధర్మం నుండి నిన్ను మార్చేయగలడు సుమా! నీ మతం ఆయన (సల్లం) మతం కంటే మేలైనది."* అని అన్నారు.

----------------------------

ఆపై ఆయన (సల్లం) మక్కా వైపునకు ముందుకు నడవనారంభించారు. "వాదియే నఖ్లా" (నక్లా అనే కొండలోయ)లోనికి వచ్చి ఆగారు. ఇక్కడ రెండు ప్రదేశాలు ఉండడానికి వీలుగా ఉన్నాయి. ఒకటి "అస్సైలుల్ కబీర్", రెండవది "జైమా". ఎందుకంటే, ఇక్కడ త్రాగడానికి నీరు, పచ్చదనం కనిపిస్తాయి. అయితే ఈ రెండు ప్రదేశాల్లో ఆయన (సల్లం) ఎక్కడ ఆగారన్నది ఆధారాల ద్వారా తెలియడం లేదు.

 *మిగిలినది In Shaa Allah రేపటి భాగములో....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment