151

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 151* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 66* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

   *"అబూ తాలిబ్"ను కలిసిన ఖురైష్ చిట్టచివరి ప్రతినిధి బృందం* 

దైవప్రవక్త (సల్లం), "షిఅబె అబీతాలిబ్" (బహిష్కరణ) నుండి బయటపడిన తరువాత మాములుగా దైవసందేశ ప్రచారంలో నిమగ్నులైపోయారు. బహుదైవారాధకులు ఇప్పుడు బహిష్కరణను ఎత్తివేసినప్పటికీ మాములుగానే ముస్లిములపై ఒత్తిడిని కొనసాగిస్తూ, దైవమార్గంపై నడవకుండా వారిని అడ్డుకోవడం మానుకోలేదు.

"అబూ తాలిబ్" విషయానికొస్తే ఆయన తన సంప్రదాయం ప్రకారం, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తన సోదరుని కుమారుడు (సల్లం)ని రక్షించడంలో, ఆయన (సల్లం)కు మద్దత్తు ఇవ్వడంలో తన శక్తినంతటిని ఉపయోగిస్తున్నారు.

కాని ఇప్పుడు "అబూ తాలిబ్" వయస్సు ఎనభై సంవత్సరాలకంటే మించిపోయింది. ఎన్నో ఏళ్ళ తరబడి వచ్చిపడే కడగండ్లు, ముఖ్యంగా దిగ్బంధం వల్ల వచ్చిపడిన కష్టాలు ఆయన వెన్నువిరిచేశాయి. ఆయన శక్తి ఉడిగిపోయింది. అందుకని "షిఅబె అబీతాలిబ్" కొండలోయ నుండి బయటకు వచ్చిన కొన్ని నెలలకే ఆయన రోగగ్రస్తులైపోయారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బహుదైవారాధకులు, *"ఒకవేళ "అబూ తాలిబ్" చనిపోయిన తరువాత గనక, మనం ముహమ్మద్ (సల్లం)పై ఏదైనా అఘాయిత్యం చేస్తే అది మనకే తలవంపులు తెస్తుంది."* అని గ్రహించారు.

 *"అందుకని "అబూ తాలిబ్" దగ్గరకు ఇప్పుడే ఓ ప్రతినిధి బృందాన్ని పంపి, ఆయన ఎదుటనే దైవప్రవక్త (సల్లం) గురించి ఏదైనా తేల్చుకోవాలి."* అని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి కొన్ని రాయితీలను సయితం ఆయనకు ఇవ్వదలచుకున్నారు. కాబట్టి ఓ ప్రతినిధి బృందాన్ని "అబూ తాలిబ్" దగ్గరకు పంపించారు. ఇది బహుదైవారాధకుల చిట్టచివరి ప్రతినిధి బృందం.

 *"ఇబ్నె ఇస్'హాక్" వగైరాల కథనం ప్రకారం....; ↓* 

"అబూ తాలిబ్" వ్యాధిగ్రస్తులైన విషయం ఖురైష్ కు తెలిసింది. ఆయన ఇక ఎక్కువ కాలం జీవించలేరన్న సంగతి తెలిసింది. అందరూ కలసి, *"చూడండి! హమ్'జా (రజి) మరియు ఉమర్ (రజి)లు ముస్లింలైపోయారు. ముహమ్మద్ (సల్లం) ధర్మం అన్ని తెగల్లోనూ ప్రాకిపోయింది. పదండి వెళ్దాం, ముహమ్మద్ (సల్లం)ను దేనికో ఓ దానికి ఒప్పుకునేటట్లు చేద్దాం. మనం కూడా ఏదో విషయంలో బద్ధులమైపోదాం. బహుశా వారు ఇక మన ఆధీనం నుండి బయటపడిపోయే భయం ఉంది."* అని అనుకున్నారు.

 *మరో ఉల్లేఖనం లో ఇలా ఉంది....; ↓* 

"ఈ ముసలివాడు (అబూ తాలిబ్) చనిపోయి ముహమ్మద్ (సల్లం) విషయంలో ఏదో ఒక గడబిడ జరిగిపోతే ప్రజలు మమ్మల్ని తూలనాడగలరు. *"చూశారా, "అబూ తాలిబ్" బ్రతికి ఉండగా ముహమ్మద్ (సల్లం)ను ఏమీ చేయలేకపోయారు. ఆయన చనిపోగానే ముహమ్మద్ (సల్లం) పై పులులైపోయారు." అని ప్రజలు అనుకుంటారు."* అని ఖురైష్ చెప్పుకోవడం జరిగింది కూడా.

మొత్తానికి ఖురైష్ ప్రతినిధి బృందం ఒకటి "అబూ తాలిబ్" దగ్గరకు వెళ్ళింది. ఆయనతో మాట్లాడింది. ప్రతినిధి బృందంలో ఖురైష్ కు చెందిన గౌరవనీయులైన వారున్నారు. వారు "ఉత్బా బిన్ రబీయా", "షైబా బిన్ రబీయా", "అబూ జహల్ బిన్ హష్షామ్", "ఉమయ్యా బిన్ అబీకల్ఫ్", "అబూ సుఫియాన్ బిన్ హరబ్" ఇంకా ఇతర ఖురైష్ పెద్దలు. వారి సంఖ్య మొత్తం పాతిక మంది.

 *ఈ ఖురైష్ నాయకులంతా "అబూ తాలిబ్" వద్దకు వెళ్ళి ఇలా అడిగారు....; ↓* 

 *ఖురైషీయులు : -* అబూ తాలిబ్! మా దృష్టిలో మీ హోదా ఎలాంటిదో మీకు తెలిసిందే. మీరు ఎదురుకుంటున్న పరిస్థితులు కూడా మీకు తెలుసు. ఇవి మీ అంతిమ దినాలనే భయం మాకు పట్టుకుంది. ఇటు మాకూ, మీ సోదరుని కుమారుడు ముహమ్మద్ (సల్లం)కు నడుమ నలుగుతున్న వ్యవహారం ఏమిటో మీరు బాగా ఎరుగుదురు. మేము కోరేదేమిటంటే, ముహమ్మద్ (సల్లం)ను పిలిపించి మా గురించి ఆయన (సల్లం)తో కొన్ని వాగ్దానాలు తీసుకోండి. మేము ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. మేము కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాం. మాతో పెట్టుకోవద్దని, మేము ఆయన (సల్లం) జోలికిపోమని వాగ్దానాలు తీసుకోండి.

 _(అబూ తాలిబ్ ఆలోచనలో పడ్డారు. తన ముహమ్మద్ (సల్లం)ను ఈ దుర్మార్గులు వదిలిపెట్టేటట్లు లేరని గ్రహించారు. తన కాలం కూడా సమీపించింది. ఏం చేయాలో తోచలేదు.)_ 

ఖురైషీయుల విజ్ఞప్తి మేరకు, "అబూ తాలిబ్", దైవప్రవక్త (సల్లం)ను పిలిపించారు. దైవప్రవక్త (సల్లం) అక్కడికి రాగానే, అబూ తాలిబ్ ఇలా అన్నారు....; ↓

 *అబూ తాలిబ్ : -* సోదర కుమారా ముహమ్మద్ (సల్లం)! వీరంతా నీ జాతికి చెందిన పెద్ద మనుషులు, గౌరవనీయులు. వీరంతా నీకోసమే వచ్చారు. వీరు కోరేదల్లా ఏమిటంటే, వీరంతా నీకు కొన్ని వాగ్దానాలు చేస్తారట. నీవు కూడా వారికి కొన్ని వాగ్దానాలు చెయ్యాలట.

ఇలా చెప్పి, ఖురైషీయులు కోరిన కోరికను ముహమ్మద్ (సల్లం) ముందుంచి, ఇక నుండి ఎవరూ ఎవరి జోలికిపోకుండా వాగ్దానాలు చేయాలనేది ప్రవక్త (సల్లం)తో చెప్పారు అబూ తాలిబ్.

ఇందుకు సమాధానంగా దైవప్రవక్త (సల్లం) ఖురైష్ ప్రతినిధి బృందాన్ని సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు....; ↓

 *ముహమ్మద్ (సల్లం) : -* ఖురైషీయులారా! నేను మీ ముందు, ఓ విషయాన్నుంచి దాన్ని గనక సమ్మతిస్తే, "మీరు మొత్తం అరేబియాకే రాజులైపోతారని, అరబ్బేతరులు మీకు దాసోహం అంటారు." అని చెబితే, మీరు దానికి సమ్మతించడానికి సిద్ధంగా ఉన్నారా?

కొన్ని ఉల్లేఖనాల్లో, దైవప్రవక్త (సల్లం) "అబూ తాలిబ్"ను సంభోదిస్తూ....; *"నేను వీరి ముందు ఓ మాటను ఉంచుతాను. వారే గనక దీనికి సమ్మతిస్తే, అరేబియా మొత్తం వీరికి దాసోహం అంటుంది, అరబ్బేతరులంతా వీరికి జిజియా కడతారు."* అని ఉంది.

 *●మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది....; ↓* 

 *ముహమ్మద్ (సల్లం) : -* పెదనాన్న గారు! మీరు వారిని, వారికి శ్రేయం కలిగించే విషయం వైపునకు (ఎందుకు) పిలవరు?

 *అబూ తాలిబ్ : -* ముహమ్మద్ (సల్లం)! నీవు వారిని ఏ విషయం వైపునకు పిలుస్తున్నావు?

 *ముహమ్మద్ (సల్లం) : -* నేను వారిని ఏ విషయం వైపునకయితే ఆహ్వానిస్తున్నానో దాన్ని గనక వారు స్వీకరిస్తే, అరేబియా అంతా వారికి దాసోహం అంటుంది. అరబ్బేతరులపై వారి రాచరికం ఏర్పడుతుంది.●

 *"ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖనంలో, ఆయన (సల్లం) ఈ మాట కూడా చెప్పినట్లుంది....; ↓* 

"మీరు కేవలం ఒకే ఒక మాటను ఒప్పుకోండి! దాని కారణంగా మీరు అరేబియాకే రాజులైపోతారు. అరబ్బేతర రాజ్యాలు మీకు ఆధీనమైపోతాయి."

మొత్తానికి ఈ మాటలు వినగానే ఆ ప్రతినిధి బృందం సందిగ్ధంలో పడిపోయింది.

 *ఖురైషీయులు : -* ఒకే ఒక మాటా? అంత ప్రయోజనకరమైన ఆ మాట ఏమై ఉంటుంది? దాన్ని ఎలా నిరాకరించగలం?? (అని తటపటాయించనారంభించారు)

చివరికి "అబూ జహల్" అందుకొని....;

 *అబూ జహల్ : -* చెప్పు ఆ మాట ఏమిటో? నీ తండ్రి పై ఒట్టు! అలాంటి ఒక మాట ఏమిటి, పది మాటలు ఒప్పుకోవడానికైనా మేము సిద్ధమే.

 *ముహమ్మద్ (సల్లం) : -* కేవలం మీరు, *"లా ఇలాహ ఇల్లల్లాహ్"* అనండి చాలు. *అల్లాహ్ తప్ప మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాటన్నిటిని వదిలేయండి.* 

 *ఖురైషీయులు : -* ముహమ్మద్ (సల్లం)! అనేక దేవుళ్ళ స్థానంలో ఒకే దేవుణ్ణి తెచ్చి నిలబెట్టాలా? నీ వ్యవహారమే అయోమయంగా ఉందే. (అంటూ చప్పట్లు చరిచారు)

ఆ తరువాత పరస్పరం మాట్లాడుకుంటూ, *"దైవసాక్షి! ఈ వ్యక్తి మన మాటల్ని వినేటట్లుగా లేదు. పదండి, మనం మన తాతముత్తాతల ధర్మంపైనే స్థిరపడిపోదాం. దేవుడే ఈ వ్యక్తికీ మనకూ నడుమ ఏదైనా తీర్పు చేస్తాడు"* అనుకుంటూ వెనక్కు మరలి వెళ్ళిపోయారు.

ఈ సంఘటన తరువాత వారి గురించే "దివ్యఖుర్ఆన్"లో ఈ ఆయత్ లు (వాక్యాలు) అవతరించాయి. ↓

 *సాద్. హితబోధతో నిండిన ఖుర్ఆన్ సాక్షిగా! (1). అసలు (ఈ) తిరస్కారులు అహంకారానికి, మొండితనానికి లోనై ఉన్నారు (2). మేము వారికి మునుపు కూడా ఎన్నో సముదాయాలను సర్వనాశనం చేశాము. మరి వారు (ఆఖరి క్షణాలలో) కేకలు పెట్టారు. కాని అది వారు తప్పించుకునే సమయం కాదుకదా! (3). తమ వద్దకు హెచ్చరించేవాడొకడు స్వయంగా తమలో నుంచే వచ్చాడే! అని వారు ఆశ్చర్యపోయారు. "ఇతడొక మాంత్రికుడు, అబద్ధాలకోరు" అని అవిశ్వాసులు అన్నారు (4). (వారింకా ఇలా అన్నారు) "ఏమిటి? ఇతగాడు ఇంతమంది దేముళ్ళను ఒకే ఆరాధ్య దైవంగా చేసేశాడా? నిజంగా ఇది వింతగా ఉందే!"(5). వారి నాయకమన్యులు ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోయారు: "పదండ్రా. మీరు మీ దేముళ్ళ (పూజాపునస్కారాల) పైనే గట్టిగా నిలబడండి. నిశ్చయంగా ఈ మాటలో (మీకు వ్యతిరేకంగా) ఏదో మర్మం ఉంది (6). "ఈ విషయాన్ని మేము వెనుకటి మతధర్మంలో కూడా వినలేదు. ఇదొక కల్పిత విషయం తప్ప మరేమీ కాదు" (7).* (ఖుర్ఆన్ 38:1-7).

 _2 → ముమ్మాటికీ ఈ ఖుర్ఆన్ గ్రంథం సంశయాలకు, సందేహాలకు అతీతమైనది. పరిశుద్ధమైనది. గుణపాఠం నేర్చుకోదలచిన వారి కోసం హితబోధిని. సత్యతిరస్కారులకు అది ఎందుకు ప్రయోజనకారి కావటం లేదంటే, వారి ఆలోచనలు పొద్దస్తమానం వంకరగానే ఉంటున్నాయి. వారి గుండెల్లో దురహంకారం గూడుకట్టుకుని ఉంది. వారి అణువణువునూ విరోధభావం పెనవేసుకుని ఉంది. అందుకే వారు సత్యానికి వ్యతిరేకంగా పేట్రేగిపోతున్నారు._ 

 _3 → వీరికి పూర్వం తుదముట్టించబడిన జాతులు బలపరాక్రమాలలో, ప్రజ్ఞాపాటవాలలో వీల్లకన్నా ముందంజలో ఉండేవారు. కాని సత్యతిరస్కారం మూలంగా, అవిధేయతా వైఖరి కారణంగా వారు తీవ్ర పర్యవసానానికి గురయ్యారు. వారికి దైవాగ్రహం విరుచుకుపడిన పిదప జ్ఞానోదయం అయింది. పుట్టి మునుగుతున్నప్పుడు వారు సిగ్గుతో పశ్చాత్తాపం చెంది, దైవసహాయం కోసం హాహాకారాలు చేశారు. కాని అది పశ్చాత్తాపం చెందే సమయం కాదు. సమయం అప్పటికి మించిపోయింది. శిక్షను కళ్ళజూసిన తరువాత వారు నేర్చుకున్న గుణపాఠం వారికే మాత్రం ప్రయోజనం కలిగించలేకపోయింది. వారు ఆ విపత్తునుంచి పారిపోయి తమను కాపాడుకోలేకపోయారు._ 

 _4 → తమలాంటి ఒక సాధారణ మనిషి దైవప్రవక్త ఎలా అయ్యాడన్న విషయం వారిని ఆశ్చర్యంలో పడేసింది._ 

 _5 → "ఒకే ఒక్క దేవుడు ఈ జగతినంతటినీ నడుపుతాడా? ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరా? వింతగా ఉందే!? అలాగే ఆరాధనలకు, అర్చనలకు, మొక్కుబడులకు కూడా ఆయన ఒక్కడే అర్హుడా? ఇలాంటి కొత్తమాటను మేమెప్పుడూ వినలేదే!!" అన్నది ఆ అవిశ్వాసుల ఉద్దేశ్యం._ 

 _6 → "మీరు మీ తాతముత్తాతల మతంపైనే ఉండండి. విగ్రహారాధనను మానవద్దు. ముహమ్మద్ (సల్లం) మాటను వినకండి." అన్నది వారి అభిప్రాయం. ఇతడు మా చేత విగ్రహారాధనను మాన్పించి, ఒక్కసారిగా మాకు నాయకుడై పోవాలనుకుంటున్నాడు._ 

 _7 → వెనుకటి మతధర్మం అంటే ఖురైషు పెద్దలు నడిచే మార్గమూ కావచ్చు లేక క్రైస్తవ మతధర్మం కూడా కావచ్చు. అంటే తాము ఇంతవరకూ కనీ వినీ ఎరుగని "ఏకాధైవారాధన (తౌహీద్)" వైపుకు ఈయనగారు పిలుస్తున్నాడేమిటి? బహుశా ఈ కొత్త సిద్ధాంతం ఇతని మనోమస్తిష్కాలలో పుట్టి ఉండవచ్చు. క్రైస్తవ మతంలో సయితం లేని దేవుని ఏకత్వాన్ని ఈయనగారు ప్రబోధిస్తున్నాడంటే ముమ్మాటికీ అది అతని కట్టుకథే అయి ఉంటుంది._ 

 *In Shaa Allah రేపటి భాగములో "అబూ తాలిబ్" గారి మరణం....;* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment