149

🌿             ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪             🌿

🍂   🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు* 🕌  🍂
🍃   🕌 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*    🕌 🍃

✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦✧✦

🌾🔅     🛐🕋 *ఇస్లాం చరిత్ర* *- 149* 🕋🛐      🔅🌾

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 64* 🇸🇦🇸🇦🇸🇦

───────────┄┅━═══✦═══━┅┄───────────

         *సంపూర్ణ సంఘ బహిష్కరణ :-:-: 2* 

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

           *"షిఅబె అబీతాలిబ్"లో మూడేళ్ళు* 

"అబూ తాలిబ్", తన సమస్త పరివారంతో "షిఅబె అబీతాలిబ్" అనే పర్వత లోయలో సాంఘిక నిర్బంధానికి లోనయ్యారు. ఎండనక, వాననక వారంతా ఇక అక్కడే గడపాలి.

ఈ బహిష్కరణ కారణంగా పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. ధాన్యం, తినుబండారాలు రావడం ఆగిపోయింది. మక్కాకు అమ్మకానికి వచ్చే ధాన్యాన్నిగానీ, ఆహార పదార్థాలనుగానీ బహుదైవారాధకులు పరుగునవెళ్ళి కొనేసేవారు. ఇలా దిగ్బంధంలో ఉన్న ముస్లిముల పరిస్థితి మరింత దిగజారిపోనారంభించింది. వారు ఆకులు, తోళ్ళు తినడానికి కూడా వివశులైపోవలసి వచ్చింది. ఆకలి భాదతో పిల్లలు, స్త్రీలు పెట్టే ఆర్తనాదాలు, ఆ లోయ బయట ఉన్న వారికి కూడా వినిపించేవి. వారి వద్దకు ఏదైనా పదార్థం చేరితే అతి కష్టంగా చేరగలిగేది.

ఈ విధంగా ముహమ్మద్ (సల్లం) ఇంకా ఆయన (సల్లం) అనుచరులు బహిష్కృత జీవితం గడిపారు. పేదరికంతో, ఆకలితో అలమటించారు. కొంతమంది మంచిమనుషులు సహాయంతో వీళ్ళ కష్టం కొంత తగ్గేది. ముహమ్మద్ (సల్లం) అనుచరులు వలసపోయి ఉన్న శివారు ప్రాంతానికి ఆ కొద్దిమంది రహస్యంగా ఎప్పుడన్నా ఆహారమును అందజేసేవాళ్ళు.

"హజ్రత్ ఖదీజా (రజి)" గారి అన్న కుమారుడైన "హకీం బిన్ హిజామ్" అప్పుడప్పుడు ఎవరి కంటాబడకుండా గోధుమల్ని ఆమెకు పంపించేవాడు. "హకీం" ఎప్పటిలాగే గోధుమలు సరఫరా చేస్తుండగా ఓ సారి "అబూ జహల్" కంటబడ్డాడు.

దాంతో "అబూ జహల్" ఆ గోధుమల్ని అక్కడకు చేరకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై "అబూ జహల్" పెద్ద రాద్ధాంతం చేయగా, "అబుల్ బక్తరీ" అడ్డుపడి ఆ ధాన్యాన్ని తన మేనత్త వద్దకు పంపించడం జరిగింది. 

నిషేధానికి గురి కాని ప్రవక్త బంధువు "హష్షామ్" విచారంలో మునిగి ఉన్నారు. తన కుటుంబంలోని సభ్యులు మలమల మాడుతూ ఉండడం చూస్తూ తను ఎలా సహించగలరు? తను ఏదో ఒకటి చేయాలి. ఒక అర్ధరాత్రి అవసరమైన అన్ని రకాల ఆహారాలతో, సరుకులతో ఒంటె మీద, విశ్వాసులు ఉన్న ఇంటికి బయలుదేరారు. ఆ ఇరుకు సందుల్లో గుండా ఒంటెను రహస్యంగా గమ్యానికి చేర్చడం కష్టమని తోచింది. ఆయనకు ఒకే ఒక ఉపాయం తట్టింది. ఒంటె వెనుకకు వెళ్ళి, దాన్ని గట్టిగా బాదారు. దానితో ఒంటె సందు చివరి వరకు వెళ్ళింది.

ఈ పద్ధతి కొంత కాలం నడిచింది. కాని అది పూర్తి పరిష్కారం కాదు కదా!

ఇటు "అబూ తాలిబ్"కు, దైవప్రవక్త (సల్లం)కు ఏ ప్రమాదం వచ్చిపడుతుందోనని బెంగగా ఉండేది. అందుకని ఆయన, అందరూ పడుకునే సమయంలో దైవప్రవక్త (సల్లం)ను పిలిచి, "నీవు ఈ ప్రక్కపై పడుకో" అని అందరు వినేటట్లు చెప్పేవారు. ఎందుకంటే దైవప్రవక్త (సల్లం)ను ఎవరైనా చంపడానికి పొంచి ఉంటే ఆయన (సల్లం) ఎక్కడ నిద్రిస్తున్నారో తెలుస్తుంది. అందరు పడుకోగానే "అబూ తాలిబ్" దైవప్రవక్త (సల్లం) గారి పడక స్థలాన్ని మార్చివేసేవారు. అంటే తన కుమారులు, సోదరులు లేదా సోదర కుమారుల్లో నుండి ఎవరో ఒకరిని దైవప్రవక్త (సల్లం) గారి ప్రక్కపై పరుండబెట్టి, దైవప్రవక్త (సల్లం)ను అతని ప్రక్క పైకి పంపి పడుకోబెట్టేవారు.

ఈ దిగ్బంధం ఇలా కొనసాగుతున్నా దైవప్రవక్త (సల్లం), ఇతర ముస్లిములు "హజ్" రోజుల్లో బయటకు వచ్చి "ఇస్లాం" ధర్మ ప్రచారంలో నిమగ్నులై పోయేవారు. "హజ్" యాత్రకు చెందిన నాలుగు పవిత్ర మాసాలలో మాత్రం వారిని బయటికి రానిచ్చేవారు. ఆ నాలుగు నెలలు అరేబియాలో ఎక్కడా యుద్ధ సూచనలు కనిపించవు. సర్వత్రా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ నాలుగు నెలలు కాలంలోనే దైవ సందేశహరుని (సల్లం)కి, ఆయన అనుచరులకు "ఇస్లాం" ప్రచారం చేయడానికి అవకాశం లభిస్తుంది.

"హజ్" సమయంలో దేశం నలుమూలలా నుంచి అనేక మంది యాత్రికులు, వర్తకులు మక్కా వస్తారు. వింత వింత వస్తువులతో అలంకరించబడే దుకాణాలు, ఆ దుకాణాలకు వచ్చిపోయే జనసందోహంతో మక్కా పట్నం కళకళలాడుతూ కోలాహలంగా ఉంటుంది. దైవప్రవక్త (సల్లం) ప్రజల దగ్గరకు పోయి ధర్మ ప్రచారం చేసేవారు. ఎంతో ప్రేమతో, అమృత పలుకులతో దైవసందేశాన్ని వారికి భోదించేవారు. ఈ సందర్భంలో "అబూ లహబ్" చేసే దుష్కృత్యాలను గురించి మనం వెనుకటి పుటల్లో చదువుకున్నాం.

సంఘ బహిష్కరణకు గురైన ముస్లిములు, హుర్మత్ మాసాలు (నిషిద్ధ మాసాలు) తప్ప, ఇతర దినాల్లో బయటకు వచ్చేవారు కాదు. ఆ రోజుల్లోనూ మక్కాకు, ఇతర ప్రదేశాల నుండి వ్యాపారార్థం వచ్చే బిడారాల నుండి తమకు కావలసిన ఆహార పదార్థాలు వారు కొనగలరు, కాని బహుదైవారాధకులు ఆ సరుకుకు ధర హెచ్చించి కొనడం వలన అంత ధర పెట్టి దిగ్బంధంలో ఉన్న ముస్లిములు కొనలేకపోయేవారు.

 *అబిసీనియాకు వలస వెళ్లిన ముస్లిముల సంతోషం : -* 

"ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)" ముస్లింగా మారాడని, ఆయన (రజి) ప్రవేశంతో ముస్లింలకు కొండంత ధైర్యం వచ్చి బాహాటంగా ధర్మప్రచారం చేస్తున్నారని అబిసీనియాకు వలసపోయిన ముస్లింలకు తెలిసింది. పైగా, మక్కా పట్నం వాడవాడలా "ఇస్లాం" కిరణాలు ప్రసరించాయని, వారి ప్రభావం చుట్టుపక్కల గ్రామాల మీద పడిందని కూడా విని వారు ఎంతో సంబరపడ్డారు.

వెంటనే వారు అబిసీనియా వదలి మక్కా బయలుదేరారు. కాని మక్కా దరిదాపులకు చేరుకునేటప్పటికి, ముస్లింలు "షిఅబె అబీతాలిబ్"లో నిర్భంధించబడి అష్టకష్టాలు అనుభవిస్తున్నారని విషాదవార్త విన్నారు.

దాంతో వారు ఢీలా పడిపోయి మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ వచ్చినదారే తిరిగి వెళ్ళిపోయారు.

"షిఅబె అబీతాలిబ్"లో ముస్లింల దుస్థితి నానాటికి తీవ్రమవుతుంది. పరిస్థితి విషమించడంతో మరికొందరు అనుచరుల్ని అబిసీనియాకు వెళ్ళిపొమ్మని దైవప్రవక్త (సల్లం) అనుమతించారు. ఇలా చాలా మంది అబిసీనియాకు వలసపోగా, కొద్దిమంది మాత్రమే దైవప్రవక్త (సల్లం)ను అంటిపెట్టుకొని అవిశ్వాసులు పెట్టే బాధలు భరిస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు.

ఇలా నెలా రెండు నెలలా? వరుసగా మూడు సంవత్సరాలు సాంఘిక నిర్బంధానికి గురై అష్టకష్టాలు పడ్డారు. తిండికి బట్టకూ వారు అనుభవించని బాధలు లేవు.

ఒకరోజు ప్రవక్త (సల్లం) అనుచరుడు "హజ్రత్ సాద్ అబీవఖ్ఖాస్ (రజి)" తినడానికి ఏమీ దొరక్క ఎంతో బాధపడసాగారు. అలాంటి పరిస్థితిలో ఓ చోట ఎండిన తోలుముక్క దొరికితే అదే భాగ్యమని భావించి, దాన్ని శుభ్రంగా కడిగి, కాల్చి నీళ్ళలో నానబెట్టారు. అలా నీళ్ళలో నానిన ఆ తోలుముక్క తిని ఆయన ఆకలిమంట చల్లార్చుకున్నారు.

విశ్వాసులు, ఈ విధంగా భయంకరమైన ఆకలిని, పేదరికమును ఎదుర్కొన్నప్పటికీ, ముహమ్మద్ (సల్లం) పట్ల, ఆయన (సల్లం) సందేశం పట్ల విశ్వాసంగానే ఉన్నారు. "అబూ తాలిబ్" ఏర్పాటు చేసిన ఆశ్రయాలలో వీళ్ళంతా కూర్చుని ప్రవక్త (సల్లం) భోధించినట్లు ప్రార్థించేవాళ్ళు.

సహాబాలందరూ, ముహమ్మద్ (సల్లం) చుట్టూ ఖర్జూరపు మట్టల మీద కూర్చుని సందేశాలను వినేవాళ్ళు. ప్రశ్నలు వేసేవాళ్ళు. సలహాలు అడిగేవాళ్ళు. కొంతమంది అనుచరులు, ముహమ్మద్ (సల్లం) సాంగత్యంలో గడపటాన్ని ఎంతో అదృష్టంగా భావించేవాళ్ళు. "అల్లాహ్" సందేశం ప్రవక్త (సల్లం)కు చేరిన తర్వాత, దైవప్రవక్త (సల్లం) తనకు అందిన సందేశాన్ని , తన అనుచరులకు వినిపించేవారు. వారు వెంటనే గొర్రె చర్మాల మీదనో లేదా ఖర్జూరపు ఆకుల మీదనో రాసుకునేవాళ్ళు.

ఇవే ఇప్పుడు మనం చదువుకుంటున్న "ఖుర్ఆన్"లోని సూరాలుగా ఆదరింపబడ్డాయి.

ముహమ్మద్ (సల్లం) అనుచరులు ఈ సూరాలను ఉచ్చరిస్తూ, చూడకుండా కంఠతా వల్లించే విధంగా వాటిని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. సుదీర్ఘమైన చీకటి రాత్రుల్లో, బయటి ప్రపంచమంతా ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు తన అనుచరుల "ఖుర్ఆన్" పారాయణ శబ్దాలు వినిపిస్తుండేవి.

                *ప్రమాణ పత్రం చించివేత* 

ఈ పరిస్థితులు పూర్తిగా మూడు సంవత్సరాలు కొనసాగాయి. ఆ తరువాత దైవదౌత్య శకం 10, ముహర్రం మాసంలోనే ఆ ప్రమాణ పత్రం చించివేయడం, దౌర్జన్యకరమైన ఒడంబడిక అంతం కావడం జరిగింది. దీనికి కారణం, ఖురైష్ కే చెందిన కొందరు ఈ ఒడంబడిక కు అయిష్టంగా, మరి కొందరు ఒడంబడికకు అనుకూలంగా ప్రవర్తించడమే. దీనికి వ్యతిరేకంగా ఉన్నవారే దీన్ని చించివేయడానికి పూనుకున్నారు.

దీనికి అసలు కర్త "బనూ ఆమిర్ బిన్ లవీ" తెగకు చెందిన "హష్షామ్ బిన్ అమ్రూ" అనే వ్యక్తి. ఇతను రాత్రి చీకటిలో ఎవరి కంటాబడకుండా "షిఅబె అబూ తాలిబ్" లోయలో ధాన్యాన్ని పంపి "బనూ హాషిమ్"ను ఆదుకునేవాడు. ఇతను ఓ రోజు "జుహైర్ బిన్ ఉమయ్యా మగ్జూమీ" దగ్గరకు వెళ్ళాడు. (జుహైర్ తల్లి ఆతికా, అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె. అంటే అబూ తాలిబ్ సోదరి) అపుడు హష్షామ్, జుహైర్ తో....,

 *హష్షామ్ : -* జుహైర్! మీరంతా కడుపునిండా తినడం, త్రాగడం; మరి మీ మామగారు అలా పస్తులుండడం నీకు తెలిసిందే కదా?

 *జుహైర్ : -* అయ్యో! నేనేం చేయగలను చెప్పు. నాకు మరో మనిషి సహాయపడితే నేనా ప్రమాణ పత్రాన్ని చించిపారేయకపోదునా? (అని తన చేతకానితనాన్ని వెలిబుచ్చాడు)

 *హష్షామ్ : -* అయితే జుహైర్! ఇంకో మనిషి కూడా ఉన్నాడు.

 *జుహైర్ : -* ఎవరాయన?

 *హష్షామ్ : -* నేనే!

 *జుహైర్ : -* సరే! మూడో వ్యక్తిని కూడా వెదుకు.

 *తరువాత జరిగినది In Shaa Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

                      💎💎 *మా సలాం* 💎💎

                      ─┄┅━═══✦═══━┅┄─

No comments:

Post a Comment