145

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  145* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 60* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

             *దైవప్రవక్త (సల్లం) సన్నిధికి ఖురైష్ దూత* 

ఆ రోజుల్లో, "హజ్రత్ హమ్'జా (రజి) బిన్ అబ్దుల్ ముత్తలిబ్" మరియు "హజ్రత్ ఉమర్ (రజి) బిన్ ఖత్తాబ్" లు "ఇస్లాం" స్వీకరించడం వల్ల ముస్లింలపై జరుగుతున్న ఆగడాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ముస్లింలను హింసించే బహుదైవారాధకుల వైఖరి మారి, వివేకంతో కూడిన పంథాను అందుకుంది.

కాబట్టి బహుదైవారాధకులు ఇక హింసాదౌర్జన్యాలతో ముస్లింలను సందేశ ప్రచారం చేయకుండా అడ్డుకోలేము అని గ్రహించి, మహాప్రవక్త (సల్లం) గారితో ఆ ప్రచారాన్ని ఆపుజేయమని చెప్పడానికి బేరసారాలకు దిగవలసి వచ్చింది. అయితే ఈ అమాయకులను, సందేశ ప్రచారానికి బదులుగా ఈ విశ్వాన్నంతటిని ఇచ్చినా అది ఆగేది కాదు అన్న విషయం ఏం తెలుసు? కాబట్టి వారు తమ ఈ పథకంలో కూడా అపజయం పొందవలసివచ్చింది.

 *ఖురైష్ నాయకుల సమావేశం : -* 

ఖురైష్ నాయకులు తరువాత రూపొందించవలసిన పథకం గురించి సమాలోచనలు జరపడానికి "కాబా"లో సమావేశమయ్యారు. ముందుగా ఒక నాయకుడు లేచి పరిస్థితి సమీక్షిస్తూ ఇలా ప్రసంగించాడు....,

""ఇస్లాం"ను విశ్వసించేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. వేగంతో విస్తరిస్తున్న "ఇస్లాం" ఉద్యమాన్ని ఎలా అరికట్టాలి? మనకు తలనొప్పిగా తయారైన ముహమ్మద్ (సల్లం)ను వదిలించుకునే మార్గం ఏమిటి? అతని ప్రచారాన్ని కొనసాగిస్తే మున్ముందు మనం నలుగురిలో తలెత్తుకుని తిరగలేము. కనుక ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి."

ప్రసంగం ముగిసింది. అందరూ తరువాత చేయవలసిన పనిని గురించి ఆలోచనలో పడ్డారు. కాని ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. అలా కొంత సమయం పాటు సభలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అంతలో "ఉత్బా బిన్ రబియా" లేచి నిలబడ్డాడు. సభికులంతా ఒక్కసారిగా "ఉత్బా" వైపు దృష్టి సారించారు. ఈ సమస్యకు అతను ఏదైనా పరిష్కారం చూపిస్తాడన్న ఆశ చిగురించింది వారిలో.

"ఇబ్నె ఇస్'హాక్", "యజీద్ బిన్ జయ్యాద్" మాధ్యమంగా, "ముహమ్మద్ బిన్ కఅబ్" ఉల్లేఖనాన్ని ఉటంకిస్తూ ఇలా చెప్పారు. "ముహమ్మద్ బిన్ కఅబ్" ఉల్లేఖనం ఇలా ఉంది....,

"జాతికి నాయకునిగా ఉన్న "ఉత్బా బిన్ రబియా", ఓ రోజు "మస్జిదె హరాం"లో దైవప్రవక్త (సల్లం) ఓ చోట ఒంటరిగా కూర్చుని ఉండగా చూసి, ఖురైష్ ను ఉద్దేశించి, "ఓ ఖురైష్ ప్రజలారా! ముహమ్మద్ (సల్లం) వద్దకు వెళ్ళి నేనెందుకు మాట్లాడకూడదు? ఆయన (సల్లం) ముందు కొన్ని ప్రతిపాదనలను పెడతాను. బహుశా ఆయన (సల్లం) వాటిని ఒప్పుకోవచ్చు. ఆయన (సల్లం) ఒప్పుకున్న వాటిని మనం ఆయన (సల్లం)కు ఇచ్చివేద్దాం. ఆయన (సల్లం)ను తన పని చేయకుండా అడ్డుకోవచ్చు ఏమంటారు?" అని అన్నాడు.

అప్పటికి "హజ్రత్ హమ్'జా (రజి)", "ఇస్లాం" ధర్మాన్ని స్వీకరించి ఉన్నారు. ముస్లింల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడం వారు గమనిస్తూనే ఉన్నారు.

బహుదైవారాధకులు, "ఓ అబుల్ వలీద్! వెళ్ళండి, ఆయన (సల్లం)తో మాట్లాడండి." అని అనుమతి ఇవ్వగా, "ఉత్బా" మహాప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. (అదను చూసి)....,

ఉత్బా : - సోదర కుమారా! మా జాతిలో నీకున్న హోదా, గౌరవం, నీ వంశోన్నత్యం ఏమిటో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నీవు నీ జాతిలో ఓ పెద్ద సమస్యను తీసుకొచ్చిపెట్టావు. దాని ద్వారా నీవు వారిలో విభేదం సృష్టిస్తున్నావు. వారి బుద్ధివివేచనలను పనికిమాలినవిగా ఖరారు చేస్తున్నావు. వారి ఆరాధ్య దైవాలను కించపరుస్తున్నావు. గతించిపోయిన వారి తాతముత్తాతల్ని దైవతిరస్కారులని అంటున్నావు. అందుకని నా మాటలను శ్రద్ధగా విను. నీ ముందు నేను కొన్ని ప్రతిపాదనలను ఉంచుతున్నాను. వాటి గురించి బాగా ఆలోచించు. బహుశా ఏదో ఒకటి నీకు నచ్చకపోదు.

ముహమ్మద్ (సల్లం) : - అబుల్ వలీద్! చెప్పండి. నేను మీరు చెప్పింది శ్రద్ధగానే వింటాను.

ఉత్బా : - సోదర కుమారా! నీవు తీసుకువచ్చిన వ్యవహారం ఏదయితే ఉందో ఆ విషయంలో నువ్వు, నీకు ఏది కావాలో చెప్పు. డబ్బు కావాలనుకుంటే నీవు మా అందరికంటే గొప్ప ధనవంతుడవయ్యేటట్లు సంపదను కూడబెట్టి నీకిస్తాము. నీకే గనక నాయకత్వంగాని, హోదాగాని కావాలని అనుకుంటే చెప్పు, నిన్ను మా సర్దారుగా, నాయకునిగా చేసుకుంటాము. నీవు లేకుండా ఏ తీర్పు కూడా వెలువడడానికి వీలుండదు. నీవే గనుక మాకు రాజువు కాదలచుకుంటే, నిన్ను మా రాజుగా చేస్తాము. నీ వద్దకు వచ్చేవాడు (జిబ్రీల్) జిన్నో, భూతమో అయితే చెప్పు, దాన్ని మేము నీ దగ్గరకు రాకుండా భూతవైద్యం చేసి పారద్రోలగలం. దీని కోసం మేము ఎంత ఖర్చుబెట్టవలసి వచ్చినా ఖర్చుబెడతాము. నీకు స్వస్థత చేకూరితే అంతే చాలు. జిన్ను, దెయ్యం, భూతం పట్టిన వానికి చికిత్స తప్పనిసరిగా చేయవలసి ఉంది.

ఇలాగ ఏదేదో చెబుతున్నాడు "ఉత్బా". దైవప్రవక్త (సల్లం) ఇదంతా వింటూ కూర్చున్నారు. తాను చెప్పేదంతా చెప్పిన తరువాత ఆయన (సల్లం), "ఉత్బా"ను సంభోదిస్తూ....,

ముహమ్మద్ (సల్లం) : - అబుల్ వలీద్! నీవు చెప్పడం పూర్తి అయిందా?

ఉత్బా : - అవును! నేను చెప్పవలసింది చెప్పేశాను.

ముహమ్మద్ (సల్లం) : - అయితే నేను చెప్పేది కూడా విను!

అంటూ *"బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీం"* అని పఠించి; *"దివ్యఖుర్ఆన్"* లోని *"హమీమ్ అస్సజ్'దహ్"* సూరాను పఠించనారంభించారు.

 _(ఈ సురాకు గల మరో పేరు "ఫుస్సిలత్")_ 

 *హామీమ్. (ఇది) అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన వాని తరఫునుంచి అవతరింపజేయబడినది.* 

 *(ఇది) ఎటువంటి గ్రంథమంటే, దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖుర్ఆన్ ఇది....* 

 *శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినపట్టికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు (కనీసం) విననైనా వినటం లేదు.* 

కాని, వారిలో చాలా మంది దాని పట్ల విముఖులయ్యారు.

 *వారిలా అన్నారు : “నువ్వు దేని వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి. మా చెవులలో భారం ఉంది. నీకూ - మాకు మధ్య ఒక (అడ్డు) తెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో. మా పనిని మేము చేసి తీరుతాము.”* 

 *(ఓ ప్రవక్తా!) వారికీవిధంగా చెప్పు : “నేనూ మీలాంటి మానవమాత్రుణ్ణే. ‘మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే’ అనే వహీ (వాణి) నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపునే (నిజాయితీగా) నిలబడండి. మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి.” ఈ ముష్రిక్కులకు వినాశనం ఉంది.* 

(చదవండి "సూరతుల్ హామీమ్ అస్సజ్'దహ్" 41:1-38)

దైవప్రవక్త (సల్లం) అలా పఠిస్తూనే ఉన్నారు. "ఉత్బా" తన రెండు చేతుల్ని తన వీపు వెనక భాగాన నేలకు ఆనించి నిశ్శబ్దంగా "ఖుర్ఆన్" వాక్యాలను ఆలకిస్తూ ఉన్నాడు. దైవప్రవక్త (సల్లం) "సజ్దా" చేసే ఆయత్ పఠించి "సజ్దా" చేశారు. ఆ తరువాత "ఉత్బా"ను ఉద్దేశించి....,

ముహమ్మద్ (సల్లం) : - అబుల్ వలీద్! నీవు వినవలసినదంతా వినేశావు కదా! ఇక నీవు నీ ఇష్టప్రకారం కానీ.

"ఉత్బా" లేచి తన బృందం వైపునకు నడిచాడు. అతణ్ణి చూడగానే బహుదైవారాధకులు పరస్పరం ఒకరినుద్దేశించి మరొకరు, "దైవసాక్షి! "అబుల్ వలీద్" ముఖం చూశారా! ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఉన్నట్లుగా లేడు!” అని గుసగుసలాడనారంభించారు.

"అబుల్ వలీద్" వచ్చి కూర్చోగానే వారు....,

ఖురైషీయులు : - అబుల్ వలీద్! అక్కడ ఏం జరిగింది?

ఉత్బా : - దైవసాక్షిగా చెబుతున్నాను, నేను అక్కడ విన్నది నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. దైవసాక్షి! అది కవిత్వంగాని, ఇంద్రజాలంగాని, జ్యోతిష్యుల మంత్రాలుగాని కావు. ఖురైష్ ప్రజలారా! నా మాట వినండి. అతని (సల్లం) విషయం నాకు వదిలేయండి. నా సలహా ప్రకారం అతణ్ణి అతని మానాన వదిలేసి వేరుగా కూర్చుని ఉండండి. దైవసాక్షి! నేను అతని నోట విన్న మాట ప్రకారం ఓ బ్రహ్మాండమయిన సంఘటన జరిగితీరుతుంది. ఒకవేళ అతణ్ణి మిగతా అరబ్బులు చంపేస్తే మీ పని ఇతరులు చేసిపెట్టినట్లు అవుతుంది. లేదా అతనే అరబ్బుల్ని జయిస్తే అతని రాచరికం మీ రాచరికమే అవుతుంది. అతని గౌరవం మీ గౌరవమే. అతని అస్తిత్వం అందరికంటే మీ శ్రేయం కోసమే సుమా. (అని చెప్పి ఊరుకుండిపోయాడు) 

ఖురైషీయులు : - అబుల్ వలీద్! దైవసాక్షి! అతని ఇంద్రజాలం నీపై కూడా ప్రసరించినట్లుందే!

ఉత్బా : - ఈయన (సల్లం) గారి విషయంలో నా సలహా మాత్రం అదే. ఇక మీకు ఏది సరిగ్గా తోస్తే అది చేయండి.

ఖురైషీయులు, ఈ మాటలు విని మండిపడుతూ లేచి వెళ్ళిపోయారు. "ఉత్బా" మీద వారు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయి కథ మళ్ళీ మొదటికే వచ్చింది.

 *మరో ఉల్లేఖనంలో...., ↓* 

దైవప్రవక్త (సల్లం) గ్రంథ పఠనాన్ని ప్రారంభించాక "ఉత్బా" దాన్ని చాలా శ్రద్ధగా విన్నాడు అని, దైవప్రవక్త (సల్లం) ఈ వాక్యం (ఆయత్), *అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికీవిధంగా చెప్పేయ్ : “ఆద్ సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను."* (ఖుర్ఆన్ 41:13) పఠించగానే "ఉత్బా" గడగడలాడుతూ భయంతో నిలబడిపోయాడు. తన చేతిని దైవప్రవక్త (సల్లం) గారి నోటికి అడ్డం పెడుతూ, ""అల్లాహ్" మరియు మన బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చెప్పకండి." అని వారించాడు. అతనికి, ఈ శిక్ష ఎక్కడ వచ్చి పడుతుందో అనే భయం పట్టుకుంది. ఆ తరువాత అతని బృందం వద్దకు వెళ్ళి పైన చెప్పిన మాటలే చెప్పాడు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment